Sunday, July 3, 2022

ఎవరు గొప్ప? ఒక జెన్‌ కథ

🍁 ఎవరు గొప్ప?🍁

📚✍️ మురళీ మోహన్

🌹ఎలాంటి స్థితిలో ఉన్నా జీవితాన్ని ఆస్వాదిస్తూ, మరింత అభివృద్ధి సాధించేందుకు శ్రమిస్తూ ముందుకు సాగాలి. అలా కాకుండా ప్రస్తుత స్థితి తలచుకుని కుమిలిపోతుంటే ప్రయోజనం శూన్యం. దీనికి సంబంధించి ఒక జెన్‌ కథ ప్రచారంలో ఉంది.

🌿ఓ రాళ్లు కొట్టుకునే వ్యక్తి తన స్థితికి ఎప్పుడూ దిగులుపడుతుండేవాడు. జీవితం పట్ల తీవ్ర నిరాశతో రగిలిపోతుండేవాడు. ఒకసారి అతను ధనవంతుడైన ఓ వ్యాపారి ఇంటి మీదగా వెళుతూ లోపలి వైభవాన్ని, ముఖ్యమైన అతిథుల్ని చూశాడు.

🌿‘ఆహా! ఆ వ్యాపారి ఎంత అదృష్టవంతుడు! నేను కూడా అతనిలా అయితే’ అనుకున్నాడు. వెంటనే తనను తాను ఓ వ్యాపారిలా భావించుకుని పేదవాళ్లని అసహ్యించుకున్నాడు.

🌿అంతలో మరణించిన ఓ ఉన్నతాధికారిని అతని సేవకులు, సైనికులు ఊరేగింపుగా తీసుకెళ్లటం అతని కంటపడింది. ‘ఎంత డబ్బుండి ఏం ప్రయోజనం! అధికారానికి ఎవరైనా దాసోహం అనాల్సిందే. ఆ అధికారి ఎంత శక్తిమంతుడో కదా!’ అనుకున్నాడు ఆ రాళ్లుకొట్టే వ్యక్తి. వెంటనే తనను ఓ అధికారిలా భావించుకున్నాడు. చక్కగా అలంకరించిన చెక్క కుర్చీలో కూర్చుని అన్ని చోట్లకీ వెళుతూ అందరి మీదా అజమాయిషీ చేస్తున్నట్లు ఊహించుకున్నాడు.

🌿 అయితే, అది మంచి ఎండాకాలం. సూర్యుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ‘ఇంత ఉక్కపోతలో ఆ చెక్క కుర్చీలో కూర్చుంటే ఎంత చిరాగ్గా ఉంటుందో. అదంతా ఎవరు పడతారు. శక్తి అంటే సూర్యుడిదే. నేను సూర్యుడిలా అయితే’ అనుకున్నాడు. తనని సూర్యుడిలా ఊహించుకున్నాడు. ప్రచండ కిరణాలతో ఠారెత్తిస్తుంటే, జనాలు శాపనార్థాలు పెడుతున్నట్లు ముసిముసిగా నవ్వుకున్నాడు.

🌿అంతలో ఓ కారు మేఘం సూర్యుణ్ని కమ్మేసింది. ‘మేఘానిది ఎంత గొప్ప శక్తి. దానిలా మారిపోతే!’ అనుకున్నాడు. ఆ వెంటనే బలమైన గాలి మేఘాన్ని చెల్లాచెదురు చేసేసింది. మేఘంకన్నా గాలే బలమైంది అనుకున్నాడు. అయితే చెట్లు, చేమలు అన్నింటినీ కుదిపేసిన గాలి, ఓ పెద్ద బండరాయిని మాత్రం ఏమీ చెయ్యలేకపోయింది.

🌿‘ఓహో! రాయి ఎంత బలమైంది. దాని ముందు ఎంత పెద్ద పవనమైనా బలాదూరే’ అనుకున్నాడు. అంతలో దూరం నుంచి ఎక్కడో రాయి మీద సుత్తితో కొడుతున్న శబ్దాలు వినిపించాయి. ‘అరే! ఎంత పెద్ద రాయి అయినా సుత్తి దెబ్బలకి ముక్కలైపోవాల్సిందే కదా! అంటే, సుత్తితో రాళ్లని తునాతునకలు చేసే నేనెంత గొప్పవాణ్ని’ అనుకున్నాడు. అంతే, అప్పటిదాకా అతని మనసులో ఉన్న అసంతృప్తి ఎగిరిపోయి,🌿 ప్రశాంతత నిండింది.🌿

సేకరణ

No comments:

Post a Comment