Wednesday, November 20, 2024

 ప్ర: మన దేశంలో చాలా ప్రాంతాల్లో అనేక వింతలు అర్థరహితంగా ఉంటాయి.అయోధ్యకి వెళితే 'ఇక్కడే రాముడు ఆడుకున్నాడు' 'ఇది దశరథుని కోట', 'ఇది సీతమ్మ స్నానం చేసిన చోటు' అంటారు. బృందావనం వెళితే 'ఇక్కడే కృష్ణుడు ఆడు కున్నాడు',
'ఇక్కడే మద్ది చెట్లను కూల్చాడు' అంటారు. యుగాలనాటి అంశాలు ఇప్పటికీ ఉంటాయా?ఇవన్నీ నమ్మదగ్గవేనా?
జ: రాముడు ఆడుకున్న స్థలం, సంచరించినచోటు, కృష్ణుని లీలలు జరిగిన చోట్లు- ఇది అయోధ్యలో, బృందావనంలో ఉన్నమాట వాస్తవమే కదా! రామాయణ, భాగవతాల ఆధారంగా అయోధ్య రాముని నివాసం. బృందావనం కృష్ణనివాసం, ఇందులో
సందేహం లేదు కదా! అయితే ఆ చోట్లలో ఆ కట్టడాలు యధాతథంగా ఇప్పటిదాకా
ఉండవు అనడంలో సందేహంలేదు. కానీ భక్తి కలిగిన హృదయాలు ఆ లీలలను స్మరించే సంకేతాలుగా ఆ పవిత్ర ప్రాంతాలలోని స్థలాలను భావన చేయడంలో తప్పులేదు కదా! జరిగిందనడానికి ఆధారాలు ఎలా లేవో, జరగలేదనడానికీ ఆధారాలు లేవు. ఆ ప్రాంతాలలో ఎక్కడైనా ఆ లీలలు జరగవచ్చు.
యుగాలనాటి మహోన్నత స్వర్ణ మందిరాలు కాలగర్భంలో కలసినా, ఆ నేలపై, ఆ గాలితరగలపై రామ, కృష్ణ భావనా వీచికలు నశించవు. ఆ అవతార పురుషుల దైవీ శక్తి ఆ పుణ్యక్షేత్రాలను వీడదు. అది భక్తుల, ఉపాసకుల హృదయాలను స్పర్శిస్తుంది.
ఆ హృదయం కలవారికి అయోధ్యలో ప్రతి అణువూ రామనిలయమే. బృందావన మధురలలో ప్రతి కణమూ కృష్ణమందిరమే. నాటి లీలలను ఆ చోట్లలో ఎక్కడైనా భావన చేయవచ్చు. ఇందులో తప్పేమీ లేదు.
నమ్మే లక్షణం లేనివానికి ఎదురుగా భగవంతుడు సాక్షాత్కరించినా గుర్తించలేడు.వారు అయోధ్య, బృందావనాలకు వెళ్లినా, అక్కడ సత్యంగా ఉన్న నాటి చారిత్రక స్మృతినీ, దైవ విభూతినీ స్ఫురణలోనికి తెచ్చుకోలేరు.

No comments:

Post a Comment