Monday, July 11, 2022

ఆధ్యాత్మిక శ్రేయస్సు

 🙏🏻🙌లక్ష్మీ శ్రీవేంకటేశ్వరస్వామి జ్ఞానపీఠం....తిరుపతి...చరవాణి. 9390216263..9550804092.. శ్రీనివాసరావు.ప్రధాన నిర్వహకులు . 🙏🏻🙌🙊🙌🙉🙌🙈🙌🙏🏻 🙏🏻 ఆత్మీయ

🌸💥🌸💥🌸💥🌸💥🌸

ఆధ్యాత్మిక శ్రేయస్సు

సర్వ సాధారణంగా ఆధ్యాత్మికత అంటే..
సగటు మనిషికి మత సంబంధమైన, ఆరాధన సంబంధమైన ప్రార్థన, భజన, పూజ, జప, ధ్యాన, యోగాలు అని భావిస్తారు.

అయితే, అవన్నీ వ్యక్తిలో, సమాజంలో ఆధ్యాత్మికతను పురిగొల్పే సాధన సంబంధ ఉపకరణాలు మాత్రమే!

ఆధ్యాత్మికత అన్నది అత్యున్నత సంస్కార విశేషం. ఆధ్యాత్మికత జీవితంలోని అన్ని పార్శాలను అలుముకొని ప్రభావితం చేసే సంస్కారం. అందుకు ప్రధాన మార్గం శ్రవణం, మననం, నిధి ధ్యాసనం.

శాస్ర్తాన్ని అధ్యయనం చేయడం, అధ్యయనం చేస్తున్న దానిలోని విషయాన్ని శాస్త్రీయంగా గ్రహించడం, ఆధ్యాత్మిక బోధలు వినడం.."శ్రవణం."

ఈ విధంగా గ్రహించిన విషయాన్ని తరచి తరచి చూచి స్పష్టత ఏర్పర్చుకోవడం "మననం".

ఆ స్పష్టమైన అవగాహనను హృదయంలో స్థిరపరచుకొని, ఆచరణలోకి అనువదించడం "నిధి ధ్యాసనం."

ఈ ప్రధాన మార్గానికి పైన పేర్కొన్న ఉపకరణాలు ప్రబల సహాయకారులుగా నిలుస్తాయి.

అవగాహనలో, అనుభూతిలో అనన్యత, అన్యోన్యత, ఆత్మీయత అనంతంగా విస్తరించడమే ఆధ్యాత్మికత. అదే సాధకుడి మార్గాన్ని అనుభవింపజేసే విస్తరణం.

అంతిమంగా పొందేది అమృతత్వం. ‘మృత్యోర్మా అమృతం గమయ’ అంటే ఇదే ప్రస్థానం.

పరిమితిలో కూరుకుపోయిన అహంకారం రకరకాల ఆధిక్యతా ఆకాంక్షలుగా వ్యక్తమవుతుంది. అది ఇతరులను తొక్కివేయాలన్న భావన
కలిగించవచ్చు. మాయమాటలతో ఆధ్యాత్మిక వేదికను ధనార్జనకు భూమికగా మార్చుకునే ప్రయత్నమూ జరగవచ్చు. అయితే, ఆధిక్యత సాధించాలన్న అభిలాష, ఆశయం తప్పు కాదు. అది లోక క్షేమానికి దారితీయాలి. ఆ మార్గంలో ఉన్న వ్యక్తులు వివేకంతో మసలుకోవాలి. తమ శక్తియుక్తులను సమాజ శ్రేయస్సుకు ధారపోయాలి.

ఇలాంటి భావనను విస్తారంగా వినియోగంలోకి తేవాలన్న ఆధిక్యతాభిలాష ఎప్పుడూ మంచిదే. అదే సాత్వికాధిక్యత.

అయితే, పరుల విశిష్టతను, ఉన్నతిని ఓర్వలేక ప్రదర్శించే ఆధిక్యత సరైనది కాదు. ఇలాంటి తామసాధిక్యత సమాజంలో భేదాలకు, ఘర్షణలకు దారితీస్తుంది. మనుషుల మధ్య దూరాన్ని పెంచుతుంది. సంస్కృతిని దెబ్బతీస్తుంది.

సారభూతంగా నిస్వార్థత, ప్రేమను పెంచడమే నిజమైన ఆధ్యాత్మికత. అటువంటి విధానం వ్యక్తిలో, సమాజంలో, దేశంలో పరివ్యాప్తమై పరిఢవిల్లాలి.

అయితే అనేక వికృతులు విస్తరిస్తున్న ఈ కాలంలో ఇది అసాధ్యం అనిపించవచ్చు. కానీ, ఈ మార్గంలో మాత్రమే మానవాళి భవిష్యత్తు క్షేమంగా ఉండగలుగుతుంది. ఇందుకు విరుద్ధమైన విధానం వినాశనాన్ని ఆహ్వానిస్తుందన్నది కూడా తథ్యం.

ప్రస్తుత వినియోగవాద ప్రపంచంలో ఇటువంటి ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంచిపోషించేవి వ్యవస్థలు కాదు. నిష్పక్షపాత దార్శనికత, ధైర్యం కలిగిన బుద్ధిజీవులుగా, మేధావులైన శిష్టజనులు మాత్రమే ఈ పనిని సాకారం చేయగలరు. సమాజంలో వీరి సంఖ్య పరిమితమే కావచ్చు. కానీ, వీరంతా ఒక బలమైన వేదికగా ఏర్పడి, సాఫల్య వైఫల్యాలపై దృష్టిపెట్టక ధర్మనిష్ఠతో ముందుకుసాగాలి. నిరంతరం ప్రజలకు మార్గదర్శనం చేస్తుండాలి.

శ్రేష్ఠజనుల ఉద్ఘోష , అచంచల ఆచరణే మానవాళికి ప్రేరణ. ఆర్ష వైదిక దర్శనం, ధర్మం, వాఙ్మయం, సంస్కృతి ఈ దిశలోనే సంప్రదాయాన్ని నిర్మించింది.

స్వేచ్ఛ పేరుతో అన్ని రంగాలలో స్వార్థం, సంకుచితత్వం పెరుగుతున్న ఆధునిక సమాజంలో ఆర్షవైదిక స్ఫూర్తిని విస్ఫారింపజేయడం అత్యావశ్యకం.

సంస్కారకాంతులను అన్ని దిశల నుంచి గ్రహిస్తూ తాము వికసిస్తూ, సమాజాన్నిమేల్కొలిపే శిష్టజనుల పాత్ర ఆధ్యాత్మిక శ్రేయస్సుకు శ్రీరామ రక్ష.☝

సేకరణ

No comments:

Post a Comment