Vedantha panchadasi:
తత్త్వం బుద్ధ్వాపి కామాదీన్నిః శేషం జహాసి చేత్ ౹
యథేష్టాచరణం తే స్యాత్కర్మశాస్త్రాతిలంఘినః ౹౹54౹౹
54. తత్త్వమును తెలిసికొనిన పిమ్మట కూడా కామాదులను సమూలముగ పరిత్యజింపనిచో కర్మశాస్త్రము నుల్లంఘించు నీవు స్వేచ్ఛాచారివి అగుదువు.నిజమగు జ్ఞాని విధి నిషేధములకు అతీతుడైనను శాస్త్ర విరుద్ధముగ ప్రవర్తింపడు.
(భాగవతమీ11.7.11;కఠోపనిషత్తు2.24)
బుద్దాద్వైత స్వతత్వ యథేష్టాచరణం యది ౹
శునాం తత్త్వదృశాం చైవ కో భేదో శుచిభక్షణే ౹౹55౹౹
55. నిజస్వరూపము అద్వైత బ్రహ్మమని తెలిసికొనిన వాడు స్వేచ్ఛా చారియైనచో నమేధ్యమును తినుటయందు కుక్కకును ఈ తత్త్వదర్శికిని ఏమి భేదము?నియమములను పాటించుటయే తాను బ్రహ్మజ్ఞానినని నటించువాడు అమేధ్యమును తిను కుక్కవంటి వాడని సురేశ్వరాచార్యులు అంటారు. నైష్కర్మసిద్ధి 4.62; వేదాంతసారము223.
బోధాత్పురా మనోదోషమాత్రాత్ల్కి శాస్యథాధునా౹
అశేష లోకనిందా చేత్యహో తే బోధవైభవమ్ ౹౹56౹౹
56.జ్ఞానమునకు పూర్వము మానసిక దోషములచే మాత్రమే ఖిన్నుడవై ఉంటివి.మరి ఇప్పుడు జనులందరి చేతను నిందింపబడుచున్నావు.ఆహా ఏమి నీ జ్ఞానవైభవము !
(నీ బ్రహ్మజ్ఞానము వట్టి నటనయే అనీ ఇప్పుడు దుఃఖము రెండింతలైనదనీ వ్యంగ్యము.)
వివ్వరాహాదితుల్యత్వం మా కాంక్షీసస్తత్త్వవిద్భవాన్ ౹
సర్వధీదోష సంత్యాగాల్లోకైః పూజ్యస్వ దేవవత్ ౹౹57౹౹
57. సర్వోన్నతి హేతువైన జ్ఞానమును ఆర్జించిన నీవు సర్వాధమమైన మలము పంది మొదలగువానితో సామ్యమును కోరకుము.కామ క్రోధాదులైన సకల మనోదోషములను పరిత్యజించి దేవతలతో సమానముగ లోకమున పూజలందుకొనుము.
శబ్ద స్పర్శాది సమస్త ఇంద్రియములకును,దానిదాని విషయములలొ రాగద్వేషాదులు కలుగుచుండును.అట్టి రాగద్వేషాదుల కధీనుడు ఎప్పటికిన్ని కాకూడదు. రాగద్వేషాది విషయములు కదా జ్ఞాన ప్రతిబంధములగు గొప్ప శత్రువులు.
లేడి,భ్రమరము,మిడుత,ఏనుగు,మత్స్యము -ఈ యైదు జంతువులు నొక్కక్క యింద్రియ విషయమందు ప్రవర్తించి బద్ధములై మరణ మొందుచున్నవి.
తత్త్వము తెలిసిన పిమ్మట కూడా కామాదులను పూర్తిగా వదలకున్న
గుణకర్మ స్వభావము హృదయమందు ప్రతిబింబించును.
నిజమైన బ్రహ్మనిష్టాగరిష్టులు,
నిజస్వరూపము అద్వైత బ్రహ్మమని తెలిసికొనిన తరువాత శాస్త్ర విరుద్ధముగా ప్రవర్తింపరు.
అట్లుగాక ప్రవర్తించు వారు బ్రహ్మజ్ఞానిగా నటించు వారు మాత్రమే అని శాస్త్ర వాక్యము.
స్వాత్మారూపము వలె జ్ఞానము పూర్ణమైనది.వ్యాపకమైనదియును.
కామ క్రోధాది దోషములకు నిజముగా స్వరూపమున భేదములేదు.సంసారులెట్లయితే సుఖదుఃఖాది మోహములందు ఉందురో,జ్ఞాని యైనవాడు వాసనా రహితుడై వుండును.వారిద్దరికిని విశేషము లేదు.సంసారభావన యిద్ధరికిని సమమే.కాని యోగులచే శరీరము జయింపబడినది కనుక సుఖదుఃఖాది ఫలము వారికెట్లు కల్గును?
ఇంద్రియములు,మనస్సు,బుద్ధి,
కామక్రోధాదికములును సర్వము జయింపబడినవి.అతడు దేని చేతను బాధింపబడడు.
దేవేంద్రుడు ఏలాగున వజ్రాయుధము చేతపట్టు కొని తలపైకెత్తెడి పర్వతములను మరల మరల హననము చేసెనో,ఆ రీతిగా బ్రహ్మనిష్టుడు హృదయమున స్ఫురించిన ఇంద్రియములను శత్రువులుగా జాగరూకుడై పునఃపునః వివేకదండముచే సమూలముగా కొట్టి చంపవలయునని భగవంతులగు
"వశిష్ఠులు" "శ్రీ రామచంద్రులకు" ఉపదేశించిరి.
ఎంతవరకు హృదయమందుండు సమస్త విషయవాసనలను విడువలేదో,అంతవరకు పరమాత్మ దర్శనము సిద్ధింపదు. సమస్తములగు కోరికలను ఎప్పుడు
విడుచునో అప్పుడు పరమాత్మ మాత్రమే మిగిలి యుండును.
No comments:
Post a Comment