Thursday, January 27, 2022

మానవునికి ఉండాల్సిన శుద్ధ తత్వాలు (గుణాలు) అయిదు, వీటినే పంచపునీతాలు అంటారు, వాటి వివరాలు....

మానవునికి ఉండాల్సిన శుద్ధ తత్వాలు (గుణాలు) అయిదు, వీటినే పంచపునీతాలు అంటారు, మరి ఒకసారి వాటి వివరాలు తెలుసుకుందాము...!!!

వాక్ శుద్ధి :

ఈ చరాచర సృష్టిలో, ఎన్నో వేలకోట్ల ప్రాణాలను సృష్టించిన ఆ భగవంతుడు మాట్లాడే వరాన్ని ఒక మనిషికే ఇచ్చాడు.
కాబట్టి వాక్కును దుర్వినియోగం చేయకూడదు. మంచిగా, ఆదరణతో మాట్లాడాలి అమంగళాలు మాట్లాడే వారు తారసపడితే, వారికి, ఓ నమస్కారం పెట్టి పక్కకొచ్చేయండి.

దేహ శుద్ధి :

ఈ పంచభూతాత్మకమైన మానవ శరీరం దేవుని ఆలయం వంటిది. దాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి.
అలాగే ఈ దేహములో వున్న పంచేంద్రియములైన కళ్ళు, ముక్కు, చెవులు, చేతులు/కాళ్ళతో, మంచి విషయాలను చూచుట, సువాసనలనే ఆఘ్రాణించుట, మంచి విషయములను వినుట, మంచి కార్యములను చేయుటకు వెళ్ళి చేతులతో చేయుట.

భాండ శుద్ధి :

మానవ శరీరానికి కావలసిన శక్తిని ఇచ్చేది ఆహారం . అందుకే ఆ ఆహారాన్ని అందించే పాత్ర, వంట వండే పరిసరాలు మరియు పదార్థాలు పరిశుభ్రంగా ఉండాలి . వంట వండే వ్యక్తి మరియు ఆహారం తినే వ్యక్తి, శుచిగా స్నానం చేసి, పరిశుభ్రమైన పాత్రలో వండిన ఆహారమును, ఆ భగవంతుడికి నివేదన చేసిన తరువాత, ఆ ప్రసాదమునే భుజించాలి. అపుడే అది అమృత తుల్యమవుతుంది.

కర్మ శుద్ధి :

మానవులు సుకార్యములను మరియు శుభ కార్యములనే తలపెట్టి చేయవలను. అనుకున్న పనిని మధ్యలో ఆపిన వాడు అధముడు. అసలు పనినే ప్రారంభించని వాడు అధమాధముడు. తలపెట్టిన పనిని కర్మశుద్ధితో పూర్తి చేసిన వాడు ఉన్నతుడు. ఏ కార్యము చేసినా భగవత్సంకల్పముగా మరియు పరమాత్మ ఆనతిగా తలచి చేయాలి.

మనశ్శుద్ధి :

మానవుని మనస్సు అత్యంత వేగవంతమైనది మరియు అంతే ప్రమాదకరమైనది కూడా. మనస్సును సదా మంచి ఆలోచనలపై, ధర్మ , న్యాయాల వైపు మళ్ళించాలి. మనస్సు చంచలమైనది. ఎప్పుడూ వక్రమార్గాలవైపు వెళ్ళాలని ప్రయత్నిస్తూవుంటుంది. దాని వల్ల అనేక సమస్యలు వస్తాయి. దుఃఖం చేకూరుతుంది. కాబట్టి ఎవ్వరికి హాని తలపెట్టకుండ, కుటుంబ మరియు సమాజ శ్రేయస్సు కోసం, మంచి మనస్తత్వం కలిగి ఉండటమే.

ప్రతి మానవునిలో పైన వివరించిన విధముగా, పంచపునీతాలు లేకుంటే, సర్వత్రా దుష్పరిణామాలు, దుష్పలితాలు, దుష్ప్రయోజనాలు, దుష్క్రత్యాలు, దురాలోచనలు, దురాచారాలు, దుర్మార్గాలు ప్రబలి, మన సమాజం, దేశం మరియు యావత్తు ప్రపంచం అతలాకుతలం అవుతుంది.

అందుకే మన శాస్త్రాలు ఈ క్రీంది విధంగా చెప్పాయి.

ఆహారంలో భక్తి ప్రవేశిస్తే ప్రసాదమౌతుంది !!

ఆకలికి భక్తి తోడైతే ఉపవాసమౌతుంది !!

నీటిలో భక్తి ప్రవేశిస్తే తీర్థమౌతుంది !!

యాత్రకి భక్తి తోడైతే తీర్థయాత్ర అవుతుంది !!

సంగీతానికి భక్తి కలిస్తే కీర్తనమౌతుంది !!

గృహంలో భక్తి ప్రవేశిస్తే దేవాలయమౌతుంది !!

కార్యములో భక్తి ప్రవేశిస్తే సేవ అవుతుంది !!

పనిలో భక్తి ఉంటే పుణ్యకార్యము అవుతుంది !!

మనిషిలో భక్తి ప్రవేశిస్తే సజ్జనుడౌతాడు!!
సజ్జనులు సత్సంకల్పముతో కూడితే సత్సంగం ఏర్పడుతుంది!!
ఇవన్నీ ఆచరిస్తే మానవ జన్మ పునీతమయ్యి సాఫల్యమవుతుంది. సార్థకత చేకూరుతుంది!!


కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనావా ప్రకృతేస్వభావాత్|
కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి||

అర్థం: నా శరీరముచే, వాక్కుచే, మనస్సు చేత, ఇంద్రియాలచేత, బుద్ధిచేత, ప్రకృతి స్వభావము చేత, ఏ కార్యములు చేసినా అవన్నీ ఆ పరమాత్ముడైన శ్రీమన్నారాయణునికే సమర్పిస్తున్నాను.

పరోక్షముగా సకార్యాచరణములనే చేయించాలని ఆ దేవదేవుని ప్రార్థించడం🙏...

సేకరణ

No comments:

Post a Comment