Monday, November 28, 2022

ఆదియోగి…ఆదిపరాశక్తులు ఒకేచోట నెలకొన్న పవిత్ర క్షేత్రమే శ్రీశైలము

 🌹ఆదియోగి…ఆదిపరాశక్తులు ఒకేచోట నెలకొన్న పవిత్ర క్షేత్రమే శ్రీశైలము 🌹
🔱🍁🔱🔱🍁🔱🍁🔱🍁

ఈ క్షేత్రం విశిష్టత  సందర్శన స్థలాలు పూర్తిగా నిక్షిప్తా సమాచారం
🌻🌻🌻🌻🌻🌻🌻🌻

శంభో శంకర
పరమశివుడు మల్లికార్జునుడుగా, పార్వతీదేవి భ్రమరాంబికగా కొలువుదీరిన శ్రీశైల క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో గలదు. ఈ పూణ్యక్షేత్రాన్ని భూలోక కైలాసంగా కూడా అభివర్ణిస్తారు. ఆధ్యాత్మికతకు నెలవుగా ఉండే ఈ క్షేత్రం పర్యాటక పరంగా కూడా ప్రాముఖ్యత కలిగి ఉన్నది. దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో, కృష్ణానది ఒడ్డున జ్యోతిర్లింగం, శక్తిపీఠం ఒకే చోట నెలకొని ఉన్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన మల్లికార్జున లింగంగా పరమశివుడు, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక శక్తిపీఠంగా భ్రమరాంబికాదేవి రూపంలో పార్వతీమాత శ్రీశైల క్షేత్రంలో దర్శనమిస్తారు. దశ భాస్కర క్షేత్రాల్లో ఒకటిగా కూడా  క్షేత్రానికి పేరు 

స్కాందపురాణంలో శ్రీశైలానికి సంబంధించిన గాథ ప్రచారంలో ఉన్నది. శిలాదుడనే మహర్షికి మహాశివుడి కటాక్షం వలన నందికేశ్వరుడు, పర్వతుడు అనే ఇద్దరు పుత్రులు కలిగారట. ఈశ్వర భక్తి పరాయణులైన వారిద్దరూ పరమేశ్వరుడి ప్రసన్నత కొరకు దీక్ష చేపట్టి కఠోర తపస్సు ఆచరించారట. శంభో అనినంతనే వరాలిచ్చే శివుడు వారి తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమయ్యాడు. ఎదుట ప్రత్యక్షమైన మహాదేవుడిని దర్శించి పరవశుడైన నంది తాను ఈశ్వరుడి వాహనంగా ఉండాలన్న అభీష్టాన్ని వ్యక్త పరిచాడు. దానికి పరమేశ్వరుడు అనుజ్ఞ ఇవ్వడం ముక్కంటి వాహనంగా నంది మారడం జరిగిపోయాయి. ఇక మరో పరమ భక్తుడు పర్వతుడికి సైతం తన దర్శన భాగ్యాన్ని పరమేశ్వరుడు కల్పించాడు. స్వామి దర్శనం కలిగిన ఒకక్షణంలోనే కొండంత సంతోషం లభిస్తే, ఆ సంతోషాన్ని శాశ్వతం చేసుకోవాలని సంకల్పించిన పర్వతుడు, తనను ఒక కొండగా మార్చి ఆదిదంపతులిరువురూ ఎల్లప్పుడూ తనపై కొలువుదీరి ఉండాలనే కోరిక కోరాడట. భక్తుడి కోరిక మేరకు పర్వతుడిని కొండగా మార్చి దాని పైనే ఈశ్వరుడు స్వయంభువుగా కొలువుదీరాడనీ, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన మల్లికార్జున లింగం ఇదేనని పురాణ కథనం.
ఆహ్వానం లేకుండా దక్షుడు నిర్వహించిన యజ్ఞానికి వెళ్లి తండ్రిచే అవమానితురాలైన సతీదేవి అగ్నిలో దూకి ఆత్మార్పణ చేసుకున్నది. సతీదేవి మృత శరీరాన్ని శివుడు భుజాన వేసుకుని విలయతాండవం చేయగా సంభవించిన ప్రళయాన్ని ఆపి మహాదేవుడిని యదాస్థితికి తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా శ్రీమహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించడంతో ఆ శరీర భాగాలు పడిన ప్రదేశాలన్నీ శక్తి పీఠాలుగా వెలియగా, మెడభాగం శ్రీశైలంలో పడింది. ఇక్కడ గల శక్తిపీఠంలో అమ్మవారు భ్రమరాంబికా దేవి రూపంలో కొలువుదీరి ఉంటారు. శివుడు, శక్తి ఒకేచేట భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తుండడం వలన ఈ క్షేత్రానికి శివశక్తి క్షేత్రమనే పేరు కూడా వచ్చింది 
మల్లికార్జునుడి పేరు వెనుక గల కథ

పూర్వం కృష్ణానదీ తీరంలో బ్రహ్మగిరి రాజధానిగా చంద్రకేతుడు రాజ్యపాలన చేస్తుండేవాడు. అతని కుమార్తె అయిన చంద్రావతి పరమశివుని భక్తురాలు. సర్వవేళలా ఈశ్వర ధ్యానంలోనే గడిపేది. ఈశ్వార్చనలో భాగంగా నిత్యం మల్లెపూల దండలతో పూజించేంది. చంద్రావతి భక్తికి మెచ్చిన భోళా శంకరుడు పార్వతీమాత సమేతంగా దర్శనభాగ్యం కలిగించి ఆమెను ఏం వంరం కావాలో కోరుకోమన్నాడట. అప్పుడు చంద్రావతి తాను శివలింగంపై ఉంచిన మల్లెపూల దండ ఎప్పటికీ వాడిపోకుండా ఉండే వరాన్ని ప్రాసాదించాలని కోరిందట. తన భక్తురాలి కోరికను మన్నించిన ఈశ్వరుడు ఆ మల్లెపూల దండను తన శిరస్సు పైన గల గంగ మరియు చంద్రవంకల మధ్య ధరించాడట. తన శిరస్సుపై మల్లెపూల దండ ధరించిన స్వామికి మల్లికార్జునుడనే నామధేయం సార్ధకమైనట్లుగా పురాణ గాథ ఒకటి ప్రచారంలో కలదు.


భ్రమరాంబిక దేవి పేరు వెనుక గల కథనం

శ్రీశైలంలో ఆదిపరాశక్తిగా కొలువుదీరిన భ్రమరాంబిక అమ్మవారికి ఆ పేరు రావడానికి వెనుక ఆసక్తికర కథనాలు ప్రచారంలో ఉన్నవి. పూర్వం అరుణాసురుడనే రాక్షసుడు గాయత్రీ మంత్ర జపఫలం కారణంగా మృత్యువు లేని వరాన్ని పొందాడట. ఈ విషయం తెలిసిన దేవతలు జగన్మాతను ప్రార్థించగా, గాయత్రీ మంత్ర జపం చేస్తున్నంత కాలం అరుణాసురుడికి ఎదురుండదని మాత చెప్పిందట. దాంతో ఎలాగైనా అరుణాసురుడిచే గాయత్రీ మంత్ర జపం మాన్పించాలని పథకం వేసి, దేవ గురువైన బృహస్పతిని అతడి దగ్గరకు పంపారు. బృహస్పతి తాను కూడా గాయత్రీమాత భక్తుడినని అరుణాసురుడితో చెప్పడం వలన దేవతలు చేసే అమ్మవారి జపాన్ని తాను చేయనని చెప్పి అప్పటి నుండి అరుణాసురుడు గాయత్రీ మంత్ర జపాన్ని ఆపేశాడట. అందుకు ఆగ్రహించిన ఆదిపరాశక్తి భ్రమరం(తుమ్మెద) రూపం ధరించి అసంఖ్యాకమైన భ్రమరాల సృష్టిచేయగా అవి అరుణాసురుడినీ, అతడి సైన్యాన్ని సంహరించాయట. అప్పటి నుండి పరాశక్తి అమ్మవారికి భ్రమరాంబిక అనే పేరు వచ్చిందట.

శ్రీశైలక్షేత్రం వెలసిన కాలానికి సంబంధించి స్పష్టమైన ఆధారాలైతే ఏవీ లేవనేది పురాణకారుల అభిప్రాయం. అయితే అష్టాదశ పురాణాల్లో, మహాభారతం, రామాయణం మొదలైన ఇతిహాసాల్లో శ్రీశైలానికి సంబంధించిన ప్రస్తావనలైతే కనిపిస్తాయి. సంస్కృత, ఆంధ్ర, కన్నడ, మరాఠీ భాషలకు సంబంధించిన కవులు చేసిన పలు రచనల్లో ఈ క్షేత్రానికి సంబంధించిన వర్ణనలు మాత్రం గోచరిస్తున్నాయి. స్కాందపురాణంలోని శ్రీశైల ఖండం ఈ క్షేత్రానికి సంబంధించిన మహత్యం గురించి తెలియజేస్తున్నది. జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు కొంతకాలం ఈ క్షేత్రంలో తపస్సునాచరించి “శివానంద లహరి’ రచనతో ఈశ్వరుడిని అర్చించడమే కాకుండా, భ్రమరాంబికా మాత సన్నిధిలో శ్రీ చక్రాన్ని కూడా ప్రతిష్ఠించారనడానికి ఆధారాలు కలవు. తెలుగు, సంస్కృతం, కన్నడ భాషల్లో రచించబడిన అనేక కావ్యాల్లో శ్రీశైల క్షేత్రం అత్యంత సుమనోహరంగా వర్ణించబడింది.

ఆలయ నిర్మాణము

మల్లికార్జునాలయ ప్రాకారము లోపలి భాగంలో నాలుగు మండపములతో అపురూపమైన శిల్ప సంపదను కలిగి ఉండి చూడముచ్చటగా ఉంటుంది. ఇక్కడి ప్రధాన గర్భాలయంలో ఎటువంటి శిల్పకళ లేకుండా చూడడానికి సాధారణ నిర్మాణంగా దుర్బేధ్యమైన రక్షణ కవచంతో నిర్మించినట్లుగా ఉంటుంది. ఇక భ్రమరాంబికా అమ్మవారి ఆలయంలో మాత్రం అందమైన శిల్పకళా తోరణాలను కలిగిన స్తంభాలు దర్శనమిస్తాయి. ఇక్కడి గర్భాలయానికి గల వెనుక భాగంలో ఉన్న గోడకు చెవిని ఆనిస్తే ఝుమ్మనే భ్రమరనాధం వినవచ్చును. అడుగుభాగం సైతం కనిపించే స్వచ్ఛమైన నీరు కలిగి ఉన్న మనోహర గుండము ఇక్కడ ఉన్నది. ఈ క్షేత్రం ఎంతో ఎత్తయిన ప్రదేశమైనప్పటికీ ఇక్కడి రాళ్ళలో ఇంత స్వచ్ఛత కలిగి సహజసిద్ధమైన నీరు ఉండటం వీక్షకులకు ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది.

వృద్ధ మల్లిఖార్జున లింగం ప్రత్యేకత

పూర్వం ఒకనాడు పార్వతీ మాత పరమేశ్వరుడితో తన వివాహం జరగాలని స్వామిని కొలిచి తపస్సు చేయగా ఆ తల్లి తపస్సుకు మెచ్చిన ఈశ్వరుడు ఒక వృద్ధుని రూపంలో ప్రత్యక్షమయ్యాడట. వృద్దరూపంలో వచ్చిన స్వామిని చూసి అమ్మవారు ఈ అవతారం ఏమిటి స్వామి అని ప్రశ్నింగా, దానికి స్వామి నేను అనాదినుండీ ఉన్నవాడను కావున నా రూపం ఇదే విధంగా ఉంటుంది. ఈ రూపంలో ఉన్న నేను నీకు ఇష్టమైతే వివాహం చేసుకో అన్నాడట. దానికి పార్వతీమాత పరమేశ్వరా మీ తత్వం నాకు తెలియదా, మీరు ఏ రూపంలో ఉన్నా కూడా నాకు సమ్మతమే అని మహాదేవుడిని వివాహమాడిందట. అలనాడు పార్వతీ మాతకు సాక్షాత్కారమైన వృద్ద మల్లిఖార్జునుడు శ్రీశైలంలోని ప్రధాన ఆలయానికి కుడివైపున నేడు వృద్ధ లింగ రూపంలో దర్శనమిస్తాడు.

శ్రీశైల క్షేత్రాన్ని పంచపాండవులు దర్శించుకున్నారనడానికి నిదర్శనంగా ప్రధాన దేవాలయానికి వెనక భాగంలో ఒక్కొక్కరి పేరుమీదుగా ఒక్కో ఆలయం నిర్మించి, అందులో శివ లింగాలు ప్రతిష్టించబడిన ఐదు శివాలయాలు దర్శనమిస్థాయి 
ఆలయ విశిష్టత

ఈ ఆలయాన్ని వీరశైవులు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన వీరశైవులు మల్లికార్జునుణ్ణి విశేషంగా ఆరాధిస్తారు. మల్లికార్జునుడి పూజాకార్యక్రమాలు వీరశైవానికి చెందిన అర్చకులు, అదేవిధంగా భ్రమరాంబకు సంబంధించిన పూజా కార్యక్రమాలు బ్రాహ్మణ అర్చకులు నిర్వర్తిస్తారు. ఇటువంటి విశిష్ట సాంప్రదాయం ఈ ఆలయంలో మాత్రమే గోచరిస్తుంది. ఆరాధ్యులు శివపార్వతుల కల్యాణాన్ని జరిపిస్తారు. ఇక్కడి పరివార దేవతలకూ, ఉత్సవమూర్తులకు సంబంధించి వస్త్రాలంకరణను చెంచులు విధిగా జరుపుతారు. ఇతర ఏ శైవక్షేత్రంలో లేని ప్రత్యేకతలు శ్రీశైల ఆలయంలో గోచరిస్తాయి.

ఆలయంలో పూజా సమయంలో చెప్పే సంకల్పంలో శ్రీశైల క్షేత్రానికి ఏ దిక్కులో కూర్చొని భగవదారాధన చేస్తున్నదీ విధిగా పేర్కొనడండమనేది ఇక్కడి ప్రమాణానికి నిదర్శనం. పాతాళగంగ అనే పేరుతో కృష్ణానది ఉత్తరవాహినిగా, బ్రహ్మ విష్ణు రుద్ర గిరులనబడే పర్వతాలను తాకుతూ ఇక్కడ ప్రవహిస్తున్నది.

శ్రీశైల క్షేత్రానికి నాలుగు రకాలైన ప్రధాన ద్వారాలు కలవు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో గల త్రిపురాంతకాన్ని తూర్పుద్వారం అనీ, జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రముఖ శక్తిపీఠం ఆలంపూర్ జోగులాంబ క్షేత్రాన్ని పశ్చిమద్వారం అనీ, కడప జిల్లాలో గల సిద్ధవటంను దక్షిణద్వారం అనీ, మహబూబ్ నగర్ జిల్లాలో గల ఉమామహేశ్వరాన్ని ఉత్తరద్వారం అని పిలుస్తారు. ఆగ్నేయంగా పుష్పగిరి, నైరుతిదిశలో సోమశిల, వాయువ్యంలో సంగమేశ్వర, ఈశాన్యంలో ఏకేశ్వర క్షేత్రాలు కొలువుదీరి ఉన్నవి.

ఆలయ బ్రహ్మోత్సవాలు

శ్రీశైల క్షేత్రంలో ప్రతి సంవత్సరం రెండుసార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. సంక్రాంతి సమయంలో ఒకసారి, మహాశివరాత్రి సందర్భంగా మరొకసారి ఉత్సవాలు జరుగుతాయి. తొలిరోజు సాయంవేళ ధ్వజారోహణ, భేరీపూజ, దేవతాహ్వనాలతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మరుసటి రోజు నుండి ప్రతిరోజు ఆదిదంపతులను పలు రకాల వాహనాలపై కొలువుదీర్చి సేవలు నిర్వహిస్తారు. మహాశివరాత్రి పర్వదినం రోజున లింగోద్భవ ఘడియల్లో వేద పండితులూ, అర్చకులచే మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకం జరుపబడుతుంది. ఆ తరువాత శివపార్వతుల కల్యాణం వైభవోపేతంగా నిర్వహిస్తారు. కళ్యాణోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా ప్రభోత్సవం, తెప్పోత్సవాలను నిర్వహిస్తారు.

క్షేత్ర అభివృద్ధి – చారిత్రక ఆధారాలు

లభించిన శిలాశాసనాలు, చారిత్రక ఆధారాల ద్వారా పూర్వకాలం నుండే అనేక రాజవంశీయులు శ్రీశైలక్షేత్రాన్ని సేవించినట్లు తెలుస్తున్నది. శాతవాహనులు, ఇక్ష్వాక, విష్ణుకుండిన, పల్లవ, రాష్ట్రకూట, చాళుక్య, కాకతీయ, రెడ్డిరాజ్య, విజయనగర తదితర రాజ్యాల పాలకులు శ్రీమల్లికార్జునస్వామి, భ్రమరాంబికాదేవీ అమ్మవార్లను ఆరాధించేవారనడానికి చారిత్రక సాక్షాలు కలవు. ఆలయంలో అనేక ప్రాకారాలు నిర్మింపజేసి, అశేష వస్తుసంపదలు సమర్పించారనడానికి అనేక ఆధారాలు కూడా కలవు. ఆరవ శతాబ్దం నాటిదని భావిస్తున్న మైసూరు కదంబరాజుల తాల్గుండి శాసనంలో శ్రీశైలక్షేత్ర ప్రస్తావన కలదు. పద్నాల్గవ శతాబ్దంలో కాకతీయ ప్రతాప రుద్రుడు వేయించిన శాసనంలో కూడా శ్రీశైలక్షేత్ర పూర్వ చరిత్రకు సంబంధించి మూలాలు కలవు. ఈ శాసనం ప్రస్తుతం చెన్నైలోని మ్యూజియంలో భద్రపరచబడి ఉన్నది.

ప్రస్తుతం శ్రీశైల క్షేత్రం ఉన్న ప్రాంతాన్ని కదంబ మయూర వర్మ ఆరో శతాబ్దంలో పాలించాడు. అదే విధంగా ఏడవ శతాబ్దంలో చాళుక్యులూ, పదవ శతాబ్దం వరకూ రాష్ట్రకూటుల ఏలుబడిలో ఈ ప్రాంతం ఉండేది. అప్పట్లో జరిగిన యుద్ధాల కారణంగా తరువాత కాలంలో ఈ క్షేత్రం వెలనాటి ప్రభువుల అధీనంలోకి వచ్చింది. ఇక కాకతీయుల పరిపాలన ప్రారంభమైనప్పటి నుండి యావత్ తెలుగుప్రాంతం ఏకీకృతమవడంతో శ్రీశైల క్షేత్రం మరింత ప్రభావవంతమైన క్షేత్రంగా వర్ధిల్లింది. కడపటి కాకతీయ చక్రవర్తులైన గణపతి దేవుడు, రుద్రమ, రెండవ ప్రతాపరుద్రుల కాలంలో ఈ క్షేత్రం పరిపూర్ణమైన అభివృద్ధికి నోచుకొన్నది. కాకతీయుల అనంతరం రాజ్యస్థాపన చేసిన రెడ్డిరాజుల కాలంలో ప్రోలయ వేమారెడ్డి పాలనలో శ్రీశైలం ప్రాభవం ఉచ్ఛస్థితికి చేరింది. ఆ తరువాత విజయనగర రాజుల కాలంలో రెండో హరిహరరాయలు ఈ క్షేత్రానికి దక్షిణ గోపుర ద్వారాన్నీ, ముఖమంటపాన్నీ నిర్మింపజేశాడు. తుళువంశంలో ప్రముఖుడైన శ్రీకృష్ణదేవరాయలు ఆలయ ప్రధాన ద్వారం వద్ద ఒక గాలిగోపురాన్ని నిర్మించి, శ్రీశైల క్షేత్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించి నిత్యం ఈ క్షేత్రాన్ని దర్శించేవాడు. మహారాష్ట్ర సామ్రాజ్యాధినేత ఛత్రపతి శివాజీ మహరాజ్ తన పరిపాలనా కాలంలో శ్రీశైలం ఉత్తర దిక్కున ఒక గాలిగోపురాన్ని నిర్మింపజేశాడనడానికి ఆధారాలు కలవు. ఆ తరువాత పాలించిన మహ్మదీయ పాలకులు సైతం ఈ క్షేత్ర పవిత్రతను గుర్తించి మల్లికార్జునుడికి మాన్యాలూ, ఆస్తులు సమర్పించారు.

భారతదేశంలో బ్రిటీష్ వారి పాలన ప్రారంభమైన తరువాత దేవాలయ నిర్వహణ పుష్పగిరిమఠం ఆధీనంలోకి వచ్చింది. ఆలయ అభివృద్ధికిగాను 1929లో ఒక ప్రత్యేకమైన మేనేజ్ మెంట్ బోర్డు రూపొంచారు. భారతదేశ స్వాతంత్ర్యానంతరం రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ ఆధీనంలోకి వచ్చిన ఈ క్షేత్రం దినదిన ప్రవర్ధమానం చెందుతూ భక్తుల పాలిట కల్పతరువుగా వెలుగొందుతున్నది.

 దర్శనీయ ప్రదేశాలు

శ్రీశైల క్షేత్ర పరిసర ప్రాంతాల్లో అనేక దేవాలయాలు కలవు. శ్రీశైల యాత్రకు వెళ్ళిన వారు తప్పకుండా దర్శించాల్సిన కొని దేవాలయాలు గలవు. ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. భక్తులకు ఇక్కడి ఆలయాలు తమవైన అనుభూతులను మిగులుస్తాయి.

1. సాక్షిగణపతి ఆలయం

ఇక్కడి గణపతి పరమశివుడి భక్తుల భక్తికీ, వారు చేసిన శ్రీశైల యాత్రకు మొదటి సాక్షిగా నిలుస్తాడని భక్తుల విశ్వాసం. భక్తులు శ్రీశైల పుణ్యక్షేత్రాన్ని సందర్శించినట్లు కైలాసంలో శివుని వద్ద సాక్ష్యం చెబుతాడు కనుక ఈ స్వామి సాక్షి గణపతిగా ప్రసిద్ది చెందాడు. అందుకే శ్రీశైల క్షేత్రాన్ని దర్శించేందుకు వెళ్ళిన భక్తులు సాక్షిగణపతిని మొదట సందర్శించి ఆ తరువాతనే శ్రీశైల క్షేత్రానికి వచ్చినట్లుగా తెలుపుకోవాలనీ, అప్పుడు సాక్షి గణపతి ఈ యాత్రను నమోదు చేసి తన తల్లిదండ్రులకు తెలియజేస్తాడనినే కథనం ప్రచారంలో ఉన్నది. శ్రీశైలంలో కొలువుదీరిన మల్లిఖార్జున సమేత భ్రమరాంబికా దేవిల దర్శనం పొందిన వారికి కైలాస ప్రవేశానుమతి లభిస్తుందని, మోక్షార్హతను నిర్ణయించేది సాక్షి గణపతి అని కూడా భక్తుల నమ్మకం. తాము ఇక్కడి క్షేత్రాన్ని సందర్శించినట్లు ఈ గణపతి సాక్షిభూతమని నమ్ముతారు. సాక్షి గణపతి ఆలయం శ్రీశైలం నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉటుంది.

2. భీముని కొలను

సాక్షిగణపతి ఆలయం తరువాత వచ్చే పాపనాశన తీర్థానికి ఎదురుగా కాలిబాట ద్వారా వెళితే భీముని కొలనుకు చేరవచ్చు. ఈ మార్గం ద్వారా ఒక కిలోమీటరు తరువాత ఒక మహాద్వారం ఎదురవుతుంది. ఇక్కడ వందల అడుగుల లోతులో ఉన్న లోయల మధ్య, త్రివేణీ, త్రిపర్వత శ్రేణుల మధ్య రెండు పాయలుగా జారే సెలయేళ్లు జలపాతాలుగా కిందికి పడడం రమణీయ దృశ్యంగా గోచరిస్తుంది. ఈ జలపాతాల కింద ఉండే నీటి కొలనుని భీముని కొలను అంటారు.

ఈ కొలను ఏర్పడడానికి ఒక ఆసక్తికర పురాణ కథనం ప్రచారంలో కలదు. మహాభారత కాలంలో లోమశ మహర్షితో కలిసి పాండవులు తీర్థయాత్రలు చేస్తూ ఈ ప్రదేశానికి చేరుకోగానే వారి ధర్మపత్ని ద్రౌపదికి దాహం వేయడంతో ఇక్కడి పరిసరాలలో భీముడికి ఎక్కడా నీటి జాడ లభించలేదనట. అప్పుడు లోమశ మహర్షి ఒక శిలను భీముడికి చూపి దానిని బద్దలుకొడితే నీరుంటుందని తెలిపాడట. భీముడు తన గదతో ఆ శిలను పగుల గొట్టగానే అందులో నుండి నీటి ధారలు పైకి ఉబికి వచ్చి ఆ నీటితో ఒక కొలను ఏర్పడిందట. ఆ విధంగా భీముడి వలన ఏర్పడిన కొలను భీముని కొలనుగా ప్రసిద్ధి చెందిది. ఇదే ప్రదేశంలో భీముడు ఒక శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించాడు. ఆ లింగమే భీమలింగంగా పూజలు అందుకుంటున్నది.

3. హటకేశ్వరం

శ్రీశైలం నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో హటకేశ్వరం ఉన్నది. కేశప్ప అనే భక్తుడిని స్వర్ణలింగ రూపంలో ఈశ్వరుడు అనుగ్రహించిన ప్రదేశమే హటకేశ్వరంగా ప్రసిద్ధి. ఇక్కడ కొత్త కుండ పెంకులో స్వయంభూ బంగారు శివలింగం దర్శనమిస్తుంది. కుండలు తయారు చేసే ‘అటిక’లో ఈశ్వరుడు వెలిసినందున అటికేశ్వరంగా పిలువబడి కాలక్రమేణా హటకేశ్వరంగా ప్రసిద్ధిగాంచింది. ఇదే ప్రదేశంలో బ్రహ్మధార, విష్ణుధార, రుద్రధార, చంద్రధార, దేవధార అనే పంచ ధారలు నిత్యం జాలువారుతూ ఉంటాయి. వీటిని పంచధారగా పిలుస్తారు. ఇదే ప్రదేశంలో కొండలపై నుండి పడుతున్న నీరు పరమశివుడి లలాటాన్ని తాకి కిందికి జాలువారే ధారను ఫాలధారగా పిలుస్తారు. ఆదిశంకరాచర్యుల వారిచే పావనం చేయబడిన ఫాలధార, పంచధారలు పర్యాటకులకు సుందర దృశ్యాలుగా గోచరిస్తాయి.

4. శిఖరేశ్వరం

శ్రీశైలం నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో శిఖరం ఉంటుంది. శిఖరేశ్వరం అనే ఈ కొండ పైనున్న నంది కొమ్ముల మధ్య నుండి చూసినపుడు శ్రీశైల శిఖర దర్శనం కలిగితే పునర్జన్మ ఉండదనేది భక్తుల విశ్వాసం. ఇక్కడి నుండి లభించే శ్రీశైల శిఖర దర్శనం సర్వ పాపహరణమనేది కూడా భక్తుల నమ్మకం.

5. పాతాళగంగ

శ్రీశైల క్షేత్ర దర్శనార్ధమై వెళ్ళిన భక్తులు తప్పక సందర్శించాల్సిన ప్రదేశాల్లో పాతాళగంగ ఒకటి. కొండ పైభాగం నుండి కనిపించే లోయలో పాతాళగంగ ఉండడం వలన అక్కడికి చేరుకోవడానికి మెట్ల మార్గం ఉంటుంది. పాతాళగంగ కింది నుంచి పైకి వెళ్లే మార్గాన్ని చూస్తే ఆ పేరు ఈ ప్రాంతానికి ఎందుకు పెట్టారో అర్థమవుతుంది. ఈ సందర్శన పర్యాటకులకు ఒక మంచి అనుభూతినిస్తుంది.

6. అక్కమహాదేవి గుహలు

కృష్ణానదికి ఎగువ భాగంలో అక్కమహాదేవి గుహలు కలవు. ఇక్కడికి చేరుకోవలంటే కృష్ణానదిలో బోటు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ గుహలు పూర్వ చారిత్రక యుగానికి చెందినవనే ఆధారాలు కూడా కలవు. ఇవి సహజసిద్ధంగా ఏర్పడిన గుహలు. కర్ణాటక ప్రాంతానికి చెందిన గాయని మరియు వేదాంతి అయిన అక్కమహాదేవి ఈ గుహల్లో గల శివ లింగానికి తపస్సు, పూజలు చేసి శివుడే తన సర్వస్వంగా భావించింది. అందువల్ల ఈ గుహలకు అక్కమహాదేవి గుహలు అనే పేరు స్థిరపడినది.

7. ఇష్టకామేశ్వరిదేవి ఆలయం:

దేశంలో ఈ పేరుతో శ్రీశైలక్షేత్రంలో తప్ప మరెక్కడా మరో ఆలయం లేదు. శ్రీశైలం కూడలి నుండి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో దట్టమైన నల్లమల అటవీ ప్రదేశంలో ఇష్టకామేశ్వరి దేవి అమ్మవారి ఆలయం నెలకొని ఉంటుంది. అటవీ ప్రాంతంలో వెలసిన ఈ అమ్మవారు పూర్వం కేవలం సిద్ధులచే మాత్రమే కొలవబడేది. ఈ ప్రదేశం అటవీశాఖ వారి ఆధీనంలో ఉండడం వలన ఉదయం నుండి సాయంత్రం వరకు పరిమిత సంఖ్యలో మాత్రమే వాహనాలను అనుమతిస్తారు. శ్రీశైలం నుండి ఈ ప్రదేశానికి చేసే ప్రయాణం సాహసంతో కూడుకొని ఉంటుంది. ఇక్కడి అమ్మవారిని సేవించి ఏవైనా కోరికలు కోరుకుంటే అవి తప్పకుండా నెరవేరుతాయనే బలమైన నమ్మకం ఇక్కడికి వచ్చే భక్తుల్లో ఉంటుంది. చతుర్భుజాలు కలిగి రెండు చేతులలో తామర మొగ్గలు; ఒక చేతిలో శివలింగం, మరో చేతిలో రుద్రాక్షమాలతో జపం చేస్తున్నట్లుగా అమ్మవారి విగ్రహం ఉంటుంది. గుహలాగా అనిపించే దేవాలయంలో దీపాల వెలుతురులో అమ్మవారిని దర్శించుకోవడం మరిచిపోలేని ఆధ్యాత్మిక అనుభూతినిస్తుంది.

8. శ్రీశైలం డ్యామ్

శ్రీశైల క్షేత్రం నుండి సుమారు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో కృష్ణానదిపై ఈ డ్యామ్ నిర్మితమై ఉన్నది. పాతాళగంగ స్నానఘట్టానికి ఒక కిలోమీటరు దూరంలో దిగువన ఈ డ్యామ్ ఉంటుంది. ఇది ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టు. దీనిపై నుండి చూస్తే పరవళ్ళు తొక్కుతున్న కృష్ణానది పర్యాటకులను పరవశింపజేస్తుంది.

శ్రీశైల క్షేత్రానికి సమీపంలో చెంచులక్ష్మి గిరిజన ప్రదర్శన శాల, కదలీవనం, శివాజీ సాంస్కృతిక స్మారక భవనము, ఆది శంకరాచార్యుల తపోవనము లాంటివి దర్శ నియస్థలాలు వున్నాయి 🙏


🔥సర్వేజనసుఖినోభవంతు 🔥

No comments:

Post a Comment