*కర్మఫలాల త్యాగంతోనే జీవన పరమార్థం*
*ఈ ప్రపంచంలో ఏ వస్తువు నీకు ప్రాప్తించినా దాన్ని త్యాగబుద్ధితో అనుభవించమంటుంది వేదం. కనుకనే, వస్తుధర్మంతోపాటు మానవధర్మం ఏమిటో తెలుసుకుంటే గాని పురుషార్థ సాధనలో మానవునికి గెలుపు లభించదు.*
*పురుషుడు కోరదగినవి పురుషార్థాలు. అవి నాలుగు. ఇవి నాలుగు ఆశ్రమాల వంటివి. వీటిని వేద ప్రతిపాదితాలుగా మన పూర్వీకులు గుర్తించారు. పురుషార్థాలలో ధర్మం మొదటిది. చివరిది మోక్షం. మధ్యన ఉన్నవి అర్థకామాలు. అందరూ అర్థకామాలను సాధిస్తారు గాని పురుషార్థాలలో మొదటి దాన్ని, చివరిదాన్ని సాధారణంగా విస్మరిస్తారు. ఐతే, వేదం అర్థకామాలను విడువమని చెప్పదు. ధర్మబద్ధమైన సంపాదనను, దర్మబద్ధమైన సౌఖ్యాలను వేదం కాదనదు.*
*వేదం కేవలం పరమ పురుషార్థాన్ని మాత్రమే ఉపదేశించేది కాదు. ఏ రంగంలో ఉన్నా ధార్మిక ప్రవృత్తిని అలవర్చుకొని జీవన సాఫల్యం పొందాలనేదే వేదోపదేశం.* *మృత్యువు నుంచి బయటపడి అమృతత్వాన్ని చేరుకొమ్మని వేదం పదేపదే చెప్తుంది. మృత్యువును జయించడం అంటే జీవన సాఫల్యం పొందడమే. ఒక విధంగా కర్మ పరిసమాప్తిని సూచిస్తున్నది మోక్షమే. కానీ, కర్మలు పూర్తి చేయకుండా కర్మ సమాప్తిని పొందలేదు. అందుకే, వేదం కర్మలు చేయమంటుంది.*
*అదే సమయంలో కర్మఫలాలను త్యాగం చేయమంటుంది. అంతేకాదు, ఈ ప్రపంచంలో ఏ వస్తువు నీకు ప్రాప్తించినాదాన్ని త్యాగబుద్ధితో అనుభవించమంటుంది. కనుకనే, వస్తు ధర్మంతోపాటు మానవధర్మం ఏమిటో తెలుసుకుంటే గాని పురుషార్థ సాధనలో మానవునికి గెలుపు లభించదు. వేదం యజ్ఞయాగాదులను ప్రోత్సహిస్తుంది. వాటివల్ల కలిగే ప్రయోజనాలను గురించి తెలియజేస్తుంది. అంటే, మానవుడు తన కోరికలను తీర్చుకునే అవకాశాన్ని వేదం ఎన్నడూ కాదనలేదన్నమాట. కానీ, అదే సమయంలో ధర్మాన్ని గుర్తెరిగి ఉండాలంటుంది వేదం.*
*సంపాదించకపోతే అనుభవించలేం. అంతేకాదు, దానం కూడా చేయలేం. దానం అనేది ఉత్తమ ధర్మమైనప్పుడు సంపాదన కూడా కర్తవ్యమే అవుతుంది. ఐతే, వేదం చెప్పే విషయం ఒక్కటే విత్తం న్యాయార్జితం కావాలని! నాలుగు ఆశ్రమాల వ్యవస్థ మానవుడు ధార్మికుడుగా మెలగటానికే.*
*బ్రహ్మచర్యాశ్రమంలో విద్యార్జనకు, గృహస్థాశ్రమంలో ధనార్జనకు, వానప్రస్థాశ్రమంలో జ్ఞానార్జనకు, సన్యాసాశ్రమంలో పరమ పురుషార్థమైన మోక్షానికి ప్రాధాన్యమిచ్చింది వేదం. శ్రమతో కూడుకున్నది ఆశ్రమం. ఆశ్రమ ధర్మాలు మానవుణ్ణి ఉత్తమ మానవునిగా తీర్చిదిద్దుతాయి.*
*ధర్మాన్ని తెలుసుకొని, ధర్మ విరుద్ధం కాని పనుల వంకబోక, సత్కర్మాచరణ వల్ల లభించే ధనాన్ని, తత్పల రూపమైన భోగాన్ని కైవసం చేసుకొని, చివర్లో నిష్కామయోగం ద్వారా మోక్షప్రాప్తిని సాధించాలని వేదం ప్రతిపాదిస్తుంది. జీవన సాఫల్యం అనేది ఎట్లా సిద్ధిస్తుందో మనకు వేదం చెప్పినట్లుగా ఇతర గ్రంథాలు చెప్పజాలవు. సుఖప్రాప్తినే జీవన సాఫల్యంగా భావిస్తాం. కానీ, వేదం ముఖ్యంగా దుఃఖం నుంచి దూరం కావడమే జీవన సాఫల్యం అని ఉదోషిస్తుంది.*
*మనం అనుకున్నట్లు సంసారం కేవలం సుఖాన్ని కల్గించేది మాత్రమే కాదు. అడుగడుగునా దుఃఖం అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. దాన్ని అధిగమించడానికి ఆచరింపదగిన విధానాన్ని వేదం మనకు ఉపదేశిస్తుంది. 'తమేవ విదిత్వా అతి మృత్యుమేతి' అన్న వేదోపదేశానికి అర్థం, సృష్టికర్తయైన పరమాత్మను తెలుసుకొని మోక్షాన్ని సాధించమని చెప్పడమే. ఎంతకాలం అర్థకామాల మీద దృష్టి పెడుతామో అంతకాలం లోకయాత్ర తప్పదు. ఎప్పుడైతే ప్రకృతిని, పరమాత్మను వేర్వేరుగా దర్శిస్తామో అప్పుడే మోక్షప్రాప్తికి మార్గం సుగమమవుతుంది.*
*┈┉━❀꧁గురుభ్యోనమః꧂❀━┉┈*
*ఆధ్యాత్మిక అన్వేషకులు*
🪷🚩🪷 🙏🕉️🙏 🪷🚩🪷
No comments:
Post a Comment