Saturday, July 9, 2022

కాబట్టి పాపాత్ములు కానీ పుణ్యాత్ములు కానీ, ఎవరైనా కానీ ఆత్మజ్ఞానము పొందడానికి అర్హులు.

మానవుడు ఎన్ని మహాపాపములు చేసినప్పటికినీ జ్ఞానం సంపాదిస్తే ఆ పాపాలన్నీ హరించి పోతాయి. అంటే ముందు పాపాలు చేసి తరువాత వాటిని పోగొట్టుకోమని కాదు. ముందు జన్మలో కానీ, ఈ జన్మలో కానీ తెలిసీ తెలియకుండా, అజ్ఞానం చేత, ఏమైనా పాపాలు చేసి ఉంటే, గురువు ఉపదేశమువలన అజ్ఞానము నుండి జ్ఞానము లోకి అనగా చీకటిలో నుండి వెలుగులోకి ప్రవేశించి, ఆ జ్ఞానముతో గత జన్మలోవి కానీ ఈ జన్మలోని కానీ చేసిన పాపములను పోగొట్టుకొనే అవకాశము ఉంది. జ్ఞానము అంతగొప్పది అని.
కానీ పాపములు చేయడానికి లైసెన్సు ఇచ్చినట్టు కాదు. సముద్రం ఎంత విశాలంగా ఉన్నా దానిని దాటడానికి చిన్న పడవ చాలు అంతే కానీ సముద్రం అంత పడవ అక్కరలేదు. అలాగే మనం చేసిన పాపము ఎంత పెద్దదైనా దానిని ఇసుమంత జ్ఞానముతో ఆ పాపసముద్రాన్ని దాటవచ్చు. అందుకనే కృష్ణుడు క్రింది శ్లోకంలో..

అపి చేదసి పాపేభ్య: సర్వేభ్యః పాపకృత్తమ: సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి (గీత - 4.36)

ఈ శ్లోకంలో పరమాత్మ ఒక ఊహాజనితమైన విశ్లేషణ చేస్తున్నాడు.
అర్జునా! ఒక వేళ (Assuming without considing లేక Assuming for a movement) నీవు యుద్ధము చేసి వీళ్లందరినీ చంపి, అంతులేని పాపము మూటగట్టుకొని, తద్వారా జరగబోయే వర్ణసంకరమునకు బాధ్యుడవయి, ఈ లోకంలో ఉన్న పాపాత్ములందరి కంటే ఎక్కువ పాపం చేస్తాను అని నీవు అనుకుంటే కూడా, నీవు పైన చెప్పబడిన జ్ఞానం సంపాదిస్తే, జ్ఞానము అనే తెప్పసాయంతో ఈ పాప సముద్రాన్ని దాటగలవు. అలాగే నీ పాపము కూడా ఒక్క క్షణంలో పటాపంచలవుతుంది. అని అభయం ఇచ్చాడు.

పై శ్లోకంలో సంతరిష్యసి అనే మాట వాడారు. అంటే పాపము అనే సముద్రమును జ్ఞానము అనే తెప్పతో చక్కగా దాటగలవు అని అర్థం.

కొంతమంది ఒక దురభిప్రాయములో ఉంటారు పాపం చేసిన వాళ్లు వేదములు శాస్త్రములు చదువరాదు. అసలు తాకనేకూడదు. ఓంకారము పలుకకూడదు. గీతను చదవకూడదు అనే ఆంక్షలు పెడుతుంటారు. అది తప్పు. ఈ శ్లోకం ప్రకారము ఎంత గొప్ప పాపి అయినా జ్ఞానము సంపాదించడానికి అర్హుడు అని ఉంది. జ్ఞానము రావాలంటే పురాణములు శాస్త్రములు చదవాలి. కాబట్టి పాపులు కూడా అన్నీ చదవవచ్చు. ఏదోషము లేదు.

బాగా ఆరోగ్యంగా ఉన్న వాడికి మందు అక్కరలేదు. రోగికే మందు కావాలి. అలాగే పాపము చేసిన వాడికే దానిని పోగొట్టుకోవడానికి జ్ఞానం కావాలి. వాడే వేదములు, శాస్త్రములు చదవాలి. కాబట్టి పాపాత్ములు కానీ పుణ్యాత్ములు కానీ, ఎవరైనా కానీ ఆత్మజ్ఞానము పొందడానికి అర్హులు.

🙏 కృష్ణం వందే జగద్గురుమ్ 🙏

సేకరణ

No comments:

Post a Comment