🍁వశమైతేనే దశ మారేది
సృష్టికర్త గొంగళిపురుగును అందమైన రంగుల సీతాకోకచిలుకగా మారుస్తాడు.
ఇసుక ముత్యాలుగాను, బొగ్గు వజ్రాలుగాను రూపాంతరం చెందడం చూస్తున్నాం... !
కాలం, ఒత్తిళ్ల కారణంగా, ఆ సృష్టికర్తే మనుషుల మీదా పనిచేస్తున్నాడు. స్వీకరించేందుకు మనిషి సిద్ధంగా ఉండాలి. కోరికలో గాఢత ఉండాలి. ఎరుకతో ఉండాలి. విశ్వాసం అవసరం. ఇదే ఏదైనా, ఎప్పుడైనా సాధించేందుకు సూత్రం. మనిషి ఉన్నతమైనదాన్ని సాధించాలనుకుంటే కృషిలోపం లేకుండా ధర్మమార్గంలో ప్రయత్నిస్తే, దైవం నుంచి మార్గం సుగమం అవుతుంది. గ్రహించగల శక్తి, దృక్పథం ముఖ్యం. ఆలోచనగల మనిషికి ఎంపిక చేసుకునే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. జీవితాన్ని సంపూర్ణంగా జీవించే సాహసం కావాలి. భౌతికత, ఆధ్యాత్మికతల సమతుల్యతను పాటిస్తే ఊహించని మార్గాలు కనిపిస్తాయి.
కొన్నిసార్లు దేవుడు తలుపులు మూసేస్తాడు. ముందుకెళ్లే సమయమని ఆయనకు తెలుసు. పరిస్థితులు బలవంతపెడితేగాని మనిషిలో చలనం రాదనీ తెలుసు. వశమైనప్పుడే రూపాంతరం చెందడం పూర్తవుతుంది. భగవంతుడికి లొంగిపోవడానికి మనిషి ఏమీ చేయనక్కరలేదు. అంతరంగం వైపు ప్రయాణం చేసినప్పుడే ఇది సాధ్యం. అంతఃపరిశీలన, ఆత్మశోధన ఎంతగా చేస్తే ఆ పరమాత్మకు అంత దగ్గరగా వెళ్ళగలుగుతాం. ‘నేను’ అనే అహం పూర్తిగా సమసిపోవాలి. విత్తనం భూమిలోకి చేరి ఎలా తన ఉనికిని కోల్పోతుందో అలా మనిషి తన ‘గుర్తింపు’ను పోగొట్టుకోవాలి... ఓ తాదాత్మ్యంతో. ఆ విత్తనం అంచెలంచెలుగా ఎదిగి ఏళ్ల తరవాత ఒక వృక్షమవుతుంది.
లొంగిపోయినప్పుడు ఉనికిని కోల్పోవడం సహజం. అప్పుడు అక్కడుండేది దైవమే. భగవంతుడు ప్రాణవాయువు లాంటివాడు. మనిషి చూడలేడు కానీ, ఆయన లేకపోతే బతకలేడు.
నీ దేవుడి శక్తి ఎంత అనే ప్రశ్నకు నీ విశ్వాసం ఎంత అనే ప్రశ్న సమాధానమవుతుంది.
విశ్వాసం విషయంలో ఎంత లోతుల్లోకి వెడితే జీవితంలో అంత ఎత్తుకు చేరుకోవచ్చు.
ప్రేమ మార్గం చాలా ఇరుకైనది. ఇద్దరికి సరిపోదు. ‘నేను ఆ మార్గంలో ఉన్నప్పుడు నాకిష్టమైన దేవుడు అక్కడ లేడు. తరవాత ఆయనను చూసేసరికి నేను అక్కడ లేను’ అంటాడో మహానుభావుడు!
లొంగిపోయే స్థితికి చేరుకున్నప్పుడు ఏ విధమైన ప్రతిఘటనా ఉండదు. ఇష్టాయిష్టాలను బట్టి నడుచుకోవడం ఉండదు. మరోవిధంగా మనిషి జీవితంలో ప్రతి క్షణానికీ కృతజ్ఞత కలిగివుంటాడు. భగవంతుడు ఏర్పరచిన ప్రణాళికను వ్యతిరేకించడు. జీవిత ప్రవాహాన్ని అనుసరిస్తూ వెళ్ళిపోయే వైఖరిని అలవరచుకుంటాడు. కఠినమైన ‘నేను’ కరిగిపోతుంది. అనంతమైన కోరికలు మాయమైపోతాయి. జీవితంలో మనిషి తాపత్రయపడే కీర్తిప్రతిష్ఠలు, అధికారం హోదా, ఆస్తిపాస్తులు, సంబంధ బాంధవ్యాలు... కనిపించవు. ఆ ఆకర్షణ ఉండదు. దైవం ముందు అన్నీ వెలాతెలాపోతాయి. సర్వం ఆ దైవమే అనే స్థితిలో ఏదీ ఆకర్షించదు. ప్రతి క్షణం దైవస్మరణే.
భౌతిక ప్రపంచంలో పైకి చేరుకోవడానికి నిచ్చెన ఒకటే ఉంటుంది. ఒకరితో మరొకరు పోటీపడుతూ ఆ ఒక్క నిచ్చెనతో పైకి చేరాలి. అదే ఆధ్యాత్మిక మార్గంలో దైవాన్ని చేరుకోవడానికి ఎవరి నిచ్చెనలు వారికుంటాయి. ఎవరికి వారితోనే పోటీ. ఎప్పుడూ అన్వేషణ, ప్రార్థన, అవతలి వైపు చేరుకునే ప్రయత్నం కొనసాగుతాయి. చివరికి ఆ దైవంతో తాదాత్మ్యం చెందే స్థితి వస్తుంది.
ఆధ్యాత్మికత మనిషి బలం కావాలిగానీ బలహీనత కాకూడదు.
పుష్పం నుంచి పరిమళాన్ని వేరుచేసి చూడలేం. అలాగే భగవంతుడి నుంచి గురువునూ వేరు చేయలేం .
సేకరణ. మానస సరోవరం 👏
No comments:
Post a Comment