@ ఇంటిగుట్టు... @26
తేది: 05/07/2025
""""""""""""""""""""""""""""""""
వేసుకున్న డ్రస్సు, వెళ్లిన చోటు, పెళ్లి రోజు, బిడ్డల పుట్టిన
రోజు... అన్నీ సామాజిక మాధ్యమాల్లో చెప్పుకోవటం
చూస్తుంటే మనకిక వ్యక్తిగతమంటూ లేదా, మరుగన్నది
మరిచిపోయామా అన్న సందేహం వస్తోంది.
అమ్మాయి ప్రసవానికి అమెరికా వెళ్తున్నాం, అన్నవరంలో
స్వామి వ్రతం చేయించుకుంటున్నాం...ఇలా ప్రతి
విషయాన్నీ ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టేయడం
ఇప్పటి ట్రెండ్. టీనేజర్ల నుంచి సీనియర్ సిటిజన్ల వరకు
ఎవరూ దీనికి అతీతులు కారు. కానీ సంసారమన్నాక కాస్తంత
గుట్టు ఉండొద్దా? కుటుంబసభ్యుల వ్యక్తిగత వివరాల్లాంటి
సున్నిత విషయాలను సోషల్ మీడియాలో ప్రచారానికి
పెట్టడం అవసరమా? చాలామంది ఈ-మెయిల్, బ్యాంకింగ్,
యూపీఐ పాస్వర్డ్ లను ను మర్చిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో
పెళ్లిరోజు, భాగస్వామి, పిల్లల పేర్లు, వారి పుట్టినరోజు తేదీల
కాంబినేషన్లతోనే పెడుతుంటారు. లైకులూ శుభాకాంక్షలను
ఆశించి ఆ ప్రత్యేకమైన రోజు గురించి సోషల్ మీడియాలో
రాసేస్తే మీ పాస్వర్డ్ లు తెరిచే తాళం చెవి సైబర్ నేరగాళ్ల
చేతికిచ్చినట్లే మరి!
ఆ
నిన్నగాక మొన్న మన కళ్లముందు పుట్టిన పసిబిడ్డ అప్పుడే
పట్టుపరికిణీ కట్టేసుకుందా అని మురిసిపోతుంటాం.
సంతోషాన్ని అందరితోనూ పంచుకోవాలని ఫొటో తీసి సోషల్
మీడియాలో పెట్టేస్తుంటాం. కానీ, తండ్రీ కూతురు కలిసున్న
ఫొటో కనిపించినా కళ్లు మూసుకుపోయి కుళ్లు మాటలు
మాట్లాడే సమాజంలో, మార్ఫింగ్ వీడియోలతో ఆడబిడ్డల
జీవితాల్ని బజారుకీడ్చే కామాంధులున్న లోకంలో బతుకుతున్నాం. మన బిడ్డల ఫొటోలు, వీడియోల్ని ఇనిస్టా లో,
ఎఫ్ బి ల్లో పెట్టి అలాంటివారి చేతికి మన జుట్టు మనమే
అప్పగించేసుకుంటున్నామా అన్నది ఆలోచించాల్సిన విషయం.
వ్యక్తిగతమే కాదు.. వృత్తిగతంగానూ అన్నింటినీ అందరికీ
చెప్పడం ప్రమాదహేతువే ఆఫీస్ విషయాల్ని సోషల్
మీడియాలో పంచుకునే ఉద్యోగిపై సంస్థకు నమ్మకం
సడలుతుంది అలాంటివారికి కీలక బాధ్యతలు అప్పగించడానికి
యాజమాన్యం సంకోచిస్తుంది. అది మన ఎదుగుదలకు మనమే
అడ్డుపడటం!
ఒకప్పుడు పెద్దవాళ్లు పసిబిడ్డలను బయటి వారికి చూపించే
వారు కాదు. దిష్టి తగులుతుందనేవారు కాలం మారింది.
పద్ధతులూ మారాయి అర్థం లేని నమ్మకాలూ సామాజిక
కట్టుబాట్లూ వీడి స్వేచ్ఛగా ముందుకెళ్తున్నంత మాత్రాన
ప్రతి చిన్న సమాచారాన్నీ సోషల్ మీడియాలో పందేరం
పెట్టనక్కరలేదు.
'ఇంటిగుట్టు లంకకు చేటు' అన్నమాట ఊరికే అనలేదు
పెద్దలు. ఫలానా వాళ్లింట్లోనే ఎందుకు దొంగతనం చేశావని
బోనులో ఉన్న దొంగని అడిగారు న్యాయమూర్తి. 'ఫ్యామిలీ
అంతా వారం రోజులు అండమాన్ టూర్ వెళ్తున్నామని ఫేస్ బుక్ లో పెట్టారండీ...చెప్పాడు దొంగ
అదండీ... సంగతి..!
No comments:
Post a Comment