*🌺🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺*
*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
*మనసు తీరు తెలుసుకో!*
*మనిషి ఒక్కోసారి ఉన్నది పోగొట్టుకొని బాధపడతాడు. అర్హత లేకపోయినా లేనిదాని కోసం ఆరాటపడి, అహరహం శ్రమించి పని సాఫల్యం చేసుకుంటాడు. కార్యం సఫలం కాకపోతే ఖిన్నుడవుతాడు. నిజానికి తాను ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చేప్పుడు ఏమి తెచ్చాడని, తాను ఏదైనా కోల్పోయినప్పుడు బాధపడాలి?! చిన్న పిల్లలు చూసిన ప్రతిదీ కావాలని మారాం చేస్తారు. ఏమీ తోచనప్పుడు ఏడుపు లంకించుకుంటారు. అప్పుడు వారు ఆడుకొనేందుకు తల్లి ఏదో ఒక ఆట వస్తువును ఇస్తుంది. సహజంగా సగటు మనిషి మనస్తత్వం చిన్న పిల్లల మనస్తత్వాన్ని పోలి ఉంటుందంటారు వైజ్ఞానికులు! మనిషి సహజ రీతిలో బాల్యం నుంచి కౌమార, యౌవన దశలకు చేరుకున్నవాడే. పసిబిడ్డలకు కావలసిన ఆట వస్తువులు పెద్దలకు అక్కరలేదు.*
*కొందరు పెద్దలు శిశు మనస్తత్వంతో పెద్దపెద్ద కోరికలే కోరుకుంటారు. భారీ కోరికలు సులభంగా తీరేవి కాదు కాబట్టి మనిషి అసంతృప్తితో జీవించ వలసి వస్తుంది. అలౌకిక ఆనందాన్ని పొందగల జ్ఞానశక్తి, బుద్ధి కుశలత ఉండికూడా మానవుడు దుఃఖితుడై ఆనందానికి దూరం కావడం నిజానికి విచారించవలసిన విషయం! భయం, కోపం, అసహ్యతా భావం, లోభం, పరవస్తు వ్యామోహం వంటివి రజో గుణ, తమోగుణ ప్రధాన లక్షణాలు! వీటికి దూరంగా ఉండాలని ధర్మశాస్త్రాలు బోధిస్తాయి. సాత్విక గుణ సంపన్నత, సాధించి తీరవలసిన అంశం. సత్వ రజస్తమో గుణ లక్షణాలకు అనుగుణంగా దేహం ప్రతిస్పందిస్తుంది. ఫలితంగా అనుభవాలు వస్తాయి. అవే సుఖదుఃఖాలు! మనిషి తీవ్రంగా భయపడినప్పుడు రోగలక్షణాలు పొడచూపుతాయి. చిత్తం ప్రశాంతమైనప్పుడు రోగాలు పూర్తిగా అదుపులో ఉంటాయి. భయం విసర్జనీయ లక్షణమని శాస్త్రాలు చెప్పిన అంశాన్ని మానవ దేహం రుజువు చేస్తున్నదా అన్నట్లు ప్రశాంత చిత్తాన్ని సాధించిన సాధకుడు ఆందోళనలు తగ్గి ఆనందభరిత జీవనం చేస్తాడు. భారతీయ తత్వచింతన, శాస్త్ర పరిజ్ఞానం ఒకే బండికి కట్టిన ఎద్దుల్లా సమన్వయం చెంది ముందుకు సాగడం సనాతన ఆధ్యాత్మికవాదులు హర్షించే విషయం! కల్మషాలు తొలగించిన అనంతరం పరిసరాలు పరిశుభ్రమై ఆహ్లాద భరితమైనట్లు త్రిగుణాల్లోని దోషాలు తొలగిన అనంతరం సాధకుడి చిత్తస్థితి నిర్మలమై అమందానందానుభూతితో ప్రకాశిస్తుంది.*
*యోగా అధ్యాపకులు అభ్యాస సమయంలో శరీరంలో జరిగే మార్పులను గమనించమని విద్యార్థులకు చెబుతారు. శ్వాస నియంత్రణ భంగిమల వల్ల రక్త ప్రసరణలో ఆరోగ్యానికి మేలు చేసే సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయని యోగశాస్త్రం చెబుతుంది. మనుషులందరూ ఒకే అవయవ అమరిక కలిగిఉన్నా స్వభావరీత్యా వారివి భిన్న మనస్తత్వాలు. కొందరు కలుపుగోలువారు. మరి కొందరు ముభావ స్వభావులు. కొందరు మనసులోని మంచి భావాలను వెల్లడించి తోటివారి మనసులు చూరగొనే అవకాశం వచ్చినా తమ అభిప్రాయాలను పంచుకోరు. సానుకూల మనస్తత్వ శోభితులు ఇంకొందరు, ఎదురుపడినవారిని పలకరించకుండా ముందుకు సాగరు. ఆప్యాయతలను వ్యక్తపరచడం వల్ల బంధాలు బలపడతాయి. మనసు చంచలమేగానీ అది మాయా మర్మం ఎరగనిది. లోకానికి వెల్లడి కాకపోయినా అది మన నుంచి మనకు బోధపడగల ఏ సత్యాన్నీ దాచదు. మన (ఆత్మ)తీరుకు అనుగుణంగా మనసును మలచుకొని రాజమార్గంలో నడిపిస్తే అది కష్టాలను కొని తేదు. ఇరుకు దారుల్లో దాని పయనం సాగనీయకపోతే మన మనసు వల్ల మనకే కాదు, ఎదుటివారికీ కష్టాల బెడద ఉండదు. జీవితం శుభప్రదమై ఆనందాలు వెల్లివిరుస్తాయి.*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
*🙏సర్వేజనాః సుఖినో భవంతు🙏*
🌴🌳🌴 🌳🌴🌳 🌴🌳🌴
No comments:
Post a Comment