Saturday, November 23, 2024

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

           *అమ్మమారిపోయింది*
                    ➖➖➖✍️

రాత్రి 9:00 అయింది 

డిసెంబర్ నెల కావడం వల్ల  చలి వణికించేస్తోంది. టేబుల్ మీద ఉన్న సెల్ ఫోన్ అదే పనిగా మోగుతుంటే వంటింట్లోంచి పరుగు పరుగున వచ్చి ఫోన్ తీసింది రాజ్యలక్ష్మి. 

హలో అనగానే…. “అమ్మా ఎలా ఉన్నావ్?” అని కొడుకు రంగనాథ్ అడుగుతూ  “నేను ఎల్లుండి బయలుదేరుతున్నాను సంక్రాంతి పండక్కి.! నెలరోజుల పాటు అక్కడే ఉంటాను. పండగ స్పెషల్ తయారు చేసి రెడీగా పెట్టు.   ఇక్కడ పిజ్జాలు బర్గర్లు తిని నోరు చచ్చిపోయింది. వెళ్లేటప్పుడు గోంగూర పచ్చడి, స్వీట్లు పట్టుకెళ్తాను.” అంటూ తనక్కావాల్సిన లిస్ట్ అంతా చిన్నపిల్లాడిలా చెప్పడం ప్రారంభించాడు.   “నాన్న ఎలా ఉన్నారు?  ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? పిల్లలు రావటం లేదు. మీ కోడలు కూడా రావట్లేదు. నేనొక్కడినే వస్తున్నా!” అంటూ కొడుకు చెప్పిన మాటలకి-  “సరేరా జాగ్రత్తగా బయలుదేరిరా!” అంటూ పిల్లల గురించి కోడలు గురించి కుశల ప్రశ్నలు వేసి ఫోన్ పెట్టేసింది రాజలక్ష్మి.

ప్రతి ఏటా సంక్రాంతి పండక్కి సొంత ఊరుకొచ్చి నెలరోజుల పాటు  పిల్లలతో భార్యతో ఉంటాడు. అలా ప్రతిఏటా వచ్చినప్పుడల్లా తనక్కావలసిన పచ్చళ్ళు స్వీట్లు, పొడులు ఆవకాయలు అన్ని తయారు చేయించుకుని పట్టుకెళ్తుంటాడు. పిల్లలకిష్టమని, తన భార్యకి ఇష్టం అని ఇలా ఏవేవో చెప్తూ ఉంటాడు. రంగనాథ్ కి  చిన్నప్పటినుంచి చిరుతిళ్ళు అంటే ఇష్టం.
రాజ్యలక్ష్మి కొడుకు ఇండియా వచ్చినప్పుడల్లా  నెలరోజులపాటు
కొడుకుకి కోడలికి మనవలకి రెండు పూటలా ఎవరికి ఇష్టమైనవి అవి తయారుచేసి పెట్టి తృప్తి పడుతుండేది. రాజ్యలక్ష్మి గారు కాదు ఏ  తల్లి అయినా అలాగే పెడుతుంది. ఇదివరలో కొడుకుకి ఇష్టమైనవి పెట్టడంలో సంతృప్తి పడేది కానీ వయసు పెరిగిన తర్వాత  ఆరోగ్యం మీద  శ్రద్ధ పెరిగింది. దానికి తోడు ఇవాళ కనిపించిన మనుషులు రేపటికి లేకుండా అయిపోతున్నారు. కరోనా వచ్చి తగ్గిన తర్వాత ఇది బాగా పెరిగింది. చనిపోయిన తర్వాత ఎన్నో కారణాలు చెబుతున్నారు. బతికుండగా తీసుకోవాల్సిన శ్రద్ధ ఒక కుటుంబంలో ఎవరు తీసుకోవాలి. ఇంట్లో తల్లి లేదా భార్య! ఈ ఇద్దరే మన ఆరోగ్య సంరక్షకులు. చేతితో రకరకాల పిండివంటలు తయారుచేసి పెట్టి ఇదివరకు సంతృప్తి పడేవారు. కాలం మారిపోయింది. నూనెతో తయారు చేసిన పిండి వంటలు పంటికి రుచిగానే ఉంటాయి . కానీ ఒంటికి ఎక్కడలేని అనారోగ్యాలు తెచ్చిపెడుతున్నాయని అంటూ రోజూ డాక్టర్లు సోషల్ మీడియాలో చెబుతున్న వార్తలు చూసి భయం పట్టుకుంది రాజ్యలక్ష్మికి.  ఒక కుటుంబంలో ఆరోగ్యానికైనా ఆర్థికంగానైనా  గట్టి మార్పు తీసుకురావాలి అంటే ఒక స్త్రీ వల్లే సాధ్యం. ఆరోగ్యానికి అనారోగ్యానికి కూడా పుట్టినిల్లు మన వంటిల్లు. వంటిల్లుకి యజమాని మన ఇల్లాలు. ఒక  ఇల్లాలు తలుచుకుంటే ఏ విధమైన మార్పులైనా తీసుకు రాగలదు.
********. ********
అష్ట కష్టాలు పడి కొడుకు రంగనాథ్ అమెరికా నుండి తూర్పుగోదావరిలోని ఆ పల్లెటూరు వచ్చేటప్పటికి రాత్రి 12 గంటలు అయింది. 
వస్తూనే కొడుకును కౌగిలించుకుని “ఏమిట్రా అలా చిక్కి పోయావు?” అంటూ ప్రశ్నించింది. 
“లేదమ్మా గత ఏడాదికి ఈ ఏడాదికి 10 కేజీలు పెరిగాను” అంటూ చెప్పాడు రంగనాథ్. 
“ఆరోగ్యం అంతా బాగానే ఉందా?” అంటూ ఆందోళనగా ప్రశ్నించింది. 

“లేదమ్మా శంకు చక్రాలు రెండు ధరించాను!” అన్నా డు. 

“అంటే ఏంట్రా?” 

“బీపీ షుగర్ రెండూ వచ్చాయి అమ్మా” అంటూ చెప్పాడు తల్లి తో. 

“సరే పద సామాన్లు నీ గదిలో పెట్టేస్తా ఏమైనా తింటావా?” 

“లేదమ్మా వచ్చేటప్పుడు హోటల్ లో తిని వచ్చేసాను!” అటు స్నానం చేసి గ్లాసుడు మజ్జిగ తాగి పడుకున్నాడు రంగనాథ్. 
ఏమిటి మజ్జిగ ఇంత నీళ్లలా ఉంది అనుకుంటూ మంచం మీద వాలిపోయాడు. 
ప్రయాణం బడలిక, ఆదేశానికి ఈ దేశానికి టైం తేడా వలన వెంటనే నిద్ర పట్టేసింది.

తెల్లవారుజామున ఎవరో తలుపు గట్టిగా కొడుతుంటే మెలకువ వచ్చింది. ఎదురుగుండా అమ్మ “గుడ్ మార్నింగ్ రా!” అంటూ.

“ఏమిటమ్మా అప్పుడే నిద్ర లేపావు?” అంటూ అడిగిన ప్రశ్నకి…

“పద వాకింగ్ కి వెళ్దాం” అంటూ కొడుకు చెప్పే సమాధానానికి ఎదురు చూడకుండా వీధిలోకి అడుగుపెట్టింది. 

రంగనాథ కి పొద్దున్నే అమ్మతో గొడవ ఎందుకని తల్లిని అనుసరించాడు. 

అలా రెండు కిలోమీటర్లు నడిచి వచ్చేటప్పటికి ఒళ్లంతా చెమట పట్టేసింది రంగనాథ్ కి. రోజూ అమెరికాలో అయితే ఉదయం ఎనిమిది గంటలకు నిద్ర లేవడం అలవాటు. పొద్దున్నే అమ్మ లేపేసింది. 

బుర్రంతా తిరిగిపోతుందనుకుంటూ బాత్రూంలోకి వెళ్లి బ్రష్ చేసుకుని హాల్లోకి వచ్చేటప్పటికి అమ్మ కప్పు పట్టుకొని రెడీగా ఉంది. నోట్లో పెట్టుకుని ఒక గుక్కతాగగానే “ఇదేంటమ్మా ఇది టీ కాదా?” 

“కాదురా! ఇది  తేనె నిమ్మరసం అల్లపురసం!” రాజ్యలక్ష్మి నవ్వుతూ చెప్పింది. “టీ తాగడం మానేశామురా రోజూ ఇదే తాగుతున్నా”మంటూ అమ్మ చెప్పిన మాటలకు రంగనాధ్ బుర్ర తిరిగిపోయింది. 

“త్వరగా స్నానం చేసి రా    టిఫిన్ తిందువు గాని” అంటూ తల్లి చెప్పిన మాటలకి స్నానం చేసి తిరిగి వచ్చేటప్పటికి టేబుల్ మీద  రాగి దోశ  వేరుశనగ గుళ్ళు చట్నీ  బొప్పాయి పండు ముక్కలు కనబడ్డాయి. 

“అమ్మా! ఇది నాకేనా?” అని అడిగాడు రాజేష్. ఎప్పుడూ ఇంట్లో వెరైటీ టిఫిన్ ఉండేది. ఇప్పుడేమిటిలా అనుకుంటూ అతి కష్టం మీద దోశ ముక్క నోట్లో పెట్టుకున్నాడు. అయిష్టంగానే తినడం మొదలుపెట్టినా తింటున్న కొద్ది రుచిగా ఉంది దోశ.  ఇదివరకు లాగా అమ్మ మళ్లీ మారు కూడా అడగలేదు. అమ్మ చేత్తో వేసిన మైసూర్ బజ్జి ఎంత రుచిగా ఉండేది? తినడం మొదలు పెడితే లెక్కపత్రం ఉండేది కాదు గత సంవత్సరం వరకు. 
అలా మొత్తానికి టిఫిను తినేసి హాల్లో కూర్చుని  యూట్యూబ్ పెట్టాడు. అన్నీ ఆరోగ్యానికి సంబంధించిన వీడియోలే అమ్మ ఎక్కువగా చూస్తోంది కాబోలు అవే కనపడ్డాయి. విసుగు వచ్చి టీవీ కట్టేసి గడిలోకి వెళ్లి పడుకోగానే నిద్ర పట్టేసింది. 

మధ్యాహ్నం ఒంటిగంటకు అమ్మ లంచ్ కి లేపిన తర్వాత బాత్రూంకి వెళ్ళి మొహం కడుక్కుని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చునేటప్పటికీ టేబుల్ మీద కంచంలో అంతా  సమతుల ఆహారం కనబడింది. ఎక్కడా ఉప్పు, కారం, పులుపు లేకుండా అంతా చప్పగా ఉంది లంచ్.      అన్నం తక్కువ కూరలు ఎక్కువ! పక్కనే పండ్ల ముక్కలు. అంతా కొలతలు ప్రకారం. దేశ రక్షణ కోసం మిలటరీ వాళ్ళు ఎంత క్రమశిక్షణగా ఉంటారో మన ఆరోగ్యాల కోసం అమ్మ క్రమశిక్షణ తీసుకువచ్చింది అంటూ నవ్వుతూ చెప్పాడు  నాన్న. "మొదటి రోజు అలాగే ఉంటుందిరా తినేసేయ్ క్రమేపి అలవాటు పడిపోతుంది. నోటికి ఏది అలవాటు చేస్తే  అదే కావాలని కోరుకుంటుంది అంటూ  తత్వం బోధించాడు నాన్న .

ఇంక చేసేదేముంది భోజనం అయిందనిపించి హాల్లోకి వచ్చేటప్పటికి ఫోన్ రింగ్ అయింది. 

అమెరికా నుంచి నుంచి రంగనాథ్ పిల్లలు మాట్లాడుతూ  “నానమ్మ  రుచులన్నీ మిస్ అయిపోయాం. మీరేనా బాగా ఎంజాయ్ చేయండి” అంటూ అనేసరికి … రాజేష్ కి ఎక్కడలేని కోపం ముంచుకొచ్చి అసలు విషయం  అంతా చెప్పుకుంటూ వచ్చాడు. 

భార్య ,పిల్లలు ఒకటే నవ్వులు. 

“అయితే సాయంత్రం మెనూ ఏమిటి నాన్నా?” అని అడిగారు పిల్లలు. 

ఇంతలో లోపలి నుంచి రాజ్యలక్ష్మి  వచ్చి “వాడిని ఏడిపించకండి రా! వాడికి ఇప్పటికే నా మీద పీకలు దాకా కోపం ఉంది సాయంకాలం మూడు పుల్కాలు చిక్కుడుకాయ కూర!” అంటూ చెప్పేసరికి రంగనాథ్ కి  కోపం వచ్చినా ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. 

అలా కొద్ది రోజులు గడిచేయి. రాజ్యలక్ష్మి ఎవరికి కోపం వచ్చినా పెద్దగా పట్టించుకోకుండా డైట్ ప్లాన్ కచ్చితంగా అమలు చేస్తోంది.

ఈలోగా సంక్రాంతి పండుగ దగ్గరకొచ్చింది. గత సంవత్సరం వరకు పెరట్లో పొయ్యిలు పెట్టి పది రోజుల ముందు నుంచి స్వీట్లు హాట్లు తయారు చేయడమే కాకుండా చుట్టుపక్కల అందరికీ పంపించేది. ఇప్పుడా పండగ వాతావరణం లేదు. ఇంట్లో పండిన కూరగాయలు పళ్ళు రోజూ వాడుతోంది. దొడ్లో ఆవులను పెంచడం మొదలు పెట్టారు. వాటి నుండి వచ్చే వ్యర్థ పదార్థాలే మొక్కలకి  ఎరువుగా వాడుతున్నారని నాన్న చెప్పుకుంటూ వచ్చాడు. మన ఊళ్లోఅందరూ ఇదే పద్ధతి పాటిస్తున్నారని గర్వంగా చెప్పాడు నాన్న. 

పండగ స్పెషల్ అంటూ ఏమి ప్రత్యేకంగా లేదు. అలా చప్ప చప్పగ పండగ వెళ్ళిపోయింది. 
ఊళ్లో జరిగే జాతర్లన్నీ మామూలే. పండగ హుషారు మామూలే. అలా రంగనాథ్ అమెరికా వెళ్లే రోజు దగ్గర పడింది. ఇదివరలో వారం రోజులు ముందు నుంచి అమ్మ  లగేజ్ తయారు చేసేది. ఇప్పుడా సూచనలేవీ లేవు. రాజేష్ కి కూడా నెల రోజుల నుంచి చేస్తున్న డైట్ ప్లాన్ మూలంగా ప్రత్యేకంగా ఏమీ తినాలని లేదు. వెళ్లే ముందు కొడుకుని దగ్గర తీసుకుని  రాజ్యలక్ష్మి రెండు వీడియోలు చేతిలో పెట్టింది. ఇవి కోడలికి ఇవ్వరా. నూనె లేకుండా వంటలు తయారు చేసే వీడియోలు అంటూ చెప్పింది. 

రాజేష్ కి చాలా కోపం వచ్చినా మౌనంగా ఉండిపోయాడు.

ఆ తర్వాత రాజ్యలక్ష్మి ఇలా  చెప్పడం ప్రారంభించింది. "చూడు నాయనా ఇన్నాళ్ళు  నిన్ను నా ఆరోగ్య సూత్రాలతో బాధపెట్టాను అని నాకు తెలుసు. బాధ కంటే నాకు భయం ఎక్కువ. అప్పటి రోజుల్లో అప్పటి వాతావరణము అప్పటి ఉద్యోగ పరిస్థితులను బట్టి ఆ తిండి వారికి సరిపడేది. అంటే ఎక్కువగా కాయ కష్టం చేసుకుని బ్రతికేవారు . అప్పట్లో గృహిణులు ముఖ్యంగా కష్టపడి వంట చేసుకునేవారు. ఇప్పటి రోజుల్లో అన్ని యంత్రాలు వచ్చి ఎవరికీ శారీరక శ్రమ లేకుండా అయిపోయింది. అలాగే మగ పిల్లలు కంప్యూటర్ల మీద కూర్చుని ఏసీ గదుల్లో గంటలు తరబడి పని చేస్తున్నారు. ఆకలేసినప్పుడల్లా ఏది దొరికితే అది తింటున్నారు. అంతేకాకుండా సమాజంలో హోదా పెరిగే కొద్దీ రోజూ పార్టీలు పబ్బులు గొడవై ఎక్కువైపోయింది. ఇదివరకు పుట్టినరోజు పండగ అంటే కేకులు కోసే వాళ్ళం కాదు. ఏదో పిండి వంట చేసుకునే వాళ్ళ o. ఆ పిండి వంటలు కూడా ఎవరికీ పడట్లేదు. మనిషికి తగినంత శారీరక వ్యాయామం లేకపోవడం వలన ఈ అనారోగ్యాలన్నీ వచ్చి మందులకి వేలకివేలు ఖర్చు పెడుతున్నాం. హోటల్లో తినడం అనేది ఒక హోదా కాదు. సరదా కాదు. కేవలం బద్ధకం. పక్కనే అనారోగ్యం పొంచి ఉందనే విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 30 ఏళ్ల వయసు వచ్చిన యువతీయువకులకు పొట్టలు పెరిగి ఆయాస పడిపోతున్నారు. మొదటి అంతస్తులో కాపురం ఉన్నా లిఫ్ట్ ఎక్కే వాళ్ళు చాలామంది. నాలుగు అడుగుల దూరం కూడా నడవకుండా బండి ఉపయోగించే వాళ్ళు చాలామంది. ఇవన్నీ అనారోగ్యాలు తెచ్చి పెడుతున్నాయి. ఉద్యోగం సంపాదన హోదా ఇది ఒక్కటే కాదు ఆరోగ్య సంరక్షణ కూడా చేసుకోవాలి. ఇదివరలో మా తరం వారికి తెలియక అమ్మంటే బిడ్డ కడుపు నింపేది మాత్రమే అని, కావలసింది, రుచికరంగా చేసి పెట్టేదని మాత్రమే అనుకునేవాళ్ళం.

ఇప్పుడు ఆధునికంగా అలా అనుకోవాడానికి వీలు లేదు. ఈ మధ్యకాలంలో చాలా మంచి మంచి డాక్టర్లు చెప్పిన విషయాలు వింటుంటే ఆరోగ్యకరమైన ఆహారం పెట్టవలసిన బాధ్యత ఆ ఇంటి యజమానురాలి మీదే ఉంది అని నొక్కి చెప్తున్నారు. అందుకే నిన్ను అలా బాధ పెట్టాను. కోడలికి కూడా ఈ విషయాలన్నీ చెప్పు రేపటీ  పౌరులను ఆరోగ్యకరంగా తయారు చేయవలసిన బాధ్యత ఇంటి యజమానురాలిదే. 
ఇంతవరకు అమ్మ తప్పే చేసింది ఏమో . అదే బాటలో పిల్లలు కూడా నడిచారు. కానీ ఇప్పుడు అమ్మ తన తప్పు తెలుసుకుని సరిదిద్దవలసిన సమయం ఖచ్చితంగా వచ్చింది!” 
అంటూ సుధీర్ఘ ఉపన్యాసం ఇచ్చింది రాజ్యలక్ష్మి. 

అమ్మ మాటల్లో నిజం గ్రహించిన రంగనాథ్ మౌనంగా ఉండిపోయి అమెరికా ప్రయాణమైపోయి వెళ్ళిపోయాడు...✍️

     — సేకరణ.

🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

No comments:

Post a Comment