*🌺🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺*
*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
*భగవంతుడు ఈ విశ్వాన్నంతా సృష్టిస్తున్నాడు. కానీ ఏమైనా శబ్దం చేస్తున్నాడా? సూర్య భగవానుడు కాలనియమాన్ని అనుసరించి ఉదయిస్తూ, అస్తమిస్తూ లోకాన్ని రక్షిస్తున్నాడు. చంద్రుడు చల్లదనాన్ని ఇస్తూ ప్రశాంతతను కలిగిస్తున్నాడు. ఇలాగే గొప్పగొప్ప కార్యాలు నిర్వర్తించే వారందరూ మౌనంగా ఉండి లేదా తక్కువగా మాట్లాడి ఆ పనులు చేస్తున్నారు. సనక సనందనాదులకు ఒకసారి ప్రణవాన్ని గురించి సందేహం రాగా బ్రహ్మదేవుని వద్దకు వెళ్లారు. అక్కడ వారి సందేహం తీరలేదు. దీంతో వైకుంఠానికి వెళ్లారు. అక్కడా వారికి సరైన సమాధానం లభించలేదు. వెంటనే కైలాసానికి వెళ్లారు.*
*మహేశ్వరుడు ముందుగానే వీరి రాకను గమనించి... పార్వతీ దేవిని, కైలాసాన్ని వీడి ఒక అక్షయ వట వృక్షం క్రింద దక్షిణాభిముఖుడై, నవ యౌవనాకారంలో అర్థనిమిలిత నేత్రుడై చిన్ముద్రను ధరించి కూర్చున్నాడు.*
*చిత్రం వట తరోర్మూలే వృద్ధాఃశిష్యా గురోర్యువా*
*గురోస్తు మౌనం వ్యాఖ్యనం శిష్యాస్తుచ్ఛిన్న సంశయాః*
*సాధారణంగా గురువులు పెద్దవారుగానూ, శిష్యులు చిన్నవారిగానూ ఉంటారు. కానీ ఇక్కడ గురువు చిన్నవాడై, శిష్యులు పెద్దవారుగా ఉన్నారు. అంతే కాదు... వారు గురువును ఎలాంటి ప్రశ్నలూ వేయలేదు. గురువు కూడా ఏ సమాధానమూ చెప్పలేదు. ‘గురోస్తు మౌనం వ్యాఖ్యానమ్’ అన్నట్లుగా గురువుగారి మౌనమే వారి సందేహాలను నివృత్తి చేసింది. ఆయన చిన్ముద్రయే వారికి జీవ బ్రహ్మైక్య జ్ఞానోపదేశం కలిగించింది. నిగూఢమైన తత్వ విషయంలోనే మహేశ్వరుడు మౌనంతో ఎదుటివారి సంశయాన్ని నివృత్తి చేశారంటే మౌనం ఎంత గొప్పదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా! ‘యోగ వాసిష్ఠ నిర్వాణ ప్రకరణం’లో మౌనాన్ని నాలుగు రకాలుగా నిర్వచించారు. మొదటిది వాజ్మౌనం. అనగా వాక్కును నిరోధించుట.*
*రెండవది యక్షమౌనం. అనగా ఇంద్రియ నిగ్రహం. మూడవది కాష్ఠ మౌనం. అనగా ప్రయత్నములన్నింటినీ విడిచిపెట్టడం. నాలుగోది సుషుప్తిమౌనం. అనగా తురీయావస్థ. అంటే... జీవన్ముక్తులు ఆత్మతత్వాన్ని అవలంబించడం. ‘నేనెవరు?’ అనే స్థితికి చేరుకోవాలంటే అంతర్దర్శనం కావాలి. అంతర్దర్శనం కావాలంటే మౌనంగా ఆత్మవిచారం చేయాలి. మౌనం అంటే మాట్లాడకుండా ఉండటమే కాదు, మాట్లాడాలని అనిపించకపోవడం. మిత భాషణము కూడ కొంత వరకు మౌనమేనని భారతం చెబుతోంది. భాషలన్నింటికన్నా అత్యంత శక్తివంతమైనది మౌనం. దానికి పదాలులేవు. కానీ సమస్తాన్నీ వ్యక్తం చేస్తుంది. వినమ్రత దాని లక్షణం. ఓర్పు సహనాలకు అది సంకేతం. కోపంపై నియంత్రణను చూపించే అతి నమ్మకమైన మార్గమిది. మాటలు వట్టివి. చేతలు గట్టివి కనుక మౌనం బంగారంతో సమానం.*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
*🙏సర్వేజనా సుఖినో భవంతు🙏*
🌴🌵🌴 🌵🌴🌵 🌴🌵🌴
No comments:
Post a Comment