Thursday, November 28, 2024

 ఒక జాలరి పడవ మీద చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్ళాడు. రోజూ వెళ్తూ ఉంటాడు. ఇలా వెళ్లే కొలదీ పడవ భాగాలు సముద్రపు నీటిలో తడిసి పాడై పోతూ ఉన్నాయి. ఇంకా తెరచాప ఎండకు ఎండి వానకు తడిసి చీకి పోతూ ఉంది. దానికి గట్టిన త్రాళ్లు కూడ మెల్లమెల్లగా పొట్టిపోతూ ఉంటాయి. ఇలా ప్రతి భాగం తేలికవుతూ ఉంటాయి. వర్షాకాలం వానల సమయంలో చేపల వేటకు వెళ్ళరు గనుక ఆ పడవను సముద్రపు ఒడ్డునే పడవేయడం జరుగుతుంది. సముద్రం నీటిలోనే సగం పాడయిన ఆ పడవ ఎండకు ఎండి, గాలికి ఊగి, వానకు తడిసి, అలల తాకిడికి కట్లన్నీ తెగిపోయి ఇంకా ఇంకా బొగిలి పోయి తేలిక అవుతుంది. భగవానుడు ధమ్మపదంలో చెప్పిన గాథను చూద్దాం...

*సించ భిక్షు ఇమం నావం, సిత్తా తే లహుమేస్సతి; 
ఛేత్వా రాగంచ దోసంచ, తతో నిబ్బానమేహిసి.*

భిక్షూ, ఈ శరీరం అనే నావను ఖాలీ చేయు! ఖాలీ చేయబడిన నావ తేలిక అవుతుంది. అప్పుడు నీవు రాగద్వేషాలను నరికివేసి నిర్వాణాన్ని పొందగలవు.

సముద్రమనే సంసారంలో ఒడుదుడుకుల అలలపై తేలియాడే పడవే మానవుడు. ఆ పడవ లంగరు వేయబడి ఉంది. అలాగే మానవుడు రాగద్వేషాలనే తాళ్ళతో బంధించబడి ఉన్నాడు. ఈ బంధాలను తెంచుకోవడానికి లేదా బలహీన పరచడానికి సహజ ప్రకృతి సహాయమే తీసుకోవాలి. పడవ త్రాళ్ళు ఎండకు ఎండి వానకు తడిసి బలహీన పడతాయి. అలాగే రాగద్వేషాలనే త్రాళ్ళు ధర్మంపై విశ్వాసంతో, సహజ శ్వాసను గమనించడం ద్వారా, సహజ సంవేదనలను గమనించడం ద్వారా బలహీన పడతాయి. అలా బలహీన పడటం వాటి ధర్మమై ఉంది.

ఖాళీ పడవ : ఒక వ్యక్తి ఒక నదిలో చిన్న పడవపై ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అతని పడవను ఒక ఖాళీ పడవ ఢీకొనడం జరిగింది. అతడు ఎంత కోపగించుకొనే మనస్తత్వము కలవాడైనా ఎవరిమీద కోపగించుకుని అరుస్తాడు? అది ఖాళీ పడవగదా! కాని పడవలో ఎవరో ఒకరు ఉన్నట్లయితే అతని మీద అరవడమే కాదు, కొట్టి గూడా ఉండేవాడు. ఆ పడవ ఖాళీగా ఉండటం వలన తిట్టడమూ లేదు, కోపమూ లేదు. కనుక నీ పడవను నీవు ఖాళీచేస్తే ఎవరూ నిన్ను వ్యతిరేకించరు. ఎవరూ హానిచేయరు.

No comments:

Post a Comment