*ఆదివారం కవిత*
________________
*నిండిన మనసు*
****************
ఓ మనిషి
తన పెంపుడు గుర్రంతో
మాపుల నడకకై
అలా ఊరు విడిచి ప్రకృతి ఒడిలోకి
సరదాగా పయనిస్తున్నాడు
పరిసరాలు గమనిస్తున్నాడు
గుర్రానికి బలే ఆనందం
మనసంతా మహా ఆనందం
బందిఖానా లాంటి ఇంటిని
మనుషుల్ని విడిచి ఇలా
ప్రకృతి పరిసరాలకు షికారు రావడం
గుర్రానికి సంతోషదాయకం
చుట్టూరా కొండకోనలు
పచ్చని పచ్చిక బయల్లు
అక్కడక్కడ పిల్ల కాలువలు
దారి పొడవునా దేవదారి చెట్లు
అటు నక్కేరు కాయలు
ఇటు నేరేడు కాయలు
అటు అడవి మల్లెపూలు
ఇటు చిలక దుద్ధి పూలు
చల్లని పిల్ల గాలులు
పిట్టల కిచకిచలు
గుర్రం అన్ని ఆస్వాదిస్తుంది
మనసునానందిస్తుంది
వాక్కాయలు కొరుక్కుటుంది
అడవి దోసకాయలు తింటుంది
గడ్డి గుబురును తింటుంది
గుర్రం ప్రస్తుత స్థితిని స్వాగతించి
ఈ క్షణాన్ని ఆస్వాదిస్తుంది
రేపటి గురించి ఆలోచన లేదు
యజమాని నడుస్తూనే ఉన్నాడు
చుట్టూరా చూస్తూనే ఉన్నాడు
కాళ్లు మాత్రం నడుస్తున్నాయి
కనులు మాత్రం చూస్తున్నాయి
అతని మనసులో ఏదో దిగులు
రేపటి కోసం ఏదో గుబులు
రేపు ఉద్యోగపు ప్రణాళిక గురించి
తన ఇల్లాలి పుట్టింటి ప్రయాణం గురించి
తాను దాచిన డబ్బు కంపెనీ దివాలా గురించి
అమాంతంగా వేలు దాటిన కరెంటు బిల్లు గురించి
పెళ్లి కాని కూతురు గురించి
ప్రక్కింటి రాజారావు అప్పు గురించి
కొన్న భూమి ధరల గురించి
మనసంతా భౌతిక అంశాలపై
చుట్టూరా తిరుగుతూనే ఉంది
పరిసరాలను గమనించడం లేదు
ఒకటే ఆలోచన లోలో ఆవేదన
ఇది మనిషి పరిస్థితి ఇదే నేడు
మన మనసుల దుస్థితి
గుర్రం వర్తమానంలో ఉండి
ఆ క్షణాన్ని ఆస్వాదిస్తుంది
మనిషి మనసు వర్తమానంలో ఉండి
భవిష్యత్తు గురించి ఆలోచిస్తుoది
ప్రకృతిని చూసిన జంతువుకు
ఆనందం నిండిన మనసు
ప్రకృతిని చూసినా మనిషికి
ఆనందం నిండని మనసు
ఇదే భౌతిక మనసుకు
ఆధ్యాత్మిక మనసుకు
బేధం ఖేదం వాదం వేదం
..... ఓం శాంతి శాంతి శాంతిః....
*రాఘవ మాస్టారు కేదారి*
No comments:
Post a Comment