Wednesday, October 23, 2024

 *కర్మఫలం*
              
అందరూ మనుషులే! మనిషి మనిషికి ఆకారంలో రంగు, రూపం బాహ్యంగా కనిపించేవన్నీ తేడాగా వుంటాయి. ఇవే కాకుండా సామాజిక స్థితి, ఆర్థిక స్థితి- ఇవన్నీ కూడా తేడాయే. కేవలం మనుష్యులలోనే కాకుండా పరిశీలించితే జంతువులలోను, వృక్షాలలోను కనబడతాయి.

ఈ తేడాలు ఎందుకు ఎలా అనే ప్రశ్నలు అందరిలో ఉదయించకమానవు. ధర్మ ప్రవర్తన లేని మనిషికైతే తన గొప్పతనం నైపుణ్యం వలననే తను ఉన్నత స్థితిలో ఉండగలిగానన్న భావం కలుగుతంది. 
కాని ఇది సత్యం కాదు.

జన్మించిన ప్రతి మనిషికి పూర్వ పుణ్యము వలననే మనిషి జన్మ లభించిందన్నది వాస్తవం. 
ఆ మనిషి జన్మలో తేడాలకు కారణం కూడా ఆ మనిషి కర్మలే!

కర్మలే అని పెద్దలవలన తెలుస్తోంది. ఎవరన్నా సంపాదనను బ్యాంకులలో భద్రపరుస్తూ ఉంటారు. అవసరమైనప్పుడు తీసుకుంటూ ఉంటారు.

డబ్బు, నగలు, భూములు, యిల్లు- ఇవే సంపాదనలుగా భావిస్తూ ఉంటారు. 

ఇవి కాకుండా నిత్యం మనిషి చేసే ప్రతి కర్మలలో పుణ్యం అనే ఆదాయం- పాపం అనే ఖర్చు రెండూ భగవంతుని బ్యాంకులో ఎవరి పేరన వారికి ప్రతిక్షణం జమ అయిపోతూ ఉంటాయి.

ఈ జన్మలో మనిషి అనుభవించే ప్రతీ సుఖం పాత జన్మలో జమ అయిన పుణ్య కర్మల ఫలం. ప్రతీ కష్టం పాప కర్మల ఫలంగానే చెప్పడం జరిగింది.

జ్యోతిషం ప్రకారం మనిషి లక్షణాలు పుట్టిన నక్షత్రం, రాశి, తేది, నెల, వారం వీటన్నిటి సమాహారంగా ఉంటాయంటారు జ్యోతిష్కులు. వారి పురాకృత, సుకృత, దుష్కృత్యాలను బట్టి వేటి సుఖ దుఃఖాలు ఉంటాయంటుంది కర్మ సిద్ధాంతం.
కర్మ సిద్ధాంతమే కాకుండా పరిసరాల కుటుంబ వ్యక్తుల ప్రభావం ఆచార వ్యవహారాలు, పెంపకం వీటిపై కూడా మనిషి తీరుతెన్నులు ఆధారపడి ఉంటాయి. ఇవన్నీ ఒక ఎత్తు, మనిషి వ్యక్తిగతంగా తనకు తాను మలచుకున్న వ్యక్తిత్వమే తనను మంచి కర్మలవైపు నడిపించి ధర్మ వర్తనునిగా తీర్చిదిద్దుకోవడం కూడా భగవంతుని అనుగ్రహం తోడు అవాలి.

‘మనిషి తనకు లభించే బట్ట, తిండి, ఇల్లు, విద్య, జ్ఞానం అన్నీ కూడా భగవంతుని అనుగ్రహ ఫలాలే! మరి అందిరిపై ఒకేలా అనుగ్రహం ఉండదు కదా! వారి వారి మనసును బట్టి వారి వారి స్పందన ప్రవర్తన ఉంటూంటాయి. పనిని బట్టే (వేతనం) ఫలం కదా! మరి తక్కువ పనిచేసి ఎక్కువ ఫలం కావాలనుకుంటే ఎలా?

మనిషి తన గురించి తన సుఖం గూర్చి ఆలోచించడం జరుగుతుంది. తన ఇప్పటి సుఖం, రేపటి సుఖం అనుకుంటూ ప్రాకులాడటంతోనే సరిపోతుంది. ప్రక్కవారి గురించి ఆలోచన పడరు. తనకు అవసరం లేకపోయినా ఆస్తులు కూడబెట్టడం, దాచుకోవడం- ఆస్తుల రూపేణా కాకుండా పుణ్యరూపం కూడా దాచుకోవచ్చునన్న స్పృహరాదు. దానధర్మాల గూర్చి ఆలోచన పడతారే కాని ఆచరణ చేయలేరు. ఊహల్లోనే ధర్మ కార్యాచరణాలు!

మహాభారతంలో కర్ణుడు ఓసారి వచ్చిన అభ్యాగతికి ఎడం చేతితోనే బంగారు గిన్నెను నలుగు పెట్టుకున్నది యిచ్చారుట. అదేంటి ఎడమ చేతితో యిచ్చావు, కుడిచేతితో ఇవ్వవచ్చు కదా అని శ్రీకృష్ణుడు ప్రశ్నించగా, ఎడమ చేతినుండి కుడి చేతికి మార్చేలోపు ఇవ్వాలన్న ఆలోచన మారిపోవచ్చునని, ఎడమ చేతితోనే యిచ్చానని చెప్పాడు.

మంచి కార్యక్రమాలు, దానధర్మాలయినా సేవ ఏదైనా ఏదో ఆశించి చేయడం కాకుండా ఫలాలన్నీ పరమాత్మకే విడిచి ఏ పని చేసినా మనసా వాచా కర్మణా తనకు ఇతరులకు ఉపయోగపడే విధంగా చేసుకుంటూ ప్రయాణం సాగించాలి.

తేడాలన్నీ భగవంతుని లిఖితంగా ఆయన చరణాలను శరణాగతిగా జీవనం, ధర్మ మార్గంలో జీవితం- భగవంతుని ప్రసాదంగా ప్రతీ కర్మ ఆయనకు సమర్పణగా మంచికై లక్ష్యంగా జీవిం.చాలి.       

No comments:

Post a Comment