👉. ఉద్యోగాలు లేవు . తారా స్థాయిలో నిరుద్యోగిత !
👉 ఉద్యోగాలకు మనుషులు దొరకరు . కంపెనీ లు ఖాళీ !
రెండూ పరస్పర విరుద్ధమైన వార్తలు కదా /
రెండింటిలో ఏదో ఒకటే నిజమయి ఉండాలి . కదా ?
కానీ వాస్తవమేమిటంటే రెండూ నిజమే .
ఒక పక్క ఉద్యోగాలు లేవంటూ నిరుద్యోగులు . మరో పక్క ఉద్యోగులు దొరక్క కంపెనీలు / పరిశ్రమలు .
పరస్పర విరుద్ధ వైచిత్రి . ఇదీ నేటి వాస్తవం .
మీరు ఏ ప్రైవేట్ స్కూల్ కరెస్పాండంట్ నైనా అడగండి . టీచర్ లు దొరక్క తలలు పట్టుకొంటున్నారు. టీచర్ లే కాదు . ఆయాలు , ఆఫీస్ బాయ్ లు డ్రైవర్ లు దొరకడం లేదని వాపోతున్నారు .
ప్రైవేట్ పాఠశాలలు కరోనా టైములో ఉద్యోగుల్ని తీసేసాయి. ఉన్నవారికి సగం జీతాలు కూడా ఇవ్వలేదు . అందుకే ఈ స్థితి అంటారా ? అది ఒక కారణమే . కాదనడం లేదు. కానీ ..... .
హైదరాబాద్ లాంటి చోట్ల రెస్టురెంట్ ల కు వెళ్ళండి . వెయిటర్ లు చాలినంత ఉండరు . ఈశాన్య రాష్ట్రాల వారు కనిపిస్తారు . అదీ సరిపడినంతగా ఉండరు. ఓనర్ ను లేదా మేనేజర్ ను కలవండి . పని చేయడానికి మనుషులు దొరకడం లేదని బోరు మంటారు .
ఇటీవల ఓలా లేదా ఉబెర్ క్యాబ్ బుక్ చేసారా ? సరిగ్గా దొరకవు . బుక్ చేసినా క్యాన్సిల్ అవుతాయి . కారణం డిమాండ్ సప్లై గ్యాప్ . గతం లో బెంగళూరు లాంటి నగరం లో లక్ష కాబ్ లు ఉంటే ఇప్పుడు అది ముప్పై వేలకు పడిపోయింది అంటే చాలినంత క్యాబ్ డ్రైవర్ లు లేరు . లాక్ డౌన్ సమయం లో గ్రామాలకు వెళ్లిన డ్రైవర్ లు తిరిగి రావడం లేదు
" డ్రైవర్ లు, ఆయాలు ఇలా చిన్న చితక ఉద్యోగాల్లో ఈ స్థితి .. సమాజం ఆర్థికంగా డెవెలప్ అయ్యింది . అందుకే ఇలాంటి ఉద్యోగాలకు మనుషులు దొరకడం లేదు" అనుకొంటున్నారా ?
సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అంటే మహా క్రేజ్ కదా . అక్కడ కూడా గ్రేట్ రెసిగ్నషన్ ట్రెండ్ గా నడుస్తోంది . వరస పెట్టి వేలాది మంది... లక్షలాది మంది ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నారు అమెరికా లో అనుకొంటున్నారా ? ఇండియా లో కూడా మరో ఆరు నెలల్లో 86 శాతం ఉద్యోగులు రాజీనామా చేస్తారని ఒక అంచనా !
గతం లో బీహార్ ఉత్తర ప్రదేశ్ లేబర్ కాంట్రాక్టర్ ల పాలిట వరం గా లబించేవారు . ఇప్పుడు కేవలం వెస్ట్ బెంగాల్ .. ఒరిస్సా లేబర్ . కస్టమర్ కేర్ లాంటి రంగాల్లో ఈశాన్య రాష్ట్రాల వారు .
రైతు కూలీలు దొరకడం లేదనేది పాత వార్త. రైతులే క్రాప్ హాలిడే ప్రకటించి వ్యవసాయం మానుకొనే స్థితి నేడు.
ఈ స్థితి కి కారణాలు అనేకం .
1 . పని సంస్కృతి లోపించడం :
కస్టపడి పని చెయ్యడానికి నేడు చాలా మంది సిద్ధంగా లేరు . ఒక పక్క నీలి విప్లవం . నేను చెబుతున్నది నీలి చిత్రాల గురించి . ఒక సెల్ ఫోన్ ఉంటే చాలు . సిగ్గు ని తీసి గట్టున పెడితే డబ్బే డబ్బు . మరో పక్క గంజాయి, డ్రగ్స్ స్మగ్లింగ్ ..
రాజకీయ పార్టీ ల సమావేశాలకు వెళితే ఆ రోజు బిర్యాని .. వారం ఖర్చులకు సరిపడా డబ్బు .
రాజకీయ పార్టీ ల కు సలహాదారుగా మారిన ఒక వ్యక్తి వేలాది మందికి ఉద్యోగాలు ఇస్తున్నాడు . ట్విట్టర్ అకౌంట్ ఉంటే చాలు . వారే ట్రైనింగ్ ఇస్తారు . లాప్ టాప్ లేదా సెల్ ఫోన్ ఇస్తారు . చేయాల్సిందల్లా వారు పెట్టిన రాజకీయ పోస్ట్ లను వైరల్ చేయడమే . నెలకు ఆరు వేలు . అది కాకుండా ఒక లైక్ కు ఒక షేర్ కు ఇంత అని లెక్క కట్టి ఇస్తారు .
ప్రతి ఆరు నెలలకు ఏదో ఒక ఎన్నికలు వస్తాయి . ఓటుకు అయిదు నుంచి పది వేలు దాకా పలుకుతోంది . ఇంట్లో నాలుగు ఓటర్లు ఉంటే మూడు నెలలు కూర్చిని తినొచ్చు
డ్రైవర్ లు గా, ఆయా లుగా , ఆఫీస్ బాయ్ లు గా, ప్రైవేట్ స్కూల్ టీచర్ లు గా, భవన నిర్మాణ రంగం, హోటల్ , టూరిజం .. ఇలాంటివాటిలో ఎవడు పని చేస్తాడు ? చెమటలు ఎవడు చిందిస్తాడు ? సుఖం కావాలి . అయినా ఇంట్లో ఉంటే డబ్బు వచ్చి పడుతుంటే పని చెయ్యాల్సిన అవసరం ఎవరికి?
అయితే ప్రభుత్వ ఉద్యోగం కావాలి . ఏదో దేశ సేవ చేద్దామని కాదు . నెలకు ఇంత జీతం .. చేసే పని ఉండదు అని వీరి ఆలోచన . { నిజానికి ప్రభుత్వ ఉద్యోగుల కు పని అనేక రెట్లు పెరిగింది . పెన్షన్ ఉండదు . ఆఖరికి జీతాలు కూడా సరిగా రావడం లేదు . కానీ దీన్ని గ్రహించడానికి సమయం పడుతుంది } .
2 . నట్టేట ముంచిన వ్యవస్థలు :
లక్షలాది మంది వలస కార్మికులు .. లాక్ డౌన్ కారణంగా ఊరెళ్ళి పోయారు . . నమ్మకున్న రంగం... మనుషులు కష్టకాలం లో వదిలేసారు . పాపం రోడ్డున పడ్డారు . వందలాది కిలోమీటర్ లు నడిచారు . నమ్మకం చెదిరింది . తిరిగి రావడం లేదు . పొట్ట కూటి కోసం ఇంత దూరం పోవాలా? అని వారి ఆలోచన
ఆర్థిక వ్యవస్థ బుడగ లాంటిది . కృత్రిమ డిమాండ్ సృష్టిస్తుంది . దాన్ని నమ్ముకొని వేలాది మంది వస్తారు . ఉదాహరణ క్యాబ్ డ్రైవర్ లు . ఏడేళ్ల క్రితం క్యాబ్ కంపెనీ లు ఊదర గొట్టేశాయి . “ మీరు ఇక పై డ్రైవర్ గా పని చెయ్యాల్సిన అవసరం లేదు . మీరే ఓనర్ . డబ్బే డబ్బు !” అని పగలే చుక్కలు చూపాయి . వేలాది మంది చేస్తున్న డ్రైవర్ ఉద్యోగాలు వదిలి బ్యాంకు లోన్ తీసుకొని వీరి వద్ద చేరారు . . బుడగ పగిలింది . దీని కి తోడు లాక్ డౌన్ . పాపం క్యాబ్ డ్రైవర్ ! .. నిండా మునిగి పోయాడు . క్యాబ్ కంపెనీ ల మోసం .. కమిషన్... డిస్కౌంట్. పెరిగిన పెట్రోల్ ధరలు . “ క్యాబ్ నడపడం ఎంత మాత్రం గిట్టుబాటు కాదు !” అనే నిర్ణయానికి వచ్చేసారు . గతం లో చేసిన డ్రైవర్ ఉద్యోగాలకు పోలేరు . క్యాబ్ డ్రైవర్ రోడ్డున పడ్డాడు .
౩. అరేయ్ .. తురేయ్.. జమిందారీ సంస్కృతి :
"నువ్వు పనోడు . నేను నీకు ఉద్యోగం ఇచ్చా. అంటే నువ్వు నా బానిసవు !” ఇదీ మన దేశం లోని దౌర్భగ్యపు పెత్తందారీ సంస్కృతి.
పని చేసే వారికి గౌరవం ఉండదు . డిగ్నిటీ అఫ్ లేబర్ అనేది ఇక్కడ కానరాని పదార్థం
లారీ డ్రైవర్ లు దొరకడం లేదని లారీ యజమానులు వాపోతున్నారు . తప్పెవరిది ? అంటే సింహ భాగం యజమానులదే .ఒకరిద్దరు సిబ్బంది పట్ల మానవతా దృక్పధం తో వ్యవహరించినా మొత్తం వ్యవస్థ కు చెడ్డ పేరొచ్చింది ! మితి మీరిన పని గంటలు ! పని భారం !! ఇదీ లారీ డ్రైవర్ లు ఒకటి రెండు తరాలుగా ఎదుర్కొంటున్న స్థితి . కాలం మారింది ." వామ్మో లారీ డ్రైవర్ ఉద్యోగమా?" అని ఇప్పుడు ఎవరూ ఆ వైపు కనెత్తి చూడడం లేదు .
భవన నిర్మాణ రంగమయినా , ప్రైవేట్ పాఠశాలయినా ఇదే వర్తిస్తుంది .
జమిందారీ- పెత్తందారీ వైఖరులకు కాలం చెల్లింది . ఉద్యోగులు కనీస గౌరవం కోరుకొంటారు . వర్కింగ్ కండిషన్స్ బాగుండాలని కోరుకొంటారు . జాబ్ సాటిస్ఫాక్షన్ కోరుకొంటారు . ఇది ఎంతైనా న్యాయం
. ఉద్యోగాలకు వచ్చేవారి సంఖ్య ఎక్కువ గా ఉందని తామే రాజపోషకులని ప్రైవేట్ పాటశాలల యజమానులు గురువులను సేల్స్ పీపుల్ గా మార్చేసి అడ్మిషన్ ల కోసం గడప గడప తొక్కించారు . ఇది వరకే ఆ ఉద్యోగాల్లో ఇమిడి పోయిన వారు విథి లేక ఏదో చేస్తున్నారు . కొత్త తరం" ఇదీ ఒక ఉద్యోగమేనా ?"అనుకొంటోంది . టీచర్ లను టీచర్ లుగా చూసే కొన్ని సంస్థల్లో ఒక్కో ఖాళీ కి ఇరవై అప్లికేషన్ లు వస్తున్నాయి . మిగతా వాటిలో పదేపదే ప్రకటించినా ఒక్కరూ ఇంటర్వ్యూ కు రావడం లేదు . తప్పెవరిది ? చేసుకున్నవారికి చేసుకున్నంత మహాదేవ అని దీన్నే అన్నారు .
ఇప్పుడు మహా కరెక్షన్ నడుస్తోంది . అన్నీ వ్యవస్థలు చక్కదిద్దుకొంటున్నాయి . పాత పద్ధతులకు కాలం చెల్లింది . అలాగని ఇప్పుడొస్తుందంతా మంచిదని కాదు . గంజాయి స్మగ్లింగ్, ఆన్లైన్ పోర్న్.... ఇవీ ఉపాధి పథకాలేనా ?
కానీ చెప్పేదెవరు ? వ్యవస్థలను చక్కదిద్దేదెవరు ?
. ఎవరూ పట్టించుకోకపోతే మహా సంక్షోభం వచ్చి దాని నుంచి మంచి పుట్టుకొని వస్తుంది . పురుగు పట్టిన వటవృక్షం కూలేటప్పుడు ఎందరో నలిగిపోతారు .
No comments:
Post a Comment