*దెబ్బకు ఏడుమంది (మిమ్మల్ని నవ్వుల్లో ముంచెత్తే జానపద హాస్యకథ)* - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
*****************************
ఒకూరిలో ఒక పిల్లోడు వుండేటోడు. వాడు పెద్ద సోమరిపోతు. ఎప్పుడూ ఏ పనీ చేయకుండా గప్పాలు కొట్టుకుంటా ఊరంతా తిరిగేటోడు. ఒక రోజు వాడు ఇంట్లో కూచోని, వాళ్ళమ్మ చేసిన నేతిలడ్లు తింటా వుంటే... ఆ కమ్మని వాసనకు ఎక్కడెక్కడి ఈగలన్నీ వచ్చి రయ్యమని ముసురుకున్నాయి. ఎన్నిసార్లు తోలినా అవి మళ్ళీ మళ్ళీ రాసాగినాయి. దాంతో వానికి బాగా కోపమొచ్చింది. ఇట్లాగయితే లాభం లేదనుకోని ఈసారి ఈగలన్నీ వాలగానే ఒక్కసారిగా రెండుచేతులతో పట్టుమని ఒక్కటి కొట్టినాడు. అంతే దెబ్బకి ఏడు వచ్చి కిందబన్నాయి. వాటిని చూసి వాడు “అబ్బ... నేనెంత వీరున్ని ఒక్కదెబ్బకి ఏడింటిని చంపేశాను" అని సంబరపడినాడు. వెంటనే ఒక బట్టలు కుట్టే దర్జీ దగ్గరికి పోయి భుజమ్మీద నుండి నడుము వరకు వేలాడేటట్టు ఒక పెద్ద పట్టీని కుట్టిచ్చుకున్నాడు. దాని మీద “దెబ్బకి ఏడుమంది" అని పెద్ద పెద్ద అక్షరాలతో రాయించి అంగీ మీద తగిలించుకున్నాడు. అట్లా తగిలిచ్చుకొనేసరికి వానికి ఎక్కడలేని ధైర్యం వచ్చింది.
వానికి తన బలం ఆవూరి మహారాజుకి చూపించి అక్కడ ఏదయినా మంచి వుద్యోగం సంపాదించాలనిపించింది. రాజుండేది పక్క ఊరిలో, మధ్యలో పెద్ద అడవి వుంది. దాన్ని దాటాల. దాంతో వాడు దారిలో ఆకలయితే తినడానికని జేబు నిండా లడ్లు వేసుకొని బైలుదేరినాడు. అట్లా అడవిలో పోతావుంటే, దారిలో ఒకచోట ఒక గద్ద ఒక పిట్టను పట్టుకోవడం కనిపించింది. వెంటనే వీడు అయ్యో పాపమని జాలిపడి
వెంటనే ఒక రాయి తీసుకోని గద్దను ఈడ్చి ఒక్కటి పెరికినాడు. ఆ దెబ్బకు అది అదిరిపడి అక్కడికక్కడే పిట్టను వదిలి పారిపోయింది. వాడు ఆ పిట్టను తీసుకోని దానికి నీళ్ళు తాపి, గింజలు పెట్టి భద్రంగా జేబులో వేసుకొని పోసాగినాడు.
ఆ అడవి మధ్యలో ఇద్దరు పెద్ద పెద్ద రాక్షసులున్నారు. వాళ్ళకి అడవిలో ఎవరయినా మనిషి కనబడితే చాలు వెంటబడి చంపి తినడం అలవాటు. అందుకే అటువైపు ఎవరూ వెళ్ళేటోళ్ళు కాదు.
కానీ వీనికి ఆ రాక్షసుల సంగతి తెలీదు. దాంతో అట్లాగే పోయినాడు.
చానా రోజుల నుంచి మనుషులెవరూ దొరకక అల్లాడతావున్న రాక్షసులు వీన్ని చూడగానే లొట్టలేస్తా ఎగురుకుంటా వచ్చి “రేయ్ ఎవడ్రా నువ్వు. మా అడవిలోకి రావడానికి ఎంత ధైర్యం నీకు" అన్నారు గట్టిగా. వాళ్ళని చూడగానే మనోనికి గుండె గుభేలుమనింది. కాళ్ళు, చేతులు వణికిపోయినాయి. అయినా ధైర్యం కూడగట్టుకోని "నేనెవరినా, ఇదిగో చూడండి" అంటూ పట్టీని చూపించినాడు. దాని మీద దెబ్బకి ఏడుమంది అని వుంది గదా... అది చూసి రాక్షసులు ఆచ్చర్యపోయి “మా మోకాలెత్తు లేవు. నీవు దెబ్బకి ఏడుమందిని చంపినావా మేము నమ్మము" అన్నారు. దానికి వాడు నవ్వి “సరే... అయితే ఏదయినా పోటీ పెట్టుకుందాం. సరేనా" అన్నాడు. ఆ రాక్షసులిద్దరూ 'సరే' అన్నారు.
మొదట ఒక రాక్షసుడు ఒక రాయి తీసుకోని "నువ్వు నాలాగా రాయిని చేత్తో ముక్కలు చేయాల. చేస్తావా" అంటూ రాయిని గట్టిగా నొక్కినాడు. వాని బలానికి అది ముక్కలు ముక్కలు అయ్యింది. అది చూసి మనోనికి ఏం చేయాల్నో అర్థం కాలేదు. అంతలో జేబులో వున్న లడ్డు గుర్తుకు వచ్చింది. వెంటనే ఆ రాక్షసులకు కనబడకుండా అది బయటికి తీసి అరచేతిలో దాచి పెట్టుకోని “రాయిని ముక్కలు ముక్కలు చేయడం ఏం గొప్పతనం. ఆ మాత్రం పని ఏ గొట్టంగాడయినా చేస్తాడు. నన్ను చూడు ఏకంగా రాయిలోంచి నూనెను గూడా పిండగలను" అంటూ ఒక రాయి తీసుకోని గట్టిగా పిసకసాగినాడు. ఆ చేతిలోనే నేతిలడ్డు గూడా వుంది గదా... దాంతో గట్టిగా ఒత్తేసరికి అందులోనించి కొన్ని నేతిచుక్కలు కారి కిందబడినాయి. అది చూసి రాక్షసులు అదిరిపడి "అబ్బో వీడెవ్వడోగానీ నిజంగానే మనకన్నా బలవంతునిలాగున్నాడే" అనుకున్నారు.
అయినా అనుమానం తీరక, రెండో రాక్షసుడు "సరే ఇందులో నువ్వే గెలిచినావుగానీ ఇంకొక పోటీ పెట్టుకుందాం. మనిద్దరమూ చెరొక రాయి విసురుదాం. ఎవరిది దూరంగా పడితే వాళ్ళు గెలిచినట్టు" అన్నాడు.
"సరే నువ్వు ముందు విసురు" అన్నాడు వాడు.
రాక్షసుడు ఒక రాయి తీసుకోని తన బలమంతా వుపయోగించి వేగంగా విసిరినాడు. అది సర్రున చానా దూరం పోయి దబ్బుమని చప్పుడు చేస్తూ ఒకచోట పడింది.
తరువాత వీడు విసరాల గదా. రాక్షసునికన్నా దూరం ఎలా విసరాలబ్బా అని ఆలోచిస్తా వుంటే జేబులో వున్న పిట్ట గుర్తుకు వచ్చింది. వెంటనే ఆ రాక్షసులకు కనబడకుండా జేబులోని పిట్టను తీసి "ఆ మాత్రం దూరం ఏ గొట్టంగాడయినా విసురుతాడు. నేను చూడు కనీసం చిన్న చప్పుడు గూడా వినిపించనంత దూరం విసురుతా" అంటూ ఆ పిట్టను విసిరినాడు. అంతే అది సర్రున ఆగకుండా ఎగిరిపోయింది. అది చూసి రాక్షసులు అదిరిపడి “అబ్బో... వీడెవడో నిజంగానే మనకన్నా బలవంతునిలాగున్నాడే" అనుకున్నారు.
వెంటనే "నువ్వే మా కన్నా బలవంతునివి అని ఒప్పుకుంటాం. ఇప్పటికే బాగా చీకటి పడింది. ఈరోజు రాత్రికి మా ఇంటికి వచ్చి మేమిచ్చే విందు తీసుకోని మా ఇంట్లోనే పడుకో. రేప్పొద్దున్నే పోదువుగాని” అన్నారు. వాడు సరేనంటూ దగ్గర్లోనే వున్న వాళ్ళ ఇంటికి పోయినాడు.
రాక్షసులు వానికి ఆ రాత్రి మంచి మంచి పిండివంటలు పెట్టి తిన్నాక పండుకోడానికి ఒక పెద్ద గది చూపించినారు. దాంట్లో పెద్ద మంచమూ, మెత్తని పరుపులూ వున్నాయి. పోయి పండుకున్నాడుగానీ వానికి రాక్షసుల పైన నమ్మకం కుదరలేదు. కాసేపున్నాక చప్పుడు చేయకుండా అడుగులో అడుగు వేసుకుంటా ఆ రాక్షసులున్న గదికాడికి వచ్చినాడు. అప్పుడే ఒక రాక్షసుడు ఇంకో రాక్షసునితో “ఒరేయ్ ఇంతవరకూ వీడు తప్ప మనలని ఎదిరించి నిలబడిన వీరుడెవడూ లేడు. వీన్ని ఇట్లాగే వదిలేసినామంటే విషయం అందరికీ తెలిసి మన మర్యాద పోతాది. అందుకే ఎట్లాగయినా సరే... ఈ రాత్రే వాన్ని పండుకున్నోన్ని పండుకున్నట్టు ఇనుపస్తంభాలతో కొట్టి చంపేద్దాం" అన్నాడు. రెండోవాడు 'సరే' అన్నాడు.
కిటికీ పక్క నుండి ఆ మాటలన్నీ విన్న ఆ పిల్లోడు "ఓహో! ఇదా సంగతి" అనుకోని పరుగుపరుగున గదిలోనికి పోయి మంచం మీద దిండ్లన్నీ వరుసగా పెట్టి, వాటి మీద దుప్పటి నిండుగా కప్పి దీపాలన్నీ అర్పి ఒక మూలన దాక్కొని చూడసాగినాడు.
అర్ధరాత్రి కాగానే ఆ రాక్షసులిద్దరూ తలా ఒక కడ్డీ లావుది చేత పట్టుకోని గదిలోకి వచ్చినారు. గదంతా చీకటిగా వుండటంతో మంచమ్మీద వున్నది మనిషే అనుకున్నారు. చెరో పక్కన చేరుకోని ధనధనధన దెబ్బ మీద దెబ్బ... దెబ్బ మీద దెబ్బ వేసినారు. అంతే... ఆ దెబ్బలకు అంత లావు మంచం విరిగి తునాతునకలయ్యింది. "దెబ్బకు కిక్కురుమనకుండా చచ్చినాడు వెధవ. వీనితో మనకు పీడా పోయింది" అనుకుంటా వాళ్ళు సంబరంగా వెళ్ళిపోయినారు.
తరువాత రోజు పొద్దున్నే రాక్షసులిద్దరూ ఇంటిబైట కూచోని వేపమొద్దుతో పండ్లు తోముకుంటా వుంటే వాడు ఒళ్ళు విరుచుకుంటా వాళ్ళ మధ్యలోకి వచ్చినాడు. వాన్ని చూసి ఆ రాక్షసులిద్దరూ అదిరిపడినారు. చిన్న రాక్షసుడు భయంతో వణికిపోతా "ర... ర్ర... ర్ర... రాత్రి నీకు నిద్ర పట్టిందా అనడిగినాడు.
"ఆ... ఆ... బాగానే పట్టింది.
కానీ అర్ధరాత్రి ఎలుకలు మీద తిరుగుతా తోకలతో కొట్టి కొంచం అల్లరి చేసినాయ్" అన్నాడు.
అంతే ఆ రాక్షసులు “ఓరినాయనోయ్... వీడు మామూలోడు కాదు. ఇనుప కడ్డీల దెబ్బలు ఎలుకతోక దెబ్బలని అనుకుంటా వున్నాడు. మనం వీన్ని చంపాలనుకున్న విషయంగానీ తెలిసిందంటే మనల్ని ప్రాణాలతో వదలడు" అని వాడు పిలుస్తావున్నా ఆగకుండా అన్నించి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయినారు. వాడు నవ్వుకుంటా నెమ్మదిగా నడుస్తా పక్కనే వున్న రాజ్యానికి చేరుకున్నాడు.
ఆ రాజ్యం పొలిమేరల్లో ఇంకో ఇద్దరు రాక్షసులున్నారు. వాళ్ళు చానా చెడ్డోళ్ళు. ప్రతిరోజూ పొద్దున్నే ఊరి మీద పడి దొరికినోన్ని దొరికినట్లు చంపి తినేటోళ్ళు. రాజు ఎంతమంది సైనికులని వాళ్ళ మీదకు పంపించినా అందరూ వాళ్ళ చేతిలో చచ్చేటోళ్ళేగానీ వాళ్ళని ఏమీ చేయలేక పోయేటోళ్ళు. దాంతో రాజుకు ఏం చేయాల్నో పాలుపోక "ఎవరయితే ఆ రాక్షసులని చంపుతారో వాళ్ళకి తన రాజ్యంలో సగభాగమిస్తానని దండోరా వేయించినాడు. ఆ దండోరా విన్న పిల్లోడు రాజుని కలవడానికని పోయినాడు. సైనికులు వాన్ని బయటనే ఆపి "ఎవరు నువ్వు ... ఏం కావాల" అనడిగినారు.
దానికి వాడు కోపంగా “నేనెవరినా. దెబ్బకు ఏడు మందిని చంపిన మొనగాన్ని. చూడండి" అంటూ అంగీ మీద వేసుకున్న పట్టి చూపించినాడు. దాంతో వాళ్ళు భయపడి రాజు దగ్గరికి తీసుకోనిపోయినారు. వాడు రాజుతో “ఓరాజా! నేను ఆ రాక్షసులను చంపి వస్తాను. నీవు మాట నిలబెట్టుకుంటావా?" అన్నాడు. "అలాగే" అన్నాడు రాజు. దాంతో వాడు ఆ రాక్షసులు రాజ్యానికి ఏ పక్కనున్నారో కనుక్కోని అటువైపు పోయినాడు.
ఊరిబైట ఒక పెద్ద మర్రిచెట్టు వుంది. ఆ చెట్టు కింద రాక్షసులిద్దరూ పండుకోని గురకలు పెడ్తా కనబడినారు. వాళ్ళని ఎట్లా చంపాలబ్బా అని ఆలోచించి కొన్ని రాళ్ళు తీసుకోని జేబులో వేసుకోని చప్పుడు గాకుండా చెట్టు పైకి ఎక్కి కనబడకుండా కొమ్మల నడుమ కూచున్నాడు. ముందుగా ఒక రాయి తీసుకోని పైనుంచి ఒక రాక్షసుని తల
మీద ఈడ్చి ఒక్కటి పెరికినాడు. ఆ దెబ్బకి వాడు అదిరిపడి లేచినాడు. చుట్టూ చూస్తే ఎవరూ కనిపించలేదు. పక్కనే పడుకున్న రాక్షసుడే కొట్టి ఉంటాడనుకోని వాన్ని లేపి... 'నేను కొట్టలేదు' అన్నా వినకుండా "ఏంరా... హాయిగా పండుకోని వుంటే రాయితో కొట్టి మళ్ళీ ఏమీ తెలీనోని మాదిరి గమ్మున పండుకుంటే నేను కనిపెట్టలేను అనుకుంటున్నావా... ఇదిగో ఇంకొకసారి గనుక ఇట్లా చేసినావంటే వుంటాది చూడు. ఏమనుకుంటా వున్నావో" అని అరిచి పండుకున్నాడు.
మరలా కాసేపటికి వాడు పైనుంచి ఇంకొక రాయి తీసుకోని మరలా అదే రాక్షసుని మొగమ్మీద ఈడ్చి ఒక్కటి పెరికినాడు. అంతే... వాడు అదిరిపడి మళ్లీ లేచినాడు.
కోపంతో బుసలు కొడతా పక్కనున్నవాన్ని నిద్ర లేపి “ఏంరా... ఒళ్ళుగాని కొవ్వెక్కిందా. ఒకసారి చెబితే అర్ధంగాదా" అంటూ ధనధనధన నాలుగు గుద్దులు గుద్దినాడు. దాంతో వానికి గూడా చానా కోపమొచ్చింది. “అరే... నేను కొట్టలేదంటావున్నా వినకుండా నన్నే తంతావా. ఏం నీవేనా తన్నేది. నేను తన్నలేనా. దా చూసుకుందాం" అంటూ లేచి ఎగిరి వాని మీదకు దుంకినాడు.
ఇంగ చూడు నా సామిరంగా! ఇద్దరూ పెద్ద పెద్ద బండరాళ్ళు తీసుకోని కిందామీదా పడి కొట్టుకోసాగినారు. కాసేపటికి ఇద్దరికీ బాగా దెబ్బలు తగిలి రక్తం కారీ కారీ ఆఖరికి ఇద్దరూ చచ్చిపోయినారు.
వెంటనే వాడు చెట్టు పైనుండి దిగి రాజు దగ్గరికి పోయినాడు. “రాజా! నీకు చెప్పినట్టే ఆ రాక్షసులిద్దరినీ చంపి వచ్చినాను. నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకో" అన్నాడు. రాజు ఆచ్చర్యపోయి అడవిలోనికి పోయి చూస్తే ఇంకేముంది ఇద్దరూ చచ్చిపడి కనిపించినారు. వెంటనే రాజు సంబరంగా వాన్ని బంగారు పల్లకీలో కూచోబెట్టి తప్పెట్ల నడుమ వూరంతా తిప్పినాడు. అన్నమాట ప్రకారం అర్ధరాజ్యం ఇవ్వడమేగాక, తన కూతురిని గూడా ఇచ్చి అంగరంగవైభోగంగా పెండ్లి చేసి అల్లున్ని చేసుకున్నాడు.
*****************************
డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
*****************************
కథ నచ్చితే *SHARE* చేయండి. రచయిత పేరు మార్చకండి. తీసేయకండి.
No comments:
Post a Comment