*💦భేతాళ కథలు💦*
*🌻 నిత్యయౌవనం🌻*
♦️పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి, చెట్టు పై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం వైపు నడవసాగాడు. అప్పుడు శవం లోని బేతాళుడు, రాజా, నువు అపూర్వ శక్తుల కోసం శ్రమిస్తున్నట్టున్నావు. అవి కొందరికి పుట్టుకతోనే కలుగుతాయి. ఆట వికులలో అలాంటి శక్తులు గలవారు అనేక మంది ఉన్నారు. కాని వాటివల్ల చివరకు నష్టమే కలుగుతుంది. నీకు శ్రమతెలియకుండా ఉండేందుకు ఒక అపూర్వ శక్తుల కథ చెబుతాను విను." అంటూ ఇలా చెప్పసాగాడు.
♦️దండకారణ్య ప్రాంతంలో ఉండే కోయలలో కొందరికి జన్మతః అపూర్వశక్తులు కలిగేవి. ఆ సంగతి బిడ్డపుట్టగానే తెలిసి పోయేది. మగబిడ్డకు పుట్టగానే దంతాలన్నీ వచ్చి ఉన్నా, ఆడపిల్ల నెత్తి మీద బొడిపె ఉన్నా అది అపూర్వశక్తులున్నట్టు గుర్తుగా ఉండేది, అటువంటి బిడ్డలను కన్న తల్లులు తమ బిడ్డల రహస్యాన్ని లోకానికి తెలియకుండా దాచేవారు. ఎందుకంటే వారి సమాజం అలాంటి బిడ్డలను చంపేసేది.
♦️ఒక కోయపిల్ల నెత్తి మీద బొడిపెతో పుట్టింది. ఆ పిల్ల పేరు ఇల. ఇల తల్లి ఈ రహస్యాన్ని చాలా చక్కగా దాచింది. ఇల పెద్దదై నెత్తి మీద జుట్టు బాగా పెరిగినాక బొడిపె రహస్యం దాచటం చాలా తేలిక అయింది. ఇల యుక్తవయస్కురాలైన దాకా ఆమెలోని అపూర్వశక్తులకు ఎలాంటి పనీ తగలలేదు.
♦️ఇల ఉండే అరణ్య ప్రాంతానికి సమీపంలోనే ఒక జమీందారీ ఉండేది. ఆ గ్రామంలోనే ఉపేంద్రుడనే ఒక కమ్మరి యువకుడుండేవాడు. వాడు చాలా అందగాడు, కాని బీదవాడు. గ్రామంలో పెళ్ళి కావలిసి ఉన్న పిల్లల్లో సగం మంది ఉపేంద్రుణ్ణి పెళ్ళాడాలని కలలు కనేవారు. ఇల వాణ్ణి మొదట చూసిన క్షణం నుంచీ చాలా గాఢంగా ప్రేమించి, వాడి కోసం ప్రాణాలు కూడా ధారపొయ్యటానికి సిద్ధపడింది.
♦️కాని 'ఉపేంద్రుడికి ఇల అంటే ఏమీ లక్ష్యం లేదు. నిజానికి వాడు ఎవరినీ నిజంగా ప్రేమించలేదు. ఎవతె అయినా డబ్బుతో వచ్చేది తనను పెళ్ళాడుతుందా అని వాడి ఆలోచన.
♦️ఒక రోజు ఏదో పండగ వచ్చింది. ప్రజ అందరూ సంబరం చేసుకుంటున్నారు. ఆ రోజు ఇల ఎక్కడికి వెళ్ళక, ఉపేంద్రుడు తన కోసం వస్తే బాగుండునని ధ్యానిస్తూ ఇంట్లోనే కూర్చుంది.
♦️రోజంతా గడిచిపోయింది. సూర్యాస్తమానమయింది. ఉపేంద్రుడు ఇల ఇంటి చాయలకైనా రాలేదు. వాడు గ్రామంలో గొప్పింటి పిల్లలతో కోలాటాలాడుతూ మహా ఆనందంలో ఉన్నాడు.
♦️ఇల తన ఇంట్లో ఏవో ముగ్గులు వేసింది. గుడ్డలు చించి పీలికలు చేసింది. మంత్రాలు చదివింది. ఉపేంద్రుడి పేరు ఉచ్చరిస్తూ, గుడ్డపీలికలలో ముడులు వేసింది. ఆ ముడులను ముగ్గులో అక్కడక్కడా పెట్టింది.
♦️కోలాటాలలో మునిగి ఉన్న ఉపేంద్రుడు అకస్మాత్తుగా కోలాటం కర్రలు అవతల పారేసి గ్రామం నుంచి బయలు చేరాడు. వాడి మెదడులో ఏ ఆలోచనా లేదు. వాడి కాళ్ళు అప్రయత్నంగా కోయ గూడెం కేసి నడుస్తూ, వాణ్ణి ఇల ఇంటి వద్దకు తెచ్చాయి. వాడు తలుపు తట్టగానే ఇల తలుపు తెరిచింది. ఇలను చూడగానే, చీకటిగా ఉన్న వాడి మనస్సులో వెయ్యి దీపాలు వెలిగినట్టయింది.
♦️మర్నాడే ఇలకూ, ఉపేంద్రుడికి పెళ్లి అయింది. ఉపేంద్రుడు ఆమెను తన ఇంటిక తెచ్చుకుని, వెర్రిగా ప్రేమిస్తూ, ఆమెతో కాపురం చేశాడు. అయిదేళ్ళలోనూ ఇల అయిదుగురు పిల్లలను కన్నది.
♦️ఉపేంద్రుడు తన భార్యలో గమనించిన చిత్రమేమిటంటే, ఒక్కొక్క కానుపు తోనూ ఆమె అందము, యౌవనమూ తరగటానికి బదులు హెచ్చుతున్నట్టు కనబడింది. ఇల పెళ్ళికూతురైన నాటి కన్న కూడా అయిదుగురు పిల్లల తల్లిగా మరింత నేపళంగానూ, ఆకర్షవంతంగానూ ఉన్నది.
♦️ఇది చూసి ఉపేంద్రుడు కొంచెం కలవరపడి తన తల్లితో ఈ మాట చెప్పాడు.
♦️"నీ భార్య ఒకవేళ మంత్రగత్తేమోరా! ఇలాంటిది భార్య కావటం మహా పాపం, నీకు, నీ పిల్లలకూ కూడా మంచిది కాదు," అన్నది ఉపేంద్రుడి తల్లి.
♦️ఇల మంత్రగత్తె అవునో కాదో ఎలా... తెలుస్తుంది?" అన్నాడు ఉపేంద్రుడు.
♦️'అది నిజంగా మంత్రగత్తె అయితే, అమావాస్య పర్వదినం అర్ధరాత్రివేళ ఏదో ఒక తాంత్రిక పూలు చెయ్యకుండా ఉండదు.
♦️ఈసారి అమావాస్య రాత్రి దానికి తెలియకుండా గమనించు," అన్నది తల్లి.
♦️ఆ తరువాత వచ్చిన అమావాస్యనాడు ఉపేంద్రుడు నిద్రపోతున్నట్టు నటిస్తూ, మేలుకునే ఉండి తన భార్య ఏం చేసేదీ గమనించాడు. ఇల అర్థరాత్రి వేళ లేచి, నిప్పు చేసి, పొయి మీద నీళ్ళకుండ పెట్టి, ఏవో మూలికలు తెచ్చి, మంత్రాలు చదువుతూ ఆ మూలికలను కుండలో వేసింది. ఇదంతా గమనించిన ఉపేంద్రుడు తాను చూసినదంతా తల్లికి చెప్పాడు.
♦️" అది నిశ్చయంగా మంత్రాలమారే దాన్ని వెంటనే చంపకపోతే నీకూ, నీ పిల్లలకూ ఘోరాలు తప్పవు. మాయలమారి దానికి సజీవదహనం తప్ప మరొక రకం చావు లేదు," అన్నది తల్లి.
♦️"నా పిల్లల తల్లిని చేజేతులా ఎలా చంపను?” అన్నాడు ఉపేంద్రుడు.
♦️"ఒక్క ప్రాణం కోసం చూస్తే, మిగిలిన ఆరు ప్రాణాల మాటా ఏమిటి? తప్పకుండా నువు నీ పెళ్ళాన్ని బూడిద చేసి తీరాలి." అన్నది తల్లి.
♦️తల్లితో చాలాసేపు వాదించిన మీదట ఉపేంద్రుడు తన భార్యను చంపటం తన విధి అని గ్రహించాడు. ఆతను ఇంటికి వచ్చి, తన ఇంటి ముందు చెట్టు కింద చితి పేర్చి, చెట్టు కొమ్మకు ఒక తాడు కట్టి, దానికి ఉచ్చు తయారుచేశాడు.
♦️ఇదంతా ఇంటి కిటికీలో నుంచి చూస్తున్న ఇల బయటకి వచ్చి, "ఏమిటిదంతా?"అని అడిగింది.
♦️"చెబుతాను, ఒకసారి ఇలా వచ్చి, ఈ కట్టెల మీదికి ఎక్కు" అన్నాడు ఉపేంద్రుడు,
9ఇల వచ్చి చితి మీద ఎక్కింది.
♦️ఉపేంద్రుడు ఆమె మెడకు ఉచ్చు తగిలించి, " నువు మంత్రగత్తెవు కనుక నిన్ను తగలేసి, నన్నూ, పిల్లలను రక్షించుకోబోతున్నాను," అన్నాడు. అతను కట్టెలకు నిప్పు అంటించి, చప్పున ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు.
♦️కట్టెల మంటలు తన బట్టలను అంటుకోగానే ఇల ఏదో మంత్రాలు చదివి, మాయమై, ఒక పువ్వుగా మారిపోయి, చెట్టుకొమ్మకు అంటుకు పోయింది.
♦️మర్నాడు ఉదయం జమీందారు గుర్రం మీద అటుగా వచ్చి, ఇటువంటి చెట్టు కొమ్మన అటువంటి పువ్వు పుయ్యటం విడ్డూరంగా ఉందే!" అనుకుని, ఆ పువ్వును కోసుకుని, ఇంటికి పోయి, దాన్ని నీటిలో పెట్టించి తన గదిలో ఉంచుకున్నాడు.
♦️ఈ జమీందారు వృద్ధుడు. ఆయనకు భార్యా, పిల్లలూ లేరు. వంటలక్క ఆయన గదికే భోజనం తెచ్చి పెట్టేది. తెచ్చిన భోజనంలో కొంచెం మాత్రమే ఆయన తిని పడుకుని కునుకు తీసేవాడు.
♦️ఆయన అలా నిద్రపోగానే నీటిలో నుంచి పువ్వు కిందికి దూకి, ఇలగా మారి ఆయన మిగిల్చిన భోజనమంతా తినేసి, మళ్ళీ పువ్వుగా మారి ఎగిరి, నీటిలో పడింది.
♦️వంటలక్క వచ్చి గిన్నెలన్నీ ఖాళీగా వుండటం చూసి, ఇందులో ఏదో రహస్యం ఉన్నదనుకున్నది. జమీందారు చేసిన వంటల్లో సగం కూడా ఏ నాడూ తినడు. ఆయన కోసం చేసిన వంటకాలన్నిటినీ వంటలక్కే ఆరగిస్తూ ఉండేది. కాని ఇవాళ ఆమెకు ఒక్క నలుసు కూడా మిగల్లేదు.
♦️రెండో పూట వంటలక్క చాటున పొంచి ఉండి, పువ్వు ఆడపిల్లగా మారి, జమీంచారు తినగా మిగిలినది భోజనం చెయ్యటం గమనించి, ఈ మాట జమీందారుకు చెప్పేసింది.
♦️మర్నాడు జమీందారు భోజనం చేసి నిద్రపోక కళ్లు అరమూసి పడుకుని ఇల భోజనం చేస్తూండగా పట్టుకున్నాడు. తప్పించుకోవటానికి ఇల ప్రయత్నించటంలో ఆమె జుట్టు జమీందారుకు చిక్కింది.
♦️నా జుట్టు వదలండి. చాలా బాధగా ఉన్నది," అన్నది ఇల
♦️"అలాగే వదులుతాను, కాని నువు పువ్వుగా మారటం మాని నాకు భార్యగా ఉండి పోవాలి," అన్నాడు జమీందారు.
♦️ఇల ఇందుకు ఒప్పుకోలేదు.
♦️జమీందారు ఆమె జుట్టు పట్టుకుని లాగి, ఆమె చేత సరే ననిపించాడు. జమీందారు భార్య కాగానే ఇల వంటలక్కను వెళ్ళగొట్టింది. వంటలక్క కోయవాళ్ళలో భూతవిద్యలు తెలిసిన వాళ్ళ దగ్గిరికి పోయి, జమీందారు కొత్త భార్య సంగతి చెప్పి, ఆమె మీద పగతీర్చుకునే ఉపాయం చెప్పమన్నది.
♦️జమీందారు భార్య మంత్రగత్తె అయి ఉండాలి. ఆమె నెత్తిన బొడిపె ఉంటుంది. ఆ బొడిపె మీది వెంట్రుకలు కత్తిరిస్తే మంత్రశక్తులు పోతాయి,” అని భూత విద్యలు తెలిసినవాళ్ళు చెప్పారు. కాని జమీందారు భార్యను పట్టుకుని ఆమె జుట్టు కత్తిరించే మార్గం ఏమిటో వంటలక్కకు తెలియలేదు.
♦️ఈ లోపల జమీందారు తన చిన్న భార్యకు అంతులేని అమూల్య వస్త్రాలూ, ఆభరణాలూ ఇచ్చాడు. ఆమె జమీందారుతో సహా బండిలో షికార్లకు పోతూ ఉండేది. ఒకనాడు ఆమె కమ్మరి అంటే ముందుగా పోతూండగా, ఆ ఇంటి ముందు మట్టిలో పొర్లిగింతలు పెట్టి ఆడుకుంటూ అయిదు గురు పిల్లలు కనిపించారు.
♦️ఇల వెంటనే బండిని ఆపించి, కిందికి దూకి వెళ్ళి, తన పిల్లలను ఎత్తుకుని, ముద్దాడింది. తన మేలివస్త్రాలు మట్టి అయిపోయినా ఆమె లక్ష్యపెట్టలేదు. ఆమె తమ తల్లే నని పిల్లలూ గుర్తించలేదు. కాని వాళ్ళు ఆమె మీదికి పాకి, ఆనందంతో కేరింతలు కొట్టసాగారు. వాళ్ళ కేకలు విని ఉపేంద్రుడు బయటికి వచ్చాడు. అతను కూడా ఇలను గుర్తించలేదు.
♦️" వీళ్ళు నీ పిల్లలేనా, కమ్మరి? వాళ్ళనిలా మట్టిలో పొర్లనివ్వటానికి నీకు సిగ్గు లేదా? చూడు, తిండి కూడా సరిగా లేక ఎలా బక్కచిక్కి ఉన్నారో!" అన్నది ఇల.
♦️పేదవాళ్లు, వాళ్ళకు ఏం తిండి పెట్టను?” అన్నాడు ఉపేంద్రుడు.
♦️"రేపు మా యింటికిరా, నీకు పని చెబుతాను, ముందుగా బయానా కింద ఇది ఉంచుకో," అంటూ ఇల తన భర్తకు బరువైన డబ్బుల సంచీ ఇచ్చింది. మర్నాడు ఉపేంద్రుడు జమీందారు ఇంటికి వెళ్ళాడు.
♦️"స్నానాల గదిలో చిన్న మరమ్మతు ఉన్నది. ముందు దాని సంగతి చూడు.” అంటూ ఇల అతన్ని స్నానాల గదికి తీసుకు పోయి, చూడు, మట్టికొట్టుకుని ఎలా ఉన్నావ్. ముందు స్నానం చేసి, మంచి బట్టలిస్తాను వేసుకో,” అన్నది.
♦️ఉపేంద్రుడికి అంతా అయోమయంగా ఉన్నది. అతను స్నానాల గదిలో స్నానం చేసి, మంచి బట్టలు వేసుకుని ఇవతలికి వచ్చాడు. ఇల ఇక నిగ్రహించుకోలేక అతన్ని కౌగలించుకుని, "నన్ను గుర్తించ లేదా? ఇలను!" అన్నది.
♦️అంతవరకూ ఉపేంద్రుడికి ఆమె మొహం కేసి సూటిగా చూసే ధైర్యం లేకపోయింది..
♦️ఇప్పుడతను ఆమె మొహం చూసి, "ఇక్కడి కెలా వచ్చావు ?" అని అడిగాడు.
♦️" నువు నన్ను వదిలించుకోదలిచావని కోపం వచ్చి, ఈ ముసలి జమీందారును పెళ్ళాడాను. కాని నాకు ఈయనంటే ఇష్టం లేదు, నీ కోసమూ, పిల్లల కోసమూ నా ప్రాణాలు కొట్టుకుపోతున్నాయి. నేను వచ్చేస్తాను, " అన్నది ఇల,
♦️అది అంత తేలిక అనుకున్నావా?. నువు కనపడకపోతే జమీందారు నీ కోసం అంతటా వెతికిస్తాడు. అప్పుడు మన పాట్లు కుక్కలూ, నక్కలూ కూడా పడవు.. అయినా, ఇవాళ రాత్రికి నన్ను ఆలోచించుకోనీ. రేపు మళ్ళీ కనిపిస్తాను." అన్నాడు. ఉపేంద్రుడు.
♦️"రేపు తప్పకుండా రా...మరిచేవు!" అని ఇల, జమీందారు తన కిచ్చిన నగలన్నీ మూట కట్టి ఉపేంద్రుడి కిచ్చేసింది.
♦️అతను ఇంటికి వస్తుండగా దారిలో వంటలక్క కనబడి, "ఎక్కడి నుంచి వస్తున్నావు, నాయనా?" అని అడిగింది.
♦️"జమీందారుగారు పిలిస్తే వెళ్ళి పని చూసి వస్తున్నాను. తిండి మూటగట్టి ఇచ్చారు." అన్నాడు ఉపేంద్రుడు.
♦️'ఆ జమీందారు పెళ్ళాం ఏదన్నా పెడితే తినకు నాయనా! అది మాయల మారిది. అది పెట్టిన తిండి తిన్నావంటే.. శిల అయిపోగలవు!" అన్నది వంటలక్క.
♦️ఈ సంగతి నీ కెలా తెలుసు ? ” అన్నాడు ఉపేంద్రుడు.
♦️" నేను జమీందారు దగ్గిర వంటలక్కగా పనిచేసేదాన్నిగా... ఆ మనిషి పువ్వుగానూ, మనిషిగానూ మారటం నా కళ్ళారా చూశాను. పని మానుకున్న తరవాత కిటుకు తెలిసింది గాని, ముందుగా తెలిస్తేనా ? దాని మంత్రాలూ, మాయలూ క్షణంలో వదల "గొట్టి ఉందును," అన్నది వంటలక్క.
♦️ఎలా? ఏమిటా కిటుకు ? " అన్నాడు ఉపేంద్రుడు.
♦️ఎంత తేలికనుకున్నావు? దాని తల వెనకజుట్టు కత్తిరిస్తే అది మామూలు మనిషి అవుతుంది. వీలుంటే ఆ పని చేద్దును!" అని వంటలక్క వెళ్ళిపోయింది.
♦️మర్నాడు ఉపేంద్రుడు బయలుదేరుతూ, తన పనిముట్ల సంచీలో ఒక కత్తెర కూడా పెట్టుకున్నాడు. అతని కోసం ఆత్రంగా కిటికీలో నుంచి చూస్తున్న ఇల, తలుపు తెరిచింది. అతను లోపలికి రాగానే, " ఏమన్నా ఆలోచించావా?" అన్నది.
♦️" ఆలోచించాను, నీ గదికి పద, చెబుతాను,” అన్నాడు ఉపేంద్రుడు,
♦️ఇద్దరూ గదిలోకి చేరగానే అతను కత్తెర తీసుకుని, ఒక చేత్తో ఇలను గట్టిగా పట్టుకుని ఆమె జడపాయలు కత్తిరించసాగాడు. "ఏమిటీ పని? ఎందుకలా చేస్తున్నావు?” అని ఇల గిలగిలా కొట్టుకున్నది. కాని ఆమె జుట్టుపాయలన్నీ కత్తిరించిన దాకా అతను మానలేదు.
♦️జుట్టుపోగానే ఇల కున్న శక్తులతోబాటు నిత్యయౌవనం కూడా పోయింది. ఆమె కళ్ళు లోతుకుపోయి, వాటి కింద గుంటలు ఏర్పడ్డాయి. శరీరంలో అంతదాకా ఉండిన జిగిపోయింది.
♦️ఆమె తన చేతులు చూసుకుని ఏడుస్తూ, అందమంతా పోయింది. నన్ను చూసి అసహ్యించుకుంటావు," అన్నది.
♦️"లేదు, ఇలా! నా కళ్ళకు ఇలా ఉంటేనే అందంగా ఉన్నావు. ఇంటికి పోదాం పద," అన్నాడు ఉపేంద్రుడు.
♦️వాళ్ళిద్దరూ వచ్చేస్తుంటే జమీందారు కనిపించి, "నా భార్య చెప్పిన పని ముగించావా?" అని ఉపేంద్రుణ్ణి అడిగాడు.
♦️" ఏలినవారు క్షమించాలి. ఈ మధ్య పారిపోయిన నా భార్య తమ ఇంటనౌకర్ల మధ్య కనిపిస్తే ఇంటికి పట్టుకుపోతున్నాను" అన్నాడు
♦️తప్పకుండా తీసుకు పో... పెళ్ళాలు మొగుళ్ళను విడిచి పారిపోవటం మహా నేరం," అన్నాడు జమీందారు. ఆయన తన భార్య కోసం ఊరూ, వాడా గాలించి, ప్రాణం విసిగి, వంటలక్కను మళ్ళీ తెచ్చుకున్నాడు.
♦️జమీందారు వద్ద నుంచి తెచ్చుకున్న నగలు అమ్మి, ఇలా ఉపేంద్రులు సుఖంగా బతుకుతూ, ఇంకా పిల్లలను కన్నారు.
♦️బేతాలుడు ఈ కథ చెప్పి, "రాజా, నా కొక సందేహం, ఉపేంద్రుడు నిత్యయౌవనంతో బాటు అందాన్ని కోల్పోయిన ఇలను ఎందుకు తెచ్చి ఏలుకున్నాడు? ఆమెను విడిచి పుచ్చేశక్తి లేకనా? ఆమెలో ఇప్పుడు అపూర్వశక్తు లేవీ లేవు కూడా కదా... అతను విడిచిపెట్టేస్తే ఆమె ఏమీ చెయ్యలేదే. అటువంటప్పుడు కూడా అతను ఆమెను ఎందుకు చేరదీశాడు? ఈ రహస్యం నీకు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది." అన్నాడు..
♦️దానికి విక్రమార్కుడు, "ఉపేంద్రుడిలో సౌందర్య భ్రాంతి ఏనాడూ ఉన్నట్టు కనబడదు అతను ఇలను పెళ్లికి ముందు కూడా మోహించలేదు. ఇల తన మంత్ర శక్తులతో అతన్ని తన దగ్గిరికి తెచ్చుకున్నది. గాని, అతన్ని నిజంగా వశం చేసుకున్నది. తన ప్రేమతోనే, ఇలకు అతనిపై గల ప్రేమ ఆసాధారణమైన దనటానికి సందేహం లేదు. ఉపేంద్రుడికి సౌందర్యభ్రాంతి లేదనటానికి మరొక నిదర్శనం, తన భార్య నిత్య యౌవనం చూసి అతను ఆందోళనపడి, తన తల్లితో దాన్ని గురించి ప్రస్తావించటమే...
నిజంగా సౌందర్య భ్రాంతి కలవాడైతే తన భార్య నిత్యయౌవని అయినందుకు తన అదృష్టాన్ని మెచ్చుకుని ఊరుకునేవాడే. తన భార్యది మాయసౌందర్యం అని తెలిశాక అతను ఆమెను పోగొట్టుకోవటానికి సిద్ద పడ్డాడు. ఆమె జమీందారు భార్య అయినది తన మూలంగానే అని తెలిసినాక అతను ఆమెను అందుకు తప్పు పట్టలేదు. కాని జమీందారు ఇంట సర్వసుఖాలూ ఉండి కూడా ఆమె ప్రాణం తన కోసమూ, తన బిడ్డల కోసమూ పీకుతున్నదంటే అతను అలాంటి భార్యను ఎలా వదులుకుంటాడు? ఆ భార్య నిత్యయౌవనాన్ని పోగొట్టుకుంటే అతని కది ఒక లెక్కలోకి రాదు. అందుకే యౌవనాన్ని పోగొట్టుకున్న భార్యను అతను సంతోషంగా ఏలుకున్నాడు." అన్నాడు.
♦️రాజు కీ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.
🌼🌼🍒🍒🍒🌻🍒🍒🍒🌼🌼
No comments:
Post a Comment