*ఈ నక్క కథ వింటే... జీవితం మనం నేర్చుకునేది కొంత అర్థమవుతుందేమో???*
ఆత్మహత్య చేసుకోవడం పిరికితనం. జీవితాన్ని జీవించే సాధించాలి.
ఎంతటి సమస్యనైనా ఆత్మవిశ్వాసంతో జయించాలి, ఇలాంటి మాటలు ఇప్పుడు తరచూ వింటున్నాం కదా! కానీ ఆత్మహత్య చేసుకోబోయిన ఒక వ్యక్తికి మహాభారంతంలో జరిగిన ఉపదేశం వింటే...
ఇంతకు మించిన వ్యక్తిత్వ వికాస తరగతి ఎక్కడా కనిపించదేమో అనిపిస్తుంది.
అనగనగా ఓ పేద బ్రాహ్మణుడు.
అతను మహా నిదానస్తుడు కూడా! ఆ పేద బ్రాహ్మణుడు ఉపాధిని వెతుక్కుంటూ పట్నానికి బయల్దేరాడు, అతను పట్నం వైపు నడుస్తుండగా, ఓ ధనవంతుని రథం అటువైపు పరుగులు తీస్తూ వచ్చింది.
ఆ రథం తోలే ధనవంతుడు కన్నూమిన్నూ కానకుండా తన రథాన్ని వేగంగా నడుపుతున్నాడు.
ఆ రథం దూకుడికి బ్రాహ్మణుడు కాస్తా పక్కకి పడిపోయాడు. అతని కాళ్లూ చేతులూ దోక్కుపోయాయి.
ఈ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ధనవంతుడు తన దారిన తను చక్కా పోయాడు.
జరిగినదానికి బ్రాహ్మణుడి మనసు తరుక్కుపోయింది. తన ఒంటికి అంటిన దుమ్ముని దులిపేసుకోగలిగాడే కానీ, మనసుకి అంటిన వేదన మాత్రం విడవలేదు. ‘నా పేదరికమే ఇంతటి అవమానానికి కారణం కదా! ఇలాంటి దుస్థితి నుంచి బయటపడాలంటే ఆత్మహత్యే శరణ్యం!’ అనుకున్నాడు. అనుకున్నదే తడువుగా ఓ వస్త్రాన్ని తీసుకుని దగ్గరలో ఉన్న చెట్టు దగ్గరకు వెళ్లాడు. ఆ చెట్టుకి ఉరేసుకుని చనిపోవాలన్నది అతని ఆలోచన.
బ్రాహ్మణుడు ఉరి వేసుకునే ప్రయత్నంలో ఉండగా అక్కడికి ఒక నక్క వచ్చింది. ఆ పేదవాడు చేస్తున్న పని చేసి దాని మనసు తరుక్కుపోయింది. ‘’ఎంతో అదృష్టం ఉంటే కానీ మనిషిగా పుట్టవు. అందులోనూ నిన్ను చూస్తే పండితునిలా కనిపిస్తున్నావు. ఆత్మహత్య మహాపాపం అని తెలియదా! భగవంతుడు మనిషికి రెండు చేతులు ఇచ్చాడు. మీ చేతుల్ని చూస్తే మాకెంత ఈర్ష్యగా ఉంటుందో తెలుసా. ఈగవాలినా కూడా తోలుకోలేని దుస్థితి మాది. ముల్లు గుచ్చుకున్నా తీసుకోలేని దైన్యం మాది. అలాంటిది మీ రెండు చేతులతో ఎన్ని అద్భుతాలు సాధించవచ్చో ఆలోచించావా!
‘‘నీ పేదరికం నుంచి తప్పించుకునేందుకు ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నావేమో! డబ్బున్నంత మాత్రాన సంతోషం ఉంటుందని భ్రమించకు. డబ్బున్నవాడు ఇంకా డబ్బు కావాలనుకుంటాడు, ఆ తర్వాత తనకి రాజ్యం కావాలనుకుంటాడు, ఆఖరికి తను దేవతలతో సమానం కావాలనుకుంటాడు. దేవతలు కూడా తమకి ఇంద్రపదవి లభిస్తే ఎంత బాగుండో అనుకుంటారు. ఇలా మనసులో పెరిగే మోహపు దాహం ఎన్నిటికీ తీరేది కాదు. దానిలో సంపద అనే ఆజ్యం వేసిన కొద్దీ, అది మరింతగా రగులుతూనే ఉంటుంది.
‘‘మనసులో సంతోషం, బాధ ఉన్నప్పుడు కేవలం బాధనే అనుభవించి ఏంటి ఉపయోగం? అందుకే కొందరు ఎన్ని కష్టాలలో ఉన్నా ఆనందంగా నవ్వుతూ ఉంటారు. మరికొందరేమో గొప్ప జ్ఞానం, మంచి ఆరోగ్యం ఉన్నా కూడా తమ చుట్టూ నిరాశను చిమ్ముతూ ఉంటారు. మనసుని అదుపుచేయలేకపోవడం వల్లే ఇలా నిత్యం బాధల్లోనే బతకాల్సి వస్తుంది.
‘‘చూడూ! గత జన్మలో నేనో గొప్ప పండితుడిని. నిరర్థకమైన చర్చలతో, పిడివాదనలతో కాలాన్ని వృధా చేస్తూ గడిపేశాను. ఇతరులని అవహేళన చేయడానికే జ్ఞానాన్ని ఉపయోగించాను. ఫలితంగా ఈ నక్క జన్మని పొందాను. నన్ను చూసైనా నువ్వు తెలివి తెచ్చుకో! ఆ భగవంతుని మీద భారం వేసి, నీ జీవన పోరాటాన్ని సాగించు.’’ అంటూ తన ఉపదేశాన్ని ముగించింది.
నక్క మాటలతో బ్రాహ్మణుడికి జ్ఞానోదయం అయ్యింది.
ఏ దేవుడో తనని కరుణించి నక్క రూపంలో వచ్చాడని అనిపించింది.
అక్కడికక్కడే తనలోని నిర్లిప్తతనీ, నిరాశావాదాన్ని విడనాడి తన ఊరి వైపు అడుగులు వేశాడు. కొత్త ఉత్సాహంతో, చెక్కు చెదరని పట్టుదలతో జీవితాన్ని మళ్లీ ఆరంభించాడు.
No comments:
Post a Comment