ప్రసన్న వదనం
మనిషి జీవితంలో ఎదుర్కొనే పరిస్థితులన్నీ సంతోషాన్ని, సంతృప్తిని కలిగించకపోవచ్చు. ప్రతిదీ ఆశించినట్టు అనుకూలంగా ఉండకపోవచ్చు. దీనికి వారి దగ్గర ఉన్న ఐశ్వర్యంతో సంబంధం లేదు. అనేక చేదు అనుభవాలు, కష్టనష్టాలు. ఎదురు కావచ్చు. ఇక్కడే అంతరంగం లోపలి అదృశ్య శక్తి ముఖ్యపాత్ర పోషిస్తుంది. మనిషి బుద్ధిజీవి. సహనం, సంయమనం పాటిస్తే కష్టసమయాలను కూడా ఇష్టసమయాలుగా మలచుకోగలడు. ఇతర జీవులకు ఆ సౌలభ్యం లేదు.
సంతోషం, విషాదం, వివాదం లాంటి విషయాల్లో చిన్నపిల్లలు ఎంతో అదృష్టవంతులని మనోతత్వ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వాళ్లకు గతం గుర్తుండదు. భవిష్యత్తు గురించి బెంగ లేదు. వర్తమానంలో వారికి ఎదురయ్యే సంతోషం, దుఃఖం, కోపం అన్నీ క్షణభంగురాలే. ప్రతి క్షణాన్నీ కొత్తగా జీవిస్తూ ఆస్వాదిస్తారు. వయసు, మనో పరిపక్వత పెరిగే కొద్దీ చిన్నపిల్లల మనస్తత్వంలోకి పరకాయ ప్రవేశం చేయగల మనస్తత్వాన్ని అలవరచుకోవాలి. స్వచ్ఛమైన, సరళమైన భావవ్యక్తీకరణకు ఏకైక మార్గం చిరునవ్వే
సత్పురుషులు, సద్గురువులు, సాధువులు... ఎల్లప్పుడూ ఆత్మానందం తొంగిచూసే చిరు దరహాసంతో దర్శనమిస్తుంటారు. ఆధునిక మానవుణ్ని పోటీ ప్రపంచం చిరునవ్వుకు దూరం చేస్తోంది.. మానసిక, శారీరక ఒత్తిళ్లు తట్టు కునేందుకు వినోదాలతో, మత్తు పదార్థాలతో ఉపశమనం కోసం పరుగెత్తుతున్నారు. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు.. మనిషి సంతోషంగా ఉండాలా వద్దా అన్నది ఎవరు నిర్ణయిస్తారు. అలాగే మనిషి దుఃఖానికి, విచా రానికి ఎవరు బాధ్యులు? వాస్తవం ఏమిటంటే మన సంతోషానికైనా దుఃఖానికైనా మనమే బాధ్యులం. మనిషి తనను తాను అద్దంలో తప్ప చూసుకోలేని మొహాన్ని ఇతరులు మనవైపు చూసేలా ప్రశాంతంగా ఉంచుకోవాలి. అందుకు ఏం చేయాలి? అంతరంగంలోని సంతోషం ఎదుటివారి ముందు చిరునవ్వు ద్వారా వ్యక్తపరచడమే.
తాను తప్ప అన్యులు తొంగి చూడలేని అంతరంగాన్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా, పారదర్శకంగా, ఆనందంగా ఉంచుకోవాలి. నిద్ర లేచింది మొదలు నిద్రపోయే వరకు తాను సంతోషంగా ఉంటూ, తన చుట్టూ ఉన్న పరివారాన్ని ఆనందంగా ఉంచడం ఒక కళ, దాన్ని అలవరచుకోవాలి. గతాన్ని తలచుకుంటూ దుఃఖంతో గడుపుతూ చుట్టూ ఉన్నవారిని దుఃఖానికి గురిచేయడం మానుకోవాలి. మనిషి తన మనసును తాను నిర్దేశించుకోవడాన్ని బట్టి ఆ క్షణం, ఆ రోజు దినచర్య ఉంటుంది. ప్రపంచంలో ఉచితంగా లభించేది ఏదైనా ఉందంటే అది విచారమే. దాని నుంచి బయటపడాలంటే అంతరంగంలో ఉన్న ఆనందాన్ని అందమైన చిరునవ్వు ద్వారా వ్యక్తపరచడమే. ఆ నవ్వులో నిజాయతీ, మనసులో ప్రశాంతత, మొహంలో ప్రసన్నత ఉన్నప్పుడే అది సరిగ్గా వ్యక్తమవుతుంది.
ఒకరికి కష్టం అనిపించే ఉద్యోగం అది లేని నిరుద్యోగికి అత్యవసరం కావచ్చు. ఒకరికి చిరాకు తెప్పించే మాటలు మరొకరికి దిశానిర్దేశం చెయ్యవచ్చు. మన ప్రసన్నత, చిరునవ్వు, మంచిమాట వేరొకరిని చుక్కానిలా ఆపదల నుంచి గట్టెక్కించవచ్చు. మొహాన్ని అద్దంకంటే అందంగా, మనసును భగవంతుడి ప్రతిరూపంగా ఇతరులకు కనిపించేలా ఉంచుకోవాలి. అప్పుడు చిరునవ్వే మన చిరునామాగా మారుతుంది!
- ఎం.వెంకటేశ్వరరావు.
No comments:
Post a Comment