Tuesday, August 22, 2023

పుట్టింటి "హేంగోవరు" !

 పుట్టింటి "హేంగోవరు" !
💐💐💐💐💐💐💐

"హేంగోవర్" అనే ఇంగ్లీషు మాటకి అర్ధం,
ఆమజ్ఝ, ఆరంగంలో నిష్ణాతుడైన 
నా ఫ్రెండు చెబితే తెలిసింది.

రాత్రి బాగా తెల్లారేదాకా తాగి, మర్నాడు మజ్ఝాన్నం నడిపొద్దున లేచేవాళ్ళకి, ఒకరకమైన తలనెప్పితో 
పాటు వచ్చే అలసటలాంటి దానికే, "హేంగోవర్" 
అని ఇంగ్లీషువాడు తన భాషలో పేరెట్టాడని !

అంటే మనభాషలో చెప్పుకోవాలంటే, 
ఏదైనా ఒక పనిని విపరీతంగా చేసేసిన తరవాత,
దాంట్లోంచి బయటికొచ్చేసినా, కొంతసేపటిదాకా 
దాని ప్రభావం వుండడాన్నే... తెలుగులో, 
"శేష దుష్ప్రభావం" అంటార్ట !

💐💐

ఇదంతా ఎందుకు చెప్పాల్సొచ్చిందంటే, 
నా అర్ధాంగి పుట్టింటికెళ్ళొచ్చినప్పుడల్లా, 
దాని 'శేష ప్రభావం' కొన్నాళ్ళదాకా 
మామీద పడుతూనే వుంటుంది, 
ప్రసరిస్తూనే వుంటుంది !

ఆమజ్ఝ, పిల్లలకి సరదాగా దసరా శలవలిస్తేనూ...
తనుకూడా ఆర్జిత శలవు పెట్టుకుని, నిర్దాక్షిణ్యంగా
నన్నొక్కణ్ణీ ఒంటరిగా ఒదిలేసి, "లలలలాం" 
అనుకుంటూ పుట్టింటికి చెక్కేసింది.

తెలుసుగా...మావూలుగా...పుట్టింటికెళ్ళేప్పుడు 
ఎక్కే ఎర్రబస్సులు వికారపెట్టవు, ఎక్స్ప్రెస్ రైళ్ళు
ఆలీసింగా నడిచినా పర్లేదు !

ఎటొచ్చీ, తిరిగి అత్తారింటికి వచ్చేప్పుడే...
అదే దిక్కుమాలిన ఎర్రబస్సు వికారం, డోకులు,
రైలైతే...కంపు కంపు!

సెలవలు పదిరోజులే వుంటే, ఇంకో నాల్రోజులు వాడుకోడం వాళ్ళ వంశాచారంట !

ఎందుకంటే, వాళ్ళక్కలు కూడా, 
అవే సెలవలకి, అదే పుట్టింటికొచ్చి, 
అక్కడ అచ్చికబుచ్చికలాడుకుంటూ,
'అర్ధాంగుళ్ళ'  మీద నేరాలు చెప్పుకోడంద్వారా, మానసికానందం, ఆత్మతృప్తి పొంది, బళ్ళన్నీ "ఓవరుహాలింగ్" అయిపోతాయని, అనుభవమ్మీద
మా పెద్దతోడల్లుడు తరచుగా ఎందుకంటాడో...
నాకిప్పుడిప్పుడే అర్ధమౌతోంది !

ఏమైనా, ఆయన సీనియారిటీని గౌరవించాల్సిందే !
'థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ' మరి !

💐💐

పుట్టింటినించి తిరిగొచ్చిన ప్రతిసారీ, కొన్నాళ్ళదాకా,
నా అర్ధాంగి మాటలూ - చేష్టలూ ఏదో తేడా కొట్టడం గమనించాను గానీ, అందులోని మర్మం...
మా తోడల్లుడు చెప్పాకే తెలిసింది..
అదే.."హేంగోవరు !" 

"నీకూ అంతేనా, అన్నయ్యా ?" అన్నాను.

"నీకంటే సీనియర్ని తమ్ముడూ..." అని 
కళ్ళు తుడుచుకున్నాడు !

తను పుట్టింటినుంచి రాగానే కొట్టే మొదటి డైలాగు,
"మీరేంటి, ఇంత నల్లగా, పొట్టిగా కనిపిస్తున్నారు ?" 
అని !

"నేను నా పెళ్ళి కాని క్రితంనించీ ఇలాగే వున్నానుగా"
అని నా సందేహం.

వాళ్ళ నాన్నా, అన్నదమ్ములూ గడకఱ్ఱల్లాగ పొడుగ్గా వుండడం, సర్ఫునీళ్ళతో కడిగేసిన అల్యూమినియం గిన్నెల్లాగ కొంచెం తెల్లతోలు వున్నకారణంగా, 
నేను 'పొట్టిగూటం' గాణ్ణి, 'నల్లబాలు' గాణ్ణి అయిపోతాను !

అదేదో సినిమాలో ఒకడు, అమెరికా నించి తిరిగొచ్చి,
ప్రతిమాటకీ ముందు, "ఇదే అమెరికాలో ఐతే..."
అంటుంటాడు.

అలాగ, ఈవిడకూడా.."మా అమ్మగారింట్లో ఐతే.."
అనడం మొదలెడుతుంది !

వాళ్ళమ్మగారింట్లో అన్నీ ఆధునిక, అధునాతన సదాచారాలని, అత్తారింట్లోవాళ్ళు మాత్రం, 
మొలలకి ఆకులు కట్టుకుని,
"జింబారే.. ఆజింబరే..." అనుకుంటూ మొన్ననే 
అడివిని ఒదిలేసి, "జింబో నగరప్రవేశం" చేసినట్టు వచ్చేశారనే ఫీలింగేమో అనిపిస్తుంది.

ఇంక వంటలూ - వార్పులూ గురించి చెప్పడం మొదలెడితే, వాళ్ళమ్మకీ, వాళ్ళక్కలకీ వంటలు, 
రుచుల విషయంలో చేతులు మెలికలు 
తిరిగిపోయినంత ఇదిగా చెప్పేస్తుంది....

నేనూ - మావాళ్ళూ.. ఇన్నాళ్ళూ దుంపలు, కందమూలాలు తిని బతికినట్టు !

💐💐

అక్కడ పుట్టింట్లో ఈ రాజకుమార్తెలు నలుగురూ 
చేరాక, 'చీరలు - నగలు' కార్యక్రమం డైలీ సీరియల్ 
లాగ నడుస్తుంటుంది. 

ఆస్థాన విద్వాంసుడు, 'బట్టల సత్యం' ఒక మారుతీ 
వేన్ లో తన సంచార బట్టలకొట్టుని మోసుకొచ్చి,
వీళ్ళింట్లో పెట్టి, ఖాళీ వేన్ తో తిరిగి వెడతాడు !

అవసరం వున్నా - లేకపోయినా, కొంపలో 
బీరువాల్నిండా ఎన్ని చీరలు మూలుగుతున్నా, 
'పాపం, వాడూ బతకాలిగా' అనుకుంటారో, ఏమో,
మా తోడల్లుళ్ళ బ్యాంకు బ్యాలన్స్ లు ఖాళీ...

ఇంక వీళ్ళ ఆస్థాన జవహరీ వ్యాపారి, ఇప్పటికే ఆవూళ్ళో, నాలుగు విల్లాలు కొన్నాడని తెలిసింది.
ఇంకో రెండు కొనే ప్రణాళికలో వున్నాడనీ తెలిసింది.

అందుకే కామోసు, మాఅత్తారింటి చూరట్టుకుని  వేలాడుతూనే వుంటాడు !

ఇహ ఆయింటి పురోహితుడు, సుభ్రమణ్యం గారైతే,
ఈభూమ్మీద వున్న సమస్త నోములూ - వ్రతాలూ - దానాలూ - ధర్మాలూ ఆచరిస్తే వచ్చే పుణ్యం గురించీ,
వాటి ప్రభావం వల్ల, మా షడ్రకులం - నలుగురం, 
సెంచరీ కొట్టేసి, ఏడుజన్మలదాకా వాళ్ళింటి 
అల్లుళ్ళుగానే పుట్టాలని అడ్వాన్స్ బుకింగ్ చేసేసుకుంటామని, మాతరఫున ఆయన 
హామీపత్రం రాసిచ్చేశాడు.

దాంతో ఇంక వీళ్ళు నలుగురప్పచెల్లెళ్ళూ, 
ఆయన ఏపాట పాడితే, ఆపాటకి కొరియోగ్రఫీ 
చేసేస్తూ, నలుగురూ కలిసి "నాటు నాటు"  
నాట్యం చేసేస్తున్నారు !

మా రెండో తోడల్లుడు అంటుంటాడు, 
"వచ్చేజన్మలో వచ్చే వాడెవడికోసమో...
వీళ్ళిప్పుడు మన ఖర్చుమీద, నోములూ - 
వ్రతాలూ చేసి, మనకి టెండరు పెడతారేవిటి,
మహప్రభో..." అని.

నాకూ, 'అవునుకదా' అనిపిస్తుంటుంది.

💐💐

మా మూడో తోడల్లుడు తరచుగా పాడుతుంటాడు,
"ఆలివైపువారు ఆత్మబంధువులు" అని !

ఎప్పుడుచూసినా, తన పుట్టింటివాళ్ళే మా ఇంట్లో హడావిడి చేస్తుంటే, నా పుట్టింటివాళ్ళు ఎప్పుడైనా రావడానిక్కూడా జంకుతుంటారు, పాపం !

మా ఇంట్లో మా అమ్మ ఇచ్చిన సామాన్లు మాయమైపోయి, వంటింటి సామ్రాజ్యంలో 
పరిపాలన మారిపోయి, అన్ని గిన్నెలు - తప్పేళాలూ అచ్చుమచ్చు వాళ్ళమ్మగారింట్లో వున్నట్టే డిట్టో డిట్టో.. !

అదొక హెడ్డాఫీసు - ఇదొక బ్రాంచాఫీసు !

మనం వాడే వస్తువులన్నీ 
'మేడ్ ఇన్ చైనా' అయినట్టు,
వంటలు - పిండివంటలూ కూడా  
అక్కణ్ణించే దిగుమతి !

మా అమ్మ ఒండిన రక రకాల కూరలు - పచ్చళ్ళూ 
తిని ఎన్నేళ్ళయిందో !

💐💐

రోజుకో గంటసేపైనా, వీడియో కాల్ లో 
వాళ్ళమ్మగాని, అక్కలుగాని కనబడకపోతే కుదరదు.

మా ఇంట్లో ఏకూర ఎలా వండాలో, రోజూ బ్రేక్ ఫాస్టుకి 
మేం ఏంతినాలో...అధిష్టానవర్గం ఆదేశించినట్టే జరిగిపోతుంటాయ్ !

మా అత్తారింట్లో వాళ్ళందరూ నాపేరు మర్చిపోయి చాలాకాలం అయింది.

అక్కడ నాపేరు, 'గౌరీపతి' లాగ, "బుజ్జి మొగుడు !"

ఏవిటో..మా పెళ్ళయ్యాక, ఈవిడ ఇంటిపేరు, గోత్రం మారాయి గాని, నాపేరు పూర్తిగా మారిపోయింది !

ఈ అప్పచెల్లెళ్ళు నలుగురూ, 
స్కూలు యూనిఫారాల్లాగ, ఒకేరంగు, 
ఒకే అంచు చీరలు కొనుక్కుని, ఒకే రోజున 
కట్టుకుని, హడావిడిగా ఇల్లంతా తిరిగేస్తుంటారు ! 

దానికితోడు, వాళ్ళ నాన్నగారు, ఇంట్లో జిరాక్స్ 
మిషను లేకపోయినా, నలుగుర్నీ ఒకే పోలిక, 
సైజుల్తో విడుదలచేశారు !

ఎప్పుడైనా ఏమరపాటుగా వున్నామా...
"ఇంతేసంగతులూ...చిత్తగించవలెను..."

ఆమజ్ఝ సంకురాత్రి పండక్కి వెళ్ళినప్పుడు, అనుకున్నంతా అయింది కూడానూ...

గదిలో మా ఆవిడ ఏదో సద్దుకుంటుంటే, 
"బుజ్జీ" అనుకుంటూ దగ్గిరికి వెళ్ళబోతే,
"ఏం కావాలి మరిదిగారూ" అంది, 
మా ఒదినగారు !

"కళ్ళజోడు పవరు మారినట్టుంది, ఒదినగారూ"
అని తప్పించుకున్నాను !

మా మాంగారు, మా నలుగురు తోడల్లుళ్ళకీ 
'ఒకే తాను ముక్కల్ని' కత్తిరింపజేసి, 
సెక్యూరిటీ గార్డులకి కుట్టించినట్టు, 
ఇంటల్లుళ్ళకి కొత్తబట్టలు పెడతారు !

మాలో పెద్దాయన రేలంగి పెర్సనాలిటీ, 
రెండు - రమణారెడ్డి, మూడు - బ్రంమానందం, 
నాలుగు - నేను, అలీ...

ఓరోజు నలుగురం కలిసి, సరదాగా మా మాంగారు 
పెట్టిన యూనిఫారాలేసుకుని, సినిమాకి బయిల్దేరాం...

తీరా చూస్తే, వీధికుక్కలు సందు చివరిదాకా
వెంటబడి మొరుగుతుంటే, వెనక్కొచ్చేశాం.

💐💐

ఈవిడ పుట్టింటినించి వచ్చిన వారం - 
పది రోజులపాటు, మాఇంట్లో ఆ పుట్టింటివాసన 
కొడుతూనే వుంటుంది !

ఇల్లంతా అక్కణ్ణించి మోసుకొచ్చిన బట్టలు,
సామాన్లు, తినుబండారాలు పరిచేసి,
వాటి ప్రదర్శన జరుగుతూనేవుంటుంది !

ఈవిడ కట్టుకునే బట్టల దగ్గిర్నించీ, పిల్లల కబుర్లు, అమ్మమ్మా - తాతల సుభాషితాలు, 
ఆరోగ్య చిట్కాలు, పచ్చళ్ళూ - పిండివంటలు... 
అన్నీ పుట్టింటి "హేంగోవర్లే !"

💐💐

.....అని చెప్పుకుని వాపోతున్న నా ఫ్రెండు,
పుణ్యమూర్తుల సత్యమూర్తిని చూస్తే జాలేసి, 
కడుపు తరుక్కుపోయింది !
😔😔

                      వారణాసి సుధాకర్.
                     💐💐💐💐💐💐
సేకరణ..

No comments:

Post a Comment