Thursday, July 10, 2025

****_మీకు దేవుడిమీద నమ్మకం ఉందా..?

 *_మీకు దేవుడిమీద నమ్మకం ఉందా..?_* 
=================
*విశ్వ విఖ్యాత శాస్త్రవేత్త ఆల్భర్ట్ ఐన్-స్టీన్ పలు విశ్వవిద్యాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడి వాళ్ళు అతడిని.. _“మీకు దేవుడి మీద నమ్మకం ఉందా”_  అని అడిగేవాళ్ళట.*
 
*“స్పినోజా చెప్పిన దేవుడి మీద మాత్రమే నాకు నమ్మకం ఉంది” అనేవాడట  ఐన్-స్టీన్*

*“స్పినోజా” 17 వ శతాబ్దపు  డచ్ తాత్వికవేత్త. అతడు చెప్పినదానికి చాలా గొప్పగా తెలుగులో ఇలా అనువదించారు.*

*_దేవుడు మనిషికి చెప్పేది.._* 
_(స్పినోజా మాటల్లోనే చూద్దాం...:)_
🍁🍁🍁🍁🍁🍁🍁🍁 

*"ప్రార్థనలేవీ అక్కర్లేదు. ప్రపంచంలోకి వెళ్లి జీవితాన్ని ఆస్వాదించండి. సృష్టి సర్వంతో మమేకం కండి.* 
*హాయిగా నవ్వండి. భువన గానంలో భాగం కండి.*

*ప్రార్థనా మందిరాలకు వెళ్లడం దేనికి? నేనక్కడ ఉంటానని ప్రకటించానా? అవన్నీ మీ నిర్మాణాలేగా!*

*ఆ అందాల పర్వతాలూ, పచ్చని చిక్కని అరణ్యాలూ, జలజల పారే నదులూ, నిశ్చల సరోవరాలూ, దుమికే జలపాతాలు, అపార సాగర తీరాలూ, ఎగసిపడే అలలూ... ఇవీ నా నివాసాలు.*

*మీ దౌర్భాగ్యాలకు నన్ను నిందించడం వదిలెయ్యండి.* 
*మీ తప్పటడుగులూ, మీ పాపాలతో నాకు ప్రమేయం లేదు.*

*మీ పవిత్ర గ్రంధాలతో నాకే సంబంధమూ లేదు.* 

*ఒక పొద్దు పొడుపులో, ఒక నిర్జన మైదానంలో, ఒక ఆత్మీయ మిత్రుడి స్పర్శలో, ఆనందంతో కేరింతలు కొట్టే మీ బిడ్డ కళ్ళలోని మెఱుపులో ఉంటాను నేను. ఏవో పుస్తకాల పుటల్లో కాదు.*

*అవధి లేని ప్రేమను నేను. ఏ తీర్మానాలు చెయ్యను నేను. నిన్ను విమర్శించను. నువ్వంటే నాకు కోపాలూ, పట్టింపులూ.. ఏవీ ఉండవు.*

*క్షమాపణలేవీ నన్ను అడగకు. క్షమించ వలసినవేవీ ఉండవు.* 

*నీ పరిధులూ, పరితాపాలూ, ఉద్వేగాలూ, సుఖాలూ, అవసరాలూ అన్నీ నేను నీలో నింపినవే. అలాంటప్పుడు నీ అతిక్రమణలకు నిన్నెలా శిక్షిస్తాను నేను?*

*నిన్ను కాల్చివేసే నరకమొకటి నేను సృష్టించి ఉంటే… నేనేం దేవుణ్ణి ?*

*నిత్య జాగృతిలో బతుకు. అదే నీ దిక్సూచి. ఇతరులు నీకేది చేయకూడదని నువ్వు భావిస్తావో అది నువ్వు వాళ్లకు చెయ్యకు.*

_కందపద్యం_
*ఒరులేయని యొనరించిన* 
*నరవర! యప్రియము దన మనంబున కగుఁ దా* 
*నొరులకు నవి సేయకునికి* 
*పరాయణము పరమ ధర్మపథముల కెల్లన్.* _(-తిక్కన, మహాభారతం)_ 

*భావము:* _ఇతరులు ఏ పని చేస్తే మనకు బాధ కలుగుతుందో ఆ పని ఇతరుల విషయంలో చేయగూడదు. అదే ధర్మం)_ 
                
*బతుకంటే అదేదో పరీక్ష కాదు.* 
*ఒక రిహార్సల్ కాదు.* 
*ఏ స్వర్గద్వారాలకో పీఠిక అసలు కాదు.* 
*ఇక్కడ నడిచే, ఇక్కడ గడిచే వాస్తవం!!!* *అంతమాత్రంగానే చూడు దాన్ని.*

*పరిపూర్ణ స్వేచ్ఛనిచ్చాను నీకు.* 
*శిక్షలూ, పురస్కారాలూ, పాపాలూ, సద్గుణాలూ నా నిఘంటువులోని మాటలు కాదు.* 
*ఏదో కలంతో వాటినెవ్వరూ నా దివాణంలో లెక్క కట్టరు. నీకు నీవే లెక్కలు కట్టుకోవాలి. స్వర్గం, నరకం నీకు నువ్వే నిర్మించుకోవాలి. ఆ స్వేఛ్చ నీదే.*

*ఈ బతుకు ముగిశాక ఇంకొకటేదైనా ఉందో, లేదో నేను చెప్పను. కానీ దీని తరువాత ఇంకేదీ లేదన్నంత దీక్షగా బతుకు. ఇంకొక బతుకు ఉంటే ఇంతకుముందు నువ్వు ఏం చేశావు, ఇంకేం విస్మరించావు - అనే లెక్కలు నేను తిరగదోడను.*

*_నమ్మడం అన్నది ఊహాత్మకం. 
నన్ను నమ్మకు.. కానీ, నిన్ను నువ్వు నమ్ముకో. బలంగా నమ్ముకో…_* 

*ఏ సాగర జలంలోనో ఈత కొడుతున్నప్పుడో, ఒక శిశువును హత్తుకున్నప్పుడో, పెంపుడు పశువును నిమిరేటప్పుడో నేను గుర్తుకు రావడమే… ఇదేఇదే… నేను ఆశించేది.*

*నీ కీర్తనలు.. నీ మధుర గానాలూ… అవన్నీ నీకోసమే..* 
*ఉప్పొంగి పాడుకో… పరపరవశించి పాడుకో..* 
*నాకోసం మాత్రం పాడకు.* 
*వాటికి ఉప్పొంగిపోతే నేనేం దైవాన్ని?* 

*నీ ఆరోగ్యం, నీ సంబంధాలూ,* *సంతోషాలూ నీవే సరిచూసుకో.* 

*_అదే నాకు నువ్వు పఠించే స్తోత్ర పాఠం._*

*నా గురించి ఇప్పటికే నీ బుర్ర నిండా ఉన్న సరంజామా అంతా వదిలించుకో.* 
 *అదంతా చిక్కుముడి అనీ, అవన్నీ అద్భుతాలు అనీ, వాటికి అన్నేసి వివరణలు దేనికి..?*

*_నువ్వు ఇప్పుడు ఇక్కడ శ్వాసిస్తూ ..జీవిస్తూ ఉన్నావు._*
 
*అంతకు మించిన ఏదో అద్భుతం ఇంకా ఎందుకు...?*
_[శ్రీ మీనవల్లి బలరామ్ గారి సౌజన్యంతో….]_ 
*_{చాన్నాళ్ళ క్రితం ఒక వాట్సాప్ గ్రూపులో నేను చదివిన అంశమిది.: –వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘీకశాస్త్ర ఉపాధ్యాయుడు, ఆత్మకూరు పట్టణం, నెల్లూరు జిల్లా🙏}_*

No comments:

Post a Comment