Saturday, November 26, 2022

అరిషడ్వర్గాలు.

 🌹అరిషడ్వర్గాలు.🌹


🍁🍁🍁🍁🍁🍁🍁

ఇది అందరికీ తెలిసిందేగా, కొత్తగా మనం మాట్లాడుకోవడానికి ఏముంటుంది అనుకుంటున్నారా !  వున్నదండీ బాబు.  

కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను కదా అరిషడ్వార్గాలు అంటారు.   మనలో చాలామందికి ఒక అనుమానం వస్తూ వుంటుంది, కొందరిని చూసినప్పుడు. 

అదేమంటే,  ‘. ఈయన ఇంత చక్కని సంగతులు మాట్లాడుతూ ఉంటాడు, చక్కని ఉపన్యాసాలు యిస్తూ ఉంటాడు.   కానీ, కోరికలు జయించలేకపోతున్నాడు,  కోపాన్ని వదిలిపెట్టలేక పోతున్నాడు.   డబ్బు లెక్కలు చూసుకుంటూ ఉంటాడు.  ఈయన చెప్పే ఉపన్యాసాలకు మనం ఎందుకు విలువ ఇవ్వాలి ? ‘. అని.   అవునా,  కాదా !

ఇప్పుడు వీటి పుట్టు పూర్వోత్తరాలు చూద్దాం.

ఆత్మతత్వం ప్రకారం, ఏ జీవి అయినా ఎప్పుడూ సుఖరూపంగా ఉండాలని కోరుకుంటుంది.   దీనికి పరమప్రేమ ఆలంబనం.   అందుకే ప్రతివాడూ ' నేను లేకుండా పోకూడదు  '  అని కోరుకుంటాడు.   అంటే ‘ ఎల్లప్పుడూ తాను వుండాలి ‘ అనే పరమప్రీతి కనిపిస్తుంది.   నా అస్తిత్వం నిత్యముగా ఉండాలనే పరమప్రేమ. 

తస్య హేతు : సమానాభిహార : పుత్ర ధ్వని శ్రుతౌ  /
ఇహానాదిరవిద్యయన వ్యామోాహైక నిబంధనం. //  
( 14  వ శ్లోకం వేదాంత పంచదశి,  తత్వ వివేక ప్రకరణం.  )

తనకంటే భిన్నులైన కొడుకులూ, కుమార్తెలు, భార్య,  మిత్రులు మొదలైనవారి యెడల ప్రేమ ఉండడం అనేది కూడా తన ఆత్మకోసమే !  నాప్రేమ,  పైకి మాత్రం వారికోసం అని కనబడుతున్నా,  అదికూడా ఆత్మసంతృప్తి కోసమే !  ఉన్నదానిని వున్నట్లుగా చూడనీయని ప్రతిబంధకాలు ఇవి అన్నీ ! వింటుంటే  ఆశ్చర్యకరంగా ఉంటుంది కదా !  కానీ ఇది నిజం.  

పదార్ధాలకున్న సౌందర్యం మనకు అవగతం అయినప్పుడే,  వాటిపై మనకు అనురాగం పెరుగుతుంది.    దానికంటే, సౌందర్యవంతమైన ప్రకాశవంతమైన వస్తువు మనకు అవగతమైనప్పుడు, మొదటిదానిపై అనురాగం తగ్గుతుంది.    

సత్వ రజస్తమో గుణాలు, పూర్వజన్మ వాసనల వలన జీవుడికి సంక్రమించేవి.   ఒకే తల్లి కడుపున పుట్టినా, ఒకే సామాజిక పరిస్థితిలో పెరుగుతున్నా, ‘ ఏకోదర సంజాతులు ఒకే విధంగా ప్రవర్తించాలి ‘ అనే నియమం ఏమీలేదు.  అది ప్రతి ఇంటిలో దాదాపుగా మనం చూస్తూనే  ఉంటాము.    దానికి కారణం వారివారి సంచిత పాపపుణ్య కర్మలే. 

సత్వగుణంలో నిర్మలత్వం కలిసినప్పుడు అది మాయ అనీ,  సత్వగుణం మాలిన్యంతో కూడినప్పుడు అది అవిద్య అని చెబుతారు.   సత్వగుణం,  రజస్తమో గుణాలతో చేరకుండా,  తద్వారా, జీవుని అలజడి పెట్టకుండా ఉండడమే, సత్వగుణ నైర్మల్యం.   వేరొక ప్రక్క, సత్వగుణం, రజస్తమో గుణాలతోచేరి,  సత్వగుణం మరుగున పడడమే సత్వగుణ మాలిన్యం.   

హిందూశాస్త్రాల ప్రకారం, కామక్రోధాలు అనేవి మన జీవితాలలో జరిగిన, జరుగుతున్న అనేక అనుభవాలకు ప్రతీకలని, వాటి నియంత్రణ బాధ్యత, వ్యక్తి జీవన విధానం వలన ఎప్పటికప్పుడు మారే అంశాలు, అని తెలుస్తుంది.  

ఉదాహరణకు,  ఒక వ్యక్తి వయసు పెరుగుతున్న కొద్దీ,  కుటుంబబాధ్యతల నుండి విముక్తుడు అవుతున్నకొద్దీ,  అతని ఆలోచనా దృక్పధం మారుతూ ఉంటుంది.  

అదే విధంగా ధన సంబంధమైన విషయాలలో, ధనం సంపాదించవలెనన్న కోరిక, ధనమును జాగ్రత్తగా దాచుకోవాలనే ఆలోచన, వ్యక్తి కుటుంబ, సామాజిక పరిస్థితుల వలన కూడా మారుతూ ఉంటుంది.   దానినే ‘ మానసిక పరిపక్వత ‘ అంటారు.    

అది ఎవరికి వారు తెలుసుకుని, బేరీజు వేసుకోవలసిన  అంశమే కానీ, చుట్టుప్రక్కల వారు చెప్పగలిగే విషయము కాదు. 

అదే విధంగా, మదమాత్సర్యాలు కూడా.   దురహంకారం,  స్వార్ధ పూరిత ఆలోచనలు వ్యక్తి నడవడికి కారణం అవుతూ ఉంటాయి.   కొన్ని సమయాలలో లౌక్యం,  ద్వంద ప్రవ్రుత్తి,  ' మనవారు '  ' పరాయి వారు '  అనే దృక్పథానికి దారి తీస్తుంది.  

అందుకనే,  ఈ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనే చెడు ప్రవృత్తులను  ' ఇంటి దొంగలు ' గా అభివర్ణిస్తారు.    అంటే ఏమిటీ !  అవి వున్నాయి అని తెలిసినా, వాటిని చెడు విషయాలుగా గుర్తించరు ప్రాజ్ఞులు కూడా.   ‘ ఆ సమయంలో అలానే ప్రవర్తించాలి ‘. అనే ధోరణిలోనే వుంటారు.  వారి నడవడిని సమర్ధించుకుంటారు.   ఆ సమయంలో వ్యక్తి ఆధ్యాత్మిక సంపద, ఈ ఇంటిదొంగల వలన కొల్లగొట్టబడుతుంది.  దాని కారణంగా వారి విజ్ఞానం, సహజ మానసిక ప్రవృత్తి, అణగద్రొక్కబడుతుంది.  

ఏ వ్యక్తి అయితే, అరిషడ్వార్గాలకు బందీ అయిఉంటాడో,  అతని జీవితం పూర్తిగా తెగిన గాలిపటం లాగా ఉంటుంది.   అనగా, సంఘంలో కొన్ని సమయాలలో మంచివాడుగా ముద్ర పడవచ్చు,   మరి కొన్ని సమయాలలో విమర్శల పాలు కావచ్చు.   

నిదానంగా, కొంతకాలానికి ఆవ్యక్తి,  ఆత్మ సాక్షాత్కారం పొందడం ప్రారంభమైనప్పుడు,  ఈ అరిషడ్వార్గాల పట్టు,  వ్యక్తి జీవితం మీద సడలడం ప్రారంభిస్తుంది.   ప్రముఖ వ్యక్తులు కూడా, ఈ అరిషడ్వార్గాల పట్టువిడుపులతో సంబంధం లేకుండా,  తమ వృత్తి వ్యాపారాలు నిర్వహించుకుంటూనే వుంటారు.   అప్పటిదాకా,  తాను పొందిన విజ్ఞానం ఇతరులకు పంచడం  జరుగుతూనే ఉంటుంది.   అతనుచెప్పే,  ఆ నాలుగు మంచిమాటలు, సత్సంగ ప్రభావం,  అతని ఆత్మ సాక్షాత్కారానికి దోహదం చేస్తూ ఉంటాయి.

అందుకనే గొప్ప గొప్ప ప్రవచన కర్తలు, వారు చెప్పే ఆధ్యాత్మిక విషయాలు, ఇతరుల కోసం చెబుతున్నట్లుగా భావించరు. ‘ మరియొకసారి మననం చేసుకుంటున్నాము ‘ అని భావిస్తారు. అది వారి వ్యక్తిగత జీవితాన్ని తప్పక మారుస్తుంది. కనకవర్షం వారిపై కురిసినా అది తృణప్రాయంగా, వారికీ అనిపిస్తుంది. ఆ సంకల్పమే వారిని ఆ ఒడ్డుకు చేరుస్తుంది.

కాబట్టి, సారాంశం ఏమిటంటే, వారివారి వ్యక్తిగత వాసనలు వారికి వదిలేసి, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తలు, ప్రవచనకర్తలు చెప్పే, నాలుగు మంచిముక్కలు విందాం. చెప్పినవి పాటిద్దాం. అప్పటిదాకా, అదుగో ఆయన ఆటోవాడితో లోభత్వంతో బేరమాడతాడనీ, ఫలానా కూరో, పప్పో, మళ్ళీ మళ్ళీ వేయించుకుని తింటాడనీ, జిహ్వ చాపల్యం ఎక్కువనీ, అడిగినంత డబ్బు ఇవ్వకపోతే, ప్రవచనానికి రాడనీ, అలాంటి వారి వ్యక్తిగత విషయాలలోకి తొంగి చూడకుండా వుండడమే, మనం వారి విద్వత్తుకు ఇచ్చే గౌరవం...

No comments:

Post a Comment