Sunday, November 24, 2024

 ◆ చిన్న కథ ◆ 
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

ఓ ఊళ్ళో శ్రీమంతుడైన ఓ కుమారుడు నిత్యం ఓ సాధువు దగ్గరకు ఉపదేశాలు వినడానికి వెళ్తుండేవాడు. కానీ, ప్రవచనం పూర్తికాకుండానే వెళ్లి పోతుండేవాడు. ఒక నాడు ఆ సాధువు "నాయనా..! ఎందుకలా చేస్తున్నావు..?" అని అడిగాడు. దానికి ఆ శ్రేష్ఠి కుమారుడు.. "స్వామీ..! నేను నా తల్లి దండ్రులకు ఏకైక పుత్రుణ్ణి. ఇంటికి తిరిగి వెళ్ళడంలో ఏ మాత్రం ఆలస్యమైనా వాళ్ళు కంగారు పడతారు. నా కోసం వెదకడానికి బయలుదేరుతారు. నా భార్య కూడా నేను వెళ్ళేవరకూ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఉంటుంది. సాంసారికుల వ్యవహారం మిథ్య అని మీరంటారు. కాని, ఆ విషయంలో తమకు అనుభవం లేదు స్వామీ..!" అని బదులిచ్చేడు.

అయితే మీ వాళ్లకు నీ మీద అంత ప్రేమ అంటావ్... అన్నాడు సాధువు. అవును స్వామీ..! నా మాట మీద తమకు నమ్మకం లేనట్లుంది. అన్నాడా యువకుడు."నాకు ఉండడం, లేకపోవడం గురించి కాదు. నీకు నమ్మకం కలగడానికి ప్రేమ పరీక్ష పెట్టి చూసుకో..!" అని సలహా ఇచ్చేడు సాధువు.  "ఎలా స్వామీ..?" అడిగేడు ఆ యువకుడు."ఇదిగో..! ఈ మూలిక తిను.
నీ శరీరం క్రమేణా వేడెక్కిపోతుంది. తరువాత అక్కడ జరిగేదేమిటో నువ్వే చూస్తావు." అని చెప్పేడు సాధువు. ఆ యువకుడు సాధువు ఆదేశాన్ని పాటించి ఆ మూలిక తిని ఇంటికి వెళ్లిపోయేడు.

అతని శరీరం ఒక్కసారిగా వేడెక్కిపోయింది. తలిదండ్రులు వైద్యుని పిలిపించి చూపించేరు. వైద్యుడు ఏం చేసినా ఫలితం లేదు. భార్య వెక్కి వెక్కి ఏడవసాగింది. ఇంతలో ఆ సాధువు వచ్చేడు. అందరూ ఆ యువకునికి చికిత్స చేయమని సాధువును అర్థించారు. సాధువు చూసి.. "ఎవరో మాయను ప్రయోగించేరు. నేను దాన్నిని ఉపసంహరించగలను." అని అతడు ఓ పాత్రతో నీరు తెమ్మన్నాడు. ఆ నీటిని యువకుని తల చుట్టూ త్రిప్పి "నేను నా మంత్రశక్తితో ఆ దుష్టగ్రహాన్ని ఈ నీటిలోకి పంపించేసేను. ఈ యువకుణ్ణి రక్షించాలంటే మీలో ఎవరైనా ఈ నీటిని త్రాగెయ్యాలి." అన్నాడు.

మళ్ళీ "ఈ నీరు త్రాగినవారు మరణిస్తారు. కానీ, ఈ యువకుడు మాత్రం బ్రతికి తీరతాడు." అని సాధువు అనగానే ఆ యువకుని తల్లి "స్వామీ..! నేను నా ప్రియ పుత్రుని కోసం ఈ నీటిని త్రాగగలను. కాని నేను చనిపోతే నా వృద్ధ పతికి సేవలు ఎవరు చేస్తారు..?" అంది. తర్వాత ఆ యువకుని తండ్రి "నేను ఈ నీటినైతే తాగుతాను కాని నా మరణానంతరం పాపం నా భార్య గతి ఏమవుతుందోనని వెనుకాడుతున్నాను. 
నేను లేకపోతే ఈమె అసలు బ్రతుకలేదు" అన్నాడు.

సాధువు వినోదంగా "అయితే మీరిద్దరూ చెరిసగం నీళ్ళు త్రాగండి. ఇద్దరి క్రియాకర్మాదులు ఒకేసారి జరిగిపోతాయి." అనగానే ఆ ఇద్దరూ మరి మాట్లాడలేదు. ఆ యువకుడి భార్యనడుగగా ఆమె... "వృద్ధురాలైన నా అత్తగారు సాంసారిక భోగాలన్నీ అనుభవించింది. కాని నేనింకా యౌవనంలో ఉన్నాను. ఏ అచ్చటా, ముచ్చటా, ముద్దూ మురిపెం, సుఖం సంతోషం చూసినదాన్ని కాదు. నేనెందుకు మరణించాలి?" అంది.

ఈ విధంగా ఆ యువకుని బంధు గణమంతా ఆ నీళ్ళు త్రాగడానికి నిరాకరించారు. సరికదా అంతటితో ఊరుకోక "మహాత్మా..! మాపై దయ తలచి తమరే ఈ నీళ్ళు త్రాగి పుణ్యం కట్టుకొండి. మీ వెనుక ఏడ్చే వాళ్ళెవరూ లేరు కదా..! పరోపకారం పరమ ధర్మమని మీరే ఎన్నోసార్లు చెప్పేరు. కనుక మీరే ఈ ఉపకారం చెయ్యండి." అన్నారు. ఆ యువకునికి తనపై తన వారి ప్రేమ వ్యవహారానుభవం కలిగింది. అతను లేస్తూనే.. 

మహాత్మా..! నేను ఈ ప్రపంచంలోని అసారత్వాన్ని తిలకించాను. అన్ని బంధాలూ స్వార్థ పూరితమైనవే, అంటూ... ఇల్లు వదలి వెళ్లిపోయేడు.

No comments:

Post a Comment