Tuesday, July 26, 2022

సంస్కారం – నాగరికత

 *సంస్కారం – నాగరికత*


వాసు, వీణ గుజరాత్‌ లోని ఒక నగరంలో నివసిస్తున్నారు. ఒకే మెడికల్ కాలేజీలో కలిసి చదువుకున్న వీరిద్దరి స్నేహం ప్రేమగా మారింది. రెండేళ్ల క్రితం కుటుంబసభ్యుల ఆమోదంతో పెళ్లి చేసుకున్నారు. పెళ్లయ్యాక బ్యాంకులో లోన్ తీసుకుని సొంతంగా ఒక ఆసుపత్రి తెరవాలని నిర్ణయించుకున్నారు. వీణ గైనకాలజిస్ట్, వాసు డాక్టర్ ఆఫ్ మెడిసిన్. వారి నైపుణ్యాల వల్ల ఆసుపత్రి బాగానే నడుస్తూ ఉంది. వారికి ఇంకా పిల్లలు లేరు, కాబట్టి వారు సరదాగా చిన్న చిన్న ప్రయాణాలు చేస్తున్నారు.

వారు వృత్తిరీత్యా వైద్యులు అవడం వల్ల తరచుగా సెలవలు తీసుకోలేరు. అయితే రెండు మూడు రోజులు విరామం దొరికినప్పుడల్లా చిన్నపాటి ప్రయాణాలు చేస్తూ ఎదో ఒక చోటికి వెళ్లేవారు. ఈసారి వారికి మూడు రోజుల విరామం లభించడంతో ఇండోర్, ఉజ్జయిని వెళ్లాలని అనుకున్నారు.


వారు ప్రయాణానికి బయలుదేరినప్పుడు, ఆకాశమంతా మేఘావృతమై ఉంది. మధ్యప్రదేశ్ సరిహద్దు దాదాపు 200 కి.మీ దూరంలో ఉండగా వర్షం ప్రారంభమయింది. మధ్యప్రదేశ్ సరిహద్దుకి 40 కి.మీ దూరంలోనే ఓ చిన్న గ్రామాన్ని దాటడానికి వారికి చాలా సమయం పట్టింది. బురదమయమైన రోడ్లు, విపరీతమైన ట్రాఫిక్ మధ్య, వారు అతికష్టం మీద ఆ గ్రామాన్ని దాటగలిగారు.

మధ్యప్రదేశ్ చేరుకున్న తర్వాత భోజనానికి ఆగుదామని నిర్ణయించుకున్నారు, కానీ ఇప్పుడు సాయంత్రపు టీ సమయం అయింది. ఆ చిన్న ఊరు నుండి 4-5 కి.మీ దూరం వెళ్లాక రోడ్డు పక్కన చిప్స్ ప్యాకెట్లు వేలాడదీసి ఉన్న ఒక చిన్న ఇల్లు కనిపించింది. టీ కొట్టు అనుకుని, వాసు అక్కడ కారు ఆపి షాప్ లోకి వెళ్ళాడు, అక్కడ ఎవరూ లేరు. 


ఎవరైనా ఉన్నారా అని పిలిచాడు! ఒక స్త్రీ బయటకు వచ్చి "ఏం కావాలి అన్నా?" అనడిగింది.


వాసు రెండు చిప్స్ ప్యాకెట్లు, ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకుని, "అక్క, రెండు కప్పులు టీ ఇవ్వరా, దయచేసి కొంచెం త్వరగా చేయండి, మేము ఇంకా చాలా దూరం ప్రయాణించాలి." అన్నాడు. ప్యాకెట్లు తీసుకుని కారు దగ్గరకు వెళ్లాడు. ఇద్దరూ చిప్స్, బిస్కెట్లు తిన్న తర్వాత కూడా టీ ఇంకా రాలేదు. కారు దిగి షాపు వద్ద ఉన్న కుర్చీలపై కూర్చున్నారు. వాసు మళ్ళీ పిలిచాడు.

కొద్దిసేపటికి ఆ స్త్రీ బయటకు వచ్చి, "అన్నా! పెరట్లో తులసి ఆకులు తీసుకురావడానికి వెళ్ళాను, దానికి కొంచెం సమయం పట్టింది, టీ తయారవుతోంది." అంటూ కొద్దిసేపటి తర్వాత ప్లేట్‌ లో రెండు పాత కప్పుల్లో వేడి వేడి టీ తెచ్చింది.

మురికిగా ఉన్న ఆ పాత కప్పులను చూసి, వాసు పూర్తిగా నిరాశ చెంది, ఏదో అనాలనుకున్నాడు; కానీ వీణ చేయి నొక్కి, అతనిని ఆపింది. కప్పులు తీసుకోగానే తులసి, అల్లం సువాసన వెదజల్లింది. ఇద్దరూ టీ తాగారు. వారు తమ జీవితంలో ఇంత రుచికరమైన, సువాసనగల టీ మొదటిసారిగా తాగారు, ముందున్న సంకోచం అంతా మాయమైపోయింది.


టీ తాగిన తర్వాత, వారు ఎంత ఇవ్వాలని ఆ మహిళను అడిగారు. "ముప్పై రూపాయలు" అని బదులిచ్చింది. వాసు ఆమెకి వంద రూపాయల నోటు ఇచ్చాడు. ఆ స్త్రీ, "అన్నా, నా దగ్గర చిల్లరలేదు, దయచేసి నాకు ₹30 చిల్లర ఇవ్వండి" అని చెప్పింది.


 డాక్టర్ వాసు ఆమెకు చిల్లర ఇవ్వడంతో, ఆ మహిళ వంద రూపాయల నోటును తిరిగి ఇచ్చేసింది.


"చిప్స్, బిస్కెట్లు కూడా కొన్నాం కదా !" అన్నాడు వాసు. 

"ఈ డబ్బు దాని కోసమే, టీ కోసం కాదు" అని ఆ మహిళ చెప్పింది.

"ఐతే టీకి డబ్బులు ఎందుకు తీసుకోలేదు?" అని అడిగాడు.

"మేము టీ అమ్మం. ఇది హోటల్ కాదు" అని ఆమె సమాధానం ఇచ్చింది.


"మరి టీ ఎందుకు చేసిచ్చావు?" అడిగాడు వాసు.


"మీరు మా అతిధులుగా వచ్చి... టీ అడిగారు !! మా వద్ద పాలు కూడా లేవు. పిల్లాడి కోసం ఉంచిన కాసిని పాలు మాత్రమే ఉన్నాయి, నేను మిమ్మల్ని కాదనలేక, ఆ పాలతో టీ చేసి ఇచ్చాను."


"ఇప్పుడు నువ్వు పిల్లవాడికి ఏమి ఇస్తావు ?" అడిగాడు .

ఒక్కరోజు పాలు తాగకపోతే ఏమీ అవదు. బాబు తండ్రికి అనారోగ్యంగా ఉంది, లేకుంటే ఊళ్లోకి వెళ్లి పాలు తెచ్చేవాడు. కానీ అతనికి నిన్నటి నుంచి జ్వరం. ఈరోజు తగ్గితే రేపు పొద్దున్నే వెళ్లి పాలు తెస్తాడు", అంది.


ఆమె మాటలు విని వాసు, వీణ ఇద్దరూ నిశ్చేష్టులయ్యారు. నోరు మెదపలేకపోయారు!


వాసు ఇలా అనుకున్నాడు, “వాళ్ళు టీ అమ్మకపోయినా, ఈ అమ్మాయి తన బిడ్డ కోసం ఉంచిన పాలతో మనకు టీ చేసి ఇచ్చింది, అది కూడా నేను అడిగానని .... ఒక అతిధిగా అనుకుని? సంస్కారంలో, నాగరికత చూపడంలో ఈ మహిళ నాకంటే చాలా ఎత్తులో ఉంది."


"మేమిద్దరం డాక్టర్లం, మీ భర్త ఎక్కడ ఉన్నాడు ?" అనడిగాడు వాసు.


స్త్రీ వారిని లోపలికి తీసుకువెళ్లింది; ఆ ఇంట్లో ప్రతీది 'పేదరికం' తో అరుస్తోంది. ఒక పెద్దమనిషి మంచం మీద పడుకుని ఉన్నాడు; అతను చాలా సన్నగా ఉన్నాడు. డాక్టర్ వాసు వెళ్ళి అతని నుదుటి మీద చెయ్యి వేసాడు. అతని నుదురు, చేతులు చాలా వేడిగా ఉంది, వణుకుతున్నాడు కూడా.


డాక్టర్ వాసు కారు దగ్గరకు వెళ్లి మందుల బ్యాగ్ తీసుకొచ్చాడు. రెండు-మూడు మాత్రలు ఇచ్చి, "ఈ మాత్రలు వల్ల అతనికి పూర్తిగా నయం అవదు, నేను నగరానికి తిరిగి వెళ్లి ఇంజెక్షన్లు, మందు బాటిల్ తీసుకొస్తాను" అని చెప్పాడు. వీణను పేషెంట్ దగ్గరే ఉండమన్నాడు.


అతను తన కారును తీసుకొని అరగంటలో, సిటీ నుండి మందు సీసాలు, ఇంజెక్షన్లు, కొన్ని పాల ప్యాకెట్లతో పాటు తిరిగి వచ్చాడు. పేషెంట్ కి ఇంజెక్షన్ ఇచ్చాడు, డ్రిప్ బాటిల్ పెట్టాడు. సెలైన్ బాటిల్ ఖాళీ అయ్యే వరకు ఇద్దరూ అక్కడే కూర్చున్నారు. ఆ స్త్రీ తులసి అల్లం టీ మరోసారి తయారు చేసింది. ఇద్దరూ టీ తాగి, దానిని మెచ్చుకున్నారు. రెండు గంటల్లో పేషెంట్ కాస్త బాగుపడడంతో అక్కడి నుంచి ఇద్దరూ వెళ్లిపోయారు.


ఇండోర్ - ఉజ్జయినిలో మూడు రోజులు ఉండి తిరిగి వచ్చిన తర్వాత, వారు ఆ పిల్లాడి కోసం కొన్ని బొమ్మలు, పాల ప్యాకెట్లు తీసుకువచ్చారు. వారు ఆ దుకాణం ముందు ఆగి ఆ మహిళను పిలిచారు. భార్యాభర్తలిద్దరూ బయటకు వచ్చి వారిని చూసి చాలా సంతోషించారు. “మీ మందులతో ఆ మరుసటి రోజే అతను పూర్తిగా కోలుకున్నాడు’’, అని ఆ మహిళ చెప్పింది.

డాక్టర్ వాసు చిన్నారికి బొమ్మలు, పాల ప్యాకెట్లు ఇచ్చారు. మళ్ళీ టీ తయారుచేయబడింది, సంభాషణలు జరిగాయి, స్నేహం ఏర్పడింది. వాసు తన అడ్రస్ ఇచ్చి, "నువ్వు మా ఊరు వచ్చినప్పుడల్లా నన్ను కలువు", అన్నాడు.


 ఆపై వారిద్దరూ వారి నగరానికి చేరుకున్నారు.


సిటీకి చేరుకోగానే డాక్టర్ వాసు ఆ మహిళ మాటలు మరిచిపోకుండా ఓ నిర్ణయం తీసుకున్నాడు. అతను తన ఆసుపత్రిలోని రిసెప్షనిస్ట్‌ తో ఇలా చెప్పాడు, "ఇక నుండి ఎవరైనా పేషెంట్లు వచ్చినప్పుడు, వారి పేర్లు రాయండి, ఎటువంటి రుసుము వసూలు చేయవద్దు, ఇక నుండి ఫీజులు నేనే వసూలు చేసుకుంటాను."


అప్పటి నుండి పేద పేషెంట్ల వద్ద నుంచి ఫీజులు వసూలు చేయడం మానేశాడు. పేషెంట్లు సంపన్నులు అని తెలిస్తే మాత్రం ఫీజు వసూలు చేసేవాడు.

క్రమంగా, అతను నగరం అంతటా ప్రసిద్ధి చెందాడు. ఇతర వైద్యులు తెలుసుకుని, ఇది మా ప్రాక్టీస్ ను తగ్గిస్తుందని, ప్రజలు తమని విమర్శిస్తారని వారు భావించారు. వైద్య సంఘం ప్రెసిడెంట్ ని కలిసి వారు ఆందోళనకు దిగారు.


అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ వాసుని కలవడానికి వచ్చి "ఎందుకు ఇలా చేస్తున్నావు?" అనడిగాడు.


  కానీ డాక్టర్ వాసు చెప్పిన సమాధానం విని అతను ఆశ్చర్యపోయాడు.


డాక్టర్ వాసు మాట్లాడుతూ.." జీవితంలో ప్రతి పరీక్షలోనూ మెరిట్‌ లో ఫస్ట్‌ ర్యాంక్‌ సాధిస్తూ వచ్చాను .... ఎంబీబీఎస్‌, ఎండీ చదివే సమయంలోనూ గోల్డ్‌ మెడలిస్ట్‌ నే.. సభ్యత, సంస్కారం, ఆతిథ్యంలో మాత్రం ఆ గ్రామానికి చెందిన ఆ పేద మహిళ నాకంటే ముందున్నది, ఇప్పుడింక నేను ఎలా వెనుకబడి ఉండగలను?అందుకే నేను ఆతిథ్యం, మానవ సేవలో కూడా గోల్డ్‌ మెడలిస్ట్‌ ని అవుదామనుకుంటున్నాను. అందుకే నేను ఈ సేవను ప్రారంభించాను. నిజానికి, మన వృత్తి మానవాళికి సేవ చేయడానికి కానీ, డబ్బు సంపాదించడానికి కాదు. మానవాళికి సేవ చేసే అవకాశాన్ని భగవంతుడు మనకు ఇచ్చాడు", అన్నాడు.


"ఇకపై నేనూ అదే స్ఫూర్తితో వైద్యసేవ చేస్తాను’’ అంటూ సంఘం అధ్యక్షుడు డాక్టర్ వాసుకు నమస్కరించి కృతజ్ఞతలు తెలిపారు.


♾️


మనం చేసే సేవలో ఉత్సాహం ఉండాలి; మనం ఏమి చేసినా, ప్రతిఫలంగా ఏమీ పొందాలనే ఉద్దేశ్యం లేకుండా హృదయపూర్వకంగా  చేయాలి. 🌼

 *సేకరణ..,...* 

 *గంగిశెట్టి మనోజ్ కుమార్.*

No comments:

Post a Comment