Thursday, July 10, 2025

 శుక్రవారం పనస పొట్టు కూర కి సంబంధం ఉన్న మా గోదారొళ్ల మంచి కథ 
రచన :నల్లమిల్లి వంశీ 

పొలమారిన జ్ఞాపకాలు...లాంచీలో బాపు రమణ!

పొడిపిరెడ్డి వీరాస్వామి గారు సందకాడే పంపించేసిన ఝాన్సీరాణి లాంచీని ఎప్పుడూ కట్టేసే లాంచీల రేవులో గాకుండా పుష్కరాల రేవులోకి తీసుకొచ్చి అక్కడ లంగరెయ్యమన్నారు  సీతారావుడు (బి.వి.ఎస్ రామారావు) గారు.
నెంబర్ఒన్ సరంగుల్లో ఒకడైన బోరసత్యం అతనికి అసిస్టెంటుగా మెండా ఏసురాజూ వచ్చేరు. ఈసారి ఇంజను డ్రైవరుగా పాదం మంగరాజూ అతని అసిస్టెంటు హనుమంతూ దిగేరు. వెజిటేరియన్ వంటల్లో గోల్డ్‌‌మెడలిస్టు సుందరంగారు అసిస్టెంట్లతోపాటు రిక్షాలో దిగిపోతా ఈ వారానికి కావల్సిన సామాన్లన్నీ లాంచీలో సర్దించేసుకున్నారు.
మడత మంచాలూ, పరుపులూ లాంచీకి కావల్సిన ఆయిలూ ఇలా అన్నీ చక్కగా సమకూరినియ్యోలేదో చూసుకుంటుండగా కూరగాయల బుట్టలతో దిగిపోయిన శ్రీపాద పట్టాభిగారు వాటిని ఎదరాల్లో ఒబ్బిడిగా సర్దిస్తున్నారు.
దగ్గర్లోనే వున్న గుళ్ళల్లో గంటలు మోగుతుంటే ఆ చీకట్లోనే వాచీ చూసుకుంటున్న సీతారావుడు గారికి ఆగిన అంబాసిడర్ కార్లోంచి దిగుతున్న బాపూ రమణా కనిపించేరు.
వాళ్ళెక్కడానికి పడిచెక్క సరిచేయించిన సరంగు సత్యం ఒంగి దణ్ణం పెట్టేడు.
సుందరంగారిచ్చిన కాఫీ చప్పరించిన రమణ గారు “పొద్దుటే మంచి కాఫీ ఇచ్చేరు బాగుంది”. అన్నారు.
మళ్ళీ టైము చూసిన సీతారాముడు “అంతా రెడీ అయితే బయల్దేరదాం” అనగానే ఇంజన్ స్టార్టవడం పడి చెక్కా, పలుపుతాడూ వెనక్కిలాగడంతో బయల్దేరినా ఝూన్సీరాణి ఐదు నిమిషాల్లో హెవ్‌‌లాక్ బ్రిడ్జీ దాటేసింది.
టాప్ఎక్కేసి, ఆ తెల్లవారిన వెలుగులో తల్లిగోదావరిని చూస్తున్న బాపుగారు పక్కనే వున్న రమణగారితో ‘సినిమాలో ఓపెనింగ్ షాట్ సీతారామాంజనేయుల మీంచి స్లోగా ట్రాలీ బేక్ చేద్దాం. దాని మీద బాల మురళీకృష్ణగారు పాడే... సాకీ” అన్నారు.
చల్లటి నీళ్ళల్లో డుబ్ డుబ్ చప్పుళ్ళు చేసుకుంటా ఆ ఝూన్సీరాణీ వెళ్తుంటే పైకొచ్చిన సుందరంగారు ఫలహారాలు ఇక్కడే ఏర్పాటు చేస్తానండి” అన్నారు.
“అలాగే.. ఏంటివ్వేళ?” అడిగేరు రమణ.
“గోదుమ ఉప్మా, పెసరట్టు..అల్లం బండపచ్చడి బాగా కుదిరింది లెండి.”
“ఓహో” అన్నారు బాపు.
లాంచీ ముగ్గళ్ళ రేవు దాటుతుంది. అది గమనించిన రమణ ఈ వూళ్ళోంచి ముందుకెళ్తే శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రిగారు చిన్నప్పుడున్న మునికొడవలి  గ్రామం వస్తుందనుకుంటాను” అంటుంటే పైకొచ్చిన సీతారాముడూ శ్రీపాద పట్టాబీ ఆలోచిస్తున్న రమణగార్నేం డిస్టర్బ్‌‌ చెయ్యకుండా తలో మూలా చతికిల బడ్డారు.
లాంచీ గూటాల రేవులో కొచ్చేటప్పటికి కాస్త ఎండెక్కింది. ఒడ్డునే చాలా శుభ్రంగా కడిగి ముగ్గులెట్టిన రాములోరి గుడి. దిగెళ్ళి దణ్ణవెట్టుకునొచ్చేక ఫలహారాలందివ్వడం మొదలెట్టేరు సుందరంగారు.
ఆ కార్యక్రమం అయ్యేకా బయల్దేరిన లాంచీ ఆ శీతాకాలం చలివెచ్చని ఎండలో అందంగా ఎగువకెళ్తుంది రాయబోయే స్క్రిప్టు గురించే ఆలోచిస్తుంటే ఇంకా వాతావరణం అలాగిలాగని చెప్పడానికి లేనంత హాయిగా వుంది.
పట్టిసీమ రేవులో పనసకాయ పట్టుకుని నిలబడ్డ ఆ మనిషి దగ్గర్నించి అది అందుకున్న పట్టాభిగారు “రాజమండ్రి వచ్చినప్పుడు కల్సి మాటాడ్తానని చెప్పు మీ కాపుగారికి” అంటా సుందరానికిస్తా “మధ్యాహ్నం ఆవపెట్టిన పనస పొట్టుకూరకి” అన్నారు.
బయల్దేరిన ఝాన్సీరాణి పోలవరం వేపెళ్తుంది. కిందకి దిగి ఎదరాల్లో కొచ్చేసిన రమణగారు ఆలోచిస్తా మధ్య మధ్యలో బాపుగారితో డిస్కస్ చేస్తున్నారు.
వెనకున్న వంటగదిలో సుందరం గారు చేస్తున్న వంటల ఘుమఘుమలు గోదారంతా పరుచుకు పోతున్నాయి. పట్టాభి ఉల్లిపాయలు తరుగుతుంటే పప్పు పులుసులోకి ముక్కలు కోస్తున్నారు సీతారావుడుగారు.
గంటలు గడుస్తుంటే, అంత హాయిగా,ఆనందంగా వుండడంతో ,ఏమాత్రం తెలీటం లేదు.
 పురుషోత్తపట్నం,పోచమ్మగండి, పూడిపల్లి దాటుతుంటే వచ్చిన సుందరంగారు “ఎక్కడన్నా ఆపుతారా? లాంచీ వెళ్తున్నప్పుడే వడ్డించెయ్యమంటారా?” అన్నారు.
“వెళ్తున్నప్పుడే తినేద్దాం హాయిగా.” అని బాపు గారనడంతో అన్నం కూరల గిన్నెల్తో వచ్చేసేడు సుందరంగారి అసిస్టెంటు.
హాయిగా  భోజనాలయ్యేకా కాస్సేపు విశ్రాంతి. తర్వాత మళ్ళీ పని మొదలు.
అలా కొన్ని గంటలు సాగేకా ఇలా సూర్యాస్తమయం అవుతున్నప్పుడే ఇంకో దిక్కునించి చంద్రుడు. ఆ వేళ పౌర్ణమి. అది దృష్టిలో వుంచుకునే ఈ షెడ్యూల్ ప్లాన్ చేసేరు సీతారావుడుగారు.
అగ్రహారం రేవులో లాంచీ ఆగగానే ఆ చంద్రుడ్ని చూస్తా స్నానాలకి దిగేరు. అలా ఆ చంద్రకాంతిలో జలకాలాడి బయటికొచ్చేటప్పటికి ఇసకలో పరిచిన పరుపులు వాటి మీద తెల్లదుప్పట్లు మోచేతులాన్చడానికి బాలిసాలు. ఇక్కడ్నించి మొదలైన మద్యం కార్యక్రమం అప్పుడు కూడా కథ గురించే. “ఒక చిన్న కేరెక్టరొచ్చిందోయ్. ఇలా మెరిసి అలా మాయమైపోయే గమ్మత్తైన కారెక్టరు. మాడా బాగుంటాడు దానికి” అన్నా రమణ గారి ముక్కులకి అదే ఇసక తిప్ప మీద టెంపరరీగా కాపురాలుంటున్న జాలారి వాళ్ళు మట్టిదాకలో కాసుకుంటున్న చేపల పులుసు వాసన తగలడంతో సుందరంగార్ని పిల్చి “వాళ్ళు కాస్తున్న రెసీపీతోనే కాయండి పులుసు. చేపల ముక్క బదులు ఏ దొండకాయ ముక్కలో, బెండకాయ ముక్కలో వేస్తే ఆ రుచి రాదంటారా?” అన్నారు.
నవ్వేసిన సుందరం “రాదు గదండీ” అన్నారు.
తాగేసిన ఒక జాలరి కుర్రోడు పెళ్ళాన్ని కొట్టబోతే విసురుగా ఎదురు తిగినా పిల్ల చితగ్గొట్టేస్తుందాడ్ని.
వాళ్ళని చూసి ఎంజాయ్ చేస్తా మందు కార్యక్రమం పూర్తి చేసినాళ్ళకి పెట్రొమాక్స్  లైటు వెలుగులో అద్భుతమైన భోజనాలు.
ఆ వెన్నెల్లో వెళ్తున్నా గూటి పడవని చూసిన రవణగారు “ఇదే అట్మాస్‌‌ఫియర్లో హీరో హీరోయిన్ల మధ్య బేక్‌‌గ్రౌండ్ సాంగ్ పెడదాం” అంటుంటే “ఈ టైములో కూడా వర్కేనా కాస్సేపు ఎంజాయ్ చెయ్యండోయ్” అంటున్నారు సీతారాముడుగారు.
           *                                *                                *
మర్నాడు పొద్దుట కాలకృత్యాలూ, స్నానాలూ, ఫలహారాలు అయ్యేకా బయల్దేరిన ఝాన్సీరాణి ఎక్కడా ఆక్కుండా వెళ్తుంది. రమణగారి పని చాలా సీరియస్‌‌గా సాగుతుంది.
రాత్రికి వాళ్ళ స్టే పాపికొండలకి ముందు అంటే ముందు తగిలే తాడివాడ రేవులో.
నిన్నటికంటే నలభై అయిదు నిమిషాలు ఆలశ్యంగా వచ్చిన చంద్రుడ్ని చూస్తా హాయి హాయిగా స్నానాలు చేసి ఒడ్డెక్కిన వాళ్ళకి విప్పిన మడత మంచాల మీద కనిపించాయా పరిచిన తెల్లటి పరుపులు.
గ్లాసుల్లోఉన్న ద్రవంలో గోదారినీళ్ళు పోస్తుండగా “మనం వున్నది ఏ జిల్లా ఒడ్డు మీదా?” అడిగేరు బాపుగారు.
“తూర్పు గోదావరి జిల్లా” చెప్పాడు శ్రీ పాద పట్టాభిగారు.
“మనకి ఎదురుగా  కనిపిస్తున్న ఆ ఒడ్డు పశ్చిమ గోదావరి అంతే గదా?”
“అంతే....అంతే” అంటా నవ్వేసిన రమణ గారు “మా జిల్లా ఒడ్డు మీద కూర్చుని, మీ జిల్లా ఒడ్డుని చూస్తున్నాం” అన్నారు బాపుతో.
సరదా సరదాగా వాళ్ళలా మాటాడుకుంటుంటే ఒక బస్తా నెత్తి మీద పెట్టుకునొచ్చినా మనిషి “కూనవరం వెళ్ళే లాంచీ వెళ్ళిపోయిందా?” అంటే “ఎప్పుడో వెళ్ళిపోయిందన్నాడా రేవులో మనిషి.
అది విని నేల మీద కూలబడిపోయినా మనిషి “నేను అడివిలోపలెక్కడో వున్న మా ఊరు పాటిగుంట నించొచ్చేటప్పటి ఇంతసేపు పట్టింది. అయితే, వెళ్ళిపోయిందన్న మాట కూనవరం సంతకెళ్ళే లాంచీ?” అంటా చాలా ఇదయిపోతున్నాడు. ఎంత వెన్నెలైనా అతని ముఖం సరిగ్గా కనపడ్డం లేదు గానీ ఏడుస్తున్నట్టున్నాడు.
“ఈ బస్తాలో ఏమున్నాయి?” అడిగారు బాపు.
“జీడి పిక్కలు” చెప్పేడా మనిషి.
“ఇవి సంతలో అమ్ముకుందామని వెళ్తున్నావా?”
అవునన్నట్టు తలూపేడు.
“దీని రేటెంతో మాకు చెప్పు మేం కొనేసుకుంటాం” అన్నారు బాపు.
“చెప్పు బేరం ఆడకుండా డబ్బులిచ్చేస్తాం” అన్నారు రమణగారు.
అతను చెప్పిన డబ్బులిచ్చిన రమణ గారు “ఈ రాత్రికి మాతో భోజనం చేసెళ్దూగాని” అన్నారు.
చేతులెత్తి దణ్ణం పెట్టినా మనిషి “మిమ్మల్నా గోదారి తల్లే పంపింది బాబూ” అన్నాడు.
నవ్వేసిన బాపు “అవును మనమంతా ఆ గోదారి తల్లి బిడ్డలం” అన్నారు.
                                      *                                *                                *
మర్నాడు స్నానాలూ పలహారాలూ చేసి బయల్దేరుతుంటే ఆ తాడివాడ రేవులో వున్న జామిచెట్టు కాయలు కొందరు గిరిజన పిల్లలు కొయ్యడం చూసిన రమణగారు “హీరోయిన్ ఇంట్రడక్షన్ ఆ పిల్లలా ఎగిరెగిరి పై కొమ్మ మీద జామికాయ కోసే సీన్ పెడదాం” అంటుంటే దళసరి అట్లు, జీడిపప్పు కూరా పట్టుకొచ్చిన సుందరంగారు “ఈ ఏరియాలో అలసందలు బాగా దొరుకుతాయి వాటితో అట్లు వేసి రాత్రి ఆ మనిషి దగ్గర కొన్న జీడి పప్పు కూర చేసేనండి” అన్నారు సుందరం.
“చాలా రుచిగా వుంది” అన్నారు బాపుగారు.
“ఈ ట్రిప్పులో జీడిపప్పుతోనే రకరకాల కూరలూ వేపుళ్ళూ చేస్తానండి.... మరి  ఆ మనిషి దగ్గర బోల్డు కొన్నారు గదా రాత్రీ?”
“అలాగే”
బయల్దేరిన ఝాన్సీరాణి పాపికొండల లోపలికెళ్ళిపోతుంటే అదో వింత హారు, వింత చలి. పగలే పొద్దోయినట్టుంది. ఆ స్వచ్ఛమైన గాలీ, నీరు మొత్తంగా స్వశ్చమైన వాతావరణం చూస్తా ఆ గోదారిమాత కి దణ్ణమెట్టుకుంటుంటే వెళ్తానే వుంది లాంచీ.  అద్బుతమైన పాపికొండలు కుడిపక్కనున్న కొల్లూరొచ్చేకా అంతమై పోయి నియ్యి.
“మనకి ఎడం పక్కన గోదాట్లోకి ఒంగున్న ఆ చింతచెట్టు చూడండి” అన్నారు శీతారావుడుగారు.
“ఏ ముందా చింతచెట్టు వెనక?” అడిగేరు బాపు.
“చింత చెట్టు వెనక కాదు ఆ చెట్టు పక్కనున్న ఆ సన్నటి కాలి బాట మీద కొంచెం ముందుకెళ్తే పేరంటపల్లి అనే చిన్ని కొండరెడ్లగ్రామం, గుడి వీటన్నింటికంటే ముఖ్యంగా మన దిగువ ప్రాంతాల్నుంచొచ్చిన స్వామి బాలానంద ఉంటారు. మనం కలవాల్సిన వ్యక్తి ఆయన” అన్నారు శీతారాముడుగారు.
మళ్ళీ డిస్కషను మొదలైంది.
“క్లైమాక్సు కపిలేశ్వరపురం జమీందార్ల గెస్ట్‌‌హౌస్‌‌లో ప్లాన్ చేద్దాం అని బాపు అంటే “నేనూ అదే అనుకుంటున్నాను” అన్నారు రమణ.
చిన్న చిన్న రేవులు దాటుతున్న ఝాన్సీరాణి కొండేపూడి, తుమ్మిలేరూ కూడా దాటుతుంటే సాయంత్రమవుతుండగా సుందరంగారేసిన జీడిపప్పు పకోడీ రుచి అలాగిలాగని చెప్పడానికి వీల్లేనంత గొప్పగా వుంది.
ఎదురొచ్చిన ఆ ఇసక తిప్ప ఒడ్డున ఆ జాలరివాళ్ళ నావఁలు కట్టేసి ఉన్నాయి. తిప్ప మీద వాళ్ళ టెంపరరీ తాటాకు గుడిశలు, ఒడ్డునున్న బండకేసి బాదుతా ఉతికిన రంగు రంగుల బట్టలూ పాక ముందు తీగలకి వేలాడుతున్నాయి. ఆ వాతావరణం చూస్తున్న పట్టాభి “వాళ్ళతో కలిసిపోయి బతకాలనిపిస్తుంది” అన్నారు.
“వాళ్ళకేమో మన కూడా వచ్చేసి వుండాలనిపిస్తది. రెండూ కరక్టు గాదు” అన్నారు శీతారావుడుగారు.
“మరి?” అన్నాడు పట్టాభి.
“ఎవరెక్కడున్నారో అక్కడే వుండి ఎవరి బతుకులాళ్ళు బతకడమే కరక్టు.”
లాంచీ చాలా పొడుగాటి రేవు పోచవరం ఒడ్డునాగింతర్వాత “ఇవేళ గంటన్నర లేటుగా వస్తాడు చంద్రుడు స్నానాలకి అప్పటి దాకా వెయిట్ చేద్దామా?” అడిగేడు పట్టాభిగారు.
“ఈలోపు డిస్కషన్ కంటిన్యూ చేద్దాం..... ఇదిగో బాపూ.... ఆ చిన్న పిల్లకి ఆంజనేయస్వామి కనబడే ధాట్‌‌కి ఫిక్సయి సీన్లు అనుకుంటున్నాను” అంటా కథ గురించి చాలా మాటాడిన రమణగారు చంద్రోదయం అయ్యేకా స్నానాలూ పానాలప్పుడు కూడా సీరియస్‌‌గా మాటాడతానే ఉన్నారు.
రాత్రి కాస్త ఆలశ్యంగా పడుకున్నా మర్నాడు పొద్దుటే లేచిపోయి కాలకృత్యాలవీ పూర్తయ్యేక మళ్ళీ కథా చర్చ.
ఫలహారాలు తర్వాత బయల్దేరిన ఆ ఝాన్సీ రాణి లాంచీ  కొయిదా, జీడికుప్ప, చిగురు మామిడి, శ్రీరామగిరి దాటుకుంటా రాత్రికి కూనవరంలో ఆగింది. ఎదురుగా రుద్రంకోట ఒడ్డు. ఒరిస్సానించి వచ్చే శబరి గోదాట్లో కలిసేది ఇక్కడే.
ఆ రాత్రికి కాంప్ కూనవరం రేవులో. ఎవరితోనూ మాటాడ్డం మానేసిన రమణగారు నవ్వుతున్నారుగానీ లోపల చాలా సీరియస్‌‌గా పని చేసుకుంటా పోతున్నారు.
అదంతా చూస్తున్న సీతారావుడుగారు“ గోదాట్లో కొస్తే ఇంత గొప్పగా పని చేసే శక్తి వస్తుందన్న మాట వీళ్ళకి” అనుకున్నారు.
మర్నాడు పొద్దుట బయల్దేరిన ఝాన్సీరాణి తాపీగా  వెళ్తుంటే చాలా సీరియస్‌‌గా పనిలో పడ్డ బాపురమణలు అన్నాలు తినడం కూడా మర్చిపోయేరు.
రాత్రికి భద్రాచలం చేరుకున్నాక ఆ మర్నాటి తెల్లవారు జామునే గోదావరిలో స్నానాలు చేసి వాళ్ళ కొత్త సినిమా స్క్రిప్టు రామచంద్రుల వారి పాదాల దగ్గర పెట్టి, వాళ్ళు ఊపిరి పీల్చేటప్పుడూ, ఊపిరి వదిలేటప్పుడూ తల్చుకునే వాళ్ళ రామభద్రుడ్నే చూసుకుంటా దణ్ణ వెట్టుకున్నారు.
 ఆ తర్వాత ఈ స్క్రిప్టు వాళ్ళ జీవితాల్లో అతిగొప్ప సినిమా అయ్యికూర్చుంది. అదే .......ముత్యాల ముగ్గు

No comments:

Post a Comment