Sunday, August 20, 2023

మనసు కథలు ❤ ( 51 ) 🌿🌿 తగిన శిక్ష

 ❤ మనసు కథలు ❤ ( 51 )

🌿🌿 తగిన శిక్ష 🌿🌿

అన్వి , సుమన కూతురు...సుమన ఒక ఊరిలో టీచరుగా పని చేస్తోంది...అన్వికి ఆటలంటే ఎక్కువ ఇష్టం..చెట్లు ఎక్కి నారింజకాయలు కోయటం, చింతచిగురు కోసి బుట్టలు నింపి కిందకు వేయటం, 
నీళ్ళ బిందెలు మోయడం, ఇలా అన్ని పనులూ అల్లరిగా చేసేస్తూ ఉంటుంది అన్వి.

సుమన స్వతహాగా ఓటమిని ఒప్పుకునే రకం కాదు..స్వతంత్రభావాలు కల అమ్మాయి..భర్తకి తనకి ఆలోచనలు కలవట్లేదు, నిత్యం అభిప్రాయభేదాలు, మనశ్శాంతి లేదు అని అన్వికి నాలుగేళ్ళ వయసప్పుడు...పల్లెటూరిలో టీచర్ పోస్టుకి ధైర్యం చేసి వచ్చేసి ఇక్కడే సిరిపురం లో స్థిరపడింది...

ఇప్పుడు అన్వికి పన్నెండేళ్ళు...దూకుడు ఎక్కువ, చెట్లు, పెరడు గోడలు ఎక్కడం..చెరువులో ఈతకొట్టటం కబడ్డీ ఆడటం..అన్నింటిలో దిట్ట...ఊరివాళ్ళకి సుమన అంటే ఇష్టం, గౌరవం..అన్వి ని అదుపులో పెట్టమని చెప్పలేక చెబుతారు...సుమన అన్వి ఇష్టాలకు విలువ ఇస్తూనే..అన్వీకి మంచీ చెడు నేర్పుతుంటుంది...

చదువు కి సమయం ఎక్కువ కేటాయించదు అన్వి...కానీ మార్కులు బాగానే తెచ్చుకుంటుంది, తెలివితేటలు ఎక్కువే...ఊరంతా తుళ్ళుతూ ఆడుతూ పాడుతూ తిరిగేస్తూ ఉంటుంది...

ఆ రోజు ఊరిపెద్ద ఇంటికెళ్ళొస్తూ సుమన దూరంగా గుడిబయట కబడ్డీ ఆడుతున్న పిల్లలను చూస్తూ వస్తోంది...చెట్టు చాటున రాజన్న నించుని అన్వీని మిగిలిన ఆడపిల్లలని చూస్తూ వెకిలిగా నవ్వుకుంటున్నాడు...రాజన్న కళ్ళల్లో చెడుచూపు సుమనకు అర్ధమయ్యింది, గుండె మండిపోయింది...చకచకా నడిచెళ్ళి రాజన్న పక్కనే నుంచుని కళ్ళతోనే కాల్చేస్తూ రాజన్నని తీక్షణంగా చూస్తోంది..ఉన్నట్టుండి తనపక్కనొచ్చి నుంచున్న సుమనని చూసి రాజన్న...ఏంది టీచరమ్మా ఈ యేళలో నా పక్కనొచ్చి నుంచున్నావు, ఏటి నాతో పని నీకు.. అని...జేబులోంచి బీడీ తీసి నోట్లో పెట్టుకుని అంటించుకున్నాడు...

నీకేం పని ఇక్కడ, అది ముందు నువ్వు చెప్పు.. అని సుమన దబాయించింది గట్టిగానే...ఓసోస్, చల్లగాలికి సెట్టునీడనొచ్చి కూసున్నా, దానికి నీకేంటి బాధ అన్నాడు రాజన్న నిర్లక్ష్యంగా...సరే అన్నట్టు తలూపి, పిల్లలూ ఇంక ఆటలు చాలు, ఇళ్ళకెళ్ళి చదువుకోండి..అని సుమన టీచరు హోదాలో పిల్లలను హెచ్చరించింది...

ఒక నెల తరువాత, అన్వి ఆ రోజు మద్యాహ్నం నుంచీ కనపడటం లేదు...తమ ఇంట్లో అన్నిపనులూ చూసుకునే రాధని అన్వి ని ఎక్కడుందో వెతికిచూసి రమ్మని పంపింది సుమన..క్లాసులో పాఠాలు చెబుతోందే కానీ మనసు పిల్లమీదకే పోతోంది ఆ కన్నతల్లికి...అన్వి ఇలా, అటూ ఇటూ ఏదో పని అంటూ తిరగటం సుమనకి కొత్తేమీ కాదు...కానీ నెలముందు రాజన్న చూపులు అన్వి మీద అన్వి తోటి ఆడపిల్లల మీద చెడుగా ఉన్నాయని గ్రహింపు కి వచ్చాక ఎంత గుండెధైర్యమున్న మనిషైనా సరే సుమనకి కొంచెం భయం అనిపిస్తోంది...

ఆరుగంటలయింది..ఇంకా అన్వి జాడ తెలీలేదు..రాధ ప్రయత్నలోపం లేకుండా అన్ని చోట్లా వెతికింది...అన్వి కనపడలేదు..

సుమనకి కాళ్ళుచేతులు ఆడటం లేదు...అమ్మా అని సన్నగొంతు వినిపించింది...సుమన గుమ్మం దగ్గరికి పరిగెత్తి చూసింది..అన్వి నీరసంగా వేలాడిపోతూ గేటు పట్టుకుని నుంచున్న మనిషి కూలబడిపోయింది...సుమన వెళ్ళి అన్వి ని పట్టుకుంది, రాధ సాయం వచ్చింది...ఇద్దరూ కలిసి స్పృహకోల్పోబోతున్న అన్విని లోపలికి తీసుకొచ్చారు...

పాత తుండు ఒకటి నీళ్ళగిన్నెలో ముంచేసి పిండి, 
ఆ తడితుండుతో అన్వి మొహం మృదువుగా తుడిచింది సుమన....జుట్టు రేగిపోయి ఉంది...బట్టలు దుమ్ముకొట్టుకుపోయి ఉన్నాయి...అన్వి అమ్మా అంది...చెప్పు అన్వి.. 
అంది సుమన...జారిపోతున్న గుండెధైర్యాన్ని జారనీయకుండా ధృఢంగా ఉండేలా విశ్వప్రయత్నం చేస్తోంది సుమన...

అన్వికి రాధ తెచ్చి అందించిన వేడిపాలు తాగించింది సుమన..ఏమయ్యింది చిట్టితల్లీ చెప్పు అంది సుమన లాలనగానూ, నువ్వు చెప్పితీరాల్సిందే అన్నట్టు మొండిగానూ...

అమ్మా రాజన్న వెధవ, పశువు...వాడు నేను గుడిదగ్గర ఉన్న చెట్టు ఎక్కి దిగుతున్నాను...చెట్టు దిగటంలో కింద వాడొచ్చి ఉన్నాడని నేను చూసుకోలేదు...నామీద దుప్పటిలాంటిది కప్పేసి కారులోకి లాక్కెళ్ళాడు...నాకు ఏమీ అర్ధం కావటం లేదు...కారు కదిలిపోతోంది..విదిలించుకుంటున్నా...బలంగా నన్ను పట్టుకున్న చేతులు విడిపించుకుంటున్నాను...పొట్టలో కొట్టాడమ్మా..నొప్పితో కళ్ళు తిరిగాయి...అయినా నేను ధైర్యం పోగొట్టుకోలేదు...నేనూ నా పిడికిళ్ళు బిగించి చేతులు వేగంగా తిప్పాను...ముసుగులో ఉన్నాను..సరిగా ఎదుర్కోలేకపోయాను...

స్పృహ కోల్పోయినట్టు కార్ సీటులోకి తలవాల్చేసాను, కాసేపు తరువాత ముసుగుతీసారు....కారు వెళుతూ ఉంది..కళ్ళు మూసుకున్నా చెవులతో శ్రద్ధగా ఆలకిస్తూ గమనించుకుంటూ ఉన్నాను..నా మూతికి టేపు వేసారు...సరే కానీలే అని ఊరుకున్నాను...చేతులకు తాళ్ళు కట్టబోయారు...అంతే ఒక్కసారి కళ్ళుతెరిచి స్పీడుగా నా చేత్తో నా పక్కన ఉన్నవాడిని కంటిమీద ఒక్కే ఒక్క దెబ్బ గట్టిగా కొట్టాను....తరువాత ఎక్కువ సమయం ఇవ్వకుండా ముక్కు మీద కొట్టాను...వాడు రాజన్న....నొప్పి తట్టుకోలేక కేకలు పెడుతున్నాడు...

బండి నడిపేవాదు బండిని ఆపేసాడు...వాడు ముందు సీటు నుంచీ కారు దిగి నా వైపు వచ్చేలోగా బాక్ డోరు తీసుకుని ఒకటే పరుగు వెనక్కి పరిగెట్టాను....కాళ్ళల్లోకి పిచ్చిబలం తెచ్చుకున్నాను....నేను ఎట్టిపరిస్థితుల్లోనూ ఆగకూడదు అని గట్టిగా నిర్ణయించుకున్నాను...వెనక వాడు వస్తున్నాడో లేదో కూడా నేను చూడాలి అనుకోలేదు....నా పరుగు మాత్రం ఆపకూడదు అనుకున్నాను....అని చెబుతోంది అన్వి...

అప్పటికే అదంతా వింటున్న రాధ చీర నోటికడ్డం పెట్టుకుని ఏడ్చేస్తోంది....సుమనకి కూడా కళ్ళు నీటితో నిండాయి, కానీ తాను చేయబోయే ప్రతిచర్య గురించి ఆలోచిస్తోంది సుమన....

అన్వి ఇంకా చెబుతోంది...అలా చాలా సేపు పరిగెత్తానమ్మా, ఒకచోట మలుపులో లోతుగా ఉండి కింద పడిపోయాను, కాళ్ళూ చేతులూ గీరుకుపోయాయి...అప్పుడు ఇంక ఒక్కసారి వెనక్కి చూసాను, ఎవరైనా వస్తున్నారా అని, ఎవరూ లేరు...అప్పుడు నేను ఎక్కడ ఉన్నానా అని గమనించుకున్నాను....

నాలుగువైపులా దృష్టి సారిస్తూ జాగ్రత్తగా చూసుకుంటూ దారిని అర్ధం చేసుకుంటూ నడుస్తూ ఉంటే మనఊరి వైపు వచ్చే బస్సు కనపడింది....బస్సులో ఎక్కాను ...మన ఊరు చేరాను...అని చెప్పేసి నీరసంగా పడుకుండిపోయింది అన్వి...

తన కూతురు ధైర్యంగా ఎదురుతిరగలేకపోయుంటే ఏంటీ పరిస్థితి అని సుమనకి భయంతో చెమటలు పోసాయి....రాధ పుటుక్కున అనేసింది...ఎదుగుతున్న ఆడపిల్లను అదుపులో పెట్టమ్మా, అలా గాలికొదిలెయ్యమాకమ్మా అంటే నా మాట వినకపోతివి ఇప్పుడు సూడు ఎంత కట్టం రాబోయిందో అంది సాధింపుగా రాధ...

రాధా అంది కోపంగా సుమన...
ఊరిలోనే కదా రాధా నా కూతురు ఆడింది పాడింది...వాడికి ఊరిలో స్వేఛ్ఛగా తిరిగే హక్కున్నట్టే నా కూతురికి, నీకు, నాకు అందరికీ హక్కుంది...
నా కూతురు ఊరిలో తిరిగినంతమాత్రాన వాడికి ఏదైనా చేసే అధికారం ఎవరిచ్చారు...సాటి మనిషి వాడు, మృగం కాదు...వాడికి ఎందుకు భయపడి నా కూతురు తన స్వేఛ్ఛని, ఆనందాన్ని వదిలి ఇంట్లోనే మగ్గాలి....తనేమీ ఎవరినో ఆకర్షించాలి అని తిరగలేదు...తన పనులు తన ఇష్టానుసారం చేసింది...దానికి వాడు నా కూతురిని ఏదో చేసే హక్కు, అధికారం వాడికి ఎవరిచ్చారు....అంది సుమన..

అడవిలోకి పంపుతావా నీ కూతురిని...అక్కడ పులులుంటాయి సింహాలుంటాయి అడవిదున్నలుంటాయి...వాటి బారిన పడకూడదని అడవికి పంపలేవుగా నీ కూతురిని..అట్టానే ఊరిలోకైనా సూసి పంపాలా పిల్లని అంది రాధ...

అడవిలోని పులి, ఊరిలోకి వస్తే మనం ఇళ్ళల్లో కాసేపే దాక్కుంటాము రాధా, తరువాత అటవీశాఖను పిలిచి మనమందరమూ తలో కర్రా చేతపట్టుకుని అటు తరిమి ఇటు తరిమి పులిని వలలో బంధిస్తాము, తరువాత బోనులో పెడతాము....అంతేకానీ పులి ఊరిలో ఉందని శాశ్వతంగా ఇంట్లోనే బందీలం అయిపోము కదా రాధా...

మనుష్యులం తిరిగే ఊరిలో ఆడపిల్లలకి రక్షణ లేదంటే దానికి కారణమయ్యే మృగప్రవ్రృత్తి ఉన్న పశువులాంటి మనుష్యులును అదుపుచేసి బోనులో పెట్టాలి కానీ...ఆడమనిషి నలుగురిలో మసలకూడదు అంటే ఏం న్యాయం చెప్పు రాధా అంది చాలా స్పష్టంగా సుమన..

ఆ మరుసటి రోజు తెల్లవారుతుండగా ఇంటి వెనుక తలుపు తీసి పెరడులోని స్నానాలగదికి రాజన్న పోతున్నాడు...అప్పటికే పెరటి గోడని స్టూలు సాయంతో దూకి ఓ మూలన కాచుకుని వేచి చూస్తూ ఉన్నారు సుమన, అన్వి, రాధ... సరైన సమయం కోసం..., రాజన్న ఎదురుగా ఉన్నట్టుండి వచ్చి నుంచుంది సుమన ఎర్రటి చీర నుదుటిన పెద్దగా ఎర్రటిబొట్టు జుట్టు విరబోసుకుని సాక్షాత్తూ కాళికావతారంలో ఉంది సుమన ...ఆ భీకర ఆకారం తీక్షణమైన సుమన చూపులకి రాజన్న నోట మాట రానట్టు నిలబడిపోయాడు...రాధ రాజన్న వెనక్కి వెళ్ళి అతని మూతికి చున్నీ ఒకటి కట్టేసి అతని తల వెనుక గట్టిగా ముడేసింది, అతను అరిచినా ఎవ్వరికీ వినపడకూడదని...అన్వి తన చేతులో పట్టుకుని ఉన్న లావుపాటి కర్రతో రాజన్న నడుము మీద కొట్టిన చోటే కొడుతూ  ఆపకుండా దెబ్బమీద దెబ్బ వేసింది...నడుము విరిగి నేలమీద పడి నొప్పితో మెలికలు తిరుగుతున్నాడు రాజన్న...

అప్పుడే పెరటిలోకి వచ్చిన రాజన్న భార్య మీనాక్షి,.. అన్వి , రాధ, సరిగా పోల్చుకోలేని సుమన లను చూసి తెలిసినవారు అనేమో అరిచి గోల చేయకుండా...ఏమిటిది అని అడుగుతూ వీళ్ళ దగ్గరకి వచ్చి చూసి సుమనని పోల్చుకుని...టీచరమ్మా, ఏంటమ్మా ఈ పని అంది...

నీ మొగుడు నా కూతుర్ని చెడు దృష్టితో చూసాడు...నిన్ననే నా కూతురుని కారులో ఎక్కడికో ఎత్తుకుపోబోయి ఏదో చేయాలనుకున్నాడు...నా కూతురు కష్టపడి తప్పించుకుని నన్ను చేరింది కాబట్టి ఇలా నడుము విరగ్గొట్టి మాత్రమే వదిలాము, అదే నా కూతురికి ఏదన్నా జరిగుంటే పీక కోసేసేదాన్ని....జాగ్రత్త...ఆడపిల్ల కదా అని, ఆడుకుందామని చూస్తే ప్రాణం తీసేస్తా...నీ మొగుడు ఇంకో ఆడపిల్ల వైపు చెడుగా కన్నెత్తి చూస్తే కళ్ళు పొడిచేయ్, నిజంగా సాటి ఆడదాని బాధ నీకర్ధమయితే అంది ఆవేశంగానూ, స్థిరంగానూ సుమన, మీనాక్షి తో...

అంతే మీనాక్షి అప్పటికే మొగుడి వేషాలు ఎన్ని చూసి భరిస్తూ వచ్చిందో...సుమన మాటలకు కిందపడున్న కర్ర తీసి రాజన్నను కోపంగా చూస్తూ సుమనకు చెప్పింది...ఇంకోసారి చెయ్యడులేమ్మా, చేస్తే ఇదే కర్రతో బుర్ర బద్దలుకొట్టేస్తా అని...

సుమన, అన్వి,రాధ..పెరటి తలుపు తీసి వెంటతెచ్చుకున్న చున్నీ, స్టూలు తీసుకుని, కర్ర మాత్రం మీనాక్షికి వదిలేసి...తమ ఇంటికి వెళ్ళిపోయారు...

తులసీభాను.

No comments:

Post a Comment