ఉపదేశ సారం-7
నిష్కామకర్మ... ముక్తిసాధకం
“ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం
చిత్త శోధకం ముక్తి సాధకం”
భగవాన్ రమణులు బోధించిన 30 శ్లోకాల "ఉపదేశసారం" లో మూడో శ్లోకమిది . కర్మఫలం అశాశ్వితమని , పైగా మోక్ష మార్గానికి ప్రతిబంధకం కూడానని రెండో శ్లోకం చెబుతుంది . అలాగని కర్మఫలాన్ని వదిలే అవకాశం లేదు . మరేం చేయాలి ? ఈ ప్రశ్నకు పరిస్కారాన్ని ఈ మూడో శ్లోకంలో సూచించారు మహర్షి .
"కర్మఫలoపై కోరిక లేకుండా , భగవదార్పణ బుద్ధితో చేసిన కర్మ , చిత్తశుద్ధిని కలిగించి మోక్షాన్ని పొందడానికి సాధనమవుతుంది " అని దీని అర్ధం . పాములవాళ్ళు పాముల కోరలు పీకేసి వాటిని ఆడించినట్టు , కోరికలనే కోరలను పీకేసి కర్మలు చేస్తే అవి మనకు బంధంగా మారవు . దీన్నే నిష్కామ కర్మ యోగం అన్నారు . దీన్నే రమణమహర్షి ఈ శ్లోకంలో "నేచ్ఛయా కృతం ( న ఇచ్చాయా కృతం )" అన్నారు . కానీ, కోరికలు లేకుండా కర్మలు చేయడమంటే ఎలా ? అసలు ఎవరైనా అలా చేస్తారా ? ఏదైనా కర్మ చేస్తే ఏదో ఒక ప్రయోజనం ఉండాలి . సుఖం కలగాలి . లాభం రావాలి . పేరో , పుణ్యమో , కీర్తిప్రతిష్టలో , మనసుకు సంతృప్తో , ఇలా ఏదో ఒకటి ఆశించి చేస్తే అది కోరికతో చేసే కర్మ. అలాగని , నిష్కామకర్మ అంటే ఏ కోరికా లేకుండా చేయడం . బండరాయిలాగా ఉండడం కాదు . మనం చేసే కర్మల వల్ల "ఫలానా " ప్రయోజనం సిద్దించాలి " అని ముందే అనుకోకుండా , ఆశపడకుండా చేయడం . ద్రుష్టి కర్మ ఫలం మీద కాకుండా , కర్మల మీదనే ఉంచి నైపుణ్యంతో కర్మలు చేయడమే నిష్కామకర్మ యోగం . అలా చేసే కర్మలు బంధం కాకపోగా మోక్షప్రాప్తికి కారణమవుతాయి .
నిజానికి కర్మల వల్ల ఎవరికీ సుఖదుఃఖాలు కలగట్లేదు . ఆ కర్మల వల్ల వచ్చే ఫలితాలపై ఆసక్తి , ఆశ కలిగి ఉండడం వల్లనే సుఖదుఃఖాలు కలుగుతున్నాయి . ఆవే బంధకారణాలవుతున్నాయి. ఉదాహరణకు , ఇద్దరు విద్యార్థులు కష్టపడి చెరువు తున్నారు . వారిలో ఒకరు ఫస్టుక్లాసులో ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు . రెండోవాడు పరీక్షలు చక్కగా రాయాలి అనే పట్టుదలతో కస్టపడి చదువుతున్నాడు . ఇద్దరూ సెకండ్ క్లాసులో పాసయ్యారు . మొదటి విద్యార్థి , నిరాస , దుఃఖం , బాధతో విలవిలలాడిపోయాడు . రెండో విద్యార్థి ఆనందంగా ఉన్నాడు . మొదటివాడు దుఃఖానికి కారణం ,...ఫలితాన్ని ముందే ఆశించడం . రెండోవాడి ఆనందానికి కారణం ..ఫలాల్ని ముందే ఆశించకపోవడం. ఒకే ఫలితంతో ఒకరికి సంతోషం , మరొకరికి దుఃఖం . కారణం కర్మఫలాసక్తి . అదే ఉండకూడనిది . ప్రయత్నలోపం లేకుండా నైపుణ్యంతో కర్మ చేయడమే ముఖ్యం . అదే నిష్కామకర్మ . ఇది సత్వ గుణలక్షణం. కోరుకున్న ఫలితాల కోసం కర్మ చేయడం రజోగుణం లక్షణం . కోరిన ఫలితం రాదేమోనని కర్మ మానడం తమో గుణ లక్షణం . సత్వగుణ లక్షణమే మోక్షకారకం .
అలాగే ..జనన, మరణ రూప సంసార సముద్రంలో చిక్కుకోకుండా కర్మల వల్ల ప్రయోజనం పొందాలంటే కావాల్సిన మరొక నైపుణ్యం ..భగవదార్పణ బుద్ధితో కర్మలు చేయడం . దాన్నే రమణులు " ఈశ్వరార్పితం " అన్నారు . చేసే పని వల్ల వచ్చే ఫలితం పుణ్యమైనా ఏదైనా సరే ఆ భగవంతుడికే అర్పించడం వల్ల ...ఆ కర్మలకు కర్త మనం కాకుండా ఉంటాం . భగవంతుడి చేతిలో పనిముట్టులా , నిమిత్తమాత్రుల్లా ఉంటాం . దీనివల్ల చిత్తశుద్ధి కలుగుతుంది . పుణ్యమైనా , పాపమైనా ...అనుభవించడానికి కర్మ ఫలమే లేకపోవడంతో ఆ కర్మలు ముక్తి సాధకాలు అవుతాయి . అంటే ...మళ్ళి జన్మించే అవసరం ఉండదు .
----BY శ్రీ దేవిశెట్టి చలపతిరావు,
Sekarana from andhrajyoti .dt.26-11-19
No comments:
Post a Comment