☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️
28. తస్యతే భక్తివాం సఃస్యామ
పరమేశ్వరా! మేము నీ భక్తులగుదము గాక(అథర్వవేదం)
భక్తిమార్గం వేదాలలో లేదనీ, అది తర్వాత కాలంలో ప్రబలిందనీ ఆధునికులు వ్యాఖ్యానించారు. దానిని అనుసరించే మనం భిన్నాభిప్రాయాలు ఏర్పరచుకుంటున్నాం.
కానీ వైదిక భావనలోనే 'భక్తి' ప్రస్ఫుటంగా చెప్పబడింది భగవత్ శరణాగతి వంటి ధర్మాలను వేదాలలో అనేకచోట్ల వివరించారు.
కర్మ, జ్ఞాన, భక్తి మార్గాల సమన్వయమే వేదధర్మం.
వైదిక సంస్కారమైన 'నమస్కారం', 'శ్రద్ధ' వంటి శబ్దాలు భక్తి మూలకందాలు.
'భజ్' శబ్దానికి 'ఆశ్రయించుట' అని అర్థం. భగవంతుని ఆశ్రయించమే భక్తి.
ఆశ్రయంలో భగవంతుని స్తుతించడం, ఆయన లీలలను గానం చేయడం వాఙ్మయంలో కనిపిస్తుంది.
సామవేదంలో భగవత్సృష్టిలోని రామణీయకతని వర్ణించడం ద్యోతకమౌతుంది.
“స్తుహి శ్రుతం గర్తసదం”వంటి యజుర్వేద మంత్రాలలో భగవంతుని స్తోత్రించడం అనే ఆత్మప్రబోధం కనిపిస్తుంది.
యో భూతం చ భవ్యంచ
సర్వం యశ్చాధితిష్ఠతి।
సర్వం చ కేవలం
తస్మై జ్యేష్టాయ బ్రహ్మణే నమః||
సర్వకాలాలకు, లోకాలకూ అధిష్ఠానమై సర్వాధికుడైన 'బ్రహ్మమునకు నమస్కారం'-
అని భగవత్ భక్తికి ప్రణమిల్లే మంత్రాలు వేదాలలో కోకొల్లలు.
-
వైదిక యజ్ఞాలలో వివిధ దేవతలకు వందనాలు అర్పించడం తెలిసిన విషయమే.
గూహతా గుహ్యం తమో వియాత విశ్వమత్రిణమ్, జ్యోతిష్కర్తాయదుశ్మసి,
వంటి ఋగ్వేద మంత్రాలు హృదయగుహలోని అంధకారాన్ని తొలగించమని జ్యోతిర్మయుడైన భగవంతుని ప్రార్థించుతున్నాయి.
మా చిదన్యత్ విశంస్యత
సఖాయో మా రిషణ్యత॥
-
'అనేది ఋగ్వేదమంత్రం. 'చైతన్యమయుడైన పరబ్రహ్మను విడిచి ఇంక దేనినీ ఆశ్రయించవద్దు' - అని 'అనన్యభక్తి' భావాన్ని ప్రబోధిస్తుంది.
భగవతృపయే నిజమైన ఆలంబనమని - కఠోపనిషత్తులోని 'ఏతదాలంబనం శ్రేష్ఠమే తదాలంబనం పరమ్' అనే మంత్రం తెలియజేస్తోంది.
‘నా' బుద్ధి, నేర్పూ, యుక్తి, శక్తీ - వీటన్నిటికీ సార్థకత నిన్ను స్తుతించినప్పుడే, నీ సన్నిధిని చేరినప్పుడే' - అని చెప్పే ఋగ్వేద మంత్రాలున్నాయి. 'నేను భగవంతుని
వానిని, భగవంతుడు నావాడు' - అనేది భక్తిలో ప్రధానమైన విషయం. ఈ భగవత్ సంబంధమే మన పురాణాల్లో విస్తృతంగా చెప్పబడింది. వేదధర్మాన్ని విస్తృతంగా చెప్పేవే పురాణేతిహాసాలు.
"
పురాణాలు వేదాల్ని నమస్కరిస్తూ -“ఆదౌ వేదమయీ దివ్యాయతః సర్వాః ప్రవృత్తయః'(మొదటనున్నది వేదమయ దివ్య వాక్కు. దాని నుండే సర్వమూ ఏర్పడ్డాయి) అని వేదధర్మాన్ని అనుసరించాయి.
త్వమస్మాకం తవస్మసి - 'నువ్వు మా వాడవు, మేము నీ వారము' - అని ఋగ్వేదం భక్తిని పరమధర్మంగా ప్రకటించింది.
వేదవేద్యమైన పరతత్త్వాన్నే శివ - విష్ణు శక్తులుగా ఆరాధించి ఆ భక్తితో తరించిన యోగులు ఎందరో!
No comments:
Post a Comment