*బుజ్జి కథలు*
*9. విభూది మహిమ*
పూర్వం ఒక ఊరిలో అత్తా కోడళ్ల వుండేవారు. వారికి అసలు పడేదేకాదు. అత్త ఎడ్డేమంటే కోడలు తెడ్డేమనేది. అత్త తూర్పు అంటే కోడలు పడమర అనేది. ఇద్దరికి గడియ పడేదికాదు. దీనితో వీరి గర్జనలు భరించలేక వారిద్దరి భర్తలు ఎటో వెళ్లిపోయారు. ఏళ్ళు గడిచినా తిరిగి రాలేదు.
ఇలా రోజులు గడిచి పోతున్నాయి. అత్తాకోడళ్ల మధ్య పిల్లి, కుక్కల్లా వైరం పెరుగుతూనే ఉంది. ఇంతలో ఆ వూరికి ఓ సాధువు వచ్చాడు. అతడు సత్యం గల సాధువు. సకల శాస్త్రాలు చదివాడు. హిమాలయాలనుండి తన శిష్యుడితో వచ్చాడు. ఆయన పరిష్కరించలేని సమస్యంటూ ఉండదు. వారివద్ద దేనికైనా చిటికెలో సమాదానం దొరుకుతుందని ప్రత్యక్ష అనుభవజ్ఞుల సాక్ష్యం.
అదివిని అత్తా, కోడలు ఒకరికి తెలియకుకూడా ఒకరు సాధువును కలిశారు. కోడలిని చంపే మందు ఇవ్వమని అత్తా, అత్తను చంపే ఉపాయం చెప్పమని కోడలు సాధువును అడిగారు. ఆయన వారికి చెరో విభూదిపొట్లం ఇచ్చాడు. అరునెలలపాటు ప్రతిరోజు పాలలో కలిపి ఎదుటివారికి తాపాలన్నాడు. ఎట్టి పరిస్తితిలోనైనా ఈ విషయం తాగినవారికి తెలిస్తే మందు పనిచేయదని హెచ్చరించాడు. అతి రహస్యంగా వుండాలన్నాడు. కానీ ఓ షరతు పెట్టాడు. ఆరు నెలలు పాటు అత్తను కోడలు, కన్న తల్లిని చూసుకున్నట్టు చాలా ప్రేమగా చూడాలన్నాడు. అలాగే కోడలిని అత్త, కన్న కూతురుకన్నా మిన్నగా చూసుకోవాలన్నాడు. ఆరు నెలల తరువాత ఏ క్షణంలోనైనా మరణం సంభవిస్తుందని చెప్పాడు. వారు సరే అని వెళ్లిపోయారు.
కాలం ఎవరికోసం ఆగదుకదా? తనపని తాను చేసుకుపోతుంది. అత్తాకోడళ్లు కూడా ఒకరికి తెలియకుండా ఒకరు వారి పనులు వారు చేసుకుపోతూ వున్నారు అతి రహస్యంగా. లేని ప్రేమలు ఒలకబోస్తూ ఒకరినొకరు ప్రేమగా చేసుకుంటున్న వారిలో నిజంగా ప్రేమ పుట్టుకొచ్చింది. తల్లీ కూతుళ్ళలా సఖ్యంగా వుండసాగారు. వారిలో మార్పు వచ్చింది. అత్తను వదలి కోడలు, కోడలిని వదిలి అత్తా ఒక్కక్షణం కూడా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. ఇచ్చిన గడువు దగ్గరపడింది. ఎదుటివారు చనిపోతారేమోననే భయం పట్టుకుంది. ఒకరికి తెలియకుండా మరొకరు సాధువును కలిశారు. విరుగుడు మందు ఇవ్వమని కోరారు. ఆయన మళ్లీ వేరేరంగు పొట్లం ఇచ్చాడు. మళ్ళీ ఆరునెలలు అదేవిధంగా పాలలో కలిపి తాపమన్నాడు. మళ్ళీ అత్తా కూతుళ్ళలా సఖ్యంగా వుండాలన్నాడు. వారు అలాగే చేశారు. ఏడాది గడిచింది. ఎంతో అన్యోన్యంగా వుండసాగారు.
ఇంతలో దేశాంతరం వెళ్లిన వారి భర్తలు తిరిగి వచ్చారు. అత్తా కోడలు లో వచ్చిన మార్పుకు ఎంతో సంతోషించారు. వారికి విభూది ఇచ్చిన సాధువులు మారు వేషంలో వచ్చిన ఈ తండ్రి కొడుకులే అనే విషయం ఆ అత్తా కోడలికి ఇప్పటికి తెలియదు.
*౼ డా.దార్ల బుజ్జిబాబు*
No comments:
Post a Comment