ఓం నమో భగవతే శ్రీ రమణాయ
అధ్యాయము 35
భగవాన్ ఉవాచ తరువాయి భాగం
భగవాన్ ఉవాచ అంటేనే సాక్షాత్ భగవాన్ రమణ మహర్షి వారి నోటి నుండి వెలువడిన అమృత తుల్యములై నటువంటి ప్రవచనం అమృతము మరెక్కడో దొరకదు . మహా పురుషుల ప్రవచనాన్ని శ్రద్ధగా విని పాటించుట మన ధర్మము . ధర్మాన్ని పాటించిన వాళ్ళందరూ అమృతాన్ని త్రాగినట్లే అమరజీవులుగా ఉన్నట్లే .
భగవాన్ సందేహాలు గురించి కొన్ని విషయాలు చెప్పారు . సందేహం ఎవరికైనా కలిగినప్పుడు ఆ సందేహాన్ని నివృత్తి చేయటానికి ప్రయత్నించక ఆ సందేహం ఎవరికి కలిగిందో తెలుసుకోమనేవారు . దృఢ నిశ్చయ ఆత్మలోనికి చొచ్చుకొని పొమ్మనేవారు . ఆ విధముగా చేయగా చేయగా మనస్సనేది మాయమై ఆత్మ ఒక్కటే మిగులును . అనగా మనస్సే ఆత్మగా మారిపోయిందని దాని అర్థం . కావున *మనస్సుకు ఆలోచనలను కలిగించే శక్తి ఉన్నదని గ్రహించవలెను* . ఈ ఆలోచనలను కొనసాగించకుండా ఆత్మలో చొచ్చుకొనిపోయే కార్యము కొనసాగుతునే ఉండవలెను . ఒక ఆలోచన వచ్చిన వెంటనే దానిని ధ్వంసము చేయవలెను . అనగా దాని జనన స్థానములోనే ధ్వంసము చేయవలెను . ఆ ఆలోచన పెరగకుండానే తుదిలోనే నరకమని దాని భావన . ఇలా ఆత్మ సాక్షాత్కారమయ్యే వరకు ఈ విధముగా చింతిన చేస్తూనే నిత్యము ఆత్మ గురించి తప్ప మరి ఏ ఇతర విషయముల పై ధ్యాస నిలువకూడదు . *ఆలోచనలను జనన స్థానములో నశింప చేయుటయే వైరాగ్యమని* సూచించారు భగవాన్ .
భగవాన్ భగవంతునికి ఏ సంకల్పము ఉండదని ఏ కార్యము అతనికి సంబంధించినది కాదని ప్రపంచములో ఏది జరిగినను ఆయనను ప్రభావితము చేయదని భగవాన్ సూచించారు . కేవలం సాక్షీభూతునిగా ఉంటాడని చెప్పేవారు . భగవంతుడే సృష్టి స్థితి మరియు లయకారకుడైనను *ఏ కార్యాలైనా ఎటువంటి సంకల్పముతోను మరియు ఒక ప్రయోజనము కొరకు భగవంతుడు చేయడు* . కానీ సామాన్య జీవులకు మాత్రం వాటి ప్రభావము ఆ జీవులపై ఉంటుందని భగవంతుడు నిర్ణయించిన ప్రకారము అనగా కర్మలననుసరించి ఫలితాలు జీవులవేగాని భగవంతునివికావు . ఆ కార్యాలకు భగవంతుడు బాధ్యుడుకాడు మరియు వాటి ప్రభావం ఆ భగవంతునిపై పడదని భగవాన్ చెప్పారు .
భగవాన్ రమణ మహర్షి గారు సాక్షాత్కారము గురించి విపులముగా వివరించారు . సామాన్యముగా సాక్షాత్కారమంటే దేవుడు మనముందు ప్రత్యక్షమవటం అని అనుకుంటాము . అంటే భగవంతుని దర్శించటమే సాక్షాత్కారమనే భావన . సామాన్యమైన మనము ఒక్కొక్కసారి దేవుడు ప్రత్యక్షం కాకపోయినా పరోక్షంగా దేవుడు వ్యవహరిస్తాడని అనుకుంటూ ఉంటాము . అదీ తప్పేనని భగవాన్ చెప్పేవారు . *భగవాన్ చెప్పినది ఏమనగా జీవన జ్యోతి మనిషిలో అతని చేష్టల ద్వారా వ్యక్తమవుతుందని ఆ జ్యోతి వల్ల ప్రభావితమైనప్పుడు ఎన్నో రకములైన చేష్టలు బైటపడతాయని చెప్పేవారు* . ఉదాహరణకు ఒక దీపం ఎదుట రంగుల గాజు పెంకు పెట్టినచో తెరమీద రంగుల బొమ్మలు కనిపించునట్లు . దీనిని బట్టి భగవాన్ చెప్పినది మనస్సనేది తెరవంటిదని ఆ తెరపై కాంతి మార్పుచెంది అతనికి భగవంతునికి కాంతికి నడుమ ప్రాపంచిక విషయాలు అడ్డుపడడం వల్ల మనస్సనుతెరపై స్వచ్ఛమైన కాంతి మార్పుచెంది ఆ కాంతి తగ్గుతుందని సూచించారు . తెరపై అనేక రంగులు పడునట్లు మనస్సుపై ఫలితాలు పడతాయని కావున ధృశ్యమానమైన ప్రపంచాన్ని తొలగిస్తే కనిపించేది ఒక జ్యోతి ! అదే భగవంతుడని సూచించారు . కావున మనకు సందేహాలను కలిగించి మన మనస్సు ఊహించే ఆ ప్రపంచాన్ని తొలగిస్తే భగవంతుడనే జ్యోతే ప్రకాశిస్తుందని ఆ ప్రపంచాన్ని తీసివేయటానికి ఒక చిన్న చిట్కా కూడా భగవాన్ చెప్పారు . *మన కళ్ళ ఎదుట ఎవరైనా కనిపించినపుడు అతనిని మనిషి అని అనుకోకుండా దేహధారి అయిన భగవంతుడని అనుకోమన్నారు భగవాన్* .
భగవాన్ ఆరాధనను గురించి ఉత్తమమైన మార్గము చెప్పారు . సర్వస్వాన్ని భగవంతునికి అంకితం చేయటం వల్ల బుద్ధిపూర్వకంగా కాని మరి ఏ ఇతరమైనటువంటి విగా కాని చేసే పత్రి కార్యము ఆలోచన భగవంతుని ప్రేరణ వలననే అని భావించమన్నారు . *అసలైన ఆరాధనంటే ఇదే తప్ప ప్రత్యేకమైన ప్రార్ధనలు అవసరం లేదని భగవాన్ సూచించారు* .
కావున భగవాన్ నీవు స్వయం ప్రకాశమౌ ఆత్మవని నీవే సత్యమని , తేజమని , హృదయ కేంద్రమని , శక్తివని ఆ శక్తిని వేరుగా ఏమీ లేదని అదే మనస్సుని కల్పిస్తుందని ప్రారబ్దాన్ననుసరించి వృత్తులు ఉదయిస్తాయని అదే మనస్సుపై నీకాంతి పడగానే వృత్తులన్ని మహా ప్రపంచముగా సాక్షాత్కరిస్తాయని అవి తెరపై బొమ్మలవలె కన్పిస్తాయని చెప్పారు . మొదట పుట్టిన భావం నేను , తరువాత నీవు , వాడు , అది మొదలగునవి వస్తాయి . ఇవన్ని ఎవరికి వస్తున్నాయని ప్రశ్నిస్తే ' నాకు ' అనే జవాబు వస్తుంది . వెంటనే ఎవరు నేను ? ఎక్కడీ నేను ? అని అన్వేషించాలి . అలా అన్వేషణ చేయగా మూలస్థానమైన హృదయాన్ని చేరుకుంటామని ఆ మూలాన్ని చేరుకున్నవారికి ముక్తి సిద్ధించినట్లని అక్కడ ద్వంద్వాలైన సుఖదుఃఖాలు , పాప పుణ్యాలు అన్ని పోయి నీ దివ్య తేజస్సుముందు ఉన్న అన్ని భ్రమలు కూడా నశిస్తాయని భగవాన్ సూచించారు .
కావున మనకు కలిగే సందేహాలను నివృత్తి చేయుటకు , భగవంతుడు సాక్షీభూతుడనే విషయాన్ని గమనించి మనము కర్మలను భగవత్ అర్పితము చేసి కార్యఫలితాలను ఆశించకుండా ఉంటూ ఆ ధైర్యాన్ని ప్రసాదించుటకు , సందేహాల వల్ల ఊహించే మన మనస్సు కల్పించే ప్రపంచాన్ని మన నుండి తొలగించటానికి మన జీవన జ్యోతియే భగవంతుడని ఆ జ్యోతియే సాక్షాత్కారమని తెలుసుకొనుటకు , ప్రతి కార్యము భగవంతుని ప్రేరణవల్ల జరుగుతుందని నిశ్చయము కలుగుటకు మరియు ఆరాధన అంటే ఏమిటో తెలుసుకొనుటకు మనమే స్వయంప్రకాశకులము , ఆత్మ , తేజము , శక్తి , సత్యము మొదలగునవి అని గ్రహించుటకు కావలసిన దృఢ సంకల్పము , ధైర్యము , శక్తి , స్థిరత్వము కలుగుటకు భగవాన్ చరణాలకు నమస్కరిస్తూ సర్వశ్యశరణాగతి వేడుతూ వారి సంపూర్ణ ఆశీర్వచనములను తీసుకొనుటకు జ్ఞానులుగా మారుటకు శరణు వేడుదాం .
భగవాన్ నీవే మాకు శరణాగతి .
🙇♂️అరుణాచల శివ 🌹
No comments:
Post a Comment