Saturday, November 26, 2022

సద్గురు ప్రబోధ సారం

 సద్గురు  ప్రబోధ సారం

🪷🪷🪷🪷🪷🪷

అప్పుడే ఉదయిస్తున్న అరుణోదయ లేలేత కాంతుల వలయాల్ని,

అప్పుడే వికసిస్తున్న కమలముల యొక్క సహజ సుందరమైన కోమలత్వాన్ని

చల్లని వెన్నెల కాంతుల్ని
పసివాని బోసి నవ్వుల్ని

స్వయంగా చూసి అనుభవించాల్సిందేగాని, 
ఏదో పుస్తకాల్లో ఉండే వర్ణనలను చదవడం వలన ఆ మధురానుభూతిని మనం పొందలేం.

సద్గురు బోధామృతం కూడా అచ్చంగా అలాంటిదే.

స్వయంగా తాను సద్గురు సన్నిధిలో అనుభవించే తన్మయత్వం అలాంటిదే.

ఆ సన్నిధిన గడిపిన సమయం 
అది మహదానందకరమైన సమయం.

సద్గురుదేవులవారు నిరంతరం భాషిస్తూ ఉన్నప్పటికినీ అదే సమయంలో అస్సలు ఏమీ మాట్లాడని "మౌని" వలె కూడా కనబడతారు.

అంతటి గంభీరమైన ప్రశాంతత ఆ సన్నిధిలో ఆవరించి ఉంటుంది. వారిని దర్శించిన ప్రతి ఒక్కరు ఆ ప్రశాంతతను స్వరూపంగా మార్చుకుని వెళుతుంటారు.

* * * 

"జ్ఞానప్రసూనాలు"లోని ప్రతి సూక్తి ఆణి ముత్యమే.
శ్రీరమణమహర్షి చెప్పిన క్లుప్తమైన జవాబుల్లాగే లక్ష పొటెన్సీ హోమియోపిల్స్ లాగే ప్రవచించారు సద్గురుదేవులవారు. ప్రత్యక్షంగా విన్నవారు ధన్యులు."
అన్నారు అన్నాజీరావుగారు(యోగవేదాంత విజ్ఞాన అకాడమీ)

ఇది నిజం.

వారి పాదాల వద్ద కూర్చొని ఆ దివ్యమైన ప్రబోధాలను వింటుంటే, చెవి నుండి హృదయానికి ఎడతెగని ఓ అమృతధార ప్రవహిస్తున్నట్లుంటుంది.

* * *

విన్న బోధనలను నేను గుర్తుపెట్టుకొని ఇంటికొచ్చాక డైరీల్లో వ్రాసి భద్రపరచేవాణ్ణి. అవే ఇప్పుడు "జ్ఞానప్రసూనాలు"గా ప్రచురింపబడుతున్నాయి.

సద్గురు వాగామృతాన్ని ప్రత్యక్షంగానే ఆస్వాదించాలి.
ఆ దివ్యవాణిని తిరిగి వ్రాసుకోవడంలో ఆ మాధుర్యం తగ్గినట్టు అనిపిస్తోంది. కారణం- అనుభవానికి మాత్రమే గోచరమయ్యే ఆ పరతత్త్వాన్ని పరిమితులు కలిగిన భాషలో ఇరికించాలని ప్రయత్నించడమే. 

సద్గురు సన్నిధిలో మౌనం కూడా గొప్ప ఉపదేశంగా విరాజిల్లుతుండేది.

* * *

మబ్బుల నుండి మేడపై పడిన వర్షపు నీరు సింహపుబొమ్మ నోటి నుండి జాలువారినట్లు, విశ్వచైతన్యానికి అధిష్ఠానదేవత అయిన జ్ఞానప్రసూనాంబ తన దయాహృదయం నుండి వెలువడిన అనుగ్రహవర్షాన్ని జిజ్ఞాసువులైన తన శిశువులకు అందించడానికి ఉపయోగించుకున్న ఉపకరణమే సద్గురు సుబ్రహ్మణ్యులు.

వారి బోధల్లో ఏదైనా క్రొత్త విషయం ఒకటి వ్యక్తమైనప్పుడు-

"నేను కూడా మీతో పాటు ఇప్పుడే విన్నాను..."
"నాక్కూడా ఈ విషయం ఇప్పుడే తెలిసింది..."
అనడం కద్దు.

తన ప్రబోధాలకు తానే మొదటి శ్రోతగా ఉంటారు. నేను చెప్పాను అన్న అహం ఏ కోశానా వారిలో ఉండదు. నిత్యవ్యవహారాల్లో సైతం 'కీ' ఇచ్చిన బొమ్మలా తటస్తంగా ఉంటూ, తన పనిని తాను అలా చేసుకుంటూ వెళ్లిపోతారు. ఏ పని చేస్తున్నా, మాట్లాడుతున్నా వారి ముఖంలో చిరునవ్వు చెరగదు.

* * *

ఇలా ఉండు.
ఇలా ఉండొద్దు.

ఈ రెండు మాటలను నా గురువునోట ముప్పై ఏళ్ల ఆయనతోటి సాంగత్యంలో ఒక్కసారి కూడా వినలేదు.

"ఎవరు ఎలా ఉండాలో అలానే ఉన్నారు.
ఏ కార్యాన్ని నెరవేర్చడానికి ఈ భూమ్మీదకు వచ్చారో
అది చేసి తీరుతారు.
ఇది ఈశ్వర నియతి."

అని నిశ్చయజ్ఞానం వలన కలిగిన నిశ్చింత వారి ముఖంలో స్ఫుటంగా కనిపిస్తుంటుంది.

* * *

నేను గురువు వద్దకు చేరిన తొలి రోజుల్లో వారి ప్రబోధాలను మంత్రముగ్దుడనై వినేవాణ్ణి. 
అవి చాలా గొప్ప మాటలుగా అనిపించేవేగాని సంపూర్ణ అవగాహన అయ్యేవి కావు. 
అందుకోసం మళ్లీ మళ్లీ సద్గురు సన్నిధికి వెళ్లి,
వేసిన ప్రశ్నలే మళ్లీ వేస్తుండేవాడిని.

రెండవసారి అదే ప్రశ్న వేసినప్పుడు మొదటిసారి ఇచ్చిన సమాధానం ఇచ్చేవారు కాదు. వైవిధ్యమైన సమాధానం ఇచ్చేవారు. 

అటు వేదాంతపరంగానూ, ఇటు సాహిత్యపరంగానూ తెలుగు భాష యొక్క సొబగుల్ని  గురువుగారి నోట ఏకాంతంగా వినే మహద్భాగ్యం నాకు 30 సంవత్సరాలు దొరికింది.

*  *  *
ప్రపంచానికి హృదయం అరుణాచలం.
జ్ఞానానికి హృదయం అనిలాచలం.

అరుణాచలంలో సుబ్రహ్మణ్యుడు రమణుడుగా ఉన్నాడు.

అనిలాచలంలో రమణుడు సుబ్రహ్యణ్యుడుగా ఉన్నాడు.

* * *

ఆ అరుణాచల రమణుని తత్త్వవైభవానికి కొనసాగింపే 
ఈ అనిలాచల సుబ్రహ్మణ్యగురుదేవులవారు.

రమణసన్నిధిలో ఉన్నంత శాంతి, కాంతి సద్గురు సన్నిధిలోనూ నిండి ఉంటుంది.

ఇంట్లో ఓ మూల ఉన్న పూలకుండీ నుండి వెలువడిన పరిమళం ఆ గదంతా నిండిపోయినట్లు, ప్రపంచంలో ఏ మూల ఏ మహనీయుడు గుట్టుగా జీవిస్తున్నా వారి ఉనికి లోకానికంతా శ్రేయస్కరం అవుతుంది.

వారి అనుగ్రహం ప్రతి జీవికి సమంగా పంచబడుతుంది.

అందుకే వేలమంది సంస్కర్తలు చేయలేని పనిని గుహలో కూర్చునే ఓ ఋషి నిశ్శబ్దంగా పూర్తి చేయగలడు.

సద్గురు ఉనికే లోకానికి ఆశీర్వాదం.

* * *
గురువుగారి ప్రబోధసారాన్ని ఒక్కముక్కలో 
చెప్పాలంటే-

"నాతో సహా సర్వమూ నాలో ఉన్నట్లున్నది"

* * * 

"నేను" ఒక్కటే సత్యము(ఉన్నది)

నామరూపాలతో కూడిన ఈ నేను,
ఈ నేనుకు ముడిపడి ఉన్న జగత్తు 
మొత్తం కలిపి అసత్యమే(ఉన్నట్లున్నదే)

ఈ విషయం అర్థమైతే(అనుభవమైతే)చాలు.
ఇక తాను ఏమిగా ఉన్నా తనకేమీ ఇబ్బంది ఉండదు.
ఆ ఇబ్బంది లేని స్థితియే మోక్షము.

* * *

No comments:

Post a Comment