దేహం దానం.
అమ్మా! నువ్వు ఇచ్చిన మాట ....
అదే నా దారిని మలిచింది...
ఆ రోజు నువ్వు, విశ్రాంతి తీసుకున్న రోజు ...
నా ఒంటరి దారికి కొత్త మలుపు తిరిగింది...
సాంప్రదాయిక వీడ్కోలుకు నాకు హక్కు లేదు,
ఎందుకంటే, నువ్వు ఎంచుకున్న ఆ దారి .. సాధారణం కాదు...
వైద్య కళాశాల గదిలో,
నువ్వు నిశ్చలంగా, నిర్జీవంగా పడున్నప్పుడు,
చల్లటి గాజు తెర వెనుక, నీవు కేవలం దేహం కాదు;
వేలాది విద్యార్థులకు, శాస్త్రానికి నువ్వు తొలి ఆనవాలుగా మారావు.
ఆ త్యాగం ముందు, నా కన్నీరు కూడా చిన్నబోయింది.
బయట వీధుల్లో వెలివేత గోడలు, దూషణల అరుపులు,
'శవం అపవిత్రం' అన్న కుళ్లు వాసన;
ఆ అగ్నిజ్వాలలు, నా గుండెను తాకి,
నా నిశ్శబ్దం ముందు పారిపోయాయి అమ్మ!
ఆగ్రహాలు, అసంతృప్తులు
నువ్వు చెప్పినట్లు, పొగ మంచులే అవి.
నా గుండె నిండా నువ్వు నింపిన ప్రేమ ముందు,
ఈ చిన్న వెలివేత నిబంధన ఎందుకు నిలబడుతుంది?
'షష్ఠముడిని నేను' అన్నప్పుడు, కులం, మతం అనుకున్నాను...
కానీ, ఇప్పుడు తెలిసింది:
శరీర దానం కూడా ఒక కొత్త జాతిని సృష్టిస్తుందని.
ఆ జాతి పేరు – మానవత్వం!
అక్కడ నువ్వు ప్రారంభం, ఇక్కడ నేను ఆరంభం!
వేల మంది విద్యార్థులకు నువ్వు పాఠమై నిలబడితే,
నీ ధైర్యాన్ని వారసత్వంగా తీసుకున్న నేను,
ఈ లోకానికి మానవత్వమే నా కొత్త జాతి అని చాటి చెబుతా.
అమ్మా! నీ జ్ఞాపకం ఒక జ్ఞానజ్యోతి,
నువ్వు ఇచ్చిన ధైర్యంతో... నేను నిలబడ్డాను.
నా వెలివేత గోడలు కూల్చివేస్తాను.
నీ గొప్ప మనసు ఎప్పటికీ నా గుండెలో ఉంటుంది.
Bureddy blooms.
No comments:
Post a Comment