Saturday, November 26, 2022

మరణించి జీవించాలి

 [11/22, 16:09] +91 73963 92086: మరణించి జీవించాలి

రమణుల "నేనెవడను?" పుస్తకానికి, ఆ పేరు కంటే "మరణించి జీవించడమెలా?" అనే పేరే సరిగ్గా సరిపోయి ఉండేది అన్నారు గురువుగారు ఓసారి

అంతేగా...అంతేగా...

'అహం మరణమే స్వరూపదర్శనము' అన్నదే 
'నేనెవడను?' అనే గ్రంథసారము. 

మరణించి జీవించడం అనే అనుభవాన్నే నిజంగా జ్ఞానానుభవం అనాలి.

చరిత్రకు ఎక్కకుండా అలాంటి జ్ఞానానుభవం పొందినవారు మన చుట్టూనే తిరుగుతూ ఎంతోమంది ఉండి ఉంటారు....

అందుకే త్యాగరాజస్వామి ఒక్క మాటలో చెప్పేశారు....

ఎందరో మహానుభావులు...
అందరికీ వందనములు...అని.

ఏమో.... నీ పక్కలో పడుకుని ఉన్న భార్య కూడా జ్ఞానవంతురాలై ఉండి ఉండవచ్చు....
చూడాల వలె...ఎవరు చెప్పగలరు?

సంతలో కుండలు అమ్మే వ్యక్తి కూడా జ్ఞానపూర్ణుడై ఉండవచ్చు....గోరాకుంభార్ వలె...ఎవరు చెప్పగలరు?

మనకు బట్టలు కుట్టిచ్చే దర్జీ కూడా జ్ఞానపూర్ణుడై ఉండవచ్చు... నామదేవుని వలె.

సాక్షాత్తుగా పాండురంగడే  వచ్చి కులవృత్తులనే భక్తిసాధనాలుగా మార్చుకున్న అలాంటి మహాభక్తులతో స్నేహితుడిలా మెలిగేవాడు...

జ్ఞానాన్ని కొలవడానికి ధర్మామీటర్లు లేవు.
'స్వానుభవమే' ధర్మా మీటరు.

నిజానికి 'పొందినవారంతా' అప్రయత్నంగా పొందినవారే...
తర్వాతివారంతా ప్రయత్నంతో పొందాలనుకునేవాళ్లే.

పొందినవారంతా అదే చెప్పారు-
'అది' అప్రయత్నంగా పొందబడుతుంది అని...
అదే నిన్ను ఆవహిస్తుందని అని...
ఊరికే ఉండు అని...

కానీ వీరు ఊరుకుంటేగా...

"దాన్ని పొందాలంటే ఏం చేయాలి?"
అన్న ప్రశ్న యుగాలపర్యంతం వేయబడుతూనే ఉంది.

వీరి మనస్సును ఊరటపరచడానికి అన్నట్టు
ప్రతి మహనీయుడూ ఆయా కాలమాన పరిస్థితులను అనుసరించి తలా ఓ మార్గాన్ని తయారుచేసి వెళ్లిపోయారు...
అవన్నీ కలిసి మోపెడయ్యాయి...

పరమహంస చెప్పినట్టు...
నీటి కోసం గుంతలు తవ్వుతున్నారేగాని,
ఒక్క గుంతనే లోతుగా తవ్వడం లేదు...

అన్ని మార్గాలనూ పుస్తకాల్లో నింపేసుకున్నారేగాని
ఏ మార్గంలోనూ చివరివరకు నడవడం లేదు...

అన్నింటిలో ఏ మార్గం గొప్పదో వివేచించడానికే జీవితం సరిపోతోంది...

ఇక తానెప్పుడు గమ్యం చేరిది?

ఊరికే ఉండండిరా బాబూ! అని రమణులు అంటే....
ఊరికే ఉండే స్థితి కలగడానికి ఏం చేయాలి? అని మళ్లీ ప్రశ్నిస్తారు...

1.నిన్ను నీవు తెలుసుకో
2.నీ లోపలికి వెళ్లు
3.ఆత్మలో స్థిరపడు

అని మళ్లీ ఏవేవో సిద్ధాంతాలు చెప్పాల్సివచ్చింది.

సరే అదయినా చేశారా....?
లేదు
అది తప్ప మిగతా అన్నీ చేశారు...

* * *

జీవించి మరణించువాడు - అజ్ఞాని.
మరణించి జీవించువాడు - జ్ఞాని.

* * *

ఈ ఒక్క ఉపదేశాన్ని ప్రపంచానికి అందించడానికే గురువుగారు అవతరించారు ఈ భూమ్మీద... 
అనేది నా ప్రగాఢనమ్మకం.

* * * 
ఒక మహాత్ముడు అన్నారు...
మళ్లీ కొత్తగా పుట్టాలి....అని.

చనిపోయి మళ్లీ తల్లిగర్భంలోంచి పుట్టాలా? 
అని అడిగారు శిష్యులు...

మారుమనస్సు అంటే ఏమంటే-
కన్యగా ఉన్న అమ్మాయికి
వివాహం కాగానే భర్తకు భార్యగా,
ప్రసవం కాగానే  బిడ్డకు తల్లిగా 
స్త్రీత్వానికి పూర్ణత చేకూరడం లాంటిదే.

వ్యక్తి ఏమో చూడ్డానికి ఆమెయే...
కానీ ఆ వ్యక్తిలో పూర్ణత్వం(సఫలత) సిద్ధించి ఉంటుంది.
అలాంటి పూర్ణత్వాన్ని పొందినవారే ఋషులు...
పూర్ణత్వం అనేది బాహ్యవిషయం కాదు.

* * *

"మరణించి జీవించాలి"

ఆ స్థితి కలగడం అనేది పూర్తిగా మన స్వాధీనంలో లేని విషయమే ఐనప్పటికీ, జిజ్ఞాసువులు మార్గం చెప్పమని అడుగుతూనే ఉంటారు గురువులను.

వీరి పోరు పడలేక.... కర్మ-భక్తి-జ్ఞాన మార్గాలను ఏర్పరిచారు ఋషులు.

రమణులు - "నేనెవడను" అనే ఆత్మవిచారణా మార్గాన్ని బోధించారు.

వారి వారి మనస్సు పరిపక్వతను బట్టి ఆయా మార్గాలను ఎన్నుకొని ఆ మార్గంలో ప్రయాణిస్తూ ఉంటారు జిజ్ఞాసువులు.

నిజానికి 
పొందినవారు చెప్పిన మార్గంలో వెళ్లి
పొందినవారు ఎవరూ లేరు చరిత్రలో.

అందుకే -

"ఏ సాధనా అవసరం లేదు" అని చెప్పిన ఏకైక మహానుభావులు - సద్గురు సుబ్రహ్మణ్యులు.

* * *

మాటల వల్ల, చేతల వల్ల తెల్లారేదేమీ లేదు.
అని తమకు తెలిసినా సరే 
కొంతమంది గురువులు ఏదో చెప్పారు...
ఏదో చేశారు...
బహుశా "చెప్పడం" అనేది వారి స్వభావం అయి ఉంటుంది.

చందనంచెట్టుకు ఏ భూమి ఆధారమో
నాక్కూడా ఆ భూమే ఆధారం అని వేపచెట్టుకు జ్ఞానోదయం కలిగింది.
అంతమాత్రం చేత తనలోని చేదు గుణం పోదు.
తెలుసుకోనంత మాత్రాన చందనంచెట్టు సుగంధం పోదు.

జ్ఞానం వలన స్వభావాలు, వ్యవహారాలు తారుమారు కావు. అన్నీ యథావిధిగానే ఉంటాయి.

జ్ఞానం అంటే అవగాహన అంతే.
అదొక మార్పు కాదు.

"అవగాహన" అనేది ఒక్క సద్గురు సన్నిధిలో మాత్రమే లభ్యం.

జపాలు, తపాలు, భజనలు, సత్సంగాలు....
ఇవన్నీ secondary....

అలాంటి గురువు దొరకాలంటే -
ఈశ్వరానుగ్రహం కలగాలి.

ఈశ్వరానుగ్రహం పొందాలంటే,
మూడు రకాలైన పెట్టుబడులు పెట్టాలి...

మొదటి పెట్టుబడి - ఆర్తి.
రెండవ పెట్టుబడి - శ్రద్ధ.
మూడవ పెట్టుబడి - శరణాగతి.

ఈ  మూటింటి వలన-
వ్యక్తిత్వాన్ని నష్టపోతాం.
దైవత్వాన్ని లాభపడతాం.

పావలా పోగొట్టుకుని రూపాయిని పొందినట్లుగా.
ఆ రూపాయిలో మనం పోగొట్టుకున్న పావలా కూడా అందులో ఉంటుంది పూర్ణంగా.
[11/22, 16:09] +91 73963 92086: నది సముద్రంలో కలిసి తనను తాను పోగొట్టుకున్నట్టే కనబడుతుంది.
కానీ అది మహాసముద్రంగా మారుకుంటుంది.
అలాంటిదే ఈ శరణాగతి అనేది.

* * *
గురువుకు అన్ని చరిత్రలూ, అందరి చరిత్రలూ తెలుసు.
కానీ గురుచరిత్ర గురువుకు తెలియదు.

రామచరిత్ర వాల్మీకి వ్రాసినట్టు 
కృష్ణచరిత్ర వ్యాసుడు వ్రాసినట్టు
సాయిచరిత్ర  హేమాద్పంతు వ్రాసినట్టు 
రమణచరిత్ర కృష్ణభిక్షు వ్రాసినట్టు 
గురుచరిత్రను జ్ఞానశిశువు వ్రాస్తున్నాడు.

గురుచరిత్ర అంటే తత్త్వరచనే...
అంతేగానీ తేదీలతో కూడిన వారి జీవిత చరిత్ర కాదు.

ఆధ్యాత్మిక సాహిత్యాల్లో శాస్త్ర ప్రమాణం లేని రచన ఏదైనా ఉందంటే అది ఇదే అవుతుంది.
ఎందుకంటే నాకు ఏ శాస్త్రమూ తెలియదు...
గురుసన్నిధిలో కూర్చొని వారి నోటి నుండి జాలువారిన మాటలను మౌనంగా ఏరుకోవడం తప్ప.

ఇదంతా జ్ఞానశిశువు యొక్క కేరింతలే.
కేరింతల్లో  గ్రామర్ ఉండదు, గ్లామర్ తప్ప.
* * *

No comments:

Post a Comment