*ఆషాడభూతి (జాతీయం వెనుక కథ)* డా.ఎమ్.హరికిషన్-కర్నూలు-9441032212
**************************
ఆషాడభూతి అంటే నెంబర్ వన్ మోసగాడు. మనతోనే వుంటూ, అమాయకునిలా అత్యంత నిజాయితీపరునిలా నటిస్తూ, అదును చూసి సర్వస్వం దోచుకునేవాడు. వీళ్ళ మాట, ప్రవర్తన, రూపం అన్నీ నిజాయితీకి ప్రతిరూపంలా వుంటాయి. మనం అస్సలు కనిపెట్టలేం. గుంటనక్కలాగా అదును కోసం కాచుకొని వుంటారు. ఏమాత్రం తొందరపడరు. పూర్తిగా మాయమాటలతో నమ్మించి చివరకు మోసం చేస్తారు. ఇలాంటి వాళ్లనే ఆషాడభూతి అంటారు.
ఈ జాతీయం వెనక పంచతంత్రం లోని ఒక కథ వుంది అది తెలుసుకుందాం. దేవశర్మ అనే సన్యాసి ఉండేవాడు. అతను మంచి మాటకారి. పురాణ ఇతిహాసాల మీద మంచి పట్టు ఉండేది. ఊరూరా తిరుగుతూ ప్రవచనాలు చెప్పేవాడు. అతను చెప్పే విధానం అరటిపండు వలచి చేతిలో పెట్టినట్లు అద్భుతంగా వుండేది. దాంతో జనాలు గుంపులు గుంపులుగా వినడానికి వచ్చేవారు. పరవశంతో వింటూ ఉండిపోయేవారు. వచ్చిన జనాలు ఊరికే ఉత్త చేతులు ఊపుకుంటూ రారు కదా... పళ్ళో పైసలో తెచ్చి చేతిలో పెట్టేవారు. "నాకెందుకు నాయనా ఇవన్నీ. సర్వం వదిలేసిన సన్యాసిని. ఏం చేసుకుంటాను ఈ కానుకలు" అంటూ వద్దు వద్దంటూనే అన్నీ తీసుకునేవాడు. పళ్ళు కడుపునిండా తిని వచ్చిన జనాలకు ప్రసాదంగా మిగిలినవి పంచి పెట్టేవాడు. డబ్బులు మాత్రం భద్రంగా దాచిపెట్టుకునే వాడు. నెమ్మది నెమ్మదిగా జనాలు ఇచ్చిన డబ్బులు పెరిగిపోయాయి. వాటిని దాచి పెట్టుకోవడం కష్టంగా మారింది. దాంతో అవి ఎవరికంటా పడకుండా ఎలా దాచి పెట్టాలా అని తెగ ఆలోచించాడు. చివరికి ఒక బొంత తయారు చేశాడు. అందులో రహస్యంగా ఎవరికంటా పడకుండా రాత్రిపూట తనకు ఆరోజు వచ్చిన డబ్బులన్నీ వేసి భద్రపరిచేవాడు. ఆ బొంత ఎప్పుడూ అతని వెంటే వుండేది. పడుకున్నా దాని మీదే... కూర్చున్నా దాని మీదే. ఒక్క క్షణం కూడా దాన్ని వదిలి వుండేవాడు కాదు. ఏ పని చేస్తున్నా ఒక కన్ను ఆ బొంత మీదే వేసి ఉంచేవాడు. ఎవరిని అస్సలు నమ్మేవాడు కాదు. ఎక్కడికి వెళ్లినా ఎవరికి ఇచ్చేవాడు కాదు. తానే మోసుకుంటూ తిరిగేవాడు. ఎవరన్నా "స్వామీ మీకెందుకు అంత శ్రమ. ఆ బొంత ఇలా ఇవ్వండి. మేము మోసుకుని వస్తాము" అంటే ఆ సన్యాసి చిరునవ్వుతో "నాయనలారా ఒకరి మీద ఆధారపడడం తప్పు. మనం ఎంత ఎదిగినా మన పని మనమే చేసుకోవాల" అని నీతులు చెప్పేవాడే గానీ ఇచ్చేవాడు కాదు. జనాలు ఇచ్చే సొమ్మంతా ఎప్పటికప్పుడు దాచిపెడతా వున్నాడు కదా... దాంతో అతని దగ్గర చాలా సంపద పోగుబడింది. బొంత కూడా బరువెక్కింది. అయినా సరే దాన్ని ఒక్క క్షణం కూడా వదిలేవాడు కాదు. తను ఎక్కడికెళితే అక్కడికి వెంటే తీసుకెళ్లేవాడు.
ఒక దొంగ కన్ను ఈ బొంత మీద పడింది. "ఈ సన్యాసి ఏమి... ఆ బొంతను ఒక్క క్షణం కూడా వదలడం లేదు. అందులో ఏదో రహస్యం దాగున్నట్టుంది" అనుకున్నాడు. ఒకరోజు అర్ధరాత్రి ఆ సన్యాసి ఏం చేస్తున్నాడా అని రహస్యంగా గమనించసాగాడు. బాగా చీకటి పడ్డాక ఎవరూ లేని సమయంలో ఆ రోజు తనకు కానుకగా వచ్చిన సొమ్మంతా ఆ బొంతలో దాచి పెట్టడం చూశాడు. "ఓహో ఇదా బొంత రహస్యం. ఎలాగైనా సరే ఈ సన్యాసిని బోల్తా కొట్టించి ఆ ధనాన్ని కాజేయాలి" అనుకున్నాడు.
దాంతో ఒక భక్తుడిలా వేషం వేసుకున్నాడు. అతను ఉపన్యాసాలు ఇచ్చే సమయంలో అందరికంటే ముందు కూర్చుని, చెప్పే మాటలకు "ఆహా ఓహో... అద్భుతం..." అంటూ తన్మయత్వంగా చప్పట్లు కొట్టేవాడు. ఉపన్యాసం పూర్తికాగానే ఆయన కాళ్ళ మీద పడి మొక్కి వినయంగా "అయ్యా నా పేరు ఆషాడబుద్ధి. నేను ఎందరెందరో గురువులను చూశాను, వారి ఉపన్యాసాలు విన్నాను. కానీ ఇంతవరకు మీ అంత అద్భుతంగా భగవంతుని లీలల గురించి చెప్పిన వారిని ఎప్పుడూ ఎక్కడా చూడలేదు. నన్ను మీ భక్తునిగా స్వీకరించండి. నాకు ముక్తి మార్గం చూపండి" అన్నాడు. పొగడ్తలకు పడిపోనివాడు ఈ లోకంలో ఎవడు ఉండడు కదా. దాంతో ఆ సన్యాసి ఉబ్బితబ్బిబ్బై సరే అన్నాడు. ఆషాడభూతి గురువు పాదాలు వత్తుతూ, అలసిన ఆయనకి విసన కర్ర ఊపుతూ, ఆయన ఏది చెప్పినా ఆహా అద్భుతం అంటూ ఆకాశానికి ఎత్తేస్తూ, ఏ పని చెప్పినా అత్యంత వినయంగా క్షణంలో చేస్తూ విధేయతగా నడుచుకోసాగాడు.
ఆషాడభూతిని చూస్తే సన్యాసికి ముచ్చటేసేది. అయినప్పటికీ రాత్రిపూట మాత్రం తన గదిలో పడుకోనిచ్చేవాడు కాదు. ఎక్కడికైనా వెళ్లేటప్పుడు పట్టుకోమని తన బొంత ఇచ్చేవాడు కాదు. ఒకసారి గురు శిష్యులు ఇద్దరూ అడవిలో నడుచుకుంటూ పోతూవుంటే ఆషాడభూతి "అయ్యో గురువా... ఎంత పొరపాటయింది. నావల్ల ఎంత తప్పు జరిగిపోయింది' అంటూ బాధతో గట్టిగా అరిచాడు.
"ఏమైంది ఎందుకలా బాధ పడుతున్నావు" అన్నాడు సన్యాసి.
'అయ్యా... నిన్న మనం ఒక ఇంటిలో రాత్రిపూట విశ్రాంతి తీసుకుని పొద్దున్నే తిరిగి బయలుదేరాం కదా... అలా వచ్చేటప్పుడు ఆ ఇంటి వాళ్ళ పొరక పుల్లల్లో ఒకటి పొరపాటున నా బట్టలలో చిక్కుకుపోయింది. దీన్ని ఇప్పుడే పోయి వాళ్లకు తిరిగి ఇచ్చి వేసి వస్తాను" అన్నాడు.
గురువు నవ్వి "చిన్న పొరకపుల్లనే కదా నాయనా... పరవాలేదులే. అది ఎందుకు పనికి రాదు. దాన్ని ఇక్కడ పారవెయ్యి' అన్నాడు.
అందుకు ఆషాడభూతి "అయ్యా మీరే కదా నిన్న పరుల సొమ్ము పాము వంటిది. అది లక్ష బంగారు వరహాలు కావచ్చు. ఒక పనికిరాని సత్తు రూపాయ కావచ్చు. మనం పొరపాటున కూడా ముట్టుకోకూడదు. ఆశపడకూడదు. అది మహా పాపం. జరిగిన పొరపాటును వెంటనే సరిదిద్దుకుంటా. మీరు నెమ్మదిగా నడుస్తూ వెళుతుండండి. నేను సర్రున పోయి సర్రునొస్తా" అంటూ ఆ పూచిక పుల్ల తీసుకొని వెనక్కి తిరిగి పరిగెత్తసాగాడు. కొంచెం దూరం అలా సన్యాసికి కనబడనంత దూరం పరిగెత్తి ఒక పొదల చాటున కాసేపు హాయిగా విశ్రాంతి తీసుకుని, ఒంటిమీద కాసిని నీళ్లు చల్లుకొని, మరలా పరిగెత్తుతూ గురువును చేరుకున్నాడు. ఒళ్లంతా చెమట పట్టి ఆయాస పడుతున్న ఆషాడభూతిని చూసి అతని నిజాయితీకి సన్యాసి చాలా సంతోషించాడు. అటువంటి నమ్మకమైనటువంటి శిష్యుడు దొరికినందుకు పొంగిపోయాడు.
అలా వాళ్ళు కొంచెం దూరం వెళ్ళాక ఒక చెరువు కనపడింది. నడిచీ నడిచీ సన్యాసి అలసిపోయాడు. ఒళ్లంతా చెమటతో తడిసి ముద్దయింది. దాంతో ఆ చెరువులో దిగి స్నానం చేయాలి అనుకున్నాడు. శిష్యుని మీద అప్పటికే సన్యాసికి పూర్తి నమ్మకం కుదిరింది కదా... దాంతో ఆషాడభూతిని చూసి "శిష్యా కొంచెంసేపు ఈ బొంతను జాగ్రత్తగా చూస్తూ వుండు. నేను నదిలో తనివితీరా స్నానం చేసి వస్తా" అన్నాడు.
"అలాగే గురువుగారు" అన్నాడు ఆషాడభూతి. శిష్యుని మీద అప్పటికే సన్యాసికి పూర్తి నమ్మకం కుదిరింది కదా... దాంతో ఎప్పుడూ ఎవరికీ ఇవ్వని ఆ బొంతను ఆషాడభూతికి అప్పగించాడు. ఎప్పటిలాగా ఆ బొంత మీద ఒక కన్ను వేసి వుంచకుండా ప్రశాంతంగా హాయిగా స్నానం చేయసాగాడు. అతను అలా పరవశంగా ఏమరుపాటుగా స్నానం చేస్తున్న సమయంలో ఆషాడభూతి ఆ బొంతతో సహా మెరుపులా మాయమయ్యాడు. స్నానం చేసి బయటకు వచ్చిన సన్యాసికి పరుపూ కనపడలేదు. శిష్యుడూ కనపడలేదు. అన్ని సంవత్సరాలుగా తాను దాచిపెడుతున్న సొమ్మంతా ఒక్క క్షణంలో పోయినందుకు బాధతో బోరుమన్నాడు. ఇది ఆషాడభూతి కథ. ఇలా ఎవరైతే మన వెన్నంటే వుంటూ మనల్ని బాగా నమ్మించి మోసం చేస్తారో వారిని ఆషాడభూతులు అనడం అప్పటినుంచి మొదలైంది.
**************************
డా.ఎమ్.హరికిషన్-కర్నూలు-9441032212
**************************
కథ నచ్చితే *షేర్* చేయండి. రచయిత పేరు మార్చకండి. తీసేయకండి.
No comments:
Post a Comment