Thursday, November 28, 2024

 🌹"భార్యదే అసలైన చదువు".🌹

అవును... 
భార్యదే  నిజమైన చదువు... 

చిన్నప్పుడు...
తల్లిదండ్రులను... 

చదువుకున్నప్పుడు
స్నేహితులను... 

కలిసిమెలిసి
తిరిగేటప్పుడు
ఇరుగుపొరుగు వారిని
చదువుకుంది... 

పెళ్ళి అయ్యాక...
భర్తను చదువుతుంది... 
పిల్లలను చదువుతుంది... 
తన కుటుంబ సభ్యులను
చదువుతుంది... 
పరిసరాలను చదువుతుంది... 

అందుకే...

భర్తకు...
తన గురించి తనకు
తెలియని విషయాలెన్నో
భార్యకు తెలుసు!

తల్లికి ఏం యిష్టమో 
తన కంటే తన భార్యకే 
బాగా తెలుసు... 

పిల్లలు ఏం తింటారో 
తండ్రిగా తన కంటే 
తల్లిగా తనకే తెలుసు... 

అందుకు ...
ఆశ్చర్యం, ఆనందం... రెండూనూ!

సంసారం  ఒక గడియారమనుకుంటే...

చిన్న ముల్లు భర్త... 
పెద్ద ముల్లు భార్య... 

గంటల ముల్లులా
మందగమనం 
భర్త వ్యవహారం!

నిమిషాల ముల్లులా
చకచకా సాగుతుంది 
భార్య శతావధానం!

వంటింట్లో సహకరిద్దామంటే
అగ్గి సిగ్గుపడుతుందట... 

కనీసం 
ఇల్లైనా ఊడుద్దామంటే
చీపురు చిరాకు పడుతుందట..!

పోనీ...
భోజనానంతరమైనా
కంచాలు కడగడంలో
చేయి కలుపుదామంటే
పుణ్యం నాకు దక్కకుండా
చేయడానికా అని 
కంట నీరు తిప్పుతుంది... 

ఇవన్నీ 
తన అధ్యయనం వల్లే
నేర్చుకుంది.

ఇన్ని చదువుతున్న 
తనకు ఇంగ్లీషు చదవడం
నేర్పుదామంటే 
నువ్వుండగ నాకేం లోటని
అమాయకంగా నవ్వుతుంది... 

ఇంకా...
లెక్కల్లో కూడా 
నేనే ఫష్ట్ అంటుంది...

పేపరు మీద రూపాయల
లెక్కలు మీరు చెబితే... 
ఆ రూపాయలతో 
ఇల్లు చక్కబెట్టే లెక్కలు నావని 
అంటుంది

ఎందుకంటే..
పుస్తకాల్ని 
మాత్రమే చదివేది భర్త... 

భర్తను సైతం 
చదివేది భార్య... 

ఇంటిల్లపాదిని
తన హస్తరేఖలుగా మలుచుకొన్న తన నేర్పంతా
తన సంస్కారం ముందు
తల వంచుతూనే ఉంటుంది... 

అందుకే 
ఆమె చదువే గొప్పది... 
ఆమె సంస్కారమే ఎనలేనిది...
ఓడి గెలుస్తుంటుంది భార్య!
గెలిచి ఓడేది భర్త.. !!

అందుకే తనే 
ఓ సిద్ధాంతమైంది

పెసలు నలిగి పిండి కాలాలంటే 
తిరగలి పాప ఒకటి
తిరుగుతుండాలి... 
ఇంకొకటి కదలకుండా ఉండాలి
అని తిరగలి సిద్ధాంతం బోధిస్తుంది

పనిమనిషినైనా
పెట్టుకుందామంటే...

పనిచేయని ఒళ్ళు 
రోగాల పుట్టని ఆరోగ్య చిట్కాలు
చెబుతుంది!

ఎలా చూసినా ... 
అసలైన చదువు తనదేనని
అనుక్షణం రుజువు 
చేస్తూనే ఉంటుంది!

అందుకే... 

శ్రీమతి 
ఒక అమూల్యమైన
బహుమతి
ఆమే చదువుల సరస్వతి
 *kVSS*

No comments:

Post a Comment