Wednesday, November 30, 2022

మారిస్ ఫ్రిడ్మన్

 మారిస్ ఫ్రిడ్మన్


అరుణాచల రమణుణ్ణి ప్రప్రథమంలో గుర్తించి తమ ఇంగ్లీష్ పుస్తకాల ద్వారా ప్రపంచానికి పరిచయం చేసిన వారిలో పాల్ బ్రంటన్, మారిస్ ఫ్రిడ్మన్లను ప్రధానంగా పేర్కొన్నవచ్చు. వృత్తిపరంగా ఫ్రిడ్మన్ ఎలెక్ట్రికల్ ఇంజనీర్ అయినప్పటికీ, చిన్నప్పటినుండీ అతడిలో ఉన్న ఆధ్యాత్మిక అభిలాష, తపన, అతణ్ణి ఒక మహా అన్వేషకుడిగా రూపొందించాయి.

తాను జన్మించిన యూదు మతంతో కొన్నాళ్ళు తంటాలు పడి చూచాడు కానీ, 'ఇది చేయద్దు, అది చేయద్దు, నన్నసుసరించు, నేదోవ చూపిస్తాను' అనే పద్ధతి మీద అతడికి విసుగెత్తింది. అసలీ ఆధ్యాత్మికత, ఈ అన్వేషణ అంటే ఏమిటో, స్వేచ్ఛగా, సంతోషంగా, జిజ్ఞాసాపూర్వకంగా కనుగొనాలని నిశ్చయించు కున్నాడు.

యూరప్లో సంచరిస్తున్న శ్రీ జిడ్డు కృష్ణమూర్తిని కలవ నారంభించాడు. సుమారు ఒక అర్థ శతాబ్దంపాటు కృష్ణమూర్తితో సన్నిహితంగా ఉన్నాడు. అసలు కథ ఎప్పుడు ప్రారంభమయిందంటే 1935లో మైసూరు సంస్థాన దివాన్ సర్ మీర్జా ఇసేయిల్ తన యూరప్ పర్యటన సమయంలో ఫ్రాన్స్ లో ఇంజనీర్ గా పనిచేస్తున్న ఈ ప్రజ్ఞాశాలియైన ఫ్రిడ్మన్ ను కలిశాడు. భారతదేశానికి వచ్చి తమ సంస్థానాభివృద్ధికి కృషిచేయమని కోరాడు.

వేదాంతం, ఉపనిషత్తుల మీద అప్పటికే అభిమానం పెంచుకున్న యువ ఫ్రిడ్మన్ అడిగిందే తడవుగా బయలుదేరి భారతదేశం వచ్చాడు. వచ్చిన రెండేళ్ళ లోగానే బెంగుళూరు లోని ప్రభుత్వ విద్యుచ్ఛక్తి పరికరాల ఉత్పత్తి ఫ్యాక్టరీలో సంస్థానానికి సరిపడేటన్ని స్విచ్ గీర్లు, ఇన్సులేటర్లు, ట్రాన్స్ఫార్మర్లు చకచకా తయారు చేయించాడు.

ఇంజనీర్ ఫ్రిడ్మన్ కు ఇదంతా ఒక ఎత్తు అన్వేషకుడైన ఫ్రిడ్మన్ కు తన ట్రాన్స్ఫర్మేషన్' ఎలా అనేదే ప్రధాన సమస్య. భారతదేశానికి వచ్చిన ఆరు నెలలలోగానే అరుణాచల రమణుణ్ణి సందర్శించి ఆయన బోధను స్వీకరించ నారంభించాడు. తనకు సన్యాసమిప్పించ మని రమణుణ్ణి వేడుకున్నాడు.

'అయ్యా, నీకివ్వడానికి నావద్ద సన్యాసి దుకూలాలేవీ లేవు. అదీగాక, నీ వంటి వాడికి, వాటి అవసరమూ లేదు' అన్నాడు శ్రీ రమణుడు. కానీ సన్యాసం మీద ఫ్రిడ్మన్ మనస్సు ఎంతగా లగ్నమైందంటే, కర్ణాటక లోని కన్గన్హాడ్లో ఆనందాశ్రమాన్ని నడుపుతున్న స్వామీ రాందాస్ అనే మహనీయుడి వద్దకు వెళ్ళి ఆయన వద్ద సన్యాస దీక్ష పుచ్చుకున్నాడు.

శిరోముండన, పాశ్చాత్యవేష విసర్జన, స్వామి భరతానంద అనే నూతన నామధారణ మొదలైన వన్నీ జరిగిపోయినై. భిక్షమెత్తుకుంటానని ప్రతిజ్ఞచేసి, అందుకుగాను ఆఖరికి ఒక భిక్షాపాత్ర కూడా కొనుక్కొన్నాడు.

కానీ శ్రీ కృష్ణమూర్తి, శ్రీ రమణుల సాన్నిహిత్యం కారణాన, ఈ పైపై వేషాలు అనవసరం అనే విషయం మెల్లగా గ్రహించాడు - 1947 నాటికి ఈ వేషధారణ వదిలేశాడు. ఆత్మాన్వేషణ మాత్రం నిరాఘాటంగా సాగిపోతూనే ఉండేది.

మారిస్ ఫ్రిడ్మన్, మనిషి ఎటువంటివాడో తెలుసుకుంటే, అతడి మానసిక సన్యాస మెటువంటిదో తెలుస్తుంది. బెంగుళూరు ఫ్యాక్టరీ మేనేజరుగా పనిచేస్తున్న రోజుల్లో ఫ్రిడ్మన్ నెల జీతం మూడువేల రూపాయలు. ఆనాడు ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబం నలభై, యాభై రూపాయల్లో సంసారం సుఖంగానే ఈదేవారంటే, మూడువేల జీతమెంతటిదో ఊహించుకోవచ్చు.

అసాధారణ ప్రజ్ఞావంతుడైన తనవిదేశీ ఇంజనీర్ సన్యాసం స్వీకరించి కాషాయాంబ రాల్లో కార్ఖానాకు వస్తున్నాడని, శిరోజాలు లేని శిరస్సుతో తిరుగుతున్నాడని, తనకు జీతంగా వచ్చే మూడువేల రూపాయలు దానధర్మాలకు వినియోగించి, తాను భిక్షాటన ద్వారా పొట్టపోసు కుంటున్నాడని తెలిసేసరికి, సర్ మీర్జాకు పట్టరాని ఆగ్రహ మొచ్చింది.

'నేను, ఫ్యాక్టరీలో పనిజేయడానికి ఒక ఇంజనీరిని నియమించాను కానీ, సన్యాసిని కాదు. ముందు ఆ వేషం తీసెయ్' అన్నాడు సర్ మీర్జా. నేనిక్కడ వృత్తిపరంగా చేయవలసిన పని అంతా శ్రద్ధగా చేస్తున్నాను. నేను ఏ వేషంలో ఉంటే మీకేమి సంబంధం? కాదు గూడదంటే, ఇదిగో తీసుకోండి రాజీనామా పత్రం' అన్నాడు మారిస్.

ఆ తర్వాత ఇద్దరికీ కాస్త కోపం దిగి వచ్చింది. ఫ్యాక్టరీకి ఎవరైనా ప్రముఖులు వచ్చినప్పుడు సూట్ ధరించేటట్లు, అలాంటి అవసరం లేపప్పుడు మారిస్ తన సన్యాసి వలువలు వేసుకునే వీలు కల్పిస్తూ, ఒక అంగీకారం కుదిరింది.

ఔండ్ (Oundh) అనే ఒక చిన్న సంస్థానంలో గైనకాలజిస్టు సర్జన్ గా పనిచేస్తున్న నళిని అనే తన మిత్రుడి భార్య ఒకసారి బొంబాయిలో మారిస్తు కలిసినప్పుడు 'ఆ సంస్థాన కోశాగారంలో తగినంత డబ్బులేదు. అక్కడ పేదరాళ్ళ ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన కనీస పనిముట్లు కూడా లేకపోతే నేనేమి చేయగలను?' అని తన విచారం వ్యక్తం చేసింది. 'ఎంత కావాలిసుంటుంది? అని అడిగాడు మారిస్. 'ఓపదివేల రూపాయలు అవసరముంటుంది' అన్నది నళిని. ఇంతకుముందే మనం అనుకున్నట్లు, పదివేలు అంటే, సామాన్యుడికి ఓ జీవిత కాలానికి సరిపడే మొత్తంగా భావించవచ్చు.

మర్నాడు ఉదయం మారిస్ నళిని వద్దకు నూరు రూపాయల నోట్ల రూపంలో పదివేలు పట్టుకు వచ్చాడు. 'పని ప్రారంభం చేయమ్మా” అన్నాడు. తన వద్ద ఎంత ఉంటే అంతా నిస్సంకోచంగా ఇచ్చేశాడు మారిస్. కరుణతో నిండిన అతడి హృదయ మటువంటిది. జీవితం చరమ దశలో ఈ మహానుభావుడు మరొక మహనీయుణ్ణి తారసిల్లాడు. బొంబాయి నగరంలోని ఒక చిన్న సందులో ఒక సామాన్య గృహంలో నివసించే "నిసర్గదత్త మహరాజ్" అనే మహారాష్ట్ర ఆధ్యాత్మికుడితో మారిస్కు పరిచయమేర్పడింది. రమణులు, జిడ్డు కృష్ణమూర్తి, వంటి అధ్యాత్మిక సమ్రాట్టుల బోధను అవగాహన చేసుకున్న మారిసు నిసర్గదత్త మహరాజ్ బోధలోని విశిష్టతను గ్రహించడానికి ఎక్కువ సేపు పట్టలేదు.

ఇక అంతే వీలైనప్పుడల్లా ఆయన వద్దకు వెళ్ళి కూచునేవాడు. మారిస్కు అనేక భాషలు వచ్చు. మరాఠీ కూడా నేర్చాడు. నిసర్గదత్తుని వద్దకు అనేకమంది జిజ్ఞాసువులు, సాధకులూ వచ్చి పోతూంటేవారు ఆయన బోధ యావత్తూ వీరితో జరిపే సంభాషణల ద్వారానే సాగిపోతూండేది.

నిసర్గదత్తుడొక సామాన్య గృహస్థు. ఇంట్లో వాళ్ళు అలవాటు ప్రకారం మాంసం వండితే కొద్దిగా తానూ తినేవాడు. బీడీలు కాలుస్తుండేవాడు. అందువల్లనే పదిమందీ అతణ్ణి "బీడీ బాబా" అని కూడా వ్యవహ రిస్తుండేవారు. కానీ కొల్లాయి గట్టితే నేమీ' అని కవివర్యుడు గాంధీజీని గురించి రాసినట్లు, నిసర్గుడు శాకాహారి కాకపోతేనేమి, పొగ తాగితేనేమి, హృదయాంతరాళాల్లో నుండి పుట్టుకొచ్చిన అతడి అనుభవ జ్ఞానం మాత్రం సనాతన, అధునాతన బోధకు ఏ విధంగానూ తీసిపోదు.

నిసర్గుని బోధ ఒక విధంగా 'అమృతధార' అనవచ్చు; మరోవిధంగా 'ఖడ్గధార' అని కూడా అనవచ్చు.
ఆ బోధ అతి నిశితమైనది, నిజంగా అర్థమయితే, అర క్షణంలో అహాన్ని విస్ఫోటన చెందించగలిగేటంత శక్తివంతమైనది.

ఒకప్పుడు కృష్ణమూర్తి రమణ బోధామృతాలను
గ్రోలి ప్రపంచానికి వాటిని పంచి పెట్టిన మారిసు మహనీయుడు తన చివరి కర్తవ్యంగా ఈ నిసర్గుని బోధను మరాఠీ నుండి ఆంగ్లంలోకి అనువదించి, లోకానికి తన చివరి కానుకగా సమర్పించు కున్నాడేమో ననిపిస్తుంది.

ఈ పుణ్య పురుషులిద్దరూ బొంబాయిలో తారసిల్లడం, నిసర్గదత్తుని వద్దకు రాకముందే జిడ్డు కృష్ణమూర్తి, అరుణాచల రమణుల సాంగత్య కారణాన ఆధ్యాత్మిక విద్యలో మారిస్ సుశిక్షితు డవ్వడం, నిసర్గుని మాటల్ని అమిత ఖచ్చితంగా, నిర్దుష్టంగా ఆంగ్లంలోకి సాధికారంగా అనువదించడం మన అదృష్టం. 'ఐ యామ్ దట్' అనే పేరుతో మారిస్ ఫ్రిడ్ మన్ ప్రచురించిన గ్రంథం పాశ్చాత్య దేశాల్లో ఎంత సంచలనం సృష్టించిందంటే, బ్రిటన్ లోని కొందరు యువకులు లండన్లో ప్లేన్ ఎక్కి నేరుగా బొంబాయి వచ్చి ప్లేన్ దిగి నిసర్గుని వద్దకొచ్చి ఓ వారం రోజులపాటు సంభాషణల్లో పాల్గొని, మళ్ళీ ప్లేన్ఎక్కి నేరుగా లండన్ వెళ్ళిపోతూండేవారు.

తన బోధను సంపూర్ణంగా అర్థం చేసుకున్న వారిలో ఫ్రిడ్మన్ ను ప్రథమంగా పేర్కొంటుండేవాడు నిసర్గదత్త మహరాజ్. అంతేకాక ఫ్రిడ్మన్ ఆధ్యాత్మిక హృదయాన్ని ఎంత లోతుగా చూశాడో ఏమో కానీ, ఫ్రిడ్మన్ మరణాంతరం, అతడి ఫోటోను మిగతా సంతులు, దేవతల ఫోటోల సరసన ఉంచి పూలు కుంకుమలతో అర్చిస్తూండేవాడు మహరాజ్. 

No comments:

Post a Comment