Monday, November 28, 2022

🛕 *త్రిపురాంతకం

 🛕  *త్రిపురాంతకం


⚜️ ప్రాచీన మంత్రం, చైతన్య విద్యలకు ప్రతీక, ఓషధీ మూలికల స్థావరం, భ్రమరాంబా మల్లికార్జుల నిలయం అయిన శ్రీశైలానికి తూర్పు ద్వారంగా ప్రకాశం జిల్లాలోని *త్రిపురాంతక క్షేత్రం* ఉంది.

🔱 శైవ శాక్తేయ క్షేత్రాలలో అత్యంత ప్రాధాన్యం పొందిన మహామహిమాన్విత దివ్య క్షేత్రం త్రిపురాంతకం.  

⚜️ స్కాంద పురాణంలో శ్రీశైలఖండంలో *‘’త్రైలోక్య పావనం తీర్ధం త్రిపురాంతక ముత్తమం‘’* అని చెప్పబడిన అతి ప్రాచీన క్షేత్రం.

🔱 మార్కాపురానికి నలభై కిలో మీటర్ల దూరంలో, గుంటూరు–కర్నూలు మార్గంలో రహదారికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నది.

🔱 *త్రిపురాంతకం సిద్ధ క్షేత్రం.* అనేక యోగులు, సిద్ధులు తాంత్రికులకు ఆవాసభూమి. అనేక దివ్యమైన ఔషధాలకు నిలయం.  *రస రత్నాకర, నాగార్జున సిద్ధ తంత్రం* మొదలైన గ్రంధాలు దీని ప్రాభవాన్ని తెలియజేశాయి. స్వామి ధ్వజస్తంభాన్ని చూసినా పాపాలు పటాపంచలౌతాయి. ఈ దైవ దర్శనం చేస్తే నంది జన్మ లభిస్తుందని విశ్వాసం. 

⚜️ *త్రిపురాంతక నామ స్మరణం ముక్తిదాయకం* అని పార్వతీదేవికి స్వయంగా ఆ పరమశివుడే చెప్పాడు. త్రిపురాంతక లింగాన్ని *‘’తత్పురుష లింగం‘’* అంటారు

🛕 *స్థల పురాణం – త్రిపురాసుర సంహారం* 

🔱 తారాకాసురుడు పూర్వం దేవ, ఋషులను బాధిస్తుంటే శివకుమారుడైన కుమారస్వామి తారకాసురుని మెడలోని ప్రాణలింగాన్ని ఛేదించి వాడిని సంహరించాడు. ఈ యుద్ధంలో అలసిన శరవణభవుడు *‘’ఆదిశైలం’’* అనే పేరున్న ఈ పర్వతం పై విహరించటం వలన *"కుమారగిరి‘’* అనే పేరు వచ్చింది. 

⚜️ *తారకాసురుని ముగ్గురు కొడుకులు తారాక్షుడు, విద్యున్మాలి, కమలాక్షుడు. వీరినే త్రిపురాసురులు అంటారు.* తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవటానికి ఈ ముగ్గురు మూర్ఖులు శుక్రాచార్య అనుజ్ఞతో బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేశారు. ఆయన ప్రత్యక్షం కాలేదు. పంతం పెరిగి ఒంటికాలి మీద నిలిచి తీవ్రతపస్సు చేస్తే లోకాలు తల్లడిల్లిపోయాయి. బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. 

🔱 ఎవరి చేతిలోనూ చావు కలగ కూడదని వరం కోరుకున్నారు. అపుడు బ్రహ్మ, పుట్టినవాడు చావాల్సిందే కనుక ఎలా చావాలనుకుంటున్నారో చెప్పండి అని అడిగాడు. తాము ఆకాశంలో మూడు పురాలను కట్టుకొని వెయ్యేళ్ళు జీవించిన తర్వాత ఆ మూడు పురాలు వరుసగా ఒకే చోట చేరినప్పుడు ఒకే బాణంతో ఆ త్రిపురాలను చేదించిన వాని చేతిలోనే తమకు మృత్యువు రావాలనికోరుకున్నారు. సరేనన్నాడు బ్రహ్మ.

🔱 తారాక్షుడు బంగారంతో, విద్యున్మాలి వెండితో, కమలాక్షుడు ఇనుముతో చేయబడిన పురాలను కట్టుకొని ఉంటూ దేవతలను మునులను బాధిస్తున్నారు. వారు పరమేశ్వరుని ప్రార్ధించారు. అప్పుడాయన త్రిపురాసురలను చంపాలంటే అపూర్వమైన రధం, అపూర్వ బాణాలు అవసరమని చెప్పాడు. 

⚜️ వీరు శ్రీహరిని ప్రార్ధిస్తే ఆయన విశ్వకర్మకు ఆదేశం ఇచ్చి అపూర్వ బాణాలను సృష్టింపజేశాడు. విశ్వకర్మ జగత్తు తత్త్వంతో రధాన్ని, వేదతత్త్వంతో గుర్రాలను, నాగ తత్త్వంతో పగ్గాలను, మేరు శిఖర తత్త్వంతో ధనుస్సును, వాసుకి తత్త్వంతో వింటి నారిని, సోమ, విష్ణు, వాయు తత్వాలతో బాణాలను తయారుచేసి ఇచ్చాడు. బ్రహ్మ రథసారధి అయ్యాడు. అ దివ్యరధాన్ని చూసి సంతసించి శివుడు అధిరోహించి త్రిపురాసుర సంహారానికి బయల్దేరాడు.

🛕 *త్రిపురాంతకేశ్వర ఆవిర్భావం* 🙏

⚜️ ఇంత చేసినా త్రిపురాసురుల తపో బలం వలన, మయుడి నిశ్చలతత్త్వం వలన ఆ దివ్య రధం భూమిలోకి కుంగిపోయింది. గుర్రాలు నిలవలేకపోయాయి.  ధనుస్సు పనిచేయలేదు. రుద్రుడు విశ్వకర్మను పిలిచి సమర్ధమైన రధం నిర్మించలేకపోయినందుకు కోపపడ్డాడు. ఆయన సిగ్గుతో తల వంచుకొని వెళ్ళిపోయాడు. 

⚜️ పరమేశ్వరుడు అంతర్ముఖుడైనాడు. పరదేవతను ఆత్మలో ధ్యానించాడు. లీలావినోదిని బాలా త్రిపురాసుందరిగా ఆమె ఆవిర్భవించింది. శివుని ధనుసులో ప్రవేశించింది. దీనికి ఋగ్వేదంలో ఒక మంత్రం సాక్షిగా కనిపిస్తుంది. 

*‘’అహం రుద్రాయ ధనురా తనోమి బ్రహ్మ ద్విషే శరవే హంత వా ఉ –* *అహం జనాయ సమదం క్రుణోమ్య హం ద్యావా ప్రుధివీ ఆవివేశ* 

🔱 ‘’అమ్మవారి తోడ్పాటుతో రుద్రుడు బాణం ఎక్కుపెట్టాడు. దేవతలు అప్పుడు,  *‘’నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః‘’* అని స్తుతించారు.

⚜️ త్రిపురాలన్నీ ఒకే సరళరేఖలో చేరాయి. రుద్రబాణంతో అవి ఒకే సారి ద్వంసమైనాయి. దేవ, మునులు సంతసించారు. బాలాత్రిపురసుందరి ధనుస్సు నుంచి బయటికి వచ్చింది. శివుడు ఆమె సాయాన్ని ప్రస్తుతించాడు. ఆమె కృతజ్ఞతతో త్రిపురాసుర సంహారం చేసిన రుద్రుడు ఎక్కడ ఉంటే తానూ ఆక్కడే ఉండి ఆయన్ను సేవిస్తాను అని ఆయన అనుగ్రహాన్ని కోరింది. రుద్రుడు వెంటనే సమాధి స్థితిలోకి వెళ్ళాడు. ఆయన పాదాల దగ్గర ఉన్న స్థలం ద్రవించటం ప్రారంభించింది. పెద్ద గుంట ఏర్పడి నీరు లోపలి పొరల్లోకి ప్రసరించింది ఆ గుంటలోనే ఆయన, *‘’వైడూర్య లింగం‘’* గా ఆవిర్భవించాడు. 

🔱 దీనికి సాక్ష్యంగా వేదమంత్రం ఉంది – వైడూర్య లింగానికి పై భాగాన బ్రహ్మ దివ్యజల లింగాన్ని ప్రతిష్టించాడు. ఇక్కడ జల లింగానికి చేసిన అభిషేకద్రవ్యంలోని ద్రవ్య చిత్త దోషాలు పై భాగంలోనే లయమై లోపల ఉన్న త్రిపురాంతకేశ్వరుని చేరుతుంది.

⚜️ త్రిపురాంతకేశ్వరుడు ఆవిర్భవించిన ఈ దివ్య ప్రదేశమే కుమారగిరి. ఆదిశైలం, అరుణాచలం, కుమారాచలం, లేబ్రాయపు కొండ అని పేర్లున్నాయి. 

🔱 తారకాసుర సంహారం చేసిన తర్వాత కుమార స్వామి ఇక్కడ రహస్య ప్రదేశంలో తపస్సు చేస్తున్నాడు. 

🔱 ప్రతి పౌర్ణమి నాడు పార్వతీ దేవి,  ప్రతి అమావాస్య రోజున పరమేశ్వరుడు వచ్చి తమ కుమారుడైన కుమారస్వామిని చూసి వెళ్తూఉంటారని శివపురాణం లోని శ్లోకం తెలియ జేస్తోంది –‘’

*'అమావాస్య దినే శంభుఃస్వయం గచ్చతి తరహ –*
*పౌర్ణమాసీ దినే పార్వతీ గచ్చతి ధృవం‘’*

🔱 *పిలిస్తే పలికే దైవం*🙏

⚜️ పూర్వం త్రిపురాంతకేశ్వరుడు పిలిస్తే పలికేవాడట. పాల్కురికి సోమనాధుడు బసవపురాణం లో చెప్పిన కిన్నెర బ్రహ్మయ కథ దీనికి తార్కాణం. 

⚜️ ఈ ఆలయానికి నాలుగు వైపులా నాలుగు ప్రధాన ద్వారాలున్నాయి నాలుగు వైపులా కొండ పైకి మెట్ల మార్గాలున్నాయి. ఇప్పుడు తూర్పు ద్వారం ఒకటే తెరచిఉంది.  దక్షిణ సోపాన మార్గానికి దగ్గర *మూలస్థానేశ్వర స్వామి దేవాలయం* ఉంది. ఈయన మహా మహిమ కల దైవం. అనేక మంది రాజులు ఈయనకు భూరి దానాలు సమర్పించారు. 

🔱 దీనికి దగ్గరలో....
 *శ్రీ లక్ష్మీ చెన్నకేశవాలయం* ఉన్నది. పలనాటి బ్రహ్మనాయుడు ఈ స్వామిని అర్చించాడు. మూలస్థానేశ్వరునికి ఆగ్నేయంగా పంచబ్రహ్మలచే ప్రతిష్టింప బడిన  *‘’పంచ లింగ దేవాలయం‘’* ఉన్నది. ఈశాన్యంలో ఆవు పొదుగు ఆకారంతో లింగాలు దర్శన మిస్తాయి. పూజిస్తే ఆయురారోగ్యాలను ఇస్తాయి. దక్షిణ సోపానాల దగ్గర *వీరభద్రాలయం* ఉంది. ఇంకొంచెం పైకి ఎక్కితే *ఇష్టకామేశ్వారీ* దేవాలయం ఉన్నది. దీనికి దక్షిణంగా అద్భుత మహిమలున్న *‘’అగస్త్య లింగం‘’* ఉన్నది.  దీనినే *‘’విన్ధ్యేశ్వర లింగం"* అని అంటారు. 

🔱 ముఖ్యదేవాలయం దగ్గరే *‘’అపరాజితేశ్వరుడు‘’* ఉన్నాడు. మన్యుసూక్తం తో అర్చిస్తే శత్రుజయం లభిస్తుంది. ఆగ్నేయంలో సూక్ష్మ తేజోమయ *‘’యజ్ఞేశ్వర లింగం‘’* వాయవ్యంలో హనుమంతుడు నెలకొల్పిన *‘’మారుతి లింగం‘’,* ఉన్నాయి.  వీటిని పూజిస్తే ఆయుష్షు, బలం, యశస్సులు కలుగుతాయి. వీటి ప్రక్కనే మార్కండేయ ప్రతిష్టిత దివ్య లింగం ఉంది. ఉత్తరంలో చండీశ్వరుడు, పార్వతీ ఆలయానికి ఎదురుగా విశ్వామిత్ర ప్రతిష్టితమైన *‘’ఉగ్రేశ లింగం‘’* ఉన్నాయి. ఉత్తరాన *‘’భేక సోమేశ్వరుడు’’* దర్శనమిస్తాడు. ఈయన ఆరాధనను చాలా జాగ్రత్తగా చేయాలి. ఆలయంలోని బలిహరణలను భక్షిస్తాడు. ఉత్తర గోపురం దగ్గర గొప్ప శిల్పకళా శోభితమైన మహిషాసుర మర్దిని విగ్రహం ఉండేది ఇప్పుడు అది మద్రాస్ మ్యూజియంలో ఉంది. గర్భాలయానికి నైరుతి దిశలో  *‘’చీకటి మిద్దె‘’* అనే చీకటి గుహ ఉన్నది. ఇక్కడి నుంచి కాశీ, శ్రీశైలాలకు సొరంగ మార్గం ఉంది. వృశ్చిక మల్లేశ్వరాలయానికి దగ్గరలో మఠం ఉంది. శ్రీ బాలాత్రిపురసుందరిని అర్చించడానికి సిద్ధ సాధువులు ఈ మార్గం ద్వారా వస్తారని చెబుతారు. ప్రధాన ఆలయానికి ఉత్తరాన ఒక చింతచెట్టు ఉండేది. దాని మూలంలో భైరవుడు ఉంటాడు. దాని ముందు మనిషి లోతు త్రవ్వితే ఒక గుండం కనబడుతుంది. అప్పుడు చింత చెట్టు ఆకులు కోసి గుడ్డలో మూట కట్టి ఆ గుండంలో వేస్తె రాళ్ళు చేపలుగా మారుతాయట. ఆ చేపలను వండి తలను తోకను తీసేసి తింటే మూర్చ వచ్చి కొంత సేపటికి లేస్తాడు. ఆ మనిషి వేల సంవత్సరాలు జీవిస్తాడని *‘’నిత్య నాద సిద్ధుడు‘’* అనే యోగి,  *‘’రస రత్నారం‘’* అనే గ్రంధంలో రాశాడు. చీకటి మిద్దె ప్రకనే *‘’మహా గణపతి మండపం‘’* ఉంది. విగ్రహం శిధిలమైతే ప్రక్కన కింద పెట్టారు.

⚜️ ప్రధానాలయం శ్రీ చక్రాకారంలో నిర్మించబడింది. శివాలయం ఈ ఆకారంలో నిర్మించటం చాలా అరుదు. అలాంటి అరుదైన దేవాలయం ఇది. *"శ్రీ చక్రం శివయోర్వపుః’’* అంటే శివ పార్వతుల శరీరమే శ్రీచక్రం. 

🔱 స్వామి ఉగ్రరూపం కనుక తూర్పు గ్రామాలు తగలబడిపోయాయట. అందుకే ఆ ద్వారాన్ని మూసేశారు. పక్కగా ఉన్న దారి గుండా వెళ్లి దర్శనం చేసుకోవాలి. లోపల స్వామికి ఎదురుగా నందీశ్వరుడు ఆకర్షణీయంగా ఉంటాడు. జలలింగాన్ని దుండగులు పీకేస్తే కొండ కింద ఉన్న శ్రీరామ ప్రతిష్టిత లింగాన్ని తెచ్చి ప్రతిష్టించారు. పునః ప్రతిష్ఠలో మూల విరాట్ ను కదిలించకుండా మూల విరాట్ కు కింద మరొక నర్మదా బాణ లింగాన్ని ప్రతిష్టించారు. 

🔱 త్రిపురాంతకేశ్వరునికి ఉత్తరాన పార్వతీదేవి అంటే స్కంద మాత ఆలయమున్నది. పై రెండు చేతులలో శాక్తేయ చిహ్నాలైన త్రిశూలం, డమరుకం కింది చేతులలో పద్మాలు కలిగి ఉంటుంది. అమ్మవారి ముందు కాశీ విశ్వేశ్వర లింగం ఉంది.

⚜️ స్వామి అభిషేకాలకు, భక్తజనం త్రాగటానికి గంధవతి తీర్ధం ఉంది. ఇందులో స్నానిస్తే పుణ్యం, మోక్షం. 

🔱 త్రిపుర సుందరి ఆలయం వెనక పుష్పవతీ తీర్ధం ఉండేది. చెరువులో కలిసిపోయింది. మహానంది లో లాగానే ఇక్కడ కూడా స్వచ్చమైన జలంతో ఉండే కోనేరుండేది. దీనికి *‘’పాప నాశనం‘’* అని పేరు. 

🔱 నాలుగు కొండల మధ్య ఉన్న *సోమతీర్ధం పాప నాశిని.* 

⚜️ కుమార గిరికి పడమర దూర్వానది లేక దువ్వలేరు ఉన్నది. ఇక్కడ దూర్వాసుడు తపస్సుచేశాడు. దీనికి దక్షిణంలో  *‘’ముక్త గుండం"* లో స్నానం చేస్తే మోక్షమే.

🛕 *తీర్థాలు-మిగిలిన గుడులు*🔱

⚜️ *త్రిపురాంతకం అష్ట భైరవ పరివేష్టితం.* కుమార గిరికి దక్షణాన భైరవగిరి సిద్ధులకు సిద్ధి క్షేత్రం. 

🔱 పూర్వం ఇక్కడ భైరవాలయం ఉండేది తూర్పున శ్రీ సుందరేశ్వర స్వామి కొండపై ఉన్నాడు పడమరలో శ్రీరామనాధేశ్వరుడు మిక్కిలి పూజనీయుడు. ఉత్తరాన ఉన్న కొండను పూలకొండ అంటారు ఇక్కడే తారకాసురుడు పూజించిన శివ లింగం ఉంది. ఇక్కడే తారకాసుర మందిరం ఉండేదట. 

⚜️ దక్షిణాన కొండమీద విద్యున్మాలి పూజించిన లింగం ఉంది. దీనికి దిగువన ఓషధీ సమన్విత సోమతీర్ధం ఉంది. ఇది సర్వ రోగనివారిణి. 

🔱 తూర్పున పంచబ్రహ్మలు ప్రతిష్టించిన పంచలింగాలున్నాయి. వాయవ్యంలో లింగాల కొండ ఉంది. ఇక్కడ వెయ్యినూట ఒక్క లింగాలు ఉన్నాయట. ఇక్కడ అజ్ఞాతంగా మునులు తపస్సు చేస్తూ ఉంటారట. ఇకడే దివ్యౌషధి *’’సంజీవిని‘’* ఉన్నదని జ్ఞానులు చెబుతారు.

🛕 *శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి ఆలయం* 🛕

🙏 *చిదగ్ని కుండ సంభూత* 🙏

🔱 కుమారగిరికి దగ్గరలో ఒకప్పటి చెరువులో కదంబ వృక్షాల మధ్య శ్రీబాలా త్రిపురసుందరీదేవి ఆలయం ఉంది. ఈ ఆలయంలో ప్రతిదీ విశేషమైనదే. ఆలయ గోపుర గర్భగుడిపై నిర్మాణ శైలి వైవిధ్యంతో ఉంటుంది. గర్భ గుడిమీద రాజ  గోపురానిని పోలిన గోపురం ఉండటం ప్రత్యేకత.  *’’త్రిపురాంతక పీఠేచ దేవి త్రిపురసుందరీ’’*  అని శాస్త్రాలలో ఉన్నా ఇది అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా గుర్తింపు పొందలేదు. కారణం ఇక్కడ అమ్మవారు స్వయంభుగా ఆవిర్భవించటమే.  అమ్మవారు నిర్గుణ శిలాకారంగా ఆవిర్భవించింది. ఇప్పుడున్న గర్భ గృహం త్రిపురసుందరీదేవి ఆవిర్భవించిన చిదగ్ని కుండం.  దీన్ని స్థానికులు *‘’నడబావి‘’* అంటారు.  

🔱అమ్మవారు ఉత్తరాభిముఖంగా దర్శనమిస్తుంది. చిదగ్నిగుండంలోకి దిగాలంటే తొమ్మిది మెట్లు దిగి వెళ్ళాలి. ఒక్కో మెట్టూ ఒక్కో ఆవరణ. అదే నవావరణం లో బాలాత్రిపురసుందరి ఉంటుందన్న మాట.

🔱 ఈ మెట్లకు అధిదేవతా ప్రత్యధిదేవతలుంటారు. తొమ్మిది మెట్లూ దిగిన తర్వాత చిదగ్ని గుండం లో నిర్గుణ శిలాకార రూపంలో అమ్మవారు కనిపిస్తుంది. 

🔱 దివ్య చక్షువులున్న మునీశ్వరాదులకు మాత్రం అరుణ కిరణాలతో పుస్తాక్షమాలా వరదాభయహస్తాలతో దర్శనమిస్తుంది. సామాన్య జనం కోసం శిల ముందు ఒక విగ్రహాన్ని ప్రతిష్టించారు.  అలంకారాలన్నీ ఈ విగ్రహానికి.  

⚜️ ఈ విగ్రహానికి వెనక ఉన్న శిలమధ్య తెల్లని రాతి మీద శ్రీ బాలా యంత్రం ప్రతిష్టితమై ఉంది. విగ్రహానికి వెనక రాతి కిరీటం ఉండటం చేత యంత్రం కనిపించదు.

🙏 *అమ్మవారిపై శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు –*

*‘’నూటోక్క శక్తు లెప్పుడు – నాటక మటు లాడు చుండ,* 
*నాయక మణియై కూటంబు నేర్పు త్రిపురక –*
*వాటము జొర నంత వాని వశమగు ధాత్రిన్ ‘’* అని పద్యం చెప్పారు .

🛕 *సిద్ధి మండపాలు* 🌈

🔱 చిదగ్ని కుండం నుంచి బయటికి వచ్చేటప్పుడు మెట్లకు రెండు వైపులా రెండు మండపాలున్నాయి. వాటినే *‘’సిద్ధి మండపాలు‘’* అంటారు. ఈ మండపాలలో కూర్చుని తదేక దృష్టితో మంత్రం జపిస్తే వెంటనే సిద్ధి కలుగుతుందని తత్వజ్ఞులు చెప్పారు శ్రీవావిలాల మహాదేవయ్య గారు, శ్రీగోపయ్య గారు ఇక్కడే కూర్చుని మంత్రానుస్ఠానం చేసేవారట.

🛕 *శ్రీ చక్ర పాదుకలు*🛕

🔱 మెట్లు దాటి బయటికి వస్తే శ్రీచక్ర మండపం కనిపిస్తుంది. ఇక్కడే శ్రీచక్ర పాదుకలున్నాయి. అర్చనలన్నీ వీటీకే చేస్తారు. అందరూ వీటిని పూజించ వచ్చు. ఈ చక్ర పాదుకలకూ చిదగ్నికుండ దేవికి తంత్ర సంబంధ అనుసంధానం ఉంది. ధనం కావాలంటే ఎరుపు రంగు,  విద్య కావాలంటే తెలుపు, శత్రు జయం కలగాలంటే నల్లని స్వరూపం తో అమ్మవారిని ధ్యానించాలి.  ఈ పాదుకల వెనుక సిద్దేశ్వర పాదుకలుంటాయి. వీటిని *‘’గురుపాదాలు‘’* అంటారు. శ్రీవిద్యా సాంప్రదాయంలో వీటి ప్రాధాన్యం ఎక్కువ. గురుపాదుకలకు ప్రక్కనే బ్రాహ్మీ లిపి లో  *‘’గురుపాదకా మంత్రం ఉంది’’.* చక్ర మండలం నైరుతి భాగం లో శ్రీ దక్షిణామూర్తి లింగం ఉంది. స్వామికి ఇక్కడే అభిషేకం చేస్తారు.

🙏 *ఛిన్నమస్తా దేవి*🙏

🔱 చక్ర మండపం దాటి ఉత్తర ద్వారం గుండా బయటికి వస్తే,  ‘’ఛిన్నమస్తాదేవి’’ చిన్న మండపంలో కనిపిస్తుంది.  ఈమెనే ప్రచండ చండిక అని, వజ్ర వైరోచని అని అంటారు. ఈమెయే అమ్మవారి సర్వ సైన్యాధ్యక్షురాలు. ఈమె దశమహావిద్యలలో ఆరవ మహావిద్య. ఈమెను ఉపాశిస్తే కలిగే ఫలితం *‘’యామళం’’* అనే గ్రంధం వివరించింది. 

⚜️ ఆలయం బయట చతుషష్టియోగినీ మూర్తులు దర్శన మిస్తారు. ఇవి ఇప్పుడు నిజంగా చిన్న మస్తకాలై రూపు చెడి గోడలకు నిలబెట్ట బడి ఉన్నాయి.

🌈 *రక్త పాత్రలు*

⚜️ సాధారణంగా శక్తి ఆలయాలలో సింహవాహనం,  ధ్వజస్తంభం ఉండాలి ఈ రెండూ ఇక్కడ లేవు. కనుక అమ్మవారు మానవ ప్రతిష్టితం కాదని, స్వయంభు అని భావిస్తారు. వైదికాచారులే కాక వామాచారులకు కూడా ఈ అమ్మవారు ఉపాస్య దేవత.

🙏 *’’సవ్యాప సవ్య మార్గస్థా’’.* 🙏

🔱 ఒక్కప్పుడు ఈ ఆలయంలో  *‘’పంచ మకారార్చన’’* జరిగేది అందుకే గర్భాలయంలో రాతితో చేయబడిన *‘’రక్త పాత్ర‘’* ఉంది దీనికి *‘’ఉగ్రపాత్ర ‘’* అనే పేరుకూడా ఉంది. ఉగ్రపాత్ర అరఅడుగు ఎత్తు, రెండడుగుల వ్యాసం కలిగి ఉంటుంది. ఎన్ని దున్నల్ని బలిచ్చినా, ఒక్కోపొతు రక్తానికి కడివెడు నీళ్ళు పోసినా ఆ రక్త పాత్ర నిండదు. ఈ విషయం ఈ నాటికీ ప్రత్యక్ష నిదర్శనమే ఈశాన్యంలో మామూలు భక్తులకు వేరొక రక్త పాత్ర ఉన్నది దానికి రెండు అడుగుల దూరం లో బలిని ఇచ్చే *‘’యూప స్థంభం‘’* కూడా ఉంది. దీనిపై సంస్కృత శాసనం ఉంది. శాక్తేయ చిహ్నాలైన త్రిశూలం దానికి రెండు వైపులా సూర్య చంద్రులు ఉన్నారు. 

దీన్ని ఒక కవి పద్యంలో

 *‘’మదపు టేనుగు నైన ,కొదమ సింగం బైన* – 
*యూప శిలకు దా, సమీప మంద* –
*మెడ యెసంగి నిలుచు మేకపోతులు దున్న* –
*లేమి చెప్ప జూతు నామే మ్రోల ‘’* 

🌈 వ్యాస భగవానుడు ఈ అమ్మవారిని *‘’దేవతాగ్రణీ’’* అని స్తుతించారు స్కాందపురాణం శ్రీశైలఖండంలో-

 *‘’గిరి ప్రదక్షిణం కుర్యాత్ చతుర్భైరవ సంయుతం –త్రైలోక్య జననీ సాక్షాత్ త్రిపురా దేవతాగ్రణీ* 
*దృష్ట్వా ప్రయత్నతో దేవీ మర్చయిత్వా సమంత్రకం ‘’*

🙏 *కదంబ వనవాసిని* 🙏

🌈 త్రిపురసుందరీ దేవి స్థావరం కదంబవనం. ఈ వనాలు ఆలయం దగ్గరే ఉన్నాయి. అతి సున్నితంగా రక్తవర్ణంతో ఉండే కదంబ పుష్పాలు అమ్మవారికి మహా ప్రీతి.  అందుకే...‌ *‘’కదంబ కుసుమ ప్రియాయై నమః‘’* అని లలితాసహస్రం లో చెప్పారు. 

🌈 కదంబ వృక్షాలే కల్ప వృక్షాలని శ్రీ శంకరభగవద్పాదులు తెలియ జేశారు. 

🙏 *వీర శిలలు*🌈

⚜️ అమ్మవారి ఉత్తర ద్వారంకు ఎదురుగా ఉన్న శిల్పాలన్నీ వీర శిలలే. ఇవి భక్తుల వీర కృత్యాలకు ప్రతిబింబాలు. ఒకప్పుడు ఆ వీరులకు ఇక్కడ ఆరాధన జరిగేది. ఇందులో అధికభాగం స్త్రీ శిల్పాలే.  వివిధ ఆలంకారాలతో కేశపాశాలతో వీరులు బల్లాలను తలలో, గుండెలో, గొంతులో, తొడలలో పోడుచుకొంటూ ఇంకా బ్రతికే ఉన్నట్లు కనిపిస్తారు. వీరు ఎందుకు వీరక్రుత్యాలు చేశారో తెలిపే శాసనాలున్నాయి. ఇలా ఆత్మార్పణ చేస్తే దేవి కోరికలు తీరుస్తుందని నమ్మకం.

🛕 *అపరాధేశ్వరీ ఆలయం – గుహలు*🛕

⚜️ అమ్మవారి ఆలయానికి దగ్గరలో బయట రోడ్డుమీద *‘’అపరాధేశ్వరీ‘’* లేక బాలమ్మ ఆలయం ఉంది. ఇది శిధిలరూపంలోనే ఉంది. దీనికి దగ్గరలో *చింతామణి గుహ* ఉన్నది.  ఇది అమ్మవారి ఆలయమేనని భావన ఆధారం *‘’చింతామణి గృహాంతస్థా"* అనే నామం. ఇక్కడే పూర్వం లక్ష్మీగణపతి ఆలయం ఉండేదట అమ్మవారికి వెనక ‘’వైడూర్య శిఖరం. అనే కొండ మీద ధ్యానం చేస్తే రోగాలన్నీ మాయమవుతాయట. ఇకడే తమాషా అయిన తెల్లని రాతి వరుస ఉందట. దీని రహస్యం సిద్ధులకు మాత్రమే ఎరుక.

🛕 *మహా సర్పం – మరికొన్ని విశేషాలు*🌈

🔱 బాలాత్రిపుర సుందరీదేవి ఆలయం చెరువు కట్టపై ఒక పుట్ట ఉంది. అందులో విశేషమైన సర్పం ఒకటి ఉంటుంది. సంతానార్ధులు, నాగ దోషము ఉన్నవారు ఈ పుట్టకు పొంగళ్ళు సమర్పిస్తారు. ఇందులోని పాము రాత్రి వేళ అమ్మవారి చిదగ్నిగుండం చేరి సేవ చేసి తిరిగి వస్తుందట.

🔱 అమ్మవారి గుడికి దగ్గరే ఉండే తెల్లని గుండ్రాయి ని *‘’ఈశ్వరుని తల గుడ్డ‘’* అంటారు. ఇది మహత్వం కల శిల అని ఇప్పుడు చెరువులో కూరుకు పోయి కనిపించటం లేదు.

⚜️ త్రిపురాంతక శివునికి పడమరగా పదమూడు కిలో మీటర్ల దూరంలో ఒక కొండ, దానికి పశ్చిమంగా ఒక ద్వారం ఉన్నాయి అక్కడ నలభై అడుగుల దూరం లో   *‘’మండే కాంతులు‘’* కనిపిస్తాయి. అక్కడి మామిడి పండు ఆకారంలో ఉన్న రాళ్ళను గుడ్డలో వేసి మూట కట్టాలి. అది ఎర్రగా మారుతుంది. ఆ గుడ్డను పాలల్లో వేయాలి. పాలు ఎర్రగా మారుతాయి. ఆ పాలను సాధకుడు వారం రోజులు అదే విధంగా తాగితే వజ్ర సమాన శరీరుడు అవుతాడు, ఆయుస్సు పెరుగుతుంది అని ‘’రస రత్నాకరం‘’ లో నిత్య నాద సిద్ధుడు రాశాడు.

⚜️ *బిలాలు*

🔱 శివాలయానికి ఉత్తరాన *‘’కోకిలా బిలం"* ఉంది. సాధకుడు శుచిగా అందులో ప్రవేశించాలి. నలభై అడుగులు లొపలికి వెడితే కోకిల ఆకారపు రాళ్ళు కనిపిస్తాయి. ఆ రాళ్ళను తీసుకొని వాటి వెనక నువ్వులు పెడితే అవిపగిలిపోతాయి. అప్పుడు ఆ రాళ్ళను పాలలో వేస్తే పాలు నల్లగా మారుతాయి. ఈ పాలను గొంతు నిండే దాకా తాగాలి. అప్పుడు దివ్య శరీరం పొంది తెల్లజుట్టు ముడుతలు పోయి, రోగాలు లేనివాడై మూడు బ్రహ్మ దినాలు జీవిస్తాడు. మహా బలవంతుడై వాయువేగం కలుగుతుంది.

🌈 గుండ్ల కమ్మ నదికి తూర్పు కొండపై చంద్ర మౌళీశ్వరాలయం ఉంది. దాని దగ్గరే కాశి కేశుడు, ఒక కోనేరు, నృసింహ బిలం ఉన్నాయి.  బిలంలో ప్రవేశిస్తే యోగసిద్ధి కలుగుతుంది. దానిలో నుంచి కాశీ వెళ్ళచ్చు.

🛕 *ఇష్ట కామేశ్వరీ దేవి ఆలయం*  🙏

🔱 శ్రీశైలానికి తూర్పున శిఖరేశ్వరానికి దూరం గా కారడవిలో శ్రీ ఇష్ట కామేశ్వరీ దేవి విగ్రహాన్ని అందరు తప్పక దర్శించాలి. ఈమె పేరు తెలుగు సాహిత్యంలో ఎక్కడా చోటు చేసుకోకపోవటం ఆశ్చర్యం గా ఉంది. ధ్యాన మగ్నయై పద్మాసనంలో శిలాపీఠం పై దర్శన మిస్తుంది. నాలుగు భుజాలు ఉన్నాయి. పై రెండు చేతులతో కలువ మొగ్గలను కింది కుడి చేతితో రుద్రాక్ష మాల, ఎడమ చేతిలో శివలింగాన్ని కలిగి ఉంటుంది. పూర్వపు ఆలయం శిధిలమైంది. ఆలయానికి ఎదురుగా ఒక సిద్ధుని విగ్రహం ఉంటుంది. కాపాలికల దేవత అయి ఉండచ్చు. ఉత్తరాన ఒక వాగు నిరంతరం ప్రవహిస్తుంది. సుమారు ఎనిమిదవ శతాబ్దపు ఆలయం అనుకోవచ్చు జీపులలో అడవిలో ప్రయాణించి ఇష్ట కామేశ్వరిని దర్శించాలి. 

🙏 ఈ ఆలయాన్ని,  కంచి పరమాచార్యులవారు శ్రీ శ్రీ చంద్ర శేఖర యతీంద్రుల వారు మొదటిసారి దర్శించి లోకానికి తెలియజేశారు. అప్పటిదాకా ఎవరికీ తెలియదు. తర్వాత ఇటీవలికాలం లో శ్రీచాగంటికోటేశ్వర రావు గారు వెళ్లి దర్శించి, అమ్మవారి ప్రాభవాన్ని ప్రవచనాలలో తెలియజేస్తున్నారు. ఇప్పుడే ప్రభుత్వం పక్కారోడ్లు నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు.

🙏 *వీరశైవం –మఠాలు*

🔱 త్రిపురాంతకం శైవమత వ్యాప్తికి దోహదపడింది. ఇక్కడి *‘’గోళకీ మఠం’’* ప్రసిద్ధి చెందింది. 14వ శతాబ్దంలో వీరశైవం విజృభించింది. 1312 నాటికి పూజారులు 72 నియోగాల వారు స్థానాధిపతులు శ్రీ అసంఖ్యాక మహా మహేశ్వరులకు లోబడి ఉండాలన్న నిబంధన ఏర్పడింది. ఇక్కడి *‘’విశుద్ధ శైవ మఠం’’* ఉచిత అన్న వస్త్రాలిచ్చి వేద వేదాంగాలు శాస్త్రాలు సాహిత్యం బోధించింది. పదమూడు పద్నాలుగు శతాబ్దాల మధ్య *‘’కాపాలిక మతం‘’* అభివృద్ధి చెందింది అప్పుడే *‘’పంచ మకారార్చన"* జరిగేది (మద్యం మాంసం మగువ ).

🛕 *ఉత్సవాలు*

🔱 ప్రతి సోమ, శుక్రవారాలలో విశేష ఉత్సవాలు మహా శివరాత్రి నాడు కల్యాణోత్సవం జరిగేదని వసంతనవరాత్రులు, శరన్నవరాత్రులు శ్రావణమాసంలో ప్రత్యేక ఉత్సవాలు కార్తీకంలో అభషేకాలు సంతర్పణలు జరిగేవని శాసనాల వలన తెలుస్తోంది. తర్వాత ఆలయం శిధిలావస్థకు చేరింది.  శ్రీశైలం దేవస్థానం ఈ క్షేత్రాన్ని దత్తతకు తీసుకొని పునరుద్ధరించి మళ్ళీ నిత్యధూపదీపనైవేద్యాలు ఉత్సవాలు నిర్వహింప జేస్తోంది. దాతలు ముందుకు వచ్చి అన్నదాన సత్రాలు నిర్వహిస్తున్నారు. 2006 లో కరివెన వారి బ్రాహ్మణ అన్నదాన సత్రం అమ్మవారి ఆలయానికి దగ్గరలో ప్రారంభ మైంది.  శివరాత్రి నాడు జరిగే రధోత్సవం కన్నుల పండుగగా ఉంటుంది.  

🙏 ఇంతటి మహా మహిమాన్విత దివ్య క్షేత్రమైన త్రిపురాంతకం వెళ్లి శ్రీ బాలాత్రిపుర సుందరిని, శ్రీ త్రిపురాంతకేశ్వరుని దర్శించి జీవితాలను చరితార్ధం చేసుకోవాలి.

*చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమాం*
*చంద్రశేఖర చంద్రశేఖర రక్షమాం* గురు చరణం  ఈ సమూహంలో చేరడానికి *జైశ్రీరామ9490860693 కి WhatsApp చేయండి.
🌹🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌹

No comments:

Post a Comment