Thursday, November 28, 2024

**** "ఆత్రేయగీత" నాల్గవ భాగం “సూక్ష్మజ్ఞానము” - 13వ భాగము. - శ్రీ శాస్త్రి ఆత్రేయ

 "ఆత్రేయగీత"

నాల్గవ భాగం

“సూక్ష్మజ్ఞానము” - 13వ భాగము.

- శ్రీ శాస్త్రి ఆత్రేయ

ఆత్మను చాలామంది చాలారకాలుగా వర్ణిస్తారు. అయితే దానిని వర్ణించేకన్నా సాధన ద్వారా అనుభూతి పొందడమే ఉత్తమము. ఆత్మను గ్రహించలేని సాధనాలన్నీ వ్యర్ధమే.

ఆత్మానుభూతి పొందడమే కర్మ-భక్తి-జ్ఞాన-వైరాగ్య మార్గముల అంతిమలక్ష్యము. అందుచేత దుర్భలుడై నిరుత్సాహంతో నున్న అర్జునునికి మొట్టమొదటిగా “సాంఖ్యయోగంలో” ఆత్మను గురించి తెలియజేశాడు గీతాచార్యుడు. అంతేగాక “విద్యలన్నింటిలో ఆత్మవిద్యను నేను” అని ఘంటాపధంగా తేల్చిచెప్పేడు శ్రీకృష్ణపరమాత్మ.

అందుకు మానవుడు చేయు ప్రతి కర్మను,
కర్మయోగముగా (నిష్కామ కర్మాచరణ / ఎటువంటి కోరిక లేకుండా కర్మలు చేయడం) మార్చుకుంటే, ఆత్మానుభూతి సులువుగా పొందవచ్చని సూచించాడు జగద్గురువు. ఇది వినడానికి, చదవడానికి కొంచం సందిగ్ధంగా వున్నా ఇది సత్యము. ఈ కర్మయోగమునే “యజ్ఞము” అని సంభోదించాడు శ్రీకృష్ణుడు.

యజ్ఞం అంటే వైరాగ్యంతో కూడిన అభ్యాసము. వైరాగ్యముండి అభ్యాసము లేకపోయినా, అభ్యాసముండి వైరాగ్యము లేకపోయినా అది యజ్ఞం అవ్వదు. ఆ యజ్ఞక్రమం అందరికీ సులువుగా అర్ధమయ్యేందుకు ఈ క్రింది విధంగా బోధించేడు జగద్గురువు

1. ప్రతిజీవి కర్మ చేయాల్సిందే.

2. ఏ కర్మ చేయకుండా మనుజులు ఒక్కక్షణం వుండలేరు.

3. చేసే ప్రతికర్మ నిష్కామంతో చేయాలి. దాన్నే కర్మయోగము లేదా యజ్ఞము అంటారు.

4. ఆత్మజ్ఞానము పొందాలంటే కర్మలన్నీ నిష్కామంతోనే చెయ్యాలి.

5. కర్మయోగికైనా, జ్ఞానయోగికైనా ఈ నిష్కామకర్మాచరణ తప్పదు.

6. కర్మయోగంతో చిత్తశుద్ధికలిగి జ్ఞానము ఉదయిస్తుంది.

7. జ్ఞానము కలిగిన తరువాత వైరాగ్యముతో కూడిన అభ్యాసము చేయాలి.

8. అన్ని జీవులయందు సమదృష్టి కలిగియుండాలి.

9. ధ్యానంతో ప్రాపంచిక విషయాలనుండి దృష్టి మరల్చాలి.

10. తనలో నిగూఢంగా వున్న ఆత్మను దర్శించాలి.

11. దీనితో మానవుడు అన్ని బంధాలనుండి విడిపడి
జీవన్ముక్తుడవుతాడు.

12. జీవాత్మ పరమాత్మలో విలీనము అవుతుంది.

అంతటితో ఈ జననమరణ చట్రము నుండి
బయటపడి, అవసరాన్ని బట్టి, ఆత్మ తన ఇచ్చానుసారం లోకంలో అవతరించుట, లోకము వీడివెళ్ళుట జరుగుతుంది. వారే సత్పురుషులు లేదా సద్గురువులు.

అంటే జీవుడు ఎచ్చట నుండి వచ్చాడో అక్కడికే చేరుకున్నాడు. ఈ నిష్కామకర్మాచరణ వలన ఇంత ప్రయోజనము కలుగుతుంది. ఇది గ్రహించక జీవుడు కామ్యకర్మలను ఆచరిస్తూ, అశాశ్వతములగు ప్రాపంచిక
వస్తువులపై బంధము పెంచుకుంటూ, ఇంద్రియములు వశుడై సుఖదుఃఖములను చవిచూస్తూ, మిగిలిన కర్మఫలితములు అనుభవించుటకు జననమరణములు పొందుతూ ఆత్మవస్తువును విస్మరిస్తూ, సత్యమును తెలుసుకొనక పరమాత్మకు దూరం అవుతున్నాడు. తాను వచ్చిన చోటుకి చేరుకోలేక పోతున్నాడు.

సదా శివ సమారంభం |
శంకరాచార్య మధ్యమాం |
అస్మదాచార్య పర్యంతం |
వందే గురు పరంపరాం |.            

No comments:

Post a Comment