*11.ప్రశ్న: ” ‘ఆధ్యాత్మికత’ అంటే?”*
🕊పత్రీజీ: “మనం పూర్ణదేవుళ్ళనుంచి విడివడిన అంశ దేవుళ్ళం .. మనం దేవుళ్ళచే తయారు చేయబడిన దేవుళ్ళం” అని అర్థం చేసుకోవడమే ఆధ్యాత్మికత. ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి గాను మన దైనందిన జీవితంలో మనం చేయాల్సిన అతి ముఖ్యమైన పని ధ్యానాభ్యాసం!
నీటిలో మునిగితే – స్నానం .. శ్వాసలో మునిగితే – ధ్యానం .
సత్యంలో మునిగితే – జ్ఞానం.
*🙃👎12.ప్రశ్న : “‘ధ్యానసాధనలో వుండే ప్రతిబంధకాలు ఏవేవి ?”*
🕊పత్రీజీ : ధ్యానసాధనలో ఉండే ప్రాథమిక ప్రతిబంధకాలు :
1. సోమరితనం
2. భయం
3. అహం
1. సోమరితనం : పీకలదాకా తిని త్రాగి పడుకోవడం .. టీవీలో వచ్చే ప్రోగ్రామ్‌లను కళ్ళప్పగించేసి చూస్తూ కూర్చోవడం .. ఏ కాస్త తీరిక దొరికినా పక్కింటి వాళ్ళతో నిష్ప్రయోజనకరమైన కాలక్షేపపు చెత్తకబుర్లు మాట్లాడుతూ కాలాన్ని హరించివేయడం.
2. భయం : ఎంత రోతవైనా పాత విషయాలను బంగారంలా కాపాడుకుంటూ వాటిని వదలడానికి భయపడడం .. బంగారంలాంటి క్రొత్త విషయాలను స్వీకరించి ఆచరించడానికి భయపడడం.
3. అహం: ‘దేవుడు’, ‘బుద్ధి’, ‘ఆత్మ’ ల గురించి అక్షరంముక్క తెలియకపోయినా అన్నీ తెలిసినట్లు మాట్లాడడం .. తెలుసుకోవాల్సిన విషయాల పట్ల నిర్లక్ష్యం వహించడం.
ఈ మూడు మౌలిక ప్రతిబంధకాలు ధ్యానసాధకులకే కాదు .. ఎవరికైనా .. సుతరామూ పనికిరావు.
*🤔13.ప్రశ్న: “గురూజీ! నేనొక సమస్యలో చిక్కుకున్నాను .. దాంతో నాకు జీవితమంతా సమస్యల వలయంలా కనబ డుతోంది. ఇందులోంచి బయటపడటానికి ఒక గురువుగా నాకు మీ సహాయం కావాలి. నన్నేం చేయమంటారు?”*
🧘♂పత్రీజీ : ప్రతి సమస్యకూ ఒక పరిష్కారం తప్పక వుంటుంది. మరి పరిష్కారం కూడా .. నిదానంగా వెతికితే మన అంతరంగంలోనే వుంటుంది. బయట వేరే ఎక్కడా వుండదు గాక వుండదు. బయటివాళ్ళెవ్వరూ అసలు మన సమస్యను పరిష్కరించజాలరు.
మనకు ఎదురైన ప్రతి ఒక్క సమస్య కూడా మనలోంచి ఒక ప్రశ్నను ఉదయింపజేస్తుంది. మరి ఆ ప్రశ్నే .. మనకు సమస్యకు కావాల్సిన సమాధానాన్ని కూడా వెతికిపెడుతుంది. అందుకే సమస్యలు వచ్చినప్పుడల్లా మన మనస్సుల్లోంచి ఎన్నెన్నో ప్రశ్నలు కూడా ఉద్భవిస్తూ వుంటాయి. వాటన్నింటికీ మన అంతరంగంలోంచి ఎప్పుడైతె సరియైన సమాధానాలు లభిస్తాయో .. ఇక అప్పుడు మనం మానసికకల్లోలం నుంఛి బయటపడి .. ఆ సమస్య యొక్క పరిష్కారం వైపుగా మన భౌతికపరమైన చర్యలు మొదలుపెడుతాం. ఎప్పుడైతే ఇలా మనం భౌతికపరమైన చర్యలను సమర్థవంతంగా చేపడతామో అప్పుడు ఆ సమస్యకు సంపూర్ణమైన మరి అద్భుతమైన పరిష్కారం తప్పక లభ్యమవుతుంది.
చిన్న చిన్న సమస్యలకు చిన్న చిన్న పరిష్కారాలూ, మరి పెద్ద పెద్ద సమస్యలకు పెద్ద పెద్ద పరిష్కారాలూ అవసరమవుతాయి. చిన్న సమస్యల పరిష్కారానికి మనకు పెద్దగా ధైర్యం అవసరం లెకపొయినా పెద్ద పెద్ద సమస్యలను మాత్రం తగిన ధైర్యస్థైర్యాలతో ఎదుర్కోవాలి. చిన్న సమస్యల పరిష్కారానికి మనకు మామూలు భౌతికపరమైన చర్యలు చాలు కానీ .. పెద్దసమస్యల పరిష్కారానికి మాత్రం ” అత్మశక్తి” చాలా, చాలా అవసరం. ఇలాంటి సమయంలో .. ఒకవేళ మీకంటే ఎక్కువ ఆత్మశక్తిని కలిగివున్న సరియైన గురువు మీకు దొరికితే మాత్రం .. పెద్ద సమస్యలకే కాకుండా అతిచిన్న సమస్యల పరిష్కారానికి కూడా వారి నుంచి సహకారాన్ని కోరవచ్చు. అయితే .. ఇక్కడ అసలు ‘సమస్య” ఎమిటంటే .. ‘ఎవ్వరికి సరియైన గురువు లేకపోవడం”. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో మనం బయట ఎవర్ని పడితే వాళ్ళనే “గురువులు” అని నమ్మకుండా .. ధ్యానంద్వారా శాస్త్రీయ పద్ధతిలో మన అంతరంగంలోకి ప్రయాణం చేస్తూ మన “అంతరాత్మ”నే గురువుగా ఎంచుకుని, ఆ ‘అంతరాత్మ” తోనే అనుసంధానం చెందుతూ .. ఆ “అంతరాత్మ”నుంచే సందేశాలు అందుకోవాలి. ఒకవేళ అదృష్టం బాగుండి మన అంతరాత్మకు ప్రతిరూపమైన గురువు బాహ్య ప్రపంచంలో కనుక లబిస్తే .. ఇక మనకు మన అంతరాత్మతో ఎక్కువగా పనిలేదు.
ఇలా లభించిన అసలు గురువు మన అంతరాత్మ యొక్క బాహ్యరూపమే కాబట్టి అలాంటి గురువు బోధనలను బోధనలను మనకు అర్థం అయినా, కాకపోయినా సరే మారు పలుకకుండా అమలు పరచాల్సిందే .. ఎందుకంటే గురువు ముఖతః వచ్చేవన్నీ మన అంతరాత్మ ప్రబోధాలే కనుక. ఇలాంటి గురువు బోధనలు మనకు .. మన సత్వర జ్ఞానోదయానికీ, మన సత్వర సమాధానాలకూ మరి మన సత్వర పరిష్కారాలకూ ఒకానొక దగ్గరి దారి మాత్రమే.
“ధ్యానం” మనలో వున్న ఆత్మశక్తిని పెంచి సమస్యలను ఎదుర్కోగలిగే సామర్థాన్నీ, మరి బుద్ధికుశలతతో సమస్యలను సావధానంగా ఎదుర్కోగలిగే స్థిరచిత్తాన్నీ ఇస్తుంది. తద్వారా మనం అందుబాటులో వున్న భౌతికపరమైన వనరులతో పాటుగా ఆత్మకు వున్నటువంటి అనంత శక్తులను కూడా కూడగలుపుకుని .. సమస్యను మరింత సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతాం. అప్పుడు గెలుపు, ఓటముల సంగతి ప్రక్కకి పెడితే “అసలు సమస్య్ పట్ల మనం ఏ మేరకు అవగాహన సాధించాం” అన్నదాని మీదే ఫలితం అన్నది ఆధారపడి వుంటుంది.
ఇక్కడ తెలుసుకోవల్సినదేమిటంటే .. ఏ గురువు కూడా వేరే ఎవరి సమస్యను కూడా తన భుజాన వేసుకోడు. అయితే ఒక గురువు సమస్యల పట్ల మనకు శాస్త్రీయదృక్పథాన్ని ఏర్పరుస్తాడు; కావలసిన ధైర్యం చెబుతాడు; అంతో, ఇంతో శక్తిపాతం కూడా చేయడానికి ఇష్టపడితే ఇష్టపడవచ్చు .. అంతే కానీ సమస్యలు మాత్రం ఎవరికి వారే పరిష్కరించుకోవాలి. ఎందుకంటే గురువుకి కూడా తన సమస్యల “యుద్ధాలు” తనుకుంటాయి. అలాగే మన యుద్ధాలు మనవి. “జీవితం” అంటేనే .. “ఒక యుద్ధరంగం” దానికి ఆది, అంతం లేవు, అక్కడ ఎవరికి వారు ఒంటరిగా పోరాడాల్సిందే.
ఆత్మజ్ఞానం లేనివాళ్ళకు జీవితమంటే ఒక దుర్భరమైన .. మరి భీభత్సమైన”యుద్ధం” లా కనిపిస్తుంది. మరి అదే జీవితం ఒక ఆత్మజ్ఞానికి తన ఆత్మోన్నతికై ఆడే ఒక “మహాక్రీడ” లా అనిపిస్తుంది. ఎప్పుడైతే మనం పూర్తిగా ప్రాపంచికంలో పడిపోయి ఆత్మజ్ఞాన లోపంతో కూడి “జీవితం ఒక ఆట మాత్రమే” అన్న సంగతి మర్చిపోతామో .. ఇక అప్పుడు మనకు ఎదురయ్యే సమస్యలు మనకంటే పెద్దవిగా మారి భూతాల్లా భయపడతాయి అదే మనం సరియైన ఆధ్యాత్మిక బాటలో పయనిస్తూ ఆత్మజ్ఞానప్రకాశకుల్లా మారి సమస్యల పట్ల చక్కటి అవగాహనతో మెలుగుతే .. ఇక సమస్యలు అన్నీ మనకంటే చిన్న చిన్నగా మారిపోతాయి.
జీసస్ “నేను స్వర్గాధిపతియైన దేవుని కుమారుడను” అంటారు. అంటే “నేను స్వర్గ నియమాలతో కూడుకుని వున్న ఒకానొక గురువు యొక్క ఒకానొక శిష్యుణ్ణి” అని తనను తాను చెప్పుకుంటారు.
ఇక్కడ “స్వర్గం” అంటే ఆత్మ యొక్కస్థితి మరి “గురువు అంటే అలాంటి స్వర్గస్థితిలో వున్న ఒకానొక పురుషోత్తముడు “స్వర్గం” అంటే ఒక ప్రదేశం, లేదా స్థలం కాదు. “స్వర్గం అంటే అంతా ఆనందమే. ఎవరైతే తమ అంతరాత్మకు ప్రతిరూపమైన గురువుతో కలిసి సదా వుంటారో వారు స్వర్గంతో కలిసి వున్నట్లే.. లేకపోతే వారికి స్వర్గం చేజారినట్లే.
మన అంతరాత్మకు ప్రతిరూపమైన సరియైన గురువు .. స్వర్గకళను చక్కగా ఔపోసన పట్టిన స్వర్గాధిపతి కాబట్టి మనందరం కూడా జీసస్ లా .. అంటే స్వర్గాధిపతి కుమారుల్లా వుందాం. మరి గురువుతో కూడి మన సమస్యలను మనమే పరిష్కరించుకుందాం.
*😅14.ప్రశ్న : “గత కొన్ని సంవత్సరాలుగా ఏవో తెలియని భయాలు నాలో పేరుకుపోయి నన్ను చాలా బాధపెడుతున్నాయి. వాటినుంచి విముక్తి చెందడం ఎలా?”*
🌻పత్రీజీ : ధ్యానంలో కూర్చుని .. గతంలో మీకు మాటల ద్వార చేష్టల ద్వారా ఎవరెవరి వల్ల బాధ కలిగిందో వారందరినీ పేరు పేరునా గుర్తుకు తెచ్చుకుని .. వారిని బేషరతుగా క్షమించివెయ్యండి.
అలాగే .. మీరు మీ మాటల ద్వారా చేష్టల ద్వారా ఎవరెవరిని బాధపెట్టారో గుర్తు తెచ్చుకుని పేరు పేరునా వాళ్ళను క్షమాపణలు అడగండి. క్రమక్రమంగా మీ అంతశ్చేతనా మనస్సు యొక్క మూల మూలల్లో నిక్షిప్తమై ఉన్న బాధాకరమైన ఆలోచనల నుంచి మీరు విముక్తి చెందుతారు.
ఇంకా ఇంకా మీ ధ్యాన సమయాన్ని పెంచుతూ .. నవీన ఆధ్యాత్మికతకు చెందిన పుస్తకాలను చదువుతూ .. ప్రతిరోజు దీనిని ఒక అభ్యాసంలా చేయండి.
*🤔15.ప్రశ్న : “మరణానంతరం మన పరిస్థితి ఏంటి ?*
🧘♂” పత్రీజీ : ” మరణం ” అంటే .. భౌతిక శరీరానికీ మరి సూక్ష్మశరీరానికీ మధ్య వున్న “వెండిప్రోగు -Silver cord” యొక్క సంబంధం తెగిపోవడం మాత్రమే. మరణం ద్వారా ” చైతన్యంతో కూడిన ఎరుక ” మన భౌతికశరీరం నుంచి విడివడి .. “సూక్శ్మశరీరం” తో శాశ్వతంగా అనుసంధానించబడి .. ఇక అక్కడి నుంచే తన యొక్క కార్యకలాపాలు సాగిస్తూ వుంటుంది.
ఒకానొక సగటు మూమూలు వ్యక్తి యొక్క సూక్ష్మశరీరం .. మరణం తర్వాత కూడా .. ఈ భూమి మీద కనీసం మూడు రోజుల పాటు తిరుగుతూ వుంటుంది. ఆ సమయంలో “ఒకానొక ఆస్ట్రల్ మాస్టర్” మరి “ఒకానొక ఆస్ట్రల్ అప్రెంటీస్” కలిసి ఆ వ్యక్తికి సూచనలిస్తూ శక్తినిస్తూ ఊర్ధ్వలోకాలకు తీసుకువెళ్తారు. అక్కడ కాస్త సేద తీయించిన తర్వాత అతనితో అంతవరకూ ఆ జన్మలో అతడు గడిపిన జీవితాన్ని సింహావలోకనం చేయిస్తారు.
అప్పుడే అతని పాప మరి పుణ్యకార్యాల చిట్టా సరిచూడబడి, అతని కర్మలస్థాయిని అనుసరించి మళ్ళీ పునఃపరిశీలించబడిన లక్ష్యాలతో .. మరి పునర్ వ్యవస్థీకరించబడిన గమ్యాలతో .. అతని ” పునర్జన్మ ప్రణాళిక ” రచించబడుతుంది.👏👏👏👏🔺🔺🔺🔺
No comments:
Post a Comment