Sunday, August 20, 2023

బుజ్జి కథలు* *10. తనదాకా వస్తే...

 *బుజ్జి కథలు*



*10. తనదాకా వస్తే...*


     రాజయ్య వ్యాపారస్థుడు. దేవుని మీద నమ్మకం వున్నవాడు.  ఈ యాడాది వ్యాపారంలో బాగా లాభం వస్తే  లాభంలో పది శాతం హుండీలో వేస్తానని,  కాలినడకన కొండపైకి వచ్చి కొబ్బరికాయ కొడతానని మొక్కున్నాడు.  ఆ యాడాది ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా వ్యాపారం చక్కగా సాగించి. అనుకున్న దానికన్నా ఎక్కువ లాభం వచ్చింది. మొక్కుకున్నట్టుగానే పది శాతం లాభం మూటకట్టి  కొండ పైనున్న దేవుని వద్దకు కాలినడకన బయలుదేరాడు. 
        బయలు దేరేటప్పుడు  ఇంటిపక్కనున్న కొండయ్యకు గుండెపోటు వచ్చింది. కొండయ్య భార్య  ఆతృతగా రాజయ్యదగ్గరికి   వెళ్లి  "అన్నయ్యా! ఆయన పరిస్థితి బాగాలేదు. వెంటనే ఆసుపత్రికి తీసుకుపోవాలి. బయటకు వెళ్లి బంధువులను కలుసుకునే వ్యవధి లేదు. కొంత డబ్బు సర్దుబాటు చేస్తే వెంటనే   తీరుస్తాను" అన్నది.
    "అమ్మా! నేను కొండకు వెళుతున్నాను. మొక్కు తీర్చుకుని వచ్చాక సర్దుబాటు చేస్తాను" అన్నాడు. ఏమిచేయాలో పాలుపోక ఆమె వెళ్ళిపోయింది.  
     రాజయ్య కొండ వద్దకు వెళ్ళాడు. కొండ కింద  ఏదో అలికిడి. వెళ్లి చూశాడు. ఎక్కడినుండో వచ్చిన ఓ  యాత్రికుని దొంగలు  కొట్టి, బాగా గాయపరచి,డబ్బులు దోచుకుని వెళ్లారు. అతడు చావు బతుకులమధ్య వున్నాడు. అందరూ ఆయనను చూస్తున్నారు. ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించాలని ఎవరూ అనుకోవటంలేదు. ఆసుపత్రికి తీసుకువెళితే ఖర్చు అవుతుంది. ఎందుకు భరించాలి? అని ఎవరికి వారు భావించి ఆ ప్రయత్నం మానుకున్నారు. రాజయ్య కూడా అతడిని చూసాడు. నా కెందుకులే అనుకున్నాడు.
      కొండపైకి ఎక్కాడు. దైవదర్శనం చేసుకున్నాడు. మూట కట్టిన  ముడుపు డబ్బు హుండీలో వేసాడు. మొక్కు చెల్లించుకున్నాడు. తిరుగు ముఖం పట్టాడు. ఇంటి వద్దకు వచ్చాడు. ఇంటి ముందు జనం గుమికూడి వున్నారు. ఆతృతగా ఇంటిలోకి వెళ్ళాడు. అతడి ఏకైక కుమారుడు చావు బతుకుల మధ్య వున్నాడు.  మోటారు సైకిల్ పై వస్తుంటే ఎదురుగా వస్తున్న లారీ ఢీకుందట. ఆపస్మారకస్థితిలోకి వెళ్ళాడు. ఆసుపత్రికి తీసుకువెళ్ళేవారులేక ఆచేతనంగా పడి వున్నాడు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. రాజయ్య భార్యకు కాళ్ళు చేతులు ఆడక రాజయ్య కోసం ఎదురు చూస్తూ ఉంది. రాజయ్య రాగానే అంబులెన్స్ పిలిపించి ఎక్కించారు. ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు పరీక్షించి. "ఆలస్యం చేయకుండా తీసుకువచ్చి ఉంటే బాగుండేది. చాలా రక్తం పోయింది. మా ప్రయత్నం మేం చేస్తాం" అన్నారు. చాలా డబ్బులు ఖర్చు చేశారు. అయినా ప్రయోజనం లేదు. రాజయ్య కుమారుడు చనిపోయాడు. అలాగే ఇంటి ప్రక్కన ఉన్న కొండయ్య కూడా సకాలానికి వైద్యం అందక గుండె పోటుతో చనిపోయాడు.
      అప్పుడు తెలుసుకున్నాడు రాజయ్య. కొండపైన దేవునికి ముడుపులు చెల్లించటం కన్నా అపదలోవున్నవారిని వెంటనే అదుకుంటేనే ఆ మొక్కుకు సార్ధకత చేకూరుతుందని.
     *౼ డా.దార్ల బుజ్జిబాబు*

No comments:

Post a Comment