🌹కుండలిని సిద్ధ మహా యోగము🌹:
పదార్ధ పరివర్తనం
(పదార్ధంపై మనస్సు అధికారం)
(అఘోరీ సాధువుతో స్వామి రామా అనుభవాలు)
Courtesy: Living with the great Himalayan Masters ---Swamy Rama
📚✍️ సంకలనం : భట్టాచార్య
.......బదరీనాధ్ కు దగ్గరలో ఉన్న శ్రీనగర్ దగ్గర గంగానది ఒడ్డున ఒక శక్తి దేవాలయం..... దానికి దగ్గర్లో అఘోరీ బాబా గుహ ఉన్నాయి. అఘోర విధానం తాంత్రికమైనది. అర్ధం చేసుకోవటం చాలాకష్టం. కొద్దిమంది యోగులకు స్వాములకు ఆ మార్గం బాగా తెలుసు. అది గూడార్ధమైన ఖగోళ శాస్త్ర సంబంధ రహస్య శాస్త్రం. ఈ అఘోరీ సాంప్రదాయం, అధర్వణ వేదంలో వర్ణించబడింది. జీవితంలోని అత్యున్నత స్థాయి శక్తులపై ఆధిపత్యం పొందటానికి చేసే సాధన. ఇది ప్రాణాయామం కంటే శ్రేష్ఠమైన మార్గం. ఈ మార్గం జీవితానికి, తర్వాత దానికి మధ్య ఒక వంతెన లాంటిది. అఘోరీ శాస్త్రాన్ని చాలా కొద్దిమంది యోగులు మాత్రమే సాధన చేయగలరు. కానీ వారి విధానాలు విని తెలుసుకొని చూసి సామాన్యులు భయానికి గురౌతారు.
శ్రీనగర్ చుట్టు ప్రక్కగ్రామాల ప్రజలు అక్కడ గుహలో ఉన్న "అఘోరి బాబా" అంటే భయపడతారు. అటువంటప్పుడు ఆయన దగ్గరకు వెళ్ళే సాహసమే చేయరు .ఒక వేళ ఆయన దగ్గరకు వెడితే బండ బూతులు తిట్టి ,గులకరాళ్ళతో కొట్టి పంపిస్తాడు .ఇలాంటి అఘోరి బాబా ను చూడటానికి , స్వామి రామా కాలినడకన వెళ్ళాడు .బాబా ఆరు న్నర అడుగుల పొడవు తో బలిష్టమైన శరీరం తో దాదాపు 75 ఏళ్ళ వయసుతో... పెద్దగడ్డం, గోనె తో నేసిన అంగోస్త్రం తో కనిపించాడు. గుహలో గోనె పదార్ధం, కొన్ని కుండలు తప్ప మరేమీ లేవు. స్వామిరామా తనతోపాటు స్థానిక పురోహితుడిని వెంట తీసుకు వెళ్ళాడు .ఆయన భయపడుతూ వణుకుతూనే వచ్చాడు. బయలుదేరేముందు రామా తో "వీడు దొంగ సన్యాసి. మురికి మనిషి, నువ్వు చూడదగిన మనిషి కాదు..... ”అని హెచ్చరించాడు.
ఇద్దరూకలిసి చీకటి పడే ముందు సాయంకాలానికి బాబా దగ్గరకు చేరారు. తనగుహకు గంగానదికి మధ్యనున్న ఎత్తు అయిన రాయి మీద అఘోరి కూర్చుని కన్పించాడు. వీళ్ళిద్దర్నీ తనప్రక్కనే కూర్చోమన్నాడు. వెంటనే" నా వెనకాల నువ్వు నన్ను నానా బూతులు తిడతావు , ఇప్పుడు కపట వినయంగా చేతులు ముడిచి దండాలు పెడుతున్నావే ?”అన్నాడు పండిట్ ను. కంగారుపడ్డ పండిట్ నెమ్మదిగా జారుకునే ప్రయత్నం చేస్తుంటే ...”తిరిగి నువ్వు వెళ్ళవద్దు ......నదికి వెళ్లి నాకు మంచినీళ్లు కుండతో తీసుకురా "అని చెప్పగా వెళ్లి తెచ్చాడు. పండిట్ చేతికి మాంసం నరికే పెద్దకత్తి ఇచ్చి "నదిలోఒక శవం తేలుతోంది. వెళ్లి దాన్ని ఒడ్డుకు లాగి దాని తొడ, కాలి పిక్క మాంసాన్ని కొంత నరికి నాకు తీసుకురా ”అని ఆజ్ఞాపించాడు బ్రాహ్మణ పండితుడైన ఆయన జీవితం లో ఎప్పుడూ కలలో కూడా ఊహించనిది ఆ పని. ఆ బ్రహ్మణుడు పరమ నైష్ఠికుడు. ఆయనతోపాటు స్వామి రామా కూడా వణికి పోయాడు.... అడుగు ముందుకు వేయలేకపోయాడు పండిట్. తీవ్ర స్వరంతో ”నువ్వు వెళ్లి ఆ మాంసం తేకపోతే నేనే నిన్ను చంపి తినేస్తా !!! నీ ఇష్టం ఏం చేస్తావో చెయ్యి..... "అన్నాడు, ఆ అఘోరీ.
గత్యంతరం లేక పండిట్ వెళ్లి ఆ శవంలో కోరిన మాంసాన్ని ఖండించాడు,ఈ నరుకుడు అలవాటు లేనందున తన రెండు చేతి వ్రేళ్ళు తెగి రక్తం కారుతూ తీసుకొచ్చాడు పండిట్. కానీ రామా, పండిట్ లు తమ సహజ స్థితి లో లేరు. పండిట్ దగ్గరకు రాగానే అఘోరీబాబా అతని తెగిన వ్రేళ్ళను తన చేతితో తడిమాడు. వెంటనే రక్తం కారటం ఆగిపోయి వ్రేళ్ళు బాగు పడ్డాయి . చిన్న మచ్చ కూడా కనిపించలేదు . ఒక మట్టి కుండలో తెచ్చిన మాంసం ముక్కలు వేసి, పొయ్యి మీద పెట్టి ఒక చిన్న రాయిని మూతగా పెట్టమన్నాడు. అలానే చేస్తుండగా ” ఈ యువక స్వామికి ఆకలిగా ఉందని తెలీదా నీకు? నీకు కూడా ఆకలి వెయ్యటం లేదా ?”అని అన్నాడు. ఈ ఇద్దరూ ‘బాబా! మేము పూర్తి శాకాహారులం ”అని గొణిగారు .దీనికి మళ్ళీ మండి పోయిన బాబా ”నేను మాత్రం మాంసాహారిని అనుకుంటున్నారా ?నేను కూడా ఫక్తు శాకాహారినే........" మరి ఈ అఘోరీ వింత ప్రవర్తన ఏమిటో వీరికి అర్ధం కాలేదు......
పది, పదిహేను నిమిషాలు మాంసం ఉడికాక పండిట్ ను ఆ కుండను తన దగ్గరకు తెమ్మన్నాడు. దగ్గరలో ఉన్న చెట్టు పెద్ద ఆకులు మూడు కోసుకురమ్మని భూమి మీద పరచమని వాటిలో కుండలోని మాంసం వడ్డించమని చెబితే..... బెంబేలెత్తుతూ పండిట్జీ , నా నియమ నిష్ఠలు పూర్తిగా ఈ రోజు పోయాయి. నేను భ్రష్టుడనయ్యాను.....అని లోలోన బాధపడుతూ అనుకుంటున్నాడు.....
తర్వాత అఘోరి గుహలోకి వెళ్లగా పండిట్, రామా చెవుల్లో ”ఇంత ఘోరం నా జన్మలో చూడలేదు స్వామీ! ఎలాంటి కులం లో పుట్టాను... ఎలాంటి నీచమైన పని చేశాను... ఇక నేను బతకటం వ్యర్థం..... అంటే రామా, ఏం జరుగుతుందో చూద్దాం..... అన్నాడు. ఇంతలో బాబా మూడు చిన్న మట్టి ముంతలు (కుండలు) బయటికి తెచ్చాడు పండిట్ ను కుండలోని మాంసాన్ని ఆకుల్లో వడ్డించమన్నాడు .
పండిట్ కుండపై ఉన్న మూత తీసి చేతులు లోపల పెట్టి రామా ఆకులో వడ్డించగా ఆశ్చర్యం అది "రసగుల్లాలుగా" కనిపించింది.
ఆశ్చర్యం! "పదార్ధ పరివర్తనం" జరిగింది. అది రామా కు అమిత ఇష్టమైన పదార్ధం. బాబా గుహకు వస్తుండగా రసగుల్లా గురించి ఎందుకో ఆలోచన వచ్చింది స్వామిరామాకు. ఆయనకు కావాల్సిందే తయారైందన్నమాట. తెల్లమొహాలు వేసిన రామాతో అఘోరి "ఇది మధుర పదార్ధమే. మాంసం కాదు.... అనుమానించకుండా తినండి..... "అన్నాడు". ఇద్దరూ అతి రుచికరంగా ఉన్న రసగుల్లాలను చాలా ఇష్టంగా తిన్నారు. మిగిలిన దాన్ని పండిట్ కు ఇచ్చి గ్రామం లో అందరికి పంచిపెట్టమని పంపాడు. ఇదంతా విచిత్రంగా ఉంది స్వామిరామా కు.
రెండు గంటలు అఘోరీ బాబా వద్ద ధ్యానం చేశాక స్వామిరామా, ఆయనతో మాట్లాడటం ప్రారంభించాడు .బాబా అత్యున్నత మేధావి అని అర్ధమయింది .ఆయన సంస్కృత భాష సంక్షిప్తంగా కఠినంగా ఉండేది. సంస్కృతంలో చాలా పురాతనమైన భాష మాట్లాడేవారు. (బహుశ వైదిక భాష) అందుకని ఆగి ఆగి వివరించేవారు . ఆ అఘోరీ, మహాజ్ఞాని, పండితుడు అని అర్థం అయింది. అధర్వణ వేదంలో అఘోర మార్గం ఉన్నది .కానీ ఏ శాస్త్రం లోను మనిషి మాంసం తినమని లేదు .మీరు ఎందుకు ఇలాంటి జీవితం గడుపుతున్నారు ? ”అని రామా ప్రశ్నిస్తే ”అది మృత శరీరం అని ఎందుకు అనుకొంటున్నావు? అది పనికి రాదని పార వేయబడిన పదార్ధం మాత్రమే. మీరు దాన్ని మనుషులకు ఆపాదిస్తున్నారు. ఎవరూ దాని జోలికి పోరు కానుక నేను ఉపయోగిస్తున్నాను. నేను ప్రయోగాలు చేసే శాస్త్ర వేత్తను........ "పదార్ధానికి - శక్తికి" మధ్య ఉన్న సంబంధాన్ని గురించి తెలుసుకొనే ప్రయోగం చేస్తున్నాను. ఒక రూపం లో ఉన్న పదార్ధాన్ని మరొక రూపం లోకి మారుస్తున్నాను . "పదార్ధ పరివర్తనం" చేస్తున్నాను. నాకు ప్రకృతే మాత. ఆమె అనేక రూపాలు సృష్టిస్తుంది. నేను రూపాలను మార్చే ప్రయోగాలు చేస్తూ ఆమె బాటలోనే నడుస్తున్నాను. దీన్ని ఇందాక ఎందుకు చేశానంటే .....పండిట్జీ వెళ్లి ఊళ్ళో వాళ్ళని ఇక్కడికి రాకుండా హెచ్చరిస్తాడని మాత్రమే! ఈ గుహలో 21 ఏళ్ళనుంచి ఉంటున్నాను. ఇంతవరకు ఎవ్వరూ వచ్చి నన్ను చూడలేదు. నా రూపం చూసి ప్రజలు భయపడతారు. నేను మురికి వాడినని, మృత కళేబరాలను పీక్కు తింటానని అనుకొంటారు. కానీ.....నేనెవరికీ అపకారం చేయలేదు. గులకరాళ్ళతో బెదిరించానే, కానీ ఎవ్వర్నీ గాయ పరచలేదు” .అన్నాడు
బాబా. ఆ అఘోరీ బాహ్య రూపం భయంకరం, అంతర రూపం సౌందర్యమయం. ఆయన స్వాస్థ్యము తప్పినవాడు కాదు .ఎవరిపైనా ఆధారపడకుండా జీవించే స్వతంత్రేచ్ఛ ఉన్నవాడు. ఆ రోజు రాత్రంతా బాబా అఘోర మార్గాన్ని స్వామి రామాకు వివరించి చెప్పాడు. పదార్ధాన్ని అనేక రూపాలలోకి మార్చే సమర్ధుడు ఆయన! రాయిని పంచదార గానూ, స్పటికంగానూ మార్చాడు. మర్నాటి ఉదయం ఇలాంటి అద్భుతాలెన్నో చేసి చూపించాడు. అక్కడ ఉన్న ఇసుకను తాకమన్నాడు. తాకితే జీడిపప్పు, బాదం పప్పుగా మారింది . ఇందులో శాస్త్రీయ సిద్ధాంతాలున్నాయన్నది కాదనలేని సత్యం!
మధ్యాహ్నం మళ్ళీ నిన్నటి పదార్ధం కాకుండా కుండ లో నుంచి మరొక తీపి పదార్ధం బయటికి తీసి తినిపించాడు. ఈ తంత్ర విద్య గురించి అడిగితే ”ఈ శాస్త్రం నశించిపోతోంది. పండితులు దీన్ని అభ్యాసం చేయటం లేదు. కొద్దికాలానికి ఇది కాలగతి లో కలిసి పోతుంది " అని నిర్వేదం ప్రకటించాడు ఆ అఘోరీబాబా ....
ఇలాంటి ప్రయోగాలవలన ఉపయోగం ఏమిటి ?అని అడిగితే .....ఉపయోగం అంటే ? అని ప్రశ్నించి..... ఇది సైన్స్ .ఈ సైన్స్ తెలిసిన సైన్టిస్ట్ ఈ విజ్ఞానాన్ని రోగ నివారణకు ఉపయోగిస్తాడు .ఇతర సైన్టిస్ట్ లకు పదార్ధాన్ని శక్తిగా, శక్తిని పదార్థంగా మార్చవచ్చునని తెలియ జేయాలి ....ఈ రెండిటికి ఉన్నది ఒకే సూత్రం .అన్ని పేర్లు రూపాలకు అతీతంగా ఏకీకృత సిద్ధాంతం ఉన్నది ,దీన్ని ఆధునిక శాస్త్ర వేత్తలు ఇంకా కనిపెట్టలేక పోతున్నారు ..ఈ అంతర్గత జీవిత సిద్ధాంతాన్ని ప్రాచీన సైన్స్ అయిన "వేదాంతం" స్పష్టంగా చెప్పింది. ఉన్నది ఒకే ఒక ప్రాణ శక్తి అన్ని నామాలు రూపాలు దాని విభిన్న శక్తులే. రెండుపదార్ధాల మధ్య సంబంధం తెలుసుకోవటం కష్టమేమీ కాదు. కారణం వాటిలో మూల ద్రవ్య రాసి ఒక్కటే కనుక ...నీరు గడ్డకట్టి మంచు అవటం వేడిచేస్తే ఆవిరి అవటం లాంటిదే ...చిన్నపిల్లలకు ఇవి వేర్వేరు పదార్ధాలనిపిస్తాయి. కానీ వాటిలోని కూర్పు -కంపొజిషన్ ఒకటే ...రూప భేదమే. ఇవాళ్టి సైన్టిస్ట్ లు అలాంటి పిల్లలే .వాళ్లకు పదార్ధం వెనుక ఉన్న ఐక్యత అర్ధం కాదు. వాటిని ఒకదానిలోనుంచి మరొక దానిలోకి మార్చే సూత్రాలూ తెలియవు . ” స్వామి రామాకు తెలుసుకోదగిన పదార్ధమంతా తెలిసింది .
...ఆయన దగ్గర సెలవు తీసుకొని దగ్గర గ్రామానికి చేరి పండిట్ భయం పోగొట్టాలని అనుకొని, ఆయన్ను కలిస్తే పండిట్ తానూ అఘోరీ బాబా మార్గదర్శనం నచ్చి, ఆయన శిష్యుడనవుతున్నానని చెప్పగా స్వామి రామా అవాక్కయ్యాడు!
No comments:
Post a Comment