గాయాలున్న చోటనే…
— డా. తుమ్మల దేవరావ్, నిర్మల్
(వేమనపల్లి ప్రయాణంలో రాసిన కవిత)
గాయాలున్న చోటనే
గొప్ప కథల మొగ్గలు విరుస్తాయి.
నొప్పి తగిలిన చోటే
మానని గుర్తులవుతాయి
మచ్చలలో దాగి మిగిలే
మరువలేని జ్ఞాపకాలే అవి.
ఉలిదెబ్బలకే
శిలా శిల్పం శ్వాస పీలుస్తుంది;
ఉరుముల మెరుపులకే
వర్షం నేలను తాకే తల్లి చేతిలా
వెచ్చదనమై పుడుతుంది.
సంద్రంలో ఒక్కసారి ఎగిసిన కెరటం
పడిపోతూ... నేర్పిన పాఠం ఏంటంటే
ఏ ఎదుగుదలకు అయినా
ఒక క్షణం పతనం తప్పదు.
పురిటి నొప్పులే పుట్టుకకు నాంది;
భూమి వద్దన్నా కూడా
జీవం ఆగదు.
గీతలు పడిన నేలలోనే
విత్తనం ఆశగా కన్నులు తెరుస్తుంది.
కన్నీరు ఉబికి వస్తేనే
హృదయం ఎంత గాయపడిందో తెలుస్తుంది.
ఆ కన్నీటి రుచి
లిఖించని కవిత,
రాయకపోయినా చదివించే సత్యం.
మనసు విరిగితేనే కదా....
కొత్త మనసు శిల్పమవుతుందిది.
విరహం… ఏకాంతం…
స్మృతుల పుటలను తిప్పి
మనల్ని దుఃఖంతో ముడిపెట్టినా,
అదే చోట వెలుగు పుడుతుంది,
అదే చోట చేతన చిగురిస్తుంది.
రూపం మారొచ్చు
కాని సారం మారదు;
విరిగిన హృదయాలకు....
ప్రేమే శాశ్వత ఇంధనం.
రాలిన పువ్వు
వసంతపు జాడను గుర్తు చేస్తుంది;
గుచ్చిన ముల్లు
నడకకి తీపి జ్ఞాపకమే.
చెట్టు నుండి తెగిన కొమ్మను చూసి
చెట్టు బాధపడదు
మరో కొత్త కొమ్మ
కోకిలమ్మకు ఊయలై వస్తుంది.
గాయాలున్న చోటనే...
జీవితాంతం పాడుకునే గేయాలు పుడతాయి;
మనసు రాసుకునే కథనాలూ
అక్కడి నుంచే వెలుస్తాయి!!
No comments:
Post a Comment