Thursday, July 21, 2022

స్వర్గ నరకాలు ఉన్నాయా?

 🪷🪷 *"45"* 🪷🪷

🪷🪷 *"కర్మ - జన్మ"* 🪷🪷🪷

      🌼🪷🌼🪷🌼🪷🌼

            🌼🪷🕉🪷🌼

                 🌼🪷🌼

                       🌼


 *"స్వర్గ నరకాలు ఉన్నాయా?"* 

**************************


 *"కర్మ సిద్ధాంతం ప్రకారం ఇంద్రుడు, రంభ, ఊర్వశి, మేనకలు, ఇతర అప్సరసలు గల, మనం పురాణాల్లో చదివే సుఖాన్నిచ్చే స్వర్గం నిజంగా ఉందా?"*


 *"దీనికి ముందుగా సుఖం అంటే ఏమిటో తెలుసుకోవాలి."*


 *"సచ్చిదానందానుభవ స్వరూపం జ్ఞాత్వా ఆనందరూపావస్థితిః ఏవ సుఖమ్".* 

                   -- *నిరాలంబోపనిషత్ 26*


 *"అంటే,  సత్, చైతన్య, ప్రకాశ, జ్ఞాన, ఆనంద లక్షణాల స్వతస్సిద్ధమైన సంపూర్ణ అనుభవ స్వరూపాన్ని తెలిసికొని, జ్ఞాపకంలో నిలుపుకుని ఆనంద రూపంలో స్థిరత్వాన్ని పొందడమే సుఖం అంటే. దీన్నే బ్రహ్మానందం అంటారు."*


 *"ఇప్పుడు నిరాలంబోపనిషత్ ఇచ్చిన స్వర్గం నిర్వచనం చూద్దాం."*


 *సత్సంసర్గ స్వర్గః* *"(నిరాలంబోపనిషత్ -28) అంటే సత్ లక్షణాన్ని సృజించుకోవమే స్వర్గం. అంటే తను సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్మ అనే విషయం తన ఉనికిలో చూడగలగడం స్వర్గం. ఇందువల్ల బ్రహ్మానంద సుఖం కలుగుతుంది. దీన్నిబట్టి సుఖం, స్వర్గం అనే రెండిటి నిర్వచనాలు దాదాపు ఒక్కటే అని తెలుస్తోంది. అంటే ముక్తిని పొందడమే స్వర్గం అని వేదాంతం చెప్తుంది."*


 *"మరో స్వర్గం కూడా ఉంది. ఇది లౌకికమైనది. "సృజ్యత ఇతి స్వర్గః" సృజింపబడేదే స్వర్గం. *"స్వప్రయత్నేన గచ్ఛతీతి స్వర్గః" తన ప్రయత్నం చేత చేరేది స్వర్గం."*


*"అంటే తన ప్రయత్నంతో మనసుతో భోగ స్వర్గాన్ని ఊహించుకోవడమే స్వర్గం. అలసిన బాటసారి కడుపు నిండా భోజనం చేసి చక్కటి మంచం మీద నిద్రిస్తే, అది అతను సృజించుకున్న స్వర్గం. అసలు స్వర్గం తను పరమాత్మ అనే ఎరుకని కలిగి ఉండటమే."*


 *"నరకం సంగతి చూద్దాం".*


 *నరకం* 

*********

 *"నరకం అంటే దుఃఖమే కాబట్టి ముందుగా దుఃఖం అంటే ఏమిటో చూద్దాం. నిరాలంబోపనిషత్ ప్రకారం -* *"అతన్ సంసారవిషయసంకల్ప ఏవ దుఃఖం"* *"(నిరాలంబోపనిషత్-27) అంటే,  సుఖానికి వ్యతిరేకంగా ఉండే అన్ని సంసార విషయాల సంకల్పమే దుఖం."*


 *"సంసారం అంటే ఏమిటి? - భార్యా భర్తలు కలిసి జీవించడం అని లౌకిక ప్రపంచంలో అర్థం. కాని వేదాంతపరంగా దాని అర్ధం వేరు."*


 *"సంసరతి అనేన ఇతి సంసారః సృ గతౌ." అంటే స్వతస్సిద్ధమైన బ్రహ్మ రూపమైన సత్, చైతన్య, ప్రకాశ, జ్ఞాన, ఆనంద లక్షణాల జ్ఞాపకం నించి జారిపడుట సంసారం అని అర్ధం."*


 *"తాను పరమాత్మ అనే స్మృతి పోవడాన్ని సూక్ష్మంగా 'అజ్ఞానం' అని అంటారు. (సత్వ, రజో, తమో గుణాలు అజ్ఞానానికి ప్రతీకలు) తిరిగి ఆ స్మృతి కలిగేదాకా, అంటే ముక్తిని పొందేదాకా అంటే, తను సచ్చిదానంద స్వరూపం అన్న ఎరుకని, ఉనికిని తిరిగి పొందే దాకా మనం జనన మరణ చక్రంలో పడి కొట్టుకుంటాం.ఇదే సంసారం. కర్మ-జన్మ అన్నదే సంసారం. దీనివల్ల బంధం కలుగుతుంది. సంసారానికి సంబంధించింది ఏదైనా దుఃఖకరమైందే కాబట్టి బంధం కూడా అంతే."*


 *"బంధం అంటే ఏమిటో తెలుసుకుందాం".*

**************************

 *"అనాద్యవిద్యావాసనయా జాతోహమిత్యాది నంకల్పో బన్ధః" (నిరాలంబోపనిషత్ - 30)*


*"అంటే,  'అనాదిగా పీడిస్తున్న అవిద్య యొక్క వాసనచేత పుట్టినవాడిని నేను' మొదలైన ఆలోచనలే బంధం."*


*"ఈ ఆలోచనకి ఆలంబనంగా అనేక బంధాలు ఉంటాయని శాస్త్రం చెప్తోంది. అవి అనేకం. తల్లి, తండ్రి, సోదరుడు, కొడుకు, ఇల్లు, తోట, భార్య మొదలైనవి నావి అనే సంసార ఆవరణపరమైన సంకల్పం బంధం. కర్తృత్వం (నేను, నాది) మొదలైన అహంకార సంకల్పం బంధం. అషైశ్వర్యాల మీద ఉండే ఆశ బంధం. ఉపాసన, యజ్ఞ, వ్రత, తప, దాన, విధి, విధానాల సంకల్పం బంధం."*


*"యోగం చేయాలనుకోవడం, యమ నియామాల సంకల్పం బంధం. వర్ణాశ్రమ ధర్మాలు పాటించాలనే సంకల్పం బంధం. భయం, సంశయం లాంటి గుణ సంబంధమైన సంకల్పం బంధం. మోక్షం మాత్రమే కావాలనే సంకల్పం బంధం. "సంకల్ప మాత్ర సంభవః" అంటే, ఏ సంకల్పమైనా బంధం. సంసారం వల్ల బంధం, బంధం వల్ల దుఃఖం కలుగుతాయని తెలుస్తోంది."* 


 *"ఇక నరకం అంటే ఏమిటో చూద్దాం".* 

*************************

 *"నరకాన్ని నిరాలంబోపనిషత్ ఇలా నిర్వచించింది. "అసత్ సంసార విషయ జనన సంసర్గ ఏవ నరకః" అంటే, సంసార విషయంలో జనింపచేసే, సత్యం కాని వాటి చేరికయే నరకం."*


 *"అంటే చావు పుట్టుకలు, వాటి మధ్య జరిగేదంతా నరకం. అదంతా అజ్ఞానం వల్లనే జరుగుతుంది కాబట్టి అజ్ఞానమే నరకం అంటే, మనమంతా అజ్ఞానులం కాబట్టి ఈ ప్రపంచంలోనే నరకాన్ని అనుభవిస్తున్నాం."*


 *"వేదాంతపరంగా నరకం అంటే,  తాను పరమాత్మనన్న మరుపు, నేను నాది అనే బంధం, చావు పుట్టుకల చక్రం, భౌతిక దేహం అని అర్ధం. "కో వాస్తి ఘోరో నరకః స్వదేహః" ఘోరమైన నరకం ఏది? ఈ శరీరమే. ( ప్రశ్నోత్తరి మణిమాల)"*


 *"మతపరమైన నరకం గురించిన వర్ణన గరుడ పురాణంలో, దేవి భాగవతంలో ఉంది. మనం చేసే పాపాలు, వాటికి నరకంలో అనుభవించే శిక్షలు, నరకంలోని రకాలు గురించి ఇంకా అనేక పురాణాల్లో వివరంగా వర్ణించబడింది."*


*"కర్మ సిద్ధాంతం ప్రకారం యముడు, యమ భటులు, కాగే నూనె బాణలిలో మరిగే పాపులు గల నరకం నిజంగా ఉందా? లేక ఇది కల్పనా? యముడు, చిత్రగుప్తుడు, స్వర్గ నరకాలు పురాణాల్లో కొన్ని కథలకి సూచించడానికి సంకేతంగా చేసిన పాత్రల కల్పన మాత్రమే. పాపాలకి శిక్ష అనుభవించాక జీవికి ఇక మళ్ళీ జన్మకి రావాల్సిన అవసరం ఏముంది?"*


*"వచ్చినా పాపరహితులైన అంతా సమానులుగా రావాలి కాని ఇలా హెచ్చు తగ్గులతో ఎందుకు పుడతారు? అవి కేవలం మనిషికి పాపం చేయడానికి భయం కలిగించేందుకు ఋషులు చేసిన హెచ్చరికలై ఉండాలి."*


 *"ఏ దుశ్చర్యకి ఏ రోగమో నిర్ణయింపబడ్డాక అది భౌతిక దేహంతోనేగా అనుభవించాల్సి ఉంటుంది. పరస్త్రీలతో అక్రమ సంబంధం గలవాడు క్షయ వ్యాధికి గురయి ఆ నరకాన్ని ఇక్కడే అనుభవిస్తాడు."*


*"వ్యభిచార వ్యాపారం చేసినవాడు హిజ్రాగా జన్మించి నరకాన్ని ఈ లోకంలోనే అనుభవిస్తాడు. ఇలా ప్రతీ దుష్కర్మకి ఓ ఫలితం ఉంది కాబట్టి ప్రత్యేకంగా నరకం అనే ఇంకో లోకం ఉండకపోవచ్చు. మనస్సే నరకాన్ని ఈ లోకంలో అనుభవిస్తోంది తప్ప పురాణాల్లో చెప్పినట్లుగా ప్రత్యేకంగా నరకం అనేది ఉండదు."*


 *"ఎందుకంటే పాపం అధికంగా చేస్తే ఆ పాపానుభవానికి జంతు జన్మ వస్తుందని చెప్పుకున్నాం. చెడు కర్మలు చేసినవాడు చెడు యోనుల్లో పుట్డి కష్టాలు అనుభవిస్తాడు. ఇక నరకం అవసరం ఎక్కడుంది!? ఇది వేదాంతపరమైన విశ్లేషణ."*

            🌼🪷🌼🪷🌼

                  🌼🕉🌼

No comments:

Post a Comment