Thursday, July 10, 2025

 *గురుపూర్ణిమనాడు వ్యాసుడికే పూజ!* 

*గురువు అంటే... భగవంతుణ్ని చేరుకోవడానికి తన విభూతిని మనపై ప్రసరించేవాడు. గురువు తన వాక్కుల చేత మన ఇంద్రియాలను, మనస్సును కూడా నియంత్రించి భగవంతుడివైపునకు ఆభిముఖ్యం పొందేటట్టుగా చేసి మనుష్య జన్మకు సార్థక్యాన్ని కల్పించేవాడు. సాక్షాత్తూ పరమేశ్వరుడే గురు స్వరూపంలో వస్తుంటాడు. అలా వచ్చిన మహాపురుషులలో మొట్టమొదట గణించవలసినవాడు వేదవ్యాసులవారు.*

*ఆయన నారాయణమూర్తి స్వరూపం... అపరనారాయణుడు. వేదవిభాగం చేసిన మహాపురుషుడు. శ్రీమన్నారాయణుడి అవతారాల్లో పదిహేడో అవతారం వేదవ్యాసుడని భాగవతం చెబుతోంది. అందుకే ‘వ్యాసాయ విష్ణు రూపాయ... వ్యాసరూపాయ విష్ణవే' అన్నారు. ‘వ్యాసో నారాయణ స్వయం'. ఇద్దరికీ అభేదం. వ్యాస అన్నది ఒక పదవి. భగవంతుడు వ్యాసుడిగా అవతరిస్తుంటాడు. అష్టాదశ పురాణాలను, పంచమవేదమైన మహాభారతాన్ని, బ్రహ్మసూత్రాలను, భాగవతాన్ని అందించినవాడు* *వ్యాసుడే. ఆయనే లేకపోతే మనుష్య జన్మ చీకటి. అంతటి మహానుభావుడైన వ్యాసుడిని స్మరించాలి. నమస్కరించాలి. కృతజ్ఞత చెప్పాలి.* 

*అందుకే... ఎవరూ ఏ శుభకార్యాలూ చేసుకోని ఆషాఢ మాసంలో శుక్లపక్ష పౌర్ణమిని వ్యాసపౌర్ణమిగా, గురు పౌర్ణమిగా నిర్ణయించారు. అది ఆయన జన్మదినం. కలియుగానికి సంబంధించినంతవరకూ అవతార స్వీకారం చేసిన రోజు. ఆ రోజు పూజ చేయాల్సింది వ్యాసుడికే. ఈ రోజు అందరూ తప్పకుండా చెప్పాల్సిన శ్లోకం...*

*నమోస్తుతే వ్యాస విశాలబుద్ధే పుల్లారవిందాయత పద్మ నేత్ర I*
*ప్రజ్వాలితో జ్ఞానమయః ప్రదీపః యేన త్వయా భారత తైల పూర్ణ II*

*'చాలా గొప్ప బుద్ధి గలిగినటువంటి ఓ వ్యాస భగవానుడా... విచ్చుకున్న తామర పూల రేకుల వంటి కన్నుల వైభవం గలవాడా... భారతం అనే తైలాన్ని నింపిన దీపాన్ని వెలిగించి లోకమంతటికీ జ్ఞానాన్ని కృపచేసిన మహాపురుషుడా... నీకు నమస్కరిస్తున్నాను' అని దీని అర్థం. వ్యాసుడెవరిలో ఉంటే... గురువుగారిలో ఉంటాడు. గురువును వ్యాసుడు ఆవహించి తాను చెప్పిన విషయాన్ని గురువుల చేత చెప్పించి లోకానికున్న అంధకారాన్ని తొలగిస్తాడు. అటువంటి సంస్కార బలాన్నిచ్చి జీవితాన్ని తేజోమయం చేసి లక్ష్యసిద్ధివైపు నడపడానికి కావాల్సిన ప్రచోదన శక్తిని అనుగ్రహించే మహానుభావుడు వ్యాసుడు. నాలుగు ముఖాలూ లేని బ్రహ్మ. రెండు భుజాలే ఉన్న విష్ణువు. మూడో కన్ను లేని శివుడు. సమస్త వాంగ్మయానికీ సూర్యుడు. అలాంటి వ్యాసభగవానుడికి నమస్కారం.*

*┈┉━❀꧁గురుభ్యోనమః꧂❀━┉┈*
          *ఆధ్యాత్మిక అన్వేషకులు*
📿🚩📿 🙏🕉️🙏 📿🚩📿

No comments:

Post a Comment