Sunday, July 3, 2022

సిద్దులు

సిద్దులు లేక సిద్దార్ అన్న పదానికి అర్థం పరిపూర్ణ వ్యక్తి అని. దైవిక శక్తులను సొంతం చేసుకొన్న వారు అని కూడా చెప్పుకోవచ్చును. మరో విధమైన వివరణ ఏమిటంటే నిరంతర మౌన ధ్యానం, యోగం ద్వారా తీవ్ర సాధన చేసి దైవానుగ్రహంతో అసామాన్య సిద్దులను పొందినవారు సిద్దులు. సిద్ది అనగా పొందడం లేక సాధించడం. శాస్త్ర ప్రకారం సిద్దులు ఎనిమిది. అణిమ,మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశీత్వం. ఈ అష్ట సిద్దులను సాధించిన మానవులెవ్వరూ లేరు. ఎంతటి గొప్ప సిద్దులైనా వీటిల్లో కొన్ని మాత్రమే సాధించారని అంటారు. కానీ ఈ ఎనిమిది సాధించిన వారు ఇద్దరు ఉన్నారు. వారే శ్రీ వినాయకుడు. విఘ్ననాయకుడైన ఈయన భార్య పేరు సిద్ది అని మనందరికీ తెలిసిన విషయమే. అలాగే శతయోజన సముద్రాన్ని అవలీలగా దాటి సీతమ్మ తల్లి జాడ కనుగొని రాక్షస సంహారానికి బాట ఏర్పరచి లోకాలకు మేలు చేసిన అంజనా సుతుడు శ్రీ ఆంజనేయస్వామి అష్ట సిద్ది, నవ నిధులకు దాత గా కీర్తించబడినారు. విశుద్ద మగ్గ అనే తమిళ పురాతన గ్రంథంలో సిద్దులు అంటే ఎవరో, వారి లక్షణాలు ఏమిటో ఇలా వివరించినది. అనితర సాధ్యమైన మానవాతీత శక్తులను సాధించి కూడా నిరాపేక్షగా, నిర్వికారంగా ఉంటూ, ధనము, అధికారం, మరే ఇతర భౌతిక విషయాల పట్ల ఏమాత్రం ఆసక్తి లేకుండా ఉండేవారు. వీరు తమకు వర ప్రసాదంగా లభించిన సిద్దులను లోక హితం కోసం ఉపయోగించేవారు. భారత దేశ పురాతన గ్రంథాల ద్వారా ఇలాంటి సిద్ధపురుషులు ఎందరో కలరని తెలుస్తోంది. పంతొమ్మిదవ శతాబ్దంలో తమిళ భాషలో రచించిన అభితాన చింతామణి అనే గ్రంథము తమిళ నాడులో నడయాడిన అనేక మంది సిద్దులను పద్దెనిమిది మందిని ప్రముఖ సిద్దుల గురించిన వివరాలను సవివరంగా అందించింది. ఆ గ్రంథ రచయిత అభిప్రాయం ప్రకారం వీరంతా మానవాభివృద్ధి కొరకు, మానవ జాతి శ్రేయస్సు కొరకు తమ సర్వ శక్తులను ధారపోసారు. ఆ పద్దెనిమిది మంది పేర్లు ఇలా ఉన్నాయి. నందీశ్వర, తిరుమూలర్, అగస్త్య, కమల ముని, పతంజలి, కోరాక్కార్, సుందర నాండార్, కొంగనార్, సత్తముని, నాన్ మగర్, రామ తేవర్, ధన్వంతరి, ఇదైక్కదార్, మాఛ ముని, కరువూరర్, భోగార్, పాంబట్టి సిద్దార్, కుతంబి.

సేకరణ

No comments:

Post a Comment