ఓం నమో భగవతే శ్రీ రమణాయ
అధ్యాయము 36
భగవాన్ ఉవాచ తరువాయి భాగం
భగవాన్ నిజమైన మానవుడు ఎవరో అని చెప్పుటకు *ఎవరైతే నిరంతరము ప్రపంచములో తను కృషి చేసుకుంటూ ఏ కోరికలు ఉండకుండా ఆత్మస్ఫూర్తిలో నిమగ్నుడై ఉంటాడో అతడే నిజమైన మానవుడు అని భగవాన్ చెప్పారు . పైగా మానవుడే అసలైన సత్య స్వరూపుడని అది తెలుసుకోమని భగవాన్ సూచిస్తూ ఉండేవారు . కొందరు దైవాన్ని దర్శించుకోవాలని ప్రయత్నిస్తారని అది అవివేకమని ఎందుకంటే చూచే తనను చూడక భగవంతుణ్ణి దర్శించుకోవడం అది అవివేకముకాక మరేమౌతుంది అనేవారు భగవాన్ . తనను చూచేవాడు దైవాన్ని చూసేవాడు . మిగిలినవన్నీ మానసికమైన దర్శనాలే* అని భగవాన్ చెప్పారు . మానవుడు తన మూలాన్ని అనగా తను పుట్టినచోటును చూసినపుడు చూచే తాను మిగలడని అనగా అదృశ్యమౌతాడని అప్పుడు చూశానని , చూడలేదని చెప్పటానికి ఇక ఎవరు ఉంటారని భగవాన్ అనేవారు . భగవాన్ మరియొక సూచన ప్రతీవారికి ఇచ్చారు . అది ఏమనగా ప్రతివారు ఒక పనిచేయటానికే ఈ భూమి మీదకు వచ్చారు . “ *నీవు ఇష్టమున్నా ఇష్టము లేకపోయినా నీకు విధించబడిన పనిని భగవంతుడు నీచేత బలవంతముగా చేయించి తీరుతాడు” అని భగవాన్ చెప్పారు*.
ఒకరు భగవాను కర్మయోగము గురించి ప్రస్తావించినపుడు “* తాను కర్తను కాదని తెలుసుకోవటమే కర్మయోగమని* ” భగవాన్ జవాబు చెప్పారు . ఐతే కర్తలేనిచో కర్మ జరిగేదెలా అని తిరిగి ప్రశ్నించినపుడు భగవాన్ “ *అహంకారములేని స్థితిలో కర్మ దానంతటికి అదే సాగిపోతుందని కావున నేను ఇది చేస్తాను , అది చెయ్యను అని ముందుగా నిర్ణయించుకోవద్దని ” భగవాన్ సూచించారు* .
భగవాన్ మరియొక రహస్యాన్ని చెప్పారు . ఎవరైనా మనల్ని దూషిస్తే బాధపడుట సహజం . అటువంటి స్థితిలో ఏమిటి ఉపాయం అని అన్నదానికి భగవాన్ ఇచ్చిన జవాబు “ *ఎవరైతే మనల్ని దూషించునో వాడే నిజానికి మన మిత్రుడు . ఎందుకంటే ఆ దూషించేవాడు దూషించునది ఆత్మజ్ఞానం విరోధియగు మన దేహాన్ని మాత్రమే . కావున నిజంగా మనం జాగ్రత్త పడవలసినది మనల్ని పోగుడుతున్నవారి గురించి* . "
భగవాన్ ఆత్మనుండి మొట్టమొదట నేను అనే తలంపు పుడుతుందని అది పుట్టగనే తల్లిని ( ఆత్మని ) మరచి శరీరమే తాను అనుకుంటుందని కనుక *భగవాన్ చమత్కారముగా నేను పుడుతూనే తల్లిని ( ఆత్మను ) హత్య చేస్తోంది* . ఈ నేనును భక్తితో తల్లిపాదాల ముందు అర్పిస్తే ఆ జగజ్జనని నీలోనుండి వెలుగుతుందని కావున భగవాన్ సూచించినది ఏమనగా దేహమే తానని అనుకున్న ప్రతివారు తల్లిని చంపినవారే కావున ' నేనును ' చంపినవాడే తల్లిని బ్రతికించినవాడని భగవాన్ చెప్పారు .
భగవాన్ మౌనానికి దానికి వ్యతిరేకమైన ఉపన్యాసానికి భేదం చెప్పారు . *ఉపన్యాసం కొందరికి మార్పును అది కూడా తాత్కాలికంగానే ఇస్తుందని కాని మౌనమనేది అందరికి శాశ్వతమైన పరివర్తనాన్ని అనుగ్రహిస్తుందని భగవాన్ చెప్పారు* .
మరియొకరు భగవాన్ ని ' నేనెవరిని ' అని విచారించేందుకు మన కర్మలను సన్యసించవలెను అని ప్రశ్నించగా భగవాన్ అసలు సన్యాసమంటే ఏమిటి అని ప్రశ్నించారు . *కూర్చొనుట , లేవడం , తిరుగుట , తినడం ఈ లెక్కన ఇవన్ని కర్మలే ఔతాయి కదా అని భగవాన్ ప్రశ్నించారు . మరి వీటన్నిటిలో దేన్ని విడుస్తారు ? అని చెప్పి భగవాన్ ఒక రహస్యాన్ని చెప్పారు . నేను కర్తననే అహంభావం విడువమన్నారు భగవాన్* .
మరియొక భక్తుడు ఒక్కొక్కసారి లౌకిక జీవనంలో “ ఇది నాది " అని అనవలసి వస్తుందని మరి దానికి ఏమిటి పరిష్కారమని భగవాన్ని ప్రశ్నించాడు . భగవాన్ అలా అన్నంత మాత్రాన అన్ని నేను అనుకుని భేదమోదాలు చెందవలసిన పనిలేదన్నారు . ఉదాహరణకు ఒక బండిలో ప్రయాణించినంత మాత్రాన ఆ బండి నేనని అనుకోము కదా . అలాగే సూర్యుడు నీళ్ళ కుండలోను , నదిలోను , దర్పణములోను అన్నిట్లో ప్రతిబింబిస్తాడు . అన్నంతమాత్రమున అవన్ని తాను అనుకోడు కదా . అవి భిన్నమైనప్పుడే చింతిస్తాడు . మనము కూడా అంతేనని నేను దేహాన్ని కాదని అనుకుంటే సూర్యుడు వలె ప్రకాశిస్తూ ఉంటాడని భగవాన్ చెప్పారు .
మరియొక భక్తుడు నేను ఈ శరీరాన్ని ఎలా పొందానని ప్రశ్నించగా భగవాన్ “ నేను శరీరమని అనటం వల్ల నేను వేరు శరీరం వేరు అన్న అర్ధం వస్తుందని నిజానికి ఈ ప్రశ్న శరీరానికి మటుకురాదని ఎందుకంటే శరీరం జడమని చెప్పారు భగవాన్ . అదే నిద్రలో శరీరం ఎటువంటి స్పృహ ఉండకపోవుటచే ఈ ప్రశ్న రాదని కనుక మరెవరికి ఈ ప్రశ్న కలుగుతుందని ఆ కలిగేది అహంకారానికని కావున శరీరము అహంకారము ఒకేసారి పుడుతున్నాయని అవి రెండు ఒకేసారి అణుగుతున్నాయని *నిజానికి ఈ అహంకారం శరీరానికి ఆత్మకు మధ్యగ పుడుతుందని అది ఎక్కడినుండి పుట్టుక వస్తుందో అన్వేషించమని భగవాన్ చెప్పారు* .
మరియొక భక్తుడు భగవాన్ ని హృదయాన్ని ఎలా గుర్తించటమని ప్రశ్నించగా భగవాన్ “ నీవు ఆత్మకన్న భిన్నంగా ఉన్నావా ? *నీవు ఆత్మవే . ఆత్మయే హృదయం* అని జవాబు చెప్పారు . నిద్రలో నీ వున్నప్పుడు ప్రపంచము తోచకపోవటం అదే జాగృత్ లో ఉన్నపుడు ప్రపంచం తోచటం జరుగుతుందని కావున ఇలా మనస్సులో ప్రపంచం ఒకసారి లేస్తు మరియొకసారి అణిగేది నిజమైన ఆత్మకాదని భగవాన్ సూచించారు . నిజానికి *ఆత్మలోనే మనస్సు పుట్టి పెరిగి లయిస్తుందని కావున ఆత్మే మూలమని చెప్పారు భగవాన్ . హృదయం తెలియని వారెవరు లేరన్నారు భగవాన్* . ఎందుకంటే మనం ఎవరినైనా ప్రశ్నిస్తే నీవెవరివని అన్న వెంటనే దేహానికి కుడివైపున చూపుతూ ' నేను ' అంటావు . ఆ కుడివైపున ఉన్నదే హృదయ స్థానం . దేహాన్ని మనస్సును ఆత్మగా భ్రమించిన వారికి దుఃఖము తప్పదన్నారు భగవాన్ . *నిజానికి మనస్సు అంటేనే సంకల్పాని ఆ సంకల్పాలలో నేను అనేదే ప్రథమ సంకల్పమని ఆ సంకల్పాలను వేరుచేసి అంతర్ముఖం చేస్తే మనస్సు తన మూలమైన ఆత్మతో కలిసి ఆత్మే అయిపోతుందన్నారు భగవాన్* .
ఎన్నిసార్లు ఎన్నో విధాలుగా ఆత్మను గురించి అనర్గళముగా అర్థమయ్యేటట్లు ఉదాహరణలతో సహా భగవాన్ ఆత్మను గురించి చెప్పినప్పటికి మళ్ళీ ఒక భక్తుడు ఆత్మ అంటే ఏమిటి ? అని ప్రశ్నింపగా భగవాన్ ఇలా చెప్పారు . “ *నిజానికి ఆత్మ ప్రతివారికి అనుభవమే . కాని అది స్పష్టముగా తెలియటం లేదు . నీవు ఉన్నావు కదా ? ఆ ఉండుట అనేదే ఆత్మ ' నేను ' అనేది భగవంతుని మొదటి నామం . ఈ ఆత్మే భగవంతుడు . ఆత్మను తెలుసుకుంటే భగవంతుని తెలుసుకోవచ్చు . అసలు నిజమేమిటంటే ఆత్మను విడిచి భగవంతుడు లేడు* ” అని అనగా మరియొక భక్తుడు ఆత్మను పొందటానికి సన్యసించాలా అని ప్రశ్నించగా భగవాన్ సన్యాసం అంటే వదలటమని అర్ధం . కావున ఆత్మను విడిచి ఎప్పుడైనా నీవు ఉన్నవా ? ఇక సన్యాసం అంటే వదలటం ఎక్కడ కావున ఒక్కసారి దైవానుగ్రహం పట్టినవానికి ఇక వదలదని ఆత్మ దర్శనం చేయిస్తుందని భగవాన్ చెప్పారు .
ఇలా చెప్తూ భగవాన్ ఆత్మను గూర్చి ఈ విధంగా ముగించారు . “ ఆత్మ ఎక్కడ ఉన్నది అంటూ ఆందోళన చెందేవారు ఎందరో ఉన్నారు . వారికి నేనేం చెప్పేది . *ఉన్నదే ఆత్మ . అది అంతా నిండి ఉంది . దాన్నే హృదయమని* అంటారని చెప్పినా కూడా కొందరు నా హృదయంలో నేను నిలకడగా ఉండేందుకు స్థలం లేదని ఏం చెయ్యాలని ప్రశ్నిస్తారు *లేనిపోని వాసనలతో తన హృదయాన్ని ( మనస్సు ) నింపుకొని స్థలం లేదంటే ఆ వాసనలను తీసిపారేస్తే స్థలం ఎందుకుండదు . అంతా స్థలమే . అంతా ఆత్మే . ఇక తానంటూవేరుగా ఉండడు . ఇంక స్థలమెక్కడ ? ఉండేదెవరు* ?
భగవాన్ చెప్పిన అమూల్యమైన రహస్యాలు ఆత్మ అనే దాని గురించి అనర్గళముగా ప్రతికోణము నుండి అర్థమయ్యే విధముగా ప్రతివారికి ఉదాహరణలతో చెప్పారు . ఇక మనము ప్రత్యేకముగా ఆత్మను గురించి మన సొంత తెలివి తేటలతో వెతుకుట అనవసరం భగవాన్ చూపిన మార్గము గ్రహించి వారి బోధలు అనునిత్యము స్మరించి బాగా జీర్ణించుకొని వారి అడుగు జాడల వెంబడి నడిచిన చివరికి చిమ్మచీకటిలోనైనను వారు నేర్పిన బోధలు ఆ మార్గములో ఆ చీకటిలో కూడా వారి అడుగు జాడలను గుర్తుపట్టులాగా మనమందరము కృషిచేసి ఆ అతీతమైన శక్తి స్వరూపుడు అనంత జ్ఞానము కల్గిన ఆ మహాపురుషుని స్మరిస్తూ ధ్యానిస్తూ మనకి కూడా ఆ శక్తి రావాలని మనసా వాచా కర్మేణా భగవాన్ రమణ మహర్షుల వారిని శరణు వేడుకుందాం .
ఓ రమణా , శ్రీ రమణా , జయ రమణా , గురుదేవ రమణా ,
ఆత్మా రమణా నీవే మాకు శరణాగతి .
అరుణాచల శివ
No comments:
Post a Comment