Sunday, July 17, 2022

మధువిద్య

 ♥️♥️ "162" ♥️♥️

♥️♥️ "ఉపనిషత్తులు" ♥️♥️
♥️ "బృహదారణ్యకోపనిషత్తు" ♥️

"చతుర్ధ అథ్యాయం. పంచమ బ్రాహ్మణం:"

"క్రితం భాగంలో చెప్పిన మధువిద్యను మరొక్కసారి చదివి ఈ వివరణలోకి రండి."

"ఈ మానవ శరీరం సమస్త భూతాలయొక్క సారమై ఉంది. దేహేంద్రియాది సముదాయములో తేజోమయుడు అమృతమయుడైన జీవాత్మ ఆ పరమాత్మ స్వరూపమే. ఆ విజ్ఞనముతో కూడిన ఆత్మ యే పంచ భూతాలకు అధిపతి అవుతూంది."

"మధువిద్యలో దేహేంద్రియ సముదాయము, ఇంద్రియవృత్తులు పంచభూతాలతో ఏవిధంగా ముడివడి వున్నాయో వివరించబడ్డాయి."

"వాటిని శుద్ధి పరచి ఆత్మను అవగాహన చేసుకోగలిగే స్థితికి తెచ్చేదే ఉద్గీథగానముతో కూడిన ప్రాణాయామ అనుష్ఠానము."

"యోగాభ్యాస స్థితిలో ప్రాణుని ఆధారంగా చేసే ఉద్గీధము తో కూడిన ప్రాణాయామ క్రియ ద్వారా మన శరీరములోని పంచభూతముల ఉద్ధారణ జరుగుతుంది. శ్వేతాశ్వతరోపనిషత్తులో చెప్పిన విధంగా...."

పృథ్వ్యప్ తేజోఽనిల ఖే స ముత్థితే
పంచాత్మకే యోగగుణే ప్రవృత్తే
న తస్య రోగో నజరా నమృత్యుః
ప్రాప్తస్య యోగాగ్ని మయం శరీరం।।"

"యోగాభ్యాసంలో క్రమంగా పృథివి, ఆపః, తేజః, వాయు మరియు ఆకాశం అనే పంచభూతాలు శుద్ధి కావింప బడతాయి."

"మన శరీరంలో భూమికి సంబంధించిన భాగం శుద్ధి చేయబడుతూంటే యోగాభ్యాస సమయంలోను ఆతర్వాత కూడా మట్టి వాసన మన నాశిక వెంబడి శ్వాస ప్రశ్వాసలలో తెలుస్తూ ఉంటుంది. ఈ భూతత్వం పూర్తిగా ప్రక్షాళన కాబడి, శుద్ధి చేయబడి మన శరీరం తేజ స్వరూపంగా మారుతుంది. భూమియందలి మార్పులు, ప్రకంపనలు, ఆరు ఋతువులలోని అతిసూక్ష్మమైన మార్పులు తెలియ వస్తాయి."

"శరీరం యొక్క పరిమాణం లో మూడు వంతులుగా ఉండే జలం యొక్క ప్రక్షాళన వల్ల యోగాభ్యాస ప్రధమ దశలో మన నోట్లో విపరీతంగా లాలాజలం ఉత్పత్తి అవుతుంది. అది ఎంత ఎక్కువగా ఉత్పత్తి అవుతుందంటే బయటనుంచి నీరు త్రాగాలని అనిపించదు. శరీరంలో ఒక తన్మయత్వ స్థితి ఏర్పడుతుంది. (బైబిల్ లో నీ సొంతబావి నీరు నీవు తాగు అన్నది ఇదే అనిపిస్తుంది). శరీరానికి మంచి తేజస్సు వస్తుంది. ఇకముందు ముందు శరీరంలోని నీటి పరిమాణం తగ్గుతూ శరీరం యొక్క వన్నె ద్విగుణీ కృతమవుతుంది. భూగర్భ జలాల సమాచారం, మేఘాలు, వర్షాల ప్రభావం చాలా సునిశితంగా అర్ధం అవడం మొదలవుతుంది. రేతస్సు శుద్ధి అవుతుంది. సత్సంతానానికి నాంది పలుకుతుంది."

“అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః…” అగ్నికి సంబంధించిన శుద్ధితో శరీరం తేజోమయం అవుతుంది. వాక్సుద్ధి జరిగి వాజ్ఞ్మయుడుగా మారుతాడు. భుజించిన ఆహారం పూర్తిగా జీర్ణమవుతుంది. రేతస్సు భస్మీపటలం చేయబడి రేతస్సు ఓజస్సుగాను, ఓజస్సు తేజస్సుగాను మారుతుంది. నేత్రదృష్టి తీక్షణంగాను అత్యంత ఆకర్షణీయంగాను మారుతుంది. ప్రకృతిలోని సహజమైన రంగులు అందాలు కనులవిందులు చేస్తాయి."

"శరీరం చుట్టూ ఏర్పడే విద్యుత్ వలయాల శక్తి ఉధృతం అవుతుంది. చర్మంలో విశేషమైన కాంతి ఉత్పన్నమవుతుంది. చర్మం నుంచి మంచి సుగంధ భరితమైన వాసన వెలువడుతుంది. దృఢమైన మానసిక శక్తి ఏర్పడుతుంది. ఇతరుల మనస్సులోని భావాలు తెలుస్తాయి. వారి విద్యుత్ వలయాల పరిధిలోకి చేరిన వారి మానసిక రుగ్మతలు,సంఘర్షణలు అంతమయి మనస్సులు కుదుట బడతాయి. శారీరిక రుగ్మతలు కూడా సరి అవుతాయి. ముసలితనం రాదు. అపమృత్యు భయం ఉండదు. ప్రాప్తస్య యోగాగ్నిమయం శరీరం – శరీరం పూర్తిగా యోగాగ్నితో నిండి పోతుంది."

"పంచభూతాలలో నాల్గవదయిన వాయువు శుద్ధి కావడం ద్వారా ప్రాణ శక్తి ఉధృతంగా పెరుగు తుంది. వాయువు శుద్ధి అయిన యోగాభ్యాసి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల వల్ల వాయు మండలమే శుద్ధి అవుతుంది. “వాయు సర్వత్ర గో మహాన్”- వాయు సంచారం ద్వారా సమస్త లోకాల యొక్క సమాచారం అవగతం అవుతుంది. ఇటువంటి సాధకుని నోటినుంచివచ్చే శాంతి ప్రవచనాలు సత్వరం ఫలిస్తాయి. మనస్సు అధీనంలోకి వస్తుంది."

"ఇచ్ఛామాత్రంగా (కోరిక కలిగిన తక్షణమే) ప్రాణమనో మిలనం జరుగుతుంది వీరికి. ధ్యాన స్థితి వీరికి కరతలామలకంగా ఉంటుంది. మేఘాలు, మేఘ గర్జనలు, విద్యుదాఘాతాలు శబ్ద స్వరూపంగా తెలుస్తాయి. పంచభూతాలలో ఆఖరుదైన ఆకాశము మన హృదయంలో అంటే శిరస్సులోని దహరాకాశమే. అదే ఆత్మ నివసించే ప్రదేశం."

"పంచభూతాలలో శుద్ధీకరింపబడిన భూమి, అగ్ని, జలము, వాయువులవల్ల మనస్సు ప్రాణము ఏకాత్మతను పొంది ప్రాణ మనో మిలనం జరుగుతుంది. అట్టి ప్రాణం మనస్సు తో కలసి దహరాకాశం లో ఉన్న ఆత్మను చేరి సమాధిస్థితిని పొందుతుంది."

"అదే పరబ్రహ్మ స్వరూపం. దీనినే అపూర్వమనే ధర్మము అంటారు. అందుకే ఈ మనుష్య జాతిని సమస్త భూతముల యొక్క సారం అంటారు."

"ఆ ఆత్మ సర్వ భూతాలకు అధిపతి మరియు రాజు అవుతోంది. అటువంటి ఆత్మ స్వరూపంలో సమస్త ప్రాణులు, సర్వ దేవతలు, సర్వ లోకాలు, సమస్త భూతాలు, సమస్త ఆత్మలు రధచక్రంలో ఇరుసు చుట్టూ ఉండే ఆకులు లాగ అమర్చబడి ఉన్నాయి."

"లఘుత్వ మారోగ్య మలోలుపత్వం
వర్ణప్రసాదం స్వరసౌష్టవంచ।
గంధం శ్శుభో మూత్రపురీషమల్పం
యోగప్రవృత్తిం ప్రథమాం వదంతి।।"

"ప్రప్రధమంగా శరీరం తేలికగా అవుతుంది.మంచి ఆరోగ్యవంతంగా ఉంటుంది. చపలత్వం తగ్గిపోతుంది.శరీరం యొక్క రంగు ప్రకాశవంతమై ఉంటుంది. గంభీరమైన స్పష్ఠమైన నిర్దుష్టమైన కంఠధ్వని ఏర్పడుతుంది. శరీరం మంచి సు వాసనలను వెదజల్లుతూ ఉంటుంది. మూత్ర పురీషములు పూర్తిగా తగ్గిపోతాయి. తీసుకున్న ఆహారమంతా పూర్తిగా జీర్ణమయిపోతుంది."

"యథైవ బింబం మృదయోపలిప్తం
తేజోమయం భ్రాజతే తత్సుధాంతమ్
తద్వాఽఽత్మ తత్వం ప్రసమీక్ష్య దేహీ
ఏకః కృతార్ధో భవతే వీతశోకః।।"

"బంగారు విగ్రహాలకు మట్టి పూసి అగ్నిలో కాల్చడం వల్ల అవి ఎంతో ప్రకాశవంతంగా మెరుస్తాయి. మధువిద్యలో చెప్పినట్లు పంచభూతాత్మకమైన ఈశరీరం ముఖ్యప్రాణుని ఆధారంగా చేసే ఉద్గీథం వల్ల శుద్ధి చేయబడి ప్రాణ మనోమిలనమయి ఆత్మ దర్శన స్థితిని పొందుతోంది. ఆత్మ తత్వాన్ని దర్శించిన వాడు శోక విముక్తుడౌతున్నాడు. కృతార్ధుడు అవుతున్నాడు."*
🌼♥️🌼♥️🌼
🌼🕉🌼

No comments:

Post a Comment