By Mercy Margaret
తొలిప్రేమ ఎంత మందికి జ్ఞాపకం.. ఎంత మందికి గాయం.. ఎంత మందికది పోరాటం.. ?? ఎన్నో భగ్న ప్రేమలు ఒక దగ్గరికి చేరితే ఎలా ఉంటుందో తెలుసా.. ??
త్వరలో బాల బుక్స్ నుంచి రాబోతున్న Sky Baaba గారి కొత్త పుస్తకం "ఫస్ట్ లవ్". ఈ పుస్తకం గురించి నేను రాసిన సమీక్షను ప్రచురించిన "దిశ"పత్రిక వారికి ఎడిటర్ గారికి నా కృతజ్ఞతలు.
చదవండి.
ప్రేమతో ...❤️
~
~ప్రేమ ఒక జ్ఞాపకం... ఒక పోరాటం~
~
ఈ పుస్తకం చేతిలోకి తీసుకున్నప్పుడు, నా గుండె ఒక క్షణం ఆగి, మళ్లీ కొట్టుకుంది. “తొలిప్రేమ కథలు” ఈ శీర్షిక చదవగానే మనసు ఏదో తెలియని లోకాల్లోకి, మరిచిపోయిన జ్ఞాపకాల్లోకి, పూడ్చిపెట్టిన వేదనల్లోకి జారిపోతుంది. కానీ, ఈ పేజీలు తిప్పుతుంటే అర్థమైంది, ఇవి కలల ప్రపంచంలో విహరించే లేత ప్రేమకథలు కావని. ఇవి వాస్తవిక ప్రపంచపు కఠినమైన గోడలకు తల బాదుకున్న గాయాల కథలు. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య పుట్టే భావోద్వేగం మాత్రమే కాదు, రెండు అస్తిత్వాల మధ్య, రెండు సామాజిక నేపథ్యాల మధ్య జరిగే ఒక నిరంతర సంఘర్షణ అని చెప్పే కథలు.
ఒక ప్రేమికురాలిగా కాకుండా, ఒక మనిషిగా, ముఖ్యంగా ఈ సమాజపు నిర్మితుల్లో ఇరుక్కుపోయిన ఒక స్త్రీగా ఈ కథలను ఎలా చదవగలం?
ప్రేమ: గోడలను ఢీకొట్టిన గాయం
సాధారణంగా ప్రేమకథలు రెండు హృదయాల కలయికతో మొదలవుతాయి. కానీ స్కై బాబ కథలు ఆ కలయికను అడ్డగించే గోడల దగ్గర మొదలవుతాయి. ఆ గోడలు కొన్నిసార్లు మతం, కొన్నిసార్లు కులం, మరికొన్నిసార్లు పేదరికం, ఇంకొన్నిసార్లు ‘పరువు’ అనే పితృస్వామ్యపు అహంకారం.
“అంటు” కథ మనల్ని నిశ్చేష్టుల్ని చేస్తుంది. కరీమ, సురేష్ల ప్రేమ అది ప్రేమ మాత్రమే కాదు, ఈ సమాజపు దృష్టిలో అదొక “నేరం”. ఒక ముస్లిం అమ్మాయి, ఒక మాదిగ అబ్బాయి. ఇక్కడ ప్రేమను అంగీకరించాలంటే, అబ్బాయి తన అస్తిత్వాన్ని వదులుకోవాలి, “సున్తీ” చేయించుకోవాలి, పేరు మార్చుకోవాలి. ఇక్కడ ప్రేమ గెలవడం అంటే ఏమిటి? ఒక అస్తిత్వం ఇంకో అస్తిత్వంలో కలిసిపోవడమా? లేక ఇద్దరూ తమ అస్తిత్వాలను నిలుపుకుంటూనే కలిసి బతకగలిగే చోటు కోసం పోరాడటమా? ఈ కథలో స్కై బాబ సమాజం ముందుంచిన ప్రశ్న చాలా సంక్లిష్టమైనది. ఇక్కడ ప్రేమ... రెండు కులాల, మతాల “ఇజ్జత్” (పరువు) సమస్యగా మారి, చివరికి రాజీ కోసం ఎంత హింసను ప్రతిపాదిస్తుందో చూస్తాం.
ఇదే సంఘర్షణ “లోహం” కథలో మరో రూపంలో కనిపిస్తుంది. పద్మజకు సుల్తాన్ అంటే ప్రేమ. అతని కవిత్వం, అతని ఆదర్శాలు, అతని నిర్మలమైన మనసు... అన్నీ ఇష్టమే కానీ ఆ ప్రేమ, సుల్తాన్ నివసించే “గుడిసె”ను, అతని పేదరికాన్ని, అతని ముస్లిం అస్తిత్వాన్ని చూసినప్పుడు వెనకడుగు వేస్తుంది. ఆమె భద్రతను ఎంచుకుంటుంది. ఇక్కడ ప్రేమ, ఆదర్శం... ఆర్థిక భద్రత ముందు ఓడిపోతుంది. సుల్తాన్, తన ప్రేయసిని కోల్పోయి, చదువుకు దూరమై, తన ఆదర్శాలకే పరిమితమైతే,?
పద్మజ ఖరీదైన బంగ్లాలో, ఒంటినిండా నగల మధ్య, ప్రేమలేని యాంత్రిక జీవితంలో “జీవచ్ఛవం”లా మిగిలిపోతుంది. ఈ రెండు కథలూ మనకు చెప్పేది ఒక్కటే. ప్రేమకు కులం, మతం, పేదరికం అనేవి బయటి శత్రువులు మాత్రమే కాదు, అవి మన లోపల కూడా పాతుకుపోయి, మన నిర్ణయాలను శాసించేంత బలమైనవి.
***
స్కై బాబ కథల్లో స్త్రీలు తరచుగా రెండు రకాలుగా కనిపిస్తారు. ఒకటి, సమాజపు గోడలను ఢీకొట్టి గాయపడే విప్లవకారులు (కరీమ, పద్మజ). రెండు, ఆ గోడల మధ్యే నలిగిపోయి, తమ కోరికలను, ఆశలను చంపుకుని, జ్ఞాపకాల్లో జీవించేవారు.
“బేచారె” కథలో జుబెదా సరిగ్గా అలాంటిదే. పెళ్లయి, ఇద్దరు పిల్లలున్నా, ఆమె తన తొలిప్రేమ మునీర్ జ్ఞాపకాల్లోనే బతుకుతుంది. పదిహేనేళ్ల తర్వాత అతను ఫోన్ చేసినప్పుడు ఆమె గొంతు పెగలదు, కానీ చివరికి అతన్ని కలవడానికి నిరాకరిస్తుంది. ఎందుకు? ఎందుకంటే, వర్తమానంలోని వాస్తవికత, తన గతం తాలూకు ఆ అందమైన జ్ఞాపకాన్ని చెరిపేస్తుందేమోనని ఆమె భయం. ఆమెకు వర్తమానం ఒక బతుకు శిక్ష, గతం ఒక తీయని గాయం. ఆ గాయాన్నే ఆమె భద్రంగా కాపాడుకుంటుంది. ఇది స్త్రీ హృదయంలోని ఎంత సున్నితమైన, విషాదభరితమైన కోణం!
ఈ అణచివేత “మొహబ్బత్ 1424 హిజ్రి”లో ఆధునిక సాంకేతికత రూపంలో కనిపిస్తుంది. షఫీ, సుల్తానా... ఇద్దరూ సైబర్ కేఫ్లో, చాటింగ్ ద్వారా పరిచయమవుతారు. ప్రేమించుకుంటారు. కానీ, ఆధునికత ఇచ్చిన ఆ కాస్త స్వేచ్ఛ కూడా సంప్రదాయం ముందు చిన్నబోతుంది. నెలల తరబడి చాట్ చేసినా, చివరికి ఆమె పంపిన ఫోటోలో కళ్లు తప్ప ఏమీ కనిపించని “నఖాబ్”)ఉంటుంది .ఆమె ప్రేమ ఆధునికమే, కానీ ఆమె అస్తిత్వం ఇంకా సంప్రదాయపు తెరల వెనకే బందీగా ఉంది.
ఇదే కోవలో “మిస్ వహీదా”, “లవ్ యూ షాహిదా” కథలు మనల్ని వెంటాడతాయి.
పెళ్ళికాని వయసు మీరిన స్త్రీలు (వహీదా) లేదా భర్త లేని ఒంటరి స్త్రీలు (షాహిదా) తమ ఒంటరితనాన్ని, అసంతృప్తిని పంచుకోవడానికి ఒక ‘తోడు’ కోసం వెతుకుతారు. ఆ తోడు దొరికినప్పుడు, అది సమాజం దృష్టిలో ‘అక్రమ’ సంబంధంగానో, ‘విసిగించే’ వ్యవహారంగానో ముద్రపడుతుంది. వహీదా చివరికి ఫ్యాన్కి ఉరి వేసుకుని చనిపోతే, షాహిదా తన అసంతృప్తులన్నింటినీ గుండెల్లోనే మోస్తూ, చివరి చూపు కోసం తపిస్తూ కన్నుమూస్తుంది. ఈ కథలు స్త్రీల అణచివేత గురించి, వారి మానసిక సంఘర్షణ గురించి, ప్రేమ పేరుతో వారు కోరుకునేది కేవలం ఒక స్నేహపూర్వక పలకరింపు మాత్రమేనని ఎంత బలంగా చెబుతాయి!
***
మట్టి వాసన కథల పరిమళం స్కై బాబా.
స్కై బాబ లాంటి వాళ్ళు రాసే కథలు కేవలం ప్రేమ గురించే కాదు, అవి తెలంగాణ గ్రామీణ ముస్లిం జీవితాల గురించి, దూదేకుల సంస్కృతి గురించి, మతం లోపలి ఆర్థిక అంతరాల గురించి మాట్లాడతాయి. అరుదుగా రికార్డ్ అయిన జీవితాలను స్కై బాబ మన ముందు ఉంచుతారు.
“మజ్బూర్” కథలో రంజాన్ పండుగ నాడు ఈద్గా దగ్గరి వాతావరణం, కొత్త బట్టలు లేని వారి వేదన, జానీ పేదరికం, తెగిపోయిన చెప్పు... ఇవన్నీ మతం కంటే పేదరికం ఎంత బలంగా మనుషుల్ని వేధిస్తుందో చూపిస్తాయి. “ఉర్సు” కథలో నల్గొండ గుట్ట, అక్కడి దర్గా సంస్కృతి, హిందూ-ముస్లింల కలయిక... ఈ నేపథ్యం లేకుండా యూసుఫ్, రుక్సానాల ప్రేమకథ లేదు. వారి ప్రేమ ఆ ఉర్సు తిరునాళ్లలోని రంగుల మధ్య పుట్టి, అక్కడే జ్ఞాపకంగా మిగిలిపోతుంది.
స్కై బాబ ఒక కార్యకర్తగా, ఒక కవిగా తన రచనల ద్వారా ఏ అణగారిన గొంతుకల కోసం పోరాడుతున్నారో, ఆ గొంతుకలనే ఈ కథల్లో పాత్రలుగా మలిచారు. ఆయన కథల్లోని భాష, యాస, వాతావరణం... అన్నీ మట్టి వాసన వేస్తాయి.
***
ఈ పుస్తకం చదవడం ముగించాక, మనసు బరువెక్కుతుంది. ఇవి తొలిప్రేమ కథలే, కానీ ఇవి తీపి జ్ఞాపకాలుగా మిగలవు. ఇవి మనల్ని నిరంతరం ప్రశ్నించే గాయాలుగా మిగిలిపోతాయి. ప్రేమించడం నేరమా? తమకు నచ్చిన జీవితాన్ని ఎంచుకోవడం తప్పా? కులం, మతం, డబ్బు, పరువు... వీటన్నింటి ముందు ప్రేమ ఎందుకు ఓడిపోవాలి?
స్కై బాబ ఈ ప్రశ్నలను మన ముందుంచి నిశ్శబ్దంగా నిలబడతారు. “ఐసోలేషన్” కథలో కరోనా బారిన పడిన శ్రీనివాస్, చావు బతుకుల్లో ఉన్నప్పుడు తన తొలిప్రేమ శ్రీలతను గుర్తుచేసుకుని ఆమెకు క్షమాపణ చెప్పాలనుకుంటాడు. కానీ ఆమె, “నీలాంటి నీచుడిని ఈ జన్మకు క్షమించలేను!” అని ఫోన్ కట్ చేస్తుంది. ఆ మరుక్షణమే అతను గుండె ఆగి చనిపోతాడు.
బహుశా, ప్రేమంటే ఇదేనేమో! అది మనం చేసిన తప్పులకు జీవితాంతం అనుభవించే శిక్ష. అది మనం పొందనిదాని కోసం పడే నిరంతర వేదన.
ఈ పుస్తకం ప్రేమను ఆరాధించదు. ప్రేమ పేరిట జరిగే అణచివేతను, ప్రేమను నిలబెట్టుకోవడానికి చేసే పోరాటాన్ని, ఆ పోరాటంలో మిగిలే గాయాలను మనకు చూపిస్తుంది. అందుకే ఇది కేవలం కథల పుస్తకం కాదు, ఇది మనందరి గుండెల కింద దాచుకున్న ఒక “సున్నితమైన వేదన”.
- మెర్సీ మార్గరెట్
For Copies: whatsapp to 7989546568
నరేష్కుమార్ సూఫీ
Usha Prathyusha
No comments:
Post a Comment